రక్షకభటాధికారియగు రామచంద్రరావు "అయ్యా! మీ రనంత ప్రజ్ఞాధురీణులు. కాని మీరీ రహస్యము భేదించుటచే నాకు రావలసిన బహుమతి పోవుచున్నది. ఇందులకు జింతయు హంతకుడు దొరుకుటచే సంతసము గల్గుచున్న" వనెను.
"మీరు బహుమతి విషయమై భయపడ నక్కరలేదు. ఈ రహస్యము మీరు భేదించినట్లే ప్రచురించుకొనుడు. పత్రికలో నా పేరు పడుట కిష్టమేలేదు. శ్యామసుందరునకు గూడ నా విధాన మెరుగజేయు వరకంతయు నగాధముగనే యుండెను. కావున మీరే దీనిని భేదించినట్లు తలపుడు."
"ఆహా! ఎంతటి యౌదార్యము! కాని జనులకు నే నేమి చెప్పగలను? ఈ రహస్యమెట్లు బయలుపడినదో నాకు తెలియదు. నేనెందుల కనుమానించితినో, ఎట్లు నా యనుమానములు దృఢపడియెనో, హంతకునెట్లు బంధింపగల్గితినో- ఇట్టి విషయములెవ్వరైన నడిగిన నేనెట్లు చెప్పగలను? మీ ప్రతిభ వలన హంతకుడు మాత్రము దొరికినాడు. మువ్వురు సాక్షుల యెదుట నేరముకూడా నొప్పుకొన్నాడు."
"అట్లయిన మీకు గావలసినది రహస్యభేధన విధానమన్నమాట? సరే! మీకును తొలి నుండి నాకు దోడ్పడుచున్న యీ యనంతునికి సంగతులెల్ల విశదము చేసెద! వినుడు:
"ఈ సుబ్రహ్మణ్యము మిక్కిలి తెలివైనవాడు. లుబ్దులందరికివలె ఈతనికి అనుమానము మెండు. భార్య నెప్పుడును బాధించుచుండును. కాన నామె వీని పోరు పడలేకుండుట వింతకాదు. వీరి కానందుని పరిచయము గల్గెను. తన భార్యకును వానికిని సంపర్కము కలదని సుబ్రహ్మణ్యమునకు మిక్కిలి అనుమానము కలదు. కావున వారిపై కసి తీర్చుకొనవలయునని యాతడెంచి యుండెను. ఆ యూహతోడ నాతడెట్టి పైశాచిక కృత్యమైనను జేయుటకు సిద్దుడై యుండెను. మిక్కిలి తెలివితో బ్రవర్తించి కార్యము నెరవేర్చుకొనియెను. చూడుడు.....నాతో నిటురండు...
"ఆ యింటి నెరిగియున్నవానివలెనే మధుసూదనుడు మమ్ముల దోడ్కొని పోయెను. ఇంటికి వెనుక గల వరుస గదులలో నొక గూఢమగు కొట్టు చెంతకు దీసుకొనిపోయెను.
"అబ్బ ఎంత ఘాటయిన వాసన! రంగులు కాబోలును!" అనుచు రామచంద్రరావు వెనుకకు తగ్గెను.
"అదియే నా ప్రథమ సూత్రము. అనంతరావు రంగుల పూత గనిపెట్టెను. గాని దాని యుగత్యము నరయజాలడయ్యెను. ఇందులకే పరిశీలనమునకు దోడు పరిశోధనము గూడ నుండవలెనందును. అతడిట్టి రంగుల నేల పూయుచుండవలయును. కొంచె మూహింపుదు మరి ఏదో వాసనను దాచియుంచుటకీ పని చేసినట్లు బోధపడుటలేదా? ఏదియు కానివేళ యిట్టి నిగూఢ ప్రదేశమున నతడొనర్చు కృత్యముల కర్ధమేమి? వీని నన్వయించి చూడ నేదో ఘోరము జరిగినట్లు నాకు దట్టినది. పలాయితుల యుదంతము నెవ్వరికి దెలియదే! వారి సంగతి ఏమయ్యెను? ఒక్కొక్కదానికి ముడిపెట్టుచుండ ననుమానము స్థిరపడుచునే యుండెను. ఇంతియే కాక నే నా నాటకశాలకు పోయి కనుగొంటిని. ఆ రాత్రి ఇరువదినాలుగు ఇరువదిఐదు ఇరువది ఆరు సంఖ్యలు గల కుర్చీ లుత్తవిగనే యున్నట్లు తెలిసినది. ఇంటితో రహస్య మిట్టిదని బోధపడినది.
"ఇక మిగిలినదేమి? ఇంటిని వెదకి మృత్యకళేబరముల గనుగొనుటెట్లన్న ప్రశ్నయును ఇందులకొక యబద్దపు తంతి సృష్టించి సుబ్రహ్మణ్యమును గశింకోట కంపితిని. తప్పించుకొని పోకుండ ననంతుని బుత్తెంచితిని. ఇంక నడ్డువారు లేరని యిల్లు చొచ్చి వెదకుచుంటిని.
"ఈ గదిలోనే వారి దేహములు కనబడినవి. అవి యొక పేటికయందు భద్రపరచిబడియున్నవి. నేను పరిశీలించుచుండు సమయమున నెవ్వరో వచ్చి నన్ను పట్టుకొని ఇట్లగునని నేననుకోలేదు. కావున ఇది నాశ్చర్యము గొల్పెను. అట్లు వచ్చినది శ్యామసుందరుడే! ఇతడానందుని బంధువులవలన నియుక్తుడై నిరూపణ మొనర్చుచునింటిని వెదుకవచ్చెను. నన్ను జూచి దొంగయని పట్టుకొనెను. పిమ్మట పోల్చుకొని నవ్వుకొంటిని అప్పుడు సంగతినెల్ల నతనికి విశదపరచి సుబ్రహ్మణ్య మిటకు వచ్చునని పల్కితిని అంతవరకు వేచియుండి, రాగానే బంధించితిమి."
రామచంద్ర రావాశ్చర్యమొందెను. నేను మధుసూదనుని గాంచి "నా కింకను ఒకటి రెండు సందేహములు తీరుట లేదు. వాడు నాటకమునకు బోవలసిన యగత్యమాతనికేమి కలదు?" అని ప్రశ్నించితిని.
"బోధపడలేదా? మొదట నానందరావును ఈ మిషమీద నింటికి రావింపగల్గుట ఇది మిక్కిలి రహస్యముగా జరిగి యుండవచ్చును. రెండవది-హత్యారహస్యము బయలుపడినను తానా సమయమున నింట లేనని చెప్పుకొనవచ్చును. కానీ నీకు టిక్కెట్టు చూసి యతడు చేయరాని పొరపాటు చేసెను."
"భార్య ధనమెత్తుకొని పోయెనని యేడ్చినాడు. దాని కేమనుకొనును?"
"మరి దొరకలేదని యైనను లేక తిరుగ పంపివేసినది యని యైనను చెప్పగలడు ఈ విషయ మంత బాధించెడునది కాదు గదా!"
రామచంద్రరావంతట "అయ్యా! పోలీసువారమగు మాకీ రహస్యము శోధింపనిచ్చుట సమంజసమే కాని తమయొద్ద కీత డెందుల కేతెంచెనో బోధపడదు అనియెను.
"మరేమియు లేదు-సంగతులు ప్రాతబడిన పిమ్మట "చూచితిరా! నేనొక్క పోలీసువారినే కాక మధుసూదనుని సైతము వేడికొంటిని, లాభము లేకపోయినది" అని యాతడు చెప్పుకొనును."
"మీ మాటలు స్కోత్కర్షము లైనను క్షమార్హములే! ఓహో! మీ ప్రతిభ వర్ణనాతీతము కదా! మధుసూదనరావుగారూ! సెలవు మీరు నాకు మహోపకారమొనర్చితిరి. మీ కాజన్మాంతము కృతజ్ఞతాబద్దులము కదా."
---౦౦౦---
