Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 45

    "బాబూ!" సరస్వతి గోపిని ఆనందంగా కౌగిలించుకుంది.
    అంతదాకా బయట చాటుగా నిల్చున్న రాధ కూడా లోపలికి వచ్చింది.
    "ఈ దేవతవల్లేనమ్మా నేను జైల్లోంచి బయటికి రాగలిగాను" రాధవంక  చూస్తూ అన్నాడు గోపి.
    "అదేం కాదులెండి. అదంతా దేవతలాంటి అత్తయ్యగారి ఆశీర్వాదం!" అంది రాధ ఎందుకో సిగ్గుపడ్తూ.
    రాధ, గోపిలు జైలులోంచి ఏవిధంగా తప్పించుకున్నదీ, దారి పొడుగునా పోలీసుల బారినుండి రక్షించుకుంటూ ఎలావచ్చింది సరస్వతికి చెప్పారు.
    వాళ్ళ ప్రయోజకత్వానికి సరస్వతి ఎంతగానో సంతోషించింది.
    ఇంతలో ఇంటిబయట జీపుఆగిన శబ్దం వినిపించి సరస్వతి కిటికీలోంచి బయటకి తొంగిచూసింది.
    పోలీసు జీపు!
    "బాబూ. పోలీసులు వచ్చారు. నువ్వుదాక్కో" ఆందోళనగా అంది సరస్వతి.
    "ఎందుకమ్మా! నొసలుమీది ముంగర్ల చుట్టని పైకి దువ్వేస్తా. దొంగనాయాళ్ళు గుర్తుపట్టలేరు" జేబులోంచి దువ్వెనతీస్తూ హుషారుగా అన్నాడు గోపి.
    "ఏమో బాబూ! ఎందుకయినా మంచిది. నువ్వు దాక్కో బాబూ. నాకెందుకో భయంగా వుంది."
    "సరేలే అమ్మా. నీదంతా పిచ్చిగానీ" అనేసి మంచంకింద దాక్కున్నాడు గోపి.
    గోపి అలా మంచంకిందకి వెళ్ళాడో లేదో పోలీసులు ఇలా ఇంట్లోకి బిలబిలా వచ్చేశారు.
    "ఏడి ? గోపి ఏడి?" అరిచాడు ఇన్ స్పెక్టర్.
    "గోపి ఇక్కడెందుకు ఉంటాడు బాబూ వాడు జైల్లో ఉంటాడు" అమాయకంగా అంది సరస్వతి .
    "వేషాలు వెయ్యొద్దు! గోపీ జైలునుండి తప్పించుకొని పోయాడు. వాడు తప్పకుండా ఇక్కడికి వచ్చివుంటాడు."
    "లేదు బాబూ. మావాడూ అలాంటివాడు కాడు బాబూ. వాడు చట్టాన్ని ధిక్కరించడు బాబూ."
    "ఆయన నామాటే ధిక్కరించరు. ఇంకా చట్టాన్ని ఏం ధిక్కరిస్తారు ఇన్ స్పెక్టర్." రాధ ఇన్ స్పెక్టర్ తో దీనంగా పలికి తర్వామోకలు గీరుకోడానికి అన్నట్టుగా క్రిందికిఒంగి మంచంక్రింద ఉన్న గోపినిచూసి కన్నుకొట్టి ఎలా అన్నాను అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది.
    గోపికూడా కన్నుకొట్టి బాగా అన్నావు అన్నట్టుగా సైగ చేశాడు.
    "హు! వీళ్ళతో మనకేంటి? కానిస్టేబుల్స్ మీరు ఇంట్లో అన్ని మూలలూ వెతకండి. ఆ గోపి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడని నా అనుమానం" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    కానిస్టేబుల్స్ ఇంట్లో నాలుగుమూలలకీ పరిగెత్తి తలుపుల వెనకాల, మంచం తలగడలకిందా, వంటగదిలో గిన్నెల మూతలుఎత్తి గిన్నెల్లోనూ, కుండల్లోనూ కోళ్ళగంపలకిందా చూసి ఇన్ స్పెక్టర్ దగ్గరకివచ్చి వరుసగా నిలబడ్డారు.
    "సార్. గోపి ఎక్కడాలేడు సార్" అన్నారు వాళ్ళు కోరస్ గా.
    "హు. ఎక్కడికి పోతాడు. ఊరు మొత్తం గాలించి పట్టుకునితీరతా పదండి."
    ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్స్ బయటకి పరుగుతీశారు.
    జీపు బయలుదేరి వెళ్ళినశబ్దం వినగానే గోపి మంచం కిందనుండి బయటికి వచ్చాడు. ముగ్గురూ ఒకరినొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు.
                                                                    * * *
    రాయుడు వీథి అరుగుమీద కూర్చుని ఏంతోచక మీసాలు తిప్పుకుంటూ ఉన్నాడు. ఇదివరకయితే ప్రక్కన సంతానం వుండేవాడు. అతనితో ఏవో సొల్లుకబుర్లు ఆడుతూ వుండేవాడు. సంతానం భార్యని రేప్ చేసింతర్వాత అతను రాయుడికి దూరం అయ్యాడు.
    "ఏం తోచడంలేదు. పోనీ చిత్రాంగి ఇంటికి వెళితేనో? లేదా అలా పొలం గట్టుమీద నుమది నడిచెళ్తూ వుంటే ఎవరో ఒకరు దొరికితే చక్కగా రేప్ చేస్కోవచ్చు.
    అనుకున్నాడు రాయుడు.
    అతను చెప్పులు వేస్కుని బయలుదేరడానికి సిద్దమవుతుండగా అక్కడికి రాములు అనే గూడెం మనిషి కంగారు కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు.
    "ఏంట్రా ఆ కంగారు? ఏమయింది...?" రాయుడు రాముల్ని అడిగాడు.
    "ఇంకేమవ్వాలండీ. ఆ సీతాలు దయ్యం అయిందండి. రాత్రి పూట నేను చెంబట్టుకుని బయటకెళితే తెల్లచీర కట్టుకుని నాకు ఎదురయ్యిందండి... నేను భయంతో గడగడా ఒణికిపోతూ వుంటే "ఒరేయ్ రాములూ నువ్వెందుకురా భయపడ్తావ్? నిన్ను నేనేమీ చెయ్యను. నా పగంతా ఆ రాయుడిమీదే. నేను ఆ రాయుడి ప్రాణాలుతీస్తా." అని చెప్పి మాయం అయ్యిందండి" అన్నాడు రాములు.
    "బాబోయ్.అది దెయ్యం అయ్యిందా?"
    గుండెలమీద చేయ్యేస్కుంటూ భయం భయంగా అన్నాడు రాముడు.
    "జాగ్రత్త బాబూ. అది ఏ క్షణానైనా  వచ్చి మీ పీకుచ్చుకుని రక్తం కక్కుకుని చచ్చేలా మీ వీపుమీద ఓ గుద్దు గుద్దగల్దు" అని వార్నింగ్ ఇచ్చి రాములు వెళ్ళిపోయాడు.
    సందు మొదట్లో తనకోసం ఎదురుచూస్తున్న గోపిని కలిసాడు రాములు.
    "ఆ రాయుడికి తమరు చెప్పమన్నట్టే చెప్పానండి బాబూగారూ" చెప్పాడు రాములు.
    "శభాష్!" అంటూ గోపి రాములు భుజం తట్టాడు.
                                                         37
    రాత్రి....
    రాయుడు తన గదిలో ఒంటరిగా కూర్చుని తాగుతున్నాడు. అతని మైండంతా గజిబిజిగా ఉంది.
    సీతాలు దయ్యం అయ్యిందా?
    తనని చంపుతానని అందా?
    నిజంగా చంపుతుందా?
    రాయుడికి చమటలు పట్టాయ్.
    ఇంతలో-
    ధడేల్...
    కిటికీలు గట్టిగా కొట్టుకున్నాయ్.
    రాయుడి చేతిలోని మందు గ్లాసు జారి క్రిందపడి ముక్కలు ముక్కలు అయ్యింది.
    రాయుడు ఒక్కసారిగా కుర్చీలోంచి నిలబడి భయం భయంగా కిటికీలవంక నుండి గది తలుపులు ధన ధనా కొట్టుకున్నాయ్.
    "ఎవరూ?.... ఎవరూ?...."
    చటుక్కున వెనక్క తిరిగి మళ్ళీ భయంభయంగా అడిగాడు-అతని మొహం అంతా చమటతో తడిసిపోయింది.
    "హి హి హి హి-"
    వెనుకనుండి ఓ స్త్రీ నవ్విన శబ్దం వినిపించింది.
    "బాబోయ్-" గట్టిగా అరిచి గదితలుపుల దగ్గరికి పరుగుతీశాడు రాముడు.
    తలుపులు తెరుద్దామని రెండుచేతులతో పట్టిలాగాడు. కానీ తలుపులు తెరుచుకోలేదు. ఎవరో బయటనుండి తలుపులు గడియ పెట్టేశారు.
    "తలుపులు! తలుపులు తియ్యండి!!"
    భయంగా అరుస్తూ తలుపులమీద దబదబా బాదాడు రాయుడు.
    "హి హి హి హి" స్త్రీ నవ్వు... ఈసారి కిటికీలోంచి వినబడింది.
    రాయుడు చటుకున్న వెనక్కి తిరిగి కిటికీవైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు.
    "ఠంగ్ - ఠంగ్ - ఠంగ్"
    గోడగడియారం సరిగ్గా పన్నెండుగంటలు కొట్టింది. అక్కడికి దగ్గరలో శ్మశానం గానీ, అడవిగానీ లేకపోయినా ఎక్కడినుంచో ఒకనక్క భయంకరంగా అరిచింది.చెట్లమీద గుడ్లగూబ కూడా కొన్ని క్షణాలపాటు వికృతంగా అరిచి తనవంతు కర్తవ్యాన్ని పూర్తిచేసింది.
    ఇంతలో కిటికీలు ఎవరో చేతుల్తోపట్టి ఊపుతున్నట్లుగా విసురుగా ఊగసాగాయ్.
    రాయుడు తడబడే అడుగుల్తో మెల్లగా కిటికీలను సమీపించాడు.
    కిటికీలు ఊగడం ఆగాయ్. అతను కిటికీలను చేతుల్తో ముట్టుకున్నాడు భయంభయంగా. ఆ తర్వాత కిటికీలోంచి బయటికి తొంగిచూశాడు.
    బయట అంతా చిమ్మచీకటి.
    "అంతా నా భ్రమ! దయ్యంలేదూ ఏమీలేదూ" తేలికగా ఊపిరి పీల్చుకుంటూ అనుకున్నాడు రాయుడు.
    "హి హి హి హి-"
    స్త్రీ నవ్వు!
    ఈసారి అతిచేరువలో!!
    రాయుడు చటుక్కున వెనక్కి తిరిగి చూసాడు.
    అంతే - అతని గుండె ఆగినంత పనైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS