రాయుడిచేతిలో పిస్టల్ ఎగిరిపోయింది. అక్కడికి పొగలుకక్కే రివాల్వర్ తో ఇన్స్ పెక్టర్ తన సిబ్బందితో వచ్చాడు.
"మిస్టర్ రాయుడూ - యూ ఆర్ అండర్ అరెస్ట్!-"
ఇన్స్ పెక్టర్ గర్జించాడు.
38
రాయుడిని పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్లిన తరువాత గోపీని గూడెంమనుషులు భుజాలమీద ఎక్కించుకుని గూడెం మొత్తం తిప్పారు.
ఆ తర్వాత గోపీ ఇంటిముందు గోపీని భుజం మీదనుండి దింపారు.
అంతలో "హోయ్ హోయ్" అంటూ మరోగ్యాంగ్ అక్కడకు వచ్చింది. వాళ్ళలో ముప్ఫయిమంది మగాళ్ళూ, ముప్ఫయిమంది ఆడాళ్లూ వున్నారు. అందరూ రంగురంగు బట్టలు, ఒకే రకమైన యూనిఫాంలు వేస్కున్నారు.
మగాళ్ళంతా చేతుల్లో డప్పులు ధరించి వున్నారు.
గోపి వాళ్ళవంక చిరునవ్వులు చిందిస్తూ చూశాడు.
ఒక గూడెంమనిషి మూడు కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. మూడు కుర్చీల్లో గోపి, రాధ, సరస్వతి కూర్చున్నారు.
అప్పుడు రంగురంగుల బట్టలు వేస్కున్న మగాళ్ళూ, ఆడాళ్ళూ రెండు సగాలకింద విడిపోయి రెండు వరుసల్లో నిల్చున్నారు.
మగాళ్ళంతా డప్పులమీద ఒక్కసారిగా ఠమఠమలాడించారు.
ఆడాళ్ళంతా నడ్డిపూపుతూ "ఒలియ...ఒలియ...ఒలియ...ఒలియ.." అన్నారు కీచుగొంతుల్తో .
మగాళ్ళంతా ఒక్కసారిగా "హో" అన్నారు భూతాల్లా.
ఇంక పాట అందుకోడమే తరువాయి... కానీ అక్కడికి ఒక ఎద్దులబండి వచ్చి ఆగింది.
దాంట్లోంచి పరంధామయ్య, శంకరం, అన్నపూర్ణ, దీప, నారాయణరావు, కామాక్షమ్మ, సుబ్రమణ్యం అంతా బిలబిలా కిందకి దూకారు.
డప్పులన్నీ ఒక్కసారిగా ఢమఢమ మ్రోగాయ్.
"హర్నీ!... ఉండండెహె... ఏంటి మీ గోల?..." అంటూ ఒక్క కసురు కసిరాడు గోపి.
డప్పుల మోత ఆగింది.
గోపీ పరుగున వెళ్లి పరంధామయ్యను కౌగిలించుకున్నాడు "నాన్నా..."
ఆ విసురుకి పరంధామయ్య వెనక్కితూలి వెల్లకిలా పడిపోయాడు.
గోపీ ఓసారి నాలుక కర్చుకుని పరంధామయ్యని నేలమీంచి లేపదీసి ఈసారి మెల్లగా కౌగిలించుకుని "నాన్నా... నహాన్నా..." అన్నాడు ప్రేమనంతా గొంతులో పలికిస్తూ.
"బాబూ... బాహ్హాబూ..." ప్రతిగా గద్గద స్వరంతో పరంధామయ్య అన్నాడు.
రాధేయో అన్నపూర్ణని "హక్కా..." అంటూ లపక్కున కౌగిలించుకుంది.
సరస్వతీ కామాక్షమ్మని గాఠిగా కౌగిలించుకుంటే కామాక్షమ్మ దగ్గీ... దగ్గీ... ఉక్కిరిబిక్కరి అయిపోయింది.
తర్వాత అన్నపూర్ణ ఎలాగోలా రాధ కౌగిలినుండి విడిపించుకుంది, గోపీని కౌగిలించుకోవాలనే ఉద్దేశంతో. గోపీ అప్పటికే తండ్రిని వదిలిపెట్టి వదినవంక అత్యంత ప్రేమగా చూశాడు. ప్రమాదాన్ని ముందుగానే పసికట్టిన శంకరం గోపీకి అన్నపూర్ణకీ మధ్య అడ్డుగా నిలబడ్డాడు.
భర్త చేష్టకి అన్నపూర్ణకి చెప్పలేనంత ఇరిటేషన్ కలిగింది. వెనుకనుండి శంకరం చొక్కాకాలరు పట్టి విసురుగా ప్రక్కకిలాగి ఆ తర్వాత "బాబూ గోపీ" అంటూ వేగంగావెళ్లి గోపీని కౌగిలించుకుంది. ఆ విసురుకి ఈసారి గోపి వెనక్కి తూలి పడిపోయాడు.
మీపని ఇట్లావుందా అని పళ్ళు పటపటా కొరికిన శంకరం రాధ దగ్గరకు పరుగున వెళ్లి ఆమెను లపక్కున కౌగిలించుకుని "హమ్మా మరదలా! ఎన్నాళ్ళయిందమ్మా నిన్నుచూసి? నా తల్లీ... నా బంగారం తల్లీ.." అంటూ ఆమె వీపూ, తలా నిమిరాడు.
ఇలా ఒకరినొకరు కౌగిలించుకున్నాక పరంధామయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. అన్నపూర్ణకూడా సిగ్గుతో తలవంచుకుని బొటనవేలితో నేలమీద సర్రు సర్రున రాసింది.
"ఏంటి? ఒక్కసారిగా మీరెందుకు అలాగయిపోయారు?" వాళ్ళిద్దరివంకా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గోపి.
"మరేంలేదు ఖళ్ బాబూ... నువ్వు ఖళ్ జైల్లో వుండగా నిన్ను చూడ్డానికి ఖళ్ ఖళ్ రాలేదు కదా - అందుకని ఖళ్ ఖళ్ - వాళ్లు అలా సిగ్గుపడ్తున్నారు ఖళ్ బాబూ." అంటూ సిగ్గుతూ చచ్చీచెడీ గోపీకి వివరించింది కామాక్షమ్మ.
"మేమేం సిగ్గుపడట్లేదు... మేం బాధ పడ్తున్నాం...." విసుగ్గా అన్నాడు పరంధామయ్య.
అప్పుడు అన్నపూర్ణ గద్గదస్వరంతో ఇలాఅంది " నువ్వసలు ఇంత త్వరగా జైలునుండి బయటపడ్తావని మేము అనుకోలేదు బాబూ. నువ్వింకొన్నాళ్ళు జైల్లో వుంటావనీ, వేరు చోటు చూస్కుని నిన్ను చూడ్డానికి రావాలనీ అనుకున్నాం బాబూ."
"మేం కూడా అలానే అనుకున్నాం ఖళ్ బాబూ" అంది కామాక్షమ్మ.
"అవును... అవునవును" బుర్రూపుతూ అన్నాడు నారాయణరావు.
"నేనైతే నీకిష్టమైన వంటకాన్ని స్వయంగా నా చేతుల్తోచేసి స్వయంగా నేనే జైలుకి వచ్చి కటకటాల ఇవతలనుండి నీకు గోరుముద్దలు ఈ చేత్తో తినిపిద్దామని అనుకున్నా బాబూ.. ఈ చేత్తో తినిపించాలని అనుకున్నా" ముక్కు చీదుతూ అంది అన్నపూర్ణ.
"వహ్హిదినా" బాధగా అంటూ జుట్టు పీక్కున్నాడు గోపి.
"మేం జైలుకి రానందుకు ఖళ్ ఏమైనా అనుకున్నావా ఖళ్ ఖళ్ బాబూ" అంది కామాక్షమ్మ.
"పోనీ మరోసారి జైలుకి వెళ్ళుబాబూ. నేను అక్కడకు వచ్చి నీకు గోరు ముద్దలు తినిపిస్తా" అంది అన్నపూర్ణ.
"నీ గోరుముద్దలు తినడంకోసం నేను జైలుకి వెళ్ళాలా? ఇది చాలా అన్యాయం వదినా" చొక్కాకాలరు నలిపేస్కుంటూబాధగా అన్నాడు గోపి.
"ఇదిగో.. నువ్వు వాడికి ఇలా గోరుముద్దలు తినిపిస్తూ, స్నానాలు చేయిస్తూ వాడిని వాడి పెళ్ళాంతో కాపురం చేస్కోనివ్వడంలేదనే వాడిని ఏదో సాకుచెప్పి ఇంట్లోంచి బయటకు తరిమేశా హాయిగా కాపురం చేస్కుంటాడని. ఇప్పుడు నువ్వేమో మళ్లీ గోరుముద్దలు గట్రా అంటున్నావ్. ఇలాగైతే ఇప్పుడు కూడా నేను వాడిని ఇంటికి రానివ్వనంతే" మండిపడ్తూ అన్నాడు పరంధామయ్య.
"సరేలే మామయ్యా... మీకెలా ఇష్టమో అలానే ప్రవర్తిస్తా" నీర్సంగా అంది అన్నపూర్ణ.
"బాబాయ్... బాబాయ్.... మనింటికి ఎప్పుడొస్తావ్ బాబాయ్?" అడిగింది చిన్నారి దీప.
"ఈ అనురాగపు మమతల కోలాటంలో గెలిచినదెవరో ఓడేదెవరో!" అన్నాడు సుబ్రమణ్యం హఠాత్తుగా.
"అనురాగపుటూయలలు ఊగే అదృష్టం విధి అందరికీ ఇవ్వదు. కొద్దిమంది మాత్రమే ఆ ఊయల ఊగే అదృష్టాన్ని పొందగలుగుతారు. మిగతా వాళ్ళు ఊయల గొలుసులు తెగి ధడేల్ మని క్రిందపడిపోతారు"
అంది దీపకూడా గంభీరంగా.
"మీరిద్దరూ అధికప్రసంగాన్ని కాస్సేపు ఆపండి. గోపీ ఇప్పుడు మనతో ఇంటికి వస్తున్నాడు" అన్నాడు పరంధామయ్య దీప, సుబ్రమణ్యాలవంక విసుగ్గా చూస్తూ.
ఆమాట వినగానే అక్కడి అందరి మొహలల్లో సంతోషం తాండవించింది.
"పదరా... చిప్పా చెంబూ సర్దుకో .... మనింటికి పోదాం" గోపీ భుజంతడ్తూ అన్నాడు పరంధామయ్య.
"నాన్నా... నువ్వు దేవుడివి నాన్నా.." అన్నాడు గోపి ఆనందభాష్పాలు రాలుస్తూ.
ఇంతలో డప్పులు ఢమఢమా మ్రోగాయ్.
"ఉండునాన్నా ... వీళ్ళేదో ప్రోగ్రాం పెట్టినట్టున్నారు. ఇందాకట్నుండీ ఒకటే పీక్కుతినేస్తున్నారు. అది చూసిపోదాం" అన్నాడు గోపి.
"సరే... అలాగే కానివ్వు" అన్నాడు పరంధామయ్య.
అందరూ అనవసరంగా పకపకా నవ్వారు.
తర్వాత గూడెం మనుషులు మరికొన్ని కుర్చీలు వేశారు. వాటిల్లో గోపీ ఫామిలీ మెంబర్సంతా వర్సగా కూర్చున్నారు. మధ్యలో పరంధామయ్య కూర్చున్నాడు.
రంగురంగుల యూనిఫాంలాంటి బట్టలూ వేస్కున్న వాళ్ళు చెంగున ఎగిరి డప్పులు వాయిస్తూ పాటందుకున్నారు.
"మా పేటా రాక్షసుడే పోయాడురా...
మా బేటా గోపీ తిరిగొచ్చాడురా...
ఆహా... ఓహో...
మా గూడేనికి పండగా
గాడిద గుడ్డూ దండగా...
ఆహా... ఓహో..."
పాటంతా అయ్యాక గోపీ ఫామిలీమెంబర్సంతా ఈసురోమంటూ ఎడ్లబండి ఎక్కారు.
ఎడ్లబళ్ళు గోపి ఇంటిదారి పట్టాయి.
* * *
సందడి... ఒకటే సందడి... ఇన్నాళ్ళూ గోపీలేక బోసిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు ఒహటే కళకళలాడిపోతుంది.
హాలుమధ్య పేద్ద డైనింగ్ టేబుల్.
ఆ టేబుల్ చుట్టూ పరంధామయ్య, సరస్వతి, గోపి, రాధ, అన్నపూర్ణ, శంకరం, నారాయణరావు, కామాక్షమ్మ, దీప, సుబ్రమణ్యం అంతా కూర్చున్నారు.
డైనింగ్ టేబుల్ మీద జాంగ్రీలూ, లడ్డూలూ, అరిసెలూ, బూర్లూ, గార్లూ, పులిహోరా, పాయసం, అప్పడాలూ, సాంబార్, రసం, పెరుగూ, వగైరా... వగైరా చాలా వున్నాయ్ పెద్దపెద్ద పళ్ళాల్లో, డేగిశాల్లో.
"ఊ... చూస్తారేం... కానివ్వండి!" అన్నాడు నారాయణరావు అందరివంకా చూస్తూ.
అందరూ తిండిమీదకు ఎగబడబోయారు.
"ఆగండి!" పరంధామయ్య కంఠం ఖంగున మోగింది.
"ఈ ఆనందోత్సాహాల సమయంలో ముందు నన్నో శుభవార్త చెప్పనివ్వండి" ఆగాడు.
అందరూ కుతూహలంగా పరంధామయ్యవంక చూశారు.
"నా వయసేమో అయిపోతుంది. ఇదివరకటిలా పని చేయలేకపోతున్నాను... అందుకని నేను రెస్టు తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గోపీని ఈరోజునుండి మన కంపెనీలన్నింటికీ మేనేజింగ్ డైరెక్టర్ ని చేస్తున్నాను"
చిరునవ్వు నవ్వుతూ ముగించాడు పరంధామయ్య అందరూ కోలాహలంగా చప్పట్లు కొట్టారు.
అన్నపూర్ణ ఆనందం పట్టలేక గోపీని లపక్కున కౌగలించుకుంది.
"బాబూ ఎంతలో ఎదిగిపోయావ్ బాబూ! నిన్న మొన్ననే నీచేత అఆలు దిద్దించినట్లుగా వుంది బాబూ! అప్పుడే కొన్ని కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ వి అయిపోయావా బాబూ!" అంది కప్పలా నోరు తెరచి నవ్వుతూ.
"వదినా" భావావేశంతో అన్నాడు గోపి. "ఉండు బాబూ ఉండు... నీ నోరు తీపిచేస్తా" అంటూ అన్నపూర్ణ గోపీ నోట్లో ఓ జాంగ్రీ మొత్తం కుక్కింది.
గోపీ జాంగ్రీని పచక్ పచక్ మని నమిలాడు ఆబగా.
రాధ మొహం చిన్నబుచ్చుకుంది. అది పరంధామయ్య గమనించే గమనించాడు.
"ఊ... ఊ... అదే నేను వద్దన్నది... ఎవరి భర్తల్ని వాళ్ళే కౌగలించుకోవాలి, ఎవరి భర్తలకు వాళ్ళే గోరుముద్దలు తినిపించుకోవాలి. ఇతర భర్తల జోలికి పోకూడదు" అన్నపూర్ణవంక చిలిపిగా చూస్తూ అన్నాడు పరంధామయ్య.
అన్నపూర్ణ తల వంచుకుని "హి... హి..." అంది.
"పదమ్మా రాధా... మీ ఆయనకు స్వీట్ తినిపించు!" అన్నాడు పరంధామయ్య రాధవంక అప్యాయంగా చూస్తూ.
రాధ ఓ లడ్డూ అందుకుని గోపీ నోట్లో తోసింది. అందరూ కోలాహలంగా చప్పట్లు కొట్టారు.
ఆతర్వాత అందరూ ఒకరినోట్లో ఒకరు స్వీట్సు పెట్టుకున్నారు.
ఆవిధంగా వాళ్ళందరూ తమ జీవితాన్నంతా ప్రేమా, ఆత్మీయతలు పంచుకుంటూ ఆనందంగా గడిపేశారు.
శుభం
