Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 45

 

    మిసెస్ కైలాసం ఆఫీసరు అయిన మరుక్షణం నుంచి తను చాలా ఎత్తుగా పెరిగినట్లు ఊహించుకుంది. అంతవరకు చిక్కులేదు. కాకపోతే ఆమెలో వచ్చిన ఆ మార్పును ప్రపంచం కూడా గుర్తించాలని ఆశించింది. తన చుట్టూ వున్న ప్రపంచంలో కూడా మార్పును ఆశించింది. వచ్చిన చిక్కల్లా ఇక్కడే.
    మిసెస్ కైలాసం ఆ రాత్రంతా కలత నిద్రలోనే గడిపింది. నిద్రమంచం మీద లేచి కూర్చొన్న మిసెస్ కైలాసానికి ఆ ఇల్లూ, ఆ ఉదయమూ, ఆ వాతావరణమూ అంతా మామూలుగా వుండటం నిరుత్సాహాన్ని కలిగించింది. పైగా పనిమనిషి కూడా మాములుగానే తనపని తను చేసుకొంటూ వుండటం చిరాకేత్తుకొచ్చింది. కారణం లేకుండా పని మనిషి మీద విరుచుకు పడింది. అర్ధం కాని పనిమనిషి మౌనంగా తన పనిలో మునిగిపోయింది.
    'ఎంత నిర్లక్ష్యం!" గోనుక్కుంది మిసెస్ కైలాసం అంత కంటే ఏమనాలో తోచక.
    ఆఫీసుకు బయలుదేరిన మిసెస్ కైలసానికి బస్ స్టాండ్ వరకూ రోజులాగే ఎన్.జీ.ఓ లాగే నడిచి రావాలంటే చచ్చేంత సిగ్గు వేసింది. తను గజిటెడ్ అఫీసరయాక ఎన్.జీ.ఓ లతో పాటు మాబ్ లో మనిషిలా ......అదే మందలో గొర్రెలా నడవాల్సిందేనా?
    ప్రభుత్వం మీద , ఈ దేశం మీద మిసెస్ కైలాసానికి ఎక్కడ లేని కోపం వచ్చింది.
    గజెటెడ్ ఆఫీసర్ని చెయ్యగానే సరిపోయిందా? ఆ ఆఫీసరు హోదాను , గౌరవాన్ని నిలబెట్టడం ప్రభుత్వ భార్యత కాదూ? ఒక కారాపాడా? కనీసం టాక్సీని ఉపయోగించుకొనే ప్రావిజన్ అన్నా చెయ్యనక్కర్లేదా! హోదాను పెంచాగానే సరిపోయిందా? ఆ హోదాను నిలబెట్టే వసతులయినా చెయ్యాలి లేక జీతం అయినా పెంచాలి. తనకు కొండంత హోదా పెరిగింది. కాని లాభం? జీతంలో ఓ నూట పాతిక మాత్రమే అదనంగా పెరిగింది. దాంతో హోదాను నిలబెట్టుకొనే జీవితాన్ని గడపటం సాధ్యపడే పనేనా? ఎన్.జీ.ఓ గడిపిన జీవితానికి జీ.ఓ గా గడపబోయే జీవితానికి అట్టే తేడా వుండదు. అవ్వ! యెంత అవమానం! ఏం గజెటెడ్ ఉద్యోగమో? ఇదే ఏ ఇంగ్లాండులోనో ఐతేనా! అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వున్నప్పుడు మాత్రం ? గజెటెడ్ ఆఫీసర్లు ఎంతో వైభవంగా వుండేవాళ్ళు ఆ రోజుల్లో.
    ఆలోచిస్తూ నడుస్తున్న మిసెస్ కైలాసానికి కొందరు తెలిసిన వాళ్ళు ఎదురయ్యారు. కాని వాళ్ళలో ఎవరూ తనలో పెరిగిన ఎత్తూనూ, విశిష్టతనూ, గుర్తించినట్లు కనిపించలేదు ఆమెకు. రోజూ పలకరించినట్లే పలకరించి వెళ్ళిపోవటం ఆమెకు నిరాశనే కలిగించింది. వెధవ ప్రపంచం! కుళ్లు ప్రపంచం! మరొకరి గొప్పను గుర్తించలేని ప్రపంచం కక్షగా పై పళ్ళతో కింది పెదవిని కొరుక్కుంది.
    ఎలాగో బస్ స్టాండ్ చేరింది. బస్ స్టాండ్ లో అందరితో పాటు అదే మందలో గొర్రె లా, నిల్చోవాలంటే సిగ్గువేసింది. అందరికీ దూరంగా వెళ్ళి నిల్చుంది తను. ఈ మందకు సంబంధించిన వ్యక్తీ కాదు అని తెలియజేయాలనే ఆదుర్దాతో. తెలిసినవాళ్ళు విష్ చేస్తే జవాబుగా - గంభీరంగా - ఆఫీసరులా నవ్వటానికి ప్రయత్నించింది. అప్పటికీ తనలోని మార్పును గుర్తించని మూర్ఖుల్ని 'ఏం చేసినా పాపం లేదు' అనుకుంది.
    ఎలాగయితేనేం మిసెస్ కైలాసం బస్ ఎక్కింది. అంత శరీరాన్ని ఇద్దరు పిల్లల మధ్యన బలవంతాన కూలేసింది. అందులో ఒక పిల్ల తనమీదకు వాలిన బరువును భరించలేక, మోయలేక పుస్తకాలతో లేచి నిల్చుంది. ఆ పిల్ల నిల్చోవటానికీ , తను కూర్చోవటానికీ ఎలాటి సంబంధమూ లేనట్లు కూర్చుంది మిసెస్ కైలాసం.
    అదే సీటులో చివరగా కూర్చున్న జానకి మీద వాలాయి మిసెస్ కైలాసం చూపులు. ఎంత పొగరు? తనకింద తన ఆఫీసులో పని చేసే ఈ జానకి కూడా రోజూ అలాగే తనను చూస్తుందా! కనీసం తను ఆవిడ వైపు చూసినప్పుడన్నా , బస్ కాబట్టి లేవకపోయినా , లేవటానికి ప్రయత్నిస్తూ వినయంగా నమస్కరించక్కర్లా! ఎంత నిర్లక్ష్యం! మిసెస్ కైలసానికి జానకిని చెప్పుతో కొట్టాలనిపించింది. చీమల మర్రికి కట్టాలనిపించింది.
    పెద్ద చదువులే చదవొచ్చు. తనతో సమానమైన డిగ్రీ ఉండొచ్చు. అయితే మాత్రం తనతో సమానం అనుకోవడం ఎంత సాహసం! ఆ తెల్ల వాళ్ళ ప్రభుత్వం అయితేనా! జానకి లాటి పొగరుబోతుల్ని ఉద్యోగం నుంచి పీకేయ్యటానికి రెండు నిమిషాలు పట్టేది కాదు. అసలు ఆ డిసిప్లినే వేరు! ఇప్పుడో రామ! రామ! మాట్లాడితే ఎన్.జీ.ఓ లు హక్కు లంటూ సమ్మెలు కూడా సాగించారు.
    ఆఫీసరు "వెధవా" అని సబార్డనేట్ అంటే వెధవలా ముఖం పెట్టాలి. అంతేకాని తను వెధవను కాదు అని నిరూపించుకోవటానికి ప్రయత్నించటం ఎంత సాహసం? తను కూడా ఎన్నిసార్లు ఆఫీసర్ల ముందు ఫూల్ లా ముఖం పెట్టి వాళ్ళను సంతోష పెట్టలేదు? కాని జానకి!  వేలెడంత వుందో లేదో , చేసేది ఎల్.డి. గుమస్తా ఉద్యోగం -- పైగా తను చెయ్యని తప్పును ఆఫీసర్ల ముందు చస్తే ఒప్పుకోదే! జానకిని గురించి ఆలోచించిన కొద్ది మిసెస్ కైలాసంలో కోపం నీళ్ళలో వేసిన సోడాలా పొంగసాగింది.
    "ఎమమ్మోయ్! టికెట్!" అప్పటికి ఎన్నిసార్లు అడిగాడో ఏమో కోపంగా గట్టిగా అడిగాడు కండక్టరు.
    ఆలోచనల్లో మునిగివున్న మిసెస్ కైలాసం వులిక్కిపడింది. తను ఉలిక్కిపడటం జానకి చూసిందో ఏమోనని అటుకేసి చూసింది. జానకి ముసిముసిగా నవ్వుకుంటుంది. మిసెస్ కైలాసం గుండెల్లో కోపం సుళ్ళు తిరిగింది. కండక్టర్ను కొరకొరా చూసింది. అంతకంటే ఏమీ చెయ్యలేక.
    "టికెట్ అడుగుతుంటే అలా చూస్తావేంటమ్మా?" కండక్టరు చిరాగ్గా అన్నాడు.
    "మర్యాద తెలియని బ్రూట్స్' మనస్సులోనే అనుకోని , ఎడమ చేతి మునివ్రేళ్ళతో పది పైసలు బిళ్ళను అందించింది. ముఖం మరో వైపుకు తిప్పుకుంది.
    "ఎక్కడకు?"
    "లడకీ కా పూల్" ముఖం తిప్పకుండానే విసురుగా అంది "లకడీ కా పూల్" అనబోయి కోపంతో.
    కండక్టరు కిసుక్కున నవ్వి టికెట్ చేతిలో పెట్టాడు.
    "మర్యాదగా ప్రవర్తించు !" మిసెస్ కైలాసం గర్జించింది.
    అర్ధం కాని కండక్టరు తెల్లముఖం వేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS