మామూలు సంగతులు ఆయన మతికి అంటవు.
"నాన్నగారికి పేష్ కష్ వసూలు కాకుండా వుంది. యీ సంవత్సరం పంటలు బాగానే వున్నాయి బహుశా యిచ్చేస్తారేమో!"
"ఎందుకివ్వాలి?" పాపయ్య ప్రశ్న.
"ఆ ప్రశ్న కొంతకాలం యిచ్చాక వేసుకుంటున్నాం కదా! అన్నయ్యగారూ!" అన్నది మల్లమ్మ ఆమెకు రాణీతనం అంటకట్టి, రాజకీయాల్లోకి యీడ్చి, సమస్యల గురించి మాట్లాడుతున్నాడు తాండ్ర పాపారాయుడు.
అయినా ఆమె రాచబిడ్డ కనుక తనకు తెలిసింది తనూ మాట్లాడటానికి వెనుకంజ వెయ్యలేదు.
"అవునమ్మా! చాలాకాలం యిచ్చాం కనుకనే నష్టపోయాం. యింకా యెందుకివ్వాలి అంటున్నాను" అన్నాడాయన.
"ఎదురు తిరిగేందుకు బలం కావాలికదా! సమయం వచ్చేవరకూ ఆగటమే రాజనీతి అవుతుంది" అని బదులు యిచ్చిందామె.
తాండ్ర పాపయ్యకి యిది నిజమేకదా అనిపించింది. అయినా విజయరామరాజుమీద ఎటువంటి వ్యాఖ్యానమూ చెయ్యకపోవటం ఆయనకు నచ్చలేదు. "యిదంతా విజయరామరాజు చేస్తున్న కుతంత్రమే కదా?" అని యెత్తి విడిచాడు.
"సరిహద్దులమీది రాజులు అసూయలో వుండటం అది అలుసుగా తీసుకుని మరొకళ్ళు ప్రయోజనం పొందటం యీ దేశ చరిత్రలో క్రొత్త యేమీకాదుగా అన్నయ్యగారూ!" అంది మల్లమ్మ.
ఆమె మాట్లాడిన మాటలో తప్పు ఒక్క విజయరామరాజుదే కాక యిరుపక్షాలదీ అయివుండవచ్చునన్న ధ్వని వుంది. అది తాండ్ర పాపారాయుడికి నచ్చలేదు. ఆయనకు నచ్చాలంటే తప్పంతా ఒక్క విజయ రామరాజుదేనని కుండ బ్రద్దలు కొట్టినట్లుగా చెప్పాలి. అలా చెప్పటానికి మల్లమ్మదేవి సిద్దంగా లేదు.
"మన తగవులు మనం చూచుకోవాలికాని పరాయివాళ్ళని పురి కొల్పటం యేమిటీ?" అంటూ సతాయింపు ప్రారంభించాడు.
"సాటివాళ్ళని తొక్కివేసి తాను తిరుగులేని శక్తిగా రూపొందించటానికి పేరు రాజనీతి. ధర్మం అనేది ఆలోచనలలో అంతర్లీనంగా వుండాలే తప్ప అది అధికారికంగా అడిగి రాజనీతిలో చూపమంటే చూపగలగటం అసాధ్యం. ధర్మరాజు యుద్దంలో కురుక్షేత్రమే ధర్మక్షేత్రం అని నిరూపించాగలిగాడా? వాలితో యుద్దంలో రాముడేమిచేశాడు? వాళ్ళేదో తప్పులు చేశారని నేను చెప్పబోను. రాజనీతి అలా వుంటుందని వుదాహరణ యిస్తున్నాను. రాజనీతి అటువంటిది అయినప్పుడు అందులో ధర్మం లేదని మనం ఆక్రోశిస్తే ప్రయోజనం యేమి వుంటుంది. అటువంటి స్థితిని కూడా ఎదుర్కోవతనికి మనం సిద్దపడాలి. అలా ఎదుర్కొని నిలబడినప్పుడే మన పక్షంనించి రాజనీతి ఖచ్చితమయినది అవుతుంది" అన్నది మల్లమ్మ. పాపారాయుడు అంతా శ్రద్దగా విన్నాడు. ఆలోచించాడు.
"అయితే నీ అభిప్రాయం ఏమిటి చెల్లీ!" అన్నాడు చివరికి.
"ఏముంది రాచపుట్టుక పుట్టాక ధర్మాన్ని నమ్ముకుని ధర్మం కోసం ఆక్రోశిస్తూ కూర్చుంటే స్వర్గం దక్కుతుందేమో కాని రాజ్యం దక్కదు. కపటనీతిని కత్తిపోటు యెదిరించలేదు. రాజ్యం పరిపాలించటానికి పౌరుషం ఒక్కటే అర్హతకాదు. సమయజ్ఞత కావాలి. ఖచ్చితమయిన సమయంలో ఖచ్సితమయిన నిర్ణయానికి రాగలిగిన వివేకం కావాలి" అంటూ తన అభిప్రాయాన్ని రవ్వంత దాచుకోకుండా చెప్పింది మల్లమ్మ.
ఆమె రాణీతనంలో బొబ్బిలి అజేయమైన శక్తిగా రూపొందుతుందని సంతోషించాడు పాపారాయుడు. ఆమె ఆలోచనల్లో రాజనీతికి వున్న విలువ నిజాయితీకి, ధర్మానికి లేదు.
"అవుసరం అనుకుంటే ధర్మం అనిపించినదానికి తిలోదకాలు యివ్వవచ్చునంటావు. అంతేనా?" అని అడిగాడు అనుమానాలతో తిరిగి పోవటం యిష్టంలేక. మల్లమ్మ మళ్ళీ చెప్పింది.
"మహోన్నత మానవుడుగా యెదగదలుచుకుంటే మీరు చెప్పే నిజాయితీ, ధర్మమూ ఆచరించాలి. కాని రాజుగా బ్రతకదలుచుకుంటే రాజనీతి తెలియాలి. ధర్మం వ్యక్తిగత జీవితాన్ని పాలిస్తుంది కాని రాజ్యాన్ని పాలించలేదు. రాజనీతి వ్యక్త్యత్వాన్ని కించపరచినా దేశాన్ని పాలించగలదు" అని తన అభిప్రయాన్ని మరింత స్పష్టం చేసింది మల్లమ్మ.
"రాజే కాదంటే ధర్మానికి చోటెక్కడ?" అన్నాడు పాపయ్య. అంతవరకూ అమాయకంగా ముఖంపెట్టి వారి మాటలు వింటున్న జగ్గమ్మ మాటల మధ్య జోక్యం చేసుకుంది.
"నన్ను చెప్పమంటారా అన్నయ్యగారూ!" అంటూ.
"చెప్పు చెల్లీ!" అంటూ జగ్గమాంబకు అవకాశం యిచ్చాడు పాపారాయుడు.
"మీరు రాజాంకు ప్రభువులు అవునా?"
"అవును"
"మీ సరిహద్దుల మీద ఒక దుర్మార్గుడు ప్రభువుగా వున్నాడనుకోండి."
"ఆఁ అనుకుంటే?"
"అతడు మీ మీదికి అన్యాయంగా వచ్చాడనుకోండి."
"చీల్చేస్తాను" అన్నాడు పాపయ్య పడిగమీసం దువ్వి.
"శాంతించండి అన్నగారూ! రాలేదు- వచ్చాడు అనుకోండి."
"ఊఁ...."
"ప్రజల్ని వూచకోత కోస్తున్నాడు యెక్కువ సైన్యం వుంది కాబట్టి."
"ఆఁ"
"అది మీ చోటు. స్థానికమయిన కిటుకులు మీకు తెలుస్తాయి. కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకు తెలియవు. ఒక రహస్యప్రదేశంద్వారా వాళ్ళని వెనుకనుంచి అర్దరాత్రి చుట్టుముదితే మీకు జయం రావటం తధ్యం. అలా అని మీ మంత్రులు మీకు సలహా యిస్తారు. అప్పుడు అలా చేస్తారా? అలా చెయ్యటం అధర్మం కాబట్టి మీ ప్రజల ప్రాణాలనూ, మీ ప్రాణాలను వాళ్ళకి బలియిస్తారా?" అని నిలదీసి అడిగింది జగ్గమాంబ.
