Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 45


    ఏమైనా తినదగిన వస్తువులు కన్పిస్తే సామాజికమయిన కనీస మర్యాదలు పాటించకుండా వాటి మీదకు ఎగబడిపోయే వాడు. తినే పద్ధతి మాలతికి తప్ప మిగిలిన వారందరికీ జుగుప్స కలిగించేదిగా ఉంటుంది.
    మాలతి, ఫిజో ఇద్దరూ కలిసి అతడి కోసం చాలా శ్రమించారు. అతనికి చాలా విషయాలు నేర్పించారు. కొన్ని మాటల్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడతడు.
    అందరూ కూర్చుని ఉండగా వస్తే కాళ్ళమీదకూర్చోవటం అతనికి మామూలు అలవాటు. నిద్రవస్తే ఎక్కడుంటే అక్కడే పడుకోవటం అతని స్వభావం.
    ఇటీవల అటువంటి అలవాట్లు కొన్నిమారాయి. నిద్ర వస్తే మంచం మీద పడుకోవటం నేర్చుకున్నాడు. నలుగురి మధ్యకు వస్తే అందరిలా కుర్చీలో కూర్చోవటం తెలిసింది.
    మాలతి మధు వచ్చే సమయానికి అతడు లాన్ లో ఫిజో ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఫిజో అతనికి ఏవో మాటలు నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. అవి పలికేందుకు శ్రమగానే ఉన్నా నేర్చుకోవాలన్న పట్టుదలతో మనసు ఏ కాగ్రం చేశాడు అర్ధమానవుడు.
    మధు, మాలతి రావడం అతడు గమనించలేదు. ఫిజో వారిని చూచాడు. అర్ధ మానవుని చూచిన మధు నివ్వెర పోయినాడు. అద్భుతమయిన అతని శరీరసౌష్టవం అమితమైన ఆశ్చర్యం కలిగించింది. రెప్ప వేయటం కూడా మరచిపోయి చూస్తున్నాడు మధు.
    ఒక వినూత్నవ్యక్తి అక్కడకు రావటంతో నిశ్చలంగా ఉన్న అర్ధ మానవుని చూపులు చంచలంగా అయినాయి. నీరవంగా ఉన్న తటాకంలో చిన్న రాయి విసిరినట్లుగా అయింది.
    "గుడ్ మార్నింగ్ సర్" అంటూ అభివాదం చేశాడు ఫిజో. నవ్వుతూ అతనితో కరచాలనం చేశాడు మధు. అర్ధమానవుడు ఏంచేస్తాడన్న మీ మాంస మనసులో సందేహాలను రేకెత్తించగా అతనివంక రెప్ప వేయక చూస్తోంది కెప్టెన్ మాలతి. ఆమె ఆలోచనలు ఆశా పూర్ణంగానే ఉన్నాయి.
    వాస్తవానికి మంచుకొండల మీద పేరుకుపోయిన మంచు ముద్దలు అనుకూలమయిన వాతావరణం వచ్చేంత వరకూ అలాగే రాతిపలకల్లా గడ్డకట్టుకుపోయి వుంటాయి.
    టెంపరేచర్ పెరిగి అనుకూలమయిన వాతావరణం రాగానే అవి నీరుగా కరిగిపోవటం ప్ర్రారంభిస్తాయి. వాతావరణంలో కావలసినంత మార్పు వచ్చినప్పుడు మంచు మాత్రమే కాదు, రాళ్ళు కూడా కరుగుతాయి. ఉక్కూ యినుము బంగారమూ అన్నీ కరుగుతాయి.
    అలాగేమంచు కొండల మీద ఏకాంతంవల్ల సామాజిక జీవితం లేకవపోవటం వల్ల గడ్డగా పేరుకుపోయిన అర్ధమానవుని అంతరికలోకం యిప్పుడు కరిగిజారుతోంది. సిటీకి వచ్చాక అతనికి అనుక్షణం ఎదురు అవుతున్నవి వినూత్న మయిన అనుభవాలే!
    అందునించి అతనిలో అలజడి ప్రారంభమయింది. మాలతి ప్రోత్సాహంతో అది చాల శీఘ్రతరంగా మరింత అయింది. ఆమె సహకారంతో అది క్రమబద్ధంకూడా అయింది.
    అతడు దీనంతటికీ ఫలితాంశంగా అనుకరించటం నేర్చుకున్నాడు. ఎప్పుడయితే ఫిజో మధుని చూడగానే లేచి నిలబడి అభివాదం చేశాడో వెంటనే అర్ధ మానవుడు లేచి నిలబడ్డాడు.
    "గుర్.......ర్......డు......మా.......ర్......నింగ్" అంటూ ఎంతో శ్రమపడి ఫిజో అన్న మాటల్నే తాను కూడా అని చేయిచాచాడు. మధు అద్భుతరసంతో విప్పారిన నేత్రాలతో నాగరిక ప్రపంచంలోకి అతన్ని ఆహ్వానించి సుస్వాగతం పలుకుతున్నవానిలా కరచాలనం చేశాడు. తృప్తిగా నిట్టూర్చింది మాలతి.
    రాతి పలుకలుగా మారిన మంచుగడ్డలు కరగటం ప్ర్రారంభిస్తే అతిత్వరితంగా అనూహ్యమయిన వేగంతో కరుగుతాయి. అలానే అర్ధ మానవుని ఆంతర్యంకూడా అమితమయిన వేగంతో కరిగి నాగరికత అనే సముద్రంవైపుగా పురోగమిస్తోందని గ్రహించిందామె, ఆమె ఆంతర్యంలో ఆనందతరం గాలు లేచినాయి.
    "డియర్ మధు! మిత్రులందరూ రావలసి ఉంది ఏదైనా హోటల్ కి వెళ్ళి కాలక్షేపం చేద్దాం. మనతో పాటుగా మన ప్రపంచంలోకి వచ్చిన ఈ నూతన మిత్రున్ని కూడా తీసుకుపోదాం మరికొద్ది కాలంతరువాత అతనికి మనం చెప్పవలసింది ఏమీ మిగలదనుకుంటాను" అంటూ తన మనసులోని ఆశను వివరించింది మాలతి.
    విలక్షణమైన ఆమె వ్యక్తిత్వం గురించి మధుకి బాగా తెలుసు. అందునించి ఆమె మనసులోని ఆలోచనలు యదార్ధమయిన రూపానికి వచ్చేవరకూ పరిశ్రమిస్తుందని, సఫలంచేస్తుందని అతడు ఊహించాడు.
    "అవును అది యదార్ధమే నీవు ప్రక్కనుంటే ఈ నాగరిక ప్రపంచాన్ని అతడు కొద్దిరోజుల్లో అర్ధం చేసుకోగలుగుతాడు" అన్నాడు మధు ఆశా పూర్ణమయిన కంఠస్వరాన.
    అనుకున్న విధంగానే మరి కాస్సేపటికి రావలసిన వారందరూ వచ్చేశారు. మూడు కార్లతో హోటల్ కి బయలుదేరారు.
    హోటల్ గదులు చల్లగా చీకటిగా ఉన్నాయి. రేడియోలోంచి పావ్ మ్యూజిక్ మంద్రస్వరాన వినిపిస్తోంది. టి.వి.లు నిద్రపోతున్నాయి. బృందంలో వాళ్ళందరూ బ్యాచ్ లుగా చీలి జోక్స్ పేల్చుకుంటూ గలగల నవ్వుకుంటున్నారు.
    ఇంతలో ఎవరో వచ్చి వార్త అందించారు. రిక్రియేషన్ హాలులో హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం మరికొద్దిసేపటిలో ప్రారంభంకానుంది.
    అందరికన్నా భారీశరీరంతో ఉన్న పార్వతి ఎక్కువగా ముచ్చట పడిపోతోంది ప్రోగ్రాంకు వెళ్ళాలని. అప్పటికామె అయిదారు ఐస్ క్రీం కప్స్ లాగించేసింది. అద్భుతమయిన అర్ధ మానవుని శరీరసౌష్టవాన్ని రెప్ప వేయకచూస్తోంది.
    అతని బలిష్టమయిన బాహువులు విశాలమయిన ఛాతీ చూస్తోంటే మిగిలిన వారందరికీ భయమనిపిస్తోంది. కాని పార్వతికి మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అతికాయుడయిన అర్ధ మానవుడు ఆమెకు పరిపూర్ణపురుషునిలా కన్పించసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS