వెంకటపతి గిన్నెలో నుంచి కోడి పులుసు వేసుకొని మళ్ళీ ఒక వాయి కలిపాడు. అప్పటికి రామనాథబాబు, వరూధిని పెరుగన్నం తింటున్నారు. వెంకటపతికోసం అన్నట్లు నంజుతూ సుతారంగా తింటున్నారు.
"ఇరవై వేలు లాభం ఎందుకు వదులుకోవాలి?" అని వెంకటపతి "ఇదేందీ ఇంత తెలివితక్కువలో పడిందీ!" అన్నట్టు చూశాడు భార్యకేసి.
"ఎవరండీ ఆ కొనేవాళ్ళూ!" రామనాథబాబు కళ్ళల్లోకి చూసి అడిగింది వరూధిని.
"ఎవరైతేనేం? అమ్ముతారా, చెప్పండి!" ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రామనాథబాబు.
"పోనీ, ఆ స్థలం అంతధరపెట్టి ఎందుకు కొంటున్నారో తెలుసుకోవచ్చా?" కనురెప్ప లాడిస్తూ దెప్పుతున్నట్టు అడిగింది.
"సినిమాహాలు కట్టడానికి, అది చాలా మంచి సెంటర్!" వరూధిని కళ్ళల్లో కళ్ళు కలిపి చెప్పాడు రామనాథబాబు.
"ఇప్పుడొకటుంది కదండీ? రెండవది కూడా కట్టాలా ఏం?" ఠపీమని అన్నది వరూధిని రామనాథబాబు కలవరపడ్డాడు.
"అమ్మో! ఏమో ననుకున్నాను, ఆవులిస్తే పేగులు లెక్కపెట్తావే?"
వరూధిని చెంపలు ఎరుపెక్కాయి.
వెంకటపతి "పెరుగు, పెరుగు" అన్నాడు. వరూధిని గిన్నెవంచి మొగుడి కంచంలో పెరుగు గుమ్మరించింది.
"నిజం చెప్పవూ? నేను సినిమాహాలు కట్తున్నానని ఎవరు చెప్పారు?" ముద్దు ముద్దుగా మురిపెంగా అడిగాడు వరూథిన్ని కన్నార్పకుండా చూస్తూ రామనాథబాబు.
"ఒకరు చెప్పాలా ఏం? ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిదాన్నా ఏం?" వంపులు తిరిగిపోతూ అన్నది వరూధిని.
"నాకయితే స్థలం అమ్మరా ఏమిటి?" హాయిగా, తేలిగ్గా నవ్వుతూ అడిగాడు రామనాథబాబు.
"ఎవరిచ్చింది వాళ్ళే తీసుకుంటారా ఎక్కడన్నా?"
"అయితే ఆ స్థలంలో ఇల్లేకడతారా?"
"సినిమాహాలే కడ్తాం!"
వెంకటపతి పెరుగుముద్ద గుటుక్కున మింగి వరూధినికేసి నోరు తెరచుకొని గుడ్లప్పగించి చూశాడు.
"పోనీ, మరో సగభాగమన్నా ఇస్తారా నాకు?" అడిగాడు రామనాథబాబు.
"సగమేం ఖర్మ! మీరు అడిగితే పూర్తిగానే ఇస్తాం." ఉషారుగా అంది వరూధిని.
"ఫిఫ్టీ! ఫిఫ్టీ! చెరిసగం! హాలు రెండున్నర లక్షలవుతుంది, స్థలం కాక ఈ నెల చివరకు ప్లాన్ శాంక్షన్ చేయిస్తాను. మీ వంతు కాష్ లక్షా ఇవరైఐదువేలు స్థలం ఖరీదులో సగం పాతికవేలు నేను యివ్వాలిగా? పోతే, మీ వంతు పెట్టుబడి లక్షరూపాయలు. మన హాలుకు అన్నీ మోడరన్ ఫిట్టింగ్స్! అలాంటి థియేటర్ యీ టవున్లోనే కాదు జిల్లాలోనే ఉండదు. మన హాలు పేరేమిటో తెలుసా?" రామనాథబాబు ఠీవిగా అందంగా చెప్పాడు.
వరూధిని తను కూర్చున్నచోటే మర్చిపోయింది. హృదయం పొంగింది. వళ్ళు పులకరించింది.
"ఊఁ మన హాలు పేరు?" మత్తుగా మెత్తగా అడిగింది వరూధిని.
"వరూథినీ పిక్చర్ ప్యాలెస్!"
వరూధిని మనస్సు రంగుల బెలూన్ లా గాలిలోకి లేచింది.
"మనకు సినిమా హాలెందుకూ?" అనడానికి అవకాశమే దొరక్క, తెరిచిన నోరు మూసుకొని చెయ్యి కడుక్కున్నాడు వెంకటపతి.
వరూధిని రామనాథబాబుకు కిల్లీ అందించింది. భర్తకొకటిచ్చి, తను లావుపాటి కిల్లీ నోరు పట్టనట్టు కొంచెం కొంచెం కొరుకుతూ, రామనాథబాబు సుతారంగా వదులుతున్న సిగరెట్టు పొగ గదిలో 'సున్నాలు' చుట్టుకొని పైకి లేవడాన్ని మైమరచి చూస్తూండగా బచ్చమ్మ ఆదుర్దాగా లోపలకు వచ్చింది.
"నాన్నగారు! నాన్నగారు పోయారమ్మా!" అంది.
వరూధిని చేతిలోనుంచి సగం కొరికిన కిల్లీ కిందపడింది. పండిన నోటి రంగు కళ్ళలోకి పాకింది.
"ఎప్పుడూ?" వెంకటపతి లేచి అడిగాడు.
"అరగంటకూడా కాలేదు."
"పొద్దున బాగానే వున్నారే!" ఏమీతోచక అన్నాడు వెంకటపతి.
"నాలుగ్గంటలకు డాక్టరుగారు చూసి, ఇంకేం ఫర్వలేదన్నారు బాబూ! అంతా కన్నుమూసి తెరిచేలోపల అయిపోయింది. పాలల్లో హార్లిక్స్ కలుపుతున్నా పంచదార తక్కువేయమని కూడా చెప్పాడు నాయనా! పంచదారవేసి, డబ్బా మూతపెట్టి, పంచదార కలిపి, గ్లాసు ఇద్దామనేసరికి - ఏం చెప్పను బాబూ!" బుచ్చమ్మ భోరున ఏడ్చింది.
అందరికంటే ముందు తేరుకున్నాడు రామనాథబాబు. కారుడ్రైవర్ను కేకేసి, బుచ్చమ్మను "వెళ్ళి కారెక్కు" అన్నాడు. బుచ్చమ్మ కారు దగ్గిరకెళ్ళి నిలబడింది. వరూధిని ముఖాన చేతులు కప్పుకొని కుమిలి ఏడుస్తుంటే వెంకటపతి కోసం వెతికాడు. వెంకటపతి అప్పటికే బయటకు వెళ్ళి కార్లో కూర్చున్నాడు. ఓ క్షణం సందేహించి రామనాథబాబు వరూథిన్ని సమీపించాడు. రెండు చేతుల్తో ఆమెను పట్టుకొని "ఊరుకో!" అని ఊరడిస్తూ లేవదీశాడు. వీధివాకిట్లోకి వస్తుండగా వరూధిని రామనాథబాబు చేతుల్ని మృదువుగా తోసేసి, కారుదగ్గిర కొచ్చి, భర్త ప్రక్కనే కార్లో కూర్చుంది.
18
సాంబయ్య బస్ దిగి రైలుపేటకు రిక్షా మాట్లాడాడు. రిక్షావాడు సాంబయ్యను ఎగాదిగా చూసి అర్ధరూపాయి అడిగాడు. సాంబయ్య రెండడుగులు ముందుకు వేసి "పావలా ఇస్తా, వస్తేరా!" అన్నాడు. రిక్షావాడు సాంబయ్య ముందుకు రిక్షా తోసుకొచ్చి "ఎక్కండి!" అన్నాడు. సాంబయ్య ఓ కాలు రిక్షాలో పెట్టి రెండోకాలు భూమీద నుంచి లేపుతుండగా "ఆరణాలివ్వండి!" అన్నాడు రిక్షావాడు. సాంబయ్య రిక్షాదిగి "గాడ్దికొడకా!" అనుకున్నాడు. ఊళ్ళో ఎవరన్నా అయితే చేతికర్ర తిరగేసేవాడే! ఇది బస్తీ! అంతా ఇదే బాపతు అనుకున్నాడు.
వీడితో బేరమాడినంతసేపు పట్టదు నడిచి వెళ్తే. ఎక్కాదిగా ఇదో శ్రమ! సాంబయ్య కాలు ఝాడించి నడవసాగాడు. బస్సుస్టాండుకు వాళ్ళున్న ఇల్లు అంతదూరం కాదని చెప్పాడు కొడుకు. తూరుప్పొలం అంతదూరం కూడా ఉండదట. చల్లటి వేళ. నడిస్తే ఎంతసేపు పడుతుంది? రోడ్డుమీద కొంతదూరం నడిచాక హాస్పిటల్ ఎడంగా కన్పించింది.
కొడుకు చెప్పిన ఆనవాళ్ళు గుర్తు చేసుకోసాగాడు. హాస్పిటల్ దాటాక దగ్గిర్లేనే వుందట ఇల్లు. వేపచెట్టు దగ్గిర సందులోకి వెళ్తే మళ్ళీ అడ్డరోడ్డు వస్తుంది. ఆ వీధిలో కుడివైపుకు తిరిగితే రెండో ఇల్లు. మధ్య మధ్య తలపక్కకు తిప్పి చూస్తూ నడుస్తున్నాడు సాంబయ్య.
సాంబయ్యకు వేపచెట్టు కనిపించేసరికి ఇల్లు దొరికినంత సంతోషమైంది. ఐతే సరిగ్గా వేపచెట్టు దగ్గర సందేదీలేదు! వేపచెట్టుకు ఇవతలా అవతలా సందులున్నాయి! సాంబయ్య సందేహంలో పడ్డాడు. మళ్ళీ వెనక్కు వెళ్ళటం ఎందుకని వేపచెట్టు దాటాక సందులోకి తిరిగాడు. ఐదు నిముషాలు ఆ సందులో నడిచాక, అడ్డంగా వచ్చిన రోడ్డు మీదకు వచ్చి కుడివైపుకు తిరగటానికి చూశాడు. అసలు వీధేలేదు. ఆ వరస రోడ్డు అక్కడకొచ్చి కాంపౌండు గోడదగ్గిర ఆగిపోయింది. బహుశా ఎడంవైపుకే తిరగాలేమో? తను పొరపాటుగా విని వుంటాడు. లేకపోతే తిక్కిరి బిక్కిరిగా చెప్పాడా? అసలు బజారు లేదు కనుక ఎడం వైపుకే తిరగాలని నిశ్చయించుకొని సాంబయ్య ఆ వీధికి తిరిగి కొంతదూరం నడిచాడు. రెండో ఇల్లు కట్టెల అడితీ. మూడో ఇల్లు బొగ్గుల అంగడీ. ఇంకా కొంతదూరం నడిచి సందులోకి తిరిగాడు. అంతే! సాంబయ్య అరగంటదాకా అక్కడక్కడే తిరిగాడు. మళ్ళీ వేపచెట్టున్న వీధిలోకి రావాలని ప్రయత్నించి మరో వీధిలోకి వచ్చాడు. సాంబయ్యకు అంతా అయోమయం అయింది. చిరాకు వేసింది.
దీన్ని తగలెయ్యా? ఏం బస్తీ? అన్నీ సందులూ, గొందులూ? సాలెగూడులా వుంది. అందుకే ఈ సాలెగూటిలో పడ్డవాడు మళ్ళీ తిరిగిరాలేడు. ఆలోచించినకొద్దీ తనే సాలెగూటిలో ఇరుక్కున్న ఈగలా అయిపోయాడు సాంబయ్య.
నిస్పృహలో పడ్డ సాంబయ్య ఆ త్రోవనే పోతున్న ఒక మనిషిని చూసి....

