Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 46

    అతడికి కొద్ది అడుగుల దూరంలో-
    సీతాలు!
    కాదు కాదు... సీతాలు దెయ్యం!!
    తెల్లని చీరలో - జుట్టు విరబోస్కుని -
    "ఎ - ఎ - ఎవరునువ్వు?" తడబడుతూ అడిగాడు.
    "నేనెవరో నీకు తెలీదా?" అడిగింది సీతాలు దయ్యం.
    "తె - తె - తెలుసనుకో - నువ్వు సీతాలే కదూ? - కానీ - కానీ - ఎందుకొచ్చావ్?" భయంభయంగా అడిగాడు రాయుడు.
    నీమీద పగ సాధించడానికి - హిహిహిహి-" ఒక అడుగు ముందుకువేస్తూ అది సీతాలు దెయ్యం.
    "ప్లీజ్ నన్నేం చెయ్యకు" రాయుడు ఒకఅడుగు వెనక్కివేస్తూ చెప్పాడు.
    "ఏం నిన్ను ఎందుకు వదిలిపెట్టాలి? నన్ను నిర్దాక్షిణ్యంగా రేప్ చేశావు. తర్వాత దారణంగా హత్యచేశావ్. చెప్పు - నువ్వు చేసింది తప్పా కాదా?"
    "తప్పే - ఇదిగో చెంపలుకూడా వేస్కుంటున్నావ్"
    రాయుడు ఛెళ్ - ఛెళ్ మని చెంపలేస్కున్నాడు.
    "ఉహు - అలా తప్పేఅని ఒక్కముక్క చెప్తే సరిపోదు. నువ్వు చేసిన తప్పులన్నీ వరుసగా ఏకరువు పెట్టి ఆతర్వాత చెంపలు వేస్కో"
    "అలా చేస్తే నన్ను వదిలిపెట్టేస్తావా?" ఆశగా అడిగాడు రాయుడు.
    "చూస్తాను - ఊ - ఇప్పుడు చెప్పు! నువ్వు ఏ ఏ పాపాలు చేశావ్?" అడిగింది సీతాలుదెయ్యం.
    రాయుడు గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు.
    "నేను ఈ ఊళ్ళో యాభైశాతం ఆడవాళ్ళని రేప్ చేశాను. దాదాపు ఒక వందదాకా మర్డర్లు చేశాను. నాకు ఒక స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలుకూడా వున్నాయి. నేను దొంగనోట్లుకూడా ముద్రిస్తుంటాను."
    ఇంకా ఎన్నో ఘోరాలు చేశాను. కానీ ఎన్ని ఘోరాలుచేసినా ఒక్క విషయంలో మాత్రం ఫెయిలయ్యాను. అదేంటంటే రాధని రేప్ చెయ్యాలని ప్రయత్నించి భంగపడ్డాను-
    "నీచుడా - నీకు పుట్టగతులుండవురా" ఆవేశంగా అంది సీతాలుదెయ్యం.
    "ఏంటి సీతాలూ - ఆ రాధ నీకు అక్కో, చెల్లో అయినట్టు అంతగా ఆవేశపడి పోతున్నావ్? అవునుకదూ అసలు ఆ విషయమే మర్చిపోయా. ఆ గోపీకి నీతో సంబంధం వుందిగా ఆ ప్రకారం చూస్తే రాధ నీకు అక్కే అవుతుందిగా."
    "నోర్ముయ్. ఆయన దేవుడురా దేవుడు! ఆయనగురించి అవాకులూ చెవాకులూ పేలితే పురుగులుపడి ఛస్తావ్-" అంది సీతాలుదెయ్యం ఆవేశంగా.
    "అబ్బా! నీకు తెలీదులే సీతాలూ - ఆ గోపీగాడు అంత మంచోడు కాదు - నీమీద ప్రేమనటించి నిన్ను వల్లో వేస్కోవాలని చూశాడు. నిజం!నీమీదొట్టు - అసలు నువ్వు వాడిమీద పగతీర్చుకోవాలి" కసిగా చెప్పాడు రాయుడు.
    "ఏంట్రా వుండాకోర్ పేల్తున్నావ్? నువ్వసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"
    ఆవేశంగా అంది సీతాలుదెయ్యం.
    ఆతర్వాత రెండుచేతులూ పులిపంజల్లా పెట్టి మొహం పీకేస్కుంది.
    అంతే!...
    ఆమె చేతుల్లోకి మాస్క్ వచ్చేసింది.
    ఆమె ఎవరోకాదు... రాధ!
    అంతసేపూ దయ్యంవేషంలో రాయుడితో మాట్లాడింది.
    "ఆ నువ్వా?" అదిరిపడుతూ అడిగాడు రాయుడు.
    "అవును... నేనే... ఇన్నాళ్లకు నీ రహస్యాలన్నీ బయటపడ్డాయ్. నీచేత నిజం కక్కించాలనే నేను దయ్యంవేషం వేస్కుని నీ దగ్గరకు వచ్చాను... నువ్వుచేసిన ఘోరాలన్నీ పోలీసులకి చెప్పి నిన్ను జైలుకి పంపిస్తాను."
    ఆవేశంగా అంది రాధ.
    రాయుడు పకపకా నవ్వాడు.
    "ఓసోస్... అందాకా నేను చేతులు ముడ్చుకుని కూర్చుంటాననుకున్నావ్? ఆ సీతాలుకు పట్టినగతే నీకూ పడ్తుంది. నిన్నుకూడా దానిలాగే రేప్ చేసి చంపేస్తా... ఎవడు అడ్డొస్తాడో చూస్తా..." రాయుడు రాధవైపు రెండడుగులు వేశాడు.
    రాధ ఏమాత్రం నదురూబెదురూ లేకుండా రాయుడివంక చూసి చిరునవ్వు నవ్వింది.
    "నీకు అడ్డు తగలడానికి సత్రకాయ్ లా నేనున్నారా..."
    గంభీరంగా ఓగొంతు వినిపించింది రాయుడికి.
    రాయుడు కంగారుగా గదంతా కలియజూశాడు. ఎవరూ కనిపించలేదు.
    "ఎవరు?... ఎవరిది?...." అరిచాడు రాయుడు
    మంచం క్రిందనుండి గోపి బల్లిలా ప్రాకుతూ బయటికి వచ్చాడు. అతని చేతిలో టేప్ రికార్డర్ వుంది.
    "ఆ... నువ్వా?..." ఆశ్చర్యంగా అన్నాడు రాయుడు.
    "అవును నేనే!... నీ పాలిట యముడిని!!... నేటితో నీ పాపం పండింది - ఇందాక నువ్వు ఒప్పుకున్న నేరాలన్నీ ఈ టేప్ రికార్డర్ లో రికార్డుచేశా... దీన్ని పోలీసులకు ఇస్తే నీకు ఉరిశిక్ష తప్పదు" అన్నాడు గోపి.
    "అప్పటిదాకా నువ్వు బ్రతికుంటే కదరా? ఒరేయ్ రండర్రా..." అరిచాడు రాయుడు.
    క్షణాల్లో డజనుమంది రౌడీలు గోపీని చుట్టుమట్టేశారు.
    అంతే-
    గోపి టేప్ రికార్డర్ ని రాధచేతిలో పెట్టేసి రౌడీలమీదకు విరుచుకుపడ్డాడు.
    గోపీ రౌడీలను ఎగిరెగిరి తన్నసాగాడు. గోపీ తన్నే ఒక్కోతన్నుకూ రౌడీలు యాభైగజాలూ, అరవైగజాలూ అవతలకు ఎగిరి పడసాగారు.
    ఇంతలో అదనుచూస్కుని రాయుడు రాధ దగ్గరికి వచ్చి టేప్ రికార్డర్ ని లాక్కోబోయాడు. కానీ రాధ తెలివిగా టేప్ రికార్డర్ ని అతనికి అందకుండా రెండు చేతుల్తో అటూఇటూ ఊగించి ఒక్కసారిగా పైకి విసిరేసింది. దానిని రౌడీలతో ఫైట్ చేస్తున్న గోపి అందుకున్నాడు. రౌడీలంతా టేప్ రికార్డర్ కోసం గోపీమీదకు ఎగబడ్డారు. గోపి దాన్నిమళ్ళీ రాధదగ్గరకు విసిరేశాడు. రాధ దాన్ని క్రిందపడకుండా కేచ్ పట్టింది. రాయుడు మళ్ళీ రాధ వెంటపడ్డాడు టేప్ రికార్డర్ కోసం. రాధ పరిగెత్తీ రాయుడ్ని తనవెంట తిప్పీ తిప్పీ మళ్ళీ టేప్ రికార్డర్ ని గోపి దగ్గరకు విసిరేసింది. గోపి దాన్ని క్యాచ్ పట్టాడు-
    రౌడీలంతా మళ్ళీ టేప్ రికార్డర్ కోసం గోపి వెంటపడ్డారు.
    ఇలా టేప్ రికార్డర్ అటూఇటూ గోపి, రాధల చేతులు మారుతుంది.
    ఇలా లాభంలేదని రాయుడు రాధ చేయిపట్టుకుని లాక్కెళ్ళి జీపులో పడేసి జీపును తోలుకెళ్ళాడు.
    రాధ కేర్ బేర్ మని అరిచింది.
    గోపీ తనను పట్టుకున్న రౌడీలను ఒక్కసారిగా విదిలించి కొట్టి అక్కడే వున్న ఒక సైకిలుఎక్కి జీపును వెంటబడించాడు.
    ముందు జీపు, వెనుకాల గోపీ సైకిలూ రోడ్డుమీద వేగంగా వెళుతున్నాయ్.
    రోడ్డుమీద ఎన్నోమలుపులు తిరిగి చివరకు జీపు ఒక కొండదగ్గర ఆగింది. ఆ తర్వాత రాయుడు రాధని కొండమీదకి లాక్కెళ్ళాడు. గోపీకూడా సైకిలును జీపుప్రక్కన ఆపి కొండమీదకు వేగంగా పరుగుతీసాడు.
    అప్పుడే కొండమీంచి రాధని క్రిందకి తోసెయ్యబోతున్నాడు రాయుడు. గోపి రాయుడికి అడ్డు తగిలాడు - ఇద్దరికీ కాస్సేపు భయంకరమైన ఫైటింగ్ జరిగింది. చివరికి రాయుడు హఠాత్తుగా లాల్చీ జేబులోంచి పిస్టల్ తీశాడు.
    "గోపీ - నీ ఇష్టదైవాన్ని తల్చుకో-" అన్నాడు రాయుడు పిస్టల్ గోపి ఛాతికి గురిపెడ్తూ-
    "ఢాం-" పిస్టల్ పేలింది.
    అంతలో ఎక్కడినుండి వచ్చిందో ఏమో, చిత్రాంగి పరుగున వచ్చి గోపికి అడ్డుగా నిలబడింది.
    అంతే - గుండుదెబ్బ గుండెకి తగిలి చిత్రాంగి నేలకి ఒరిగింది.
    రాయుడు బిత్తరపోయాడు.
    గోపి గబుక్కున క్రిందకివంగి చిత్రాంగిని తన ఒళ్ళోకి తీస్కున్నాడు.
    "ఎంతపని జరిగింది?... ఇంతకీ మీరు ఎవరోగానీ..." బాధగా అన్నాడు గోపి.
    "నాపేరు చిత్రాంగి!..." మూలుగుతూ చెప్పింది ఆమె.
    "నేను నీకు తెలియకపోయినా, నువ్వు నాకుతెలుసు గోపీ - నిన్ను అప్పుడెప్పుడో చూశాను"
    "నిన్ను మొదటిచూపులోనే ప్రేమించాను గోపీ! అందుకే ఈ త్యాగం-" అంటూ ప్రాణాలు వదిలింది చిత్రాంగి.
    గోపీ అయోమయంగా మొహంపెట్టి ఆతర్వాత ఘొల్లుమన్నాడు.
    "అయితే ఇకనేం - ఇద్దరు ప్రేమికులూ స్వర్గంలో కల్సుకోండి-" అంటూ రాయుడు గోపీకి పిస్టల్ గురిపెట్టాడు.
    "ఢాం-" మళ్ళీ పెద్దశబ్దం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS