అదీగాక శ్రీశ్రీగారికి, ఏదైనా ప్లాన్ చేస్తే అక్షరాలా అల జరగాల్సిందే! వారి టైమింగ్స్, పద్ధతులూ....అమ్మో! చాలా కష్టం. అందులోనూ టైం విషయంలో వారు చాలా స్ట్రిక్ట్.
శ్రీశ్రీగారు టైం చూడడం ప్ర్రారంభించారు. టిక్ టిక్ మని వాచీకాదు కొట్టుకోవడం, నా గుండె కొట్టుకుంటోంది.
తొమ్మిదిన్నర అయింది. ఆయన ముఖం కందగడ్డలా అయిపోతోంది. జగ్గయ్యగారింకా రాలేదు.
వస్తూనే "నమస్కారం శ్రీశ్రీగారూ!" అన్నారు.
ఆయనేమీ రిప్లయ్ యివ్వకుండా జగ్గయ్యగారి దగ్గరకు వెళ్ళి తన చేతి రిస్టు వాచీ చూపించి, "టైమెంత?" అని అడిగారు. జగ్గయ్యగారు చెప్పారు. "నాక్కావలసింది అంతే నేను వెళ్ళిపోతున్నాన"ని బైటకి వచ్చేశారు శ్రీశ్రీగారు.
నేను వెనకాల పరుగెత్తి, "జగ్గయ్యగారు వచ్చేశారుగా! మనం వెళ్ళిపోతే బాగుండదు. రండి లూప్ వేస్తున్నారు. దయచేసి నా మాట వినండి"
"వాళ్ళిప్పుడొస్తే నేను పనిచెయ్యాలా? నేను కరెక్టుగా వచ్చాను. తొమ్మిది గంటలవరకూ వెయిట్ చేశాను. అంతే నేనీరోజు పనిచెయ్యను. అయినా - నీ మాట నేను వినేదేమిటి? నన్ను అదుపులో పెట్టాలనుకుంటున్నావా? రా వెళదాం" - అన్నారు.
* * *
ఒక వైపు పెద్ద ఆర్టిస్టులంతా వచ్చేశారన్న హడావుడి.....రెండోవైపు శ్రీశ్రీగారు పేచీపెట్టి అనవసరంగా పేరు చెడగొట్టుకుంటున్నారన్న బాధ! ఈ పరిస్థితిలో ఇంకెవ్వరూ మమ్మల్ని పిలిచి పిక్చర్ ఇవ్వరు. ఇంతమంది ఆర్టిస్టులు ఒకేసారి దొరకడం కష్టం. వాళ్ళ షూటింగులు క్యాన్సల్ చేసుకొని, అతికష్టం మీద మాకు కాల్ షీట్లిచ్చారు.
ఇవన్నీ శ్రీశ్రీగారికి తెలుసు. అయినా తిక్క తిరిగింది. అంతే ఇక ఎవ్వరం సాల్లేము. ఆయనతో నాకు చావో రేవో తప్పదు - అని నిశ్చయించుకొని నేను కూడా మొండికేశాను.
"ఏవండి - తొందరపడి లాభంలేదు. ఒప్పుకున్నా తర్వాత మన పని మనం చెయ్యాల్సిందే! మీ అర్ధం పర్ధం లేని కోపంతో అనవసరంగా గొడవలు పెట్టుకోకుండ"ని మళ్ళీ చెప్పాను.
"అంటే - నీ ఉద్దేశం ఏమిటి?" - అని నిప్పులు కక్కారు.
"ఉద్దేశానికేముంది? మీ పట్టుదల బాగులేదు. పనిచేద్దామంటున్నాను".
"అంటే నా మాటకాదని నువ్వు పనిచేస్తావన్న మాట" అనడిగారు.
"మీ మాటకాదని కాదండీ. మీ ఇష్టం మీదే చేస్తాను".
"నా యిష్టం అయితే - పోదాం పద" అన్నారు.
ఆర్టిస్టులందరికీ విషయం అర్ధమయిపోయింది.
సావిత్రిగారు "నమస్కారమండీ శ్రీశ్రీగారూ!" అంటూ, "ఏదమ్మాయి, నా పోర్షన్ పుస్తకం ఇవ్వ"ని నా దగ్గరికి వచ్చారు.
నేను ఇరకాటంలో పడ్డాను. ఇటు శ్రీశ్రీగారూ - అటు సావిత్రిగారూ! న్యాయంగా శ్రీశ్రీగారే ముఖ్యం. వారి మాటే వినాలి. కానీ అంతమంది పెద్ద ఆర్టిస్టులు వుద్మగా కాల్ షీట్ క్యాన్సల్ చెయ్యడం నిజంగా అన్యాయం. నేనూ మొండికేశానని ముందే చెప్పానుగా. "ఏవండీ నేను పనిచేస్తున్నాను" అని సావిత్రిగారికి పుస్తకం ఇచ్చేశాను.
అంతే - గురువుగారి కోపం తారాపథాన్ని అందుకొంది.
"సరోజా!...." అని ఒక్క అరుపు అరిచారు.
వారి జీవితంలో నేను అడుగుపెట్టిన తర్వాత, వారి నోటంట అంత పెద్ద ధ్వని వినడం అదే మొదటిసారి, ఆకహరిసారికూడా, అనుకుంటాను. జడిసిపోయాను.
ఆయన తన టేబుల్ మీదున్న బెల్ రెండుసార్లు నొక్కారు. అంతే - పిక్చర్ ఆగిపోయింది. నా పరిస్థితి చూసి అందరూ చూపుతున్న సానుభూతికి నాకు ఏడుపొచ్చేస్తోంది.
"ఏమయిందండీ శ్రీశ్రీగారూ! ఈ రోజెందుకు మీ మూడ్ పాడయింది?" అని అందరూ ఆయన దగ్గరకొచ్చి అడిగారు.
"ఏమీ లేదండి?? -అనేశారాయన.
జగ్గయ్యగారు వచ్చి, "ఏం గురువుగారూ! నేను ఆలస్యంగా వచ్చాననా?" అనడిగారు.
"మీ విషయం కాదండీ బాబూ! ఇప్పుడు తేలాల్సింది. మా ఇద్దరి విషయం మీరు కూర్చోండి వస్తాను" అని, ప్రొడ్యూసర్లని పిలిచారు.
"మీకు ఈవిడ కావాలా, నేను కావాలా? నేను పనిచెయ్యాలంటే ముందు ఈవిడ్ని థియేటర్ నుండి బయటికి గెంతి, తర్వాత నాతో మాట్లాడండి" - అని వాళ్ళతో చెప్పి, నన్ను చూసి, "గెటవుట్" - అన్నారు.
అందరూ విషమ పరిస్థితిలో పడ్డారు. శ్రీశ్రీగారికి ఎంతో నచ్చచెప్పారు. ఎవ్వరేం చెప్పినా లాభంలేదని నాకు తెలుసు. నా ఒక్కదానికోసం, ఇంతమంది ఇరకాటంలో పడడం చూసి, నాకు జాలివేసింది.
ప్రొడ్యూసర్లు వచ్చి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.
"అదేం కుదరదండీ మా యిద్దర్లో ఎవరు కావాలో మీరే తేల్చుకోండి" అన్నారు.
ఆ మాటతో నాకు తల తీసేసినట్టయింది.
నేను వెంటనే లేచి, "అంత పెద్ద మాట ఎందుకండీ నేను ఆఫ్ ట్రాల్ మీ పేపర్ వెయిట్ ని మీ దయుండి పనిచ్చారు. చేశాను. వద్దంటున్నారు. న్యాయంగా నేనే వెళ్ళిపోవాలి" అంటూ స్క్రిప్ట్, పుస్తకాలూ వారికి అప్పగించేశాను.
అవమానంతో నా మనసు దహించుకుపోతోంది. అందరి దగ్గరా శెలవు తీసుకొని బయలుదేరాను.
బయటకు రాగానే ఆర్టిస్టులంతా నా చుట్టూ చేరి, "సరోజగారూ! వెళ్ళిపోతున్నారా? శ్రీశ్రీగారి కోపాన్ని, మాటల్ని పట్టించుకుంటారేమిటండీ?" అన్నారు. నా కళ్ళనిండా నీళ్ళున్నాయి. అయినా వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ, "నేనూ అదే అంటున్నానండీ. వారి కోపం లెక్కేమిటి? కొద్దిసేపట్లో పోతుంది. అది పోయేదాకా నేనిక్కడ వుండడం మంచిది కాదు వస్తాను" అని చెప్పి, వారు తెప్పించిన టాక్సీలోనే బయలుదేరి పోయాను.
ఇంట్లో అందహ్రూ ఆశ్చర్యపోయారు. నేను వెక్కి వెక్కి ఏడ్చేశాను.
మా అమ్మగారు ఈ గ్రంథమంతా జరుగుతున్న సమయంలో ఆడ ఆర్టిస్టులతోపాటు బయట పాకలో కూర్చున్నారు. అంచేత ఆమెకు పూర్తి వివరాలు తెలియవు.
కాసేపయ్యాక నాన్నగారితో అన్ని విషయాలూ చెప్పాను.
"ఆయన రమ్మనగానే ఎందుకు వచ్చేశావు కావని?" అడిగారు.
"ఏమిటి నాన్నగారూ? మీరూ అలాగే అంటున్నారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా థియేటర్లో వుంటే, డబ్బింగ్ క్యాన్సల్ చేసి వచ్చెయ్యడమా? రేపు మళ్ళీ పిక్చర్ రాయమని ఎవరయినా పిలుస్తారా? మీరూ అలాగే మాట్లాడతారేమిటి?" అన్నా.
"నిజమే అనుకో అది ఆయనకి తేలియాలమ్మా!" అన్నారు.
"ఫరవాలేదు నాన్నగారూ! శ్రీశ్రీగారి దగ్గర పని లేకుంటే ఏంచేసేవాళ్ళం? అలాగే ఇప్పుడు వారి దగ్గర పని చెయ్యలేదనుకుందాం. వారిది అరువు మంట కోపం. అది అట్టేసేపు వుండదు. వారికి నా మీద కోపం వచ్చింది. సాధిస్తారని నాకు తెలుసు. కానీ ఆ సాధింపు ఇంత దారుణంగా వుంటుందని ఊహించలేదు. ఈ పరిస్థితిలో పనిచెయ్యడమా, మానడమా అని ఆలోచిస్తున్నాను" - అని ఏడ్చినందువల్ల వచ్చిన తలనొప్పితో నడుం వాల్చాను.
పన్నెండు గంటలదాకా నన్నెవ్వరూ లేపలేదు. తర్వాత అమ్మ అన్నానికి లేపింది. "నాకు ఆకలి లేదమ్మా" అని అలాగే నిద్రపోయాను.
ఒంటిగంటన్నర అయ్యింది. శ్రీశ్రీగారు వచ్చారని మా అమ్మ లేపింది. ఉదయం అందరిలో అవమానించిన వారు మధ్యాహ్నానికల్లా ఇంటికొచ్చేసరికి, ఏమనాలో ఏం చెయ్యాలో తోచక అయోమయ స్థితిలో పడి అక్కడినుండి లేచి లోపలికి వెళ్ళిపోయాను.
నా వెనకాల వచ్చి "సరోజా అని" పిలిచారు.
"ఎందుకొచ్చార?" ని అడిగాను.
"నిన్ను చూడాలని".
"బతికున్నానా, చచ్చానా అనా? ఇంకా ఏం చూస్తారు? అందరిలో అవమానపరచి గెటవుట్ అని బయటకి గెంటేశారుగా".
"అందుకు నువ్వే కారణం".
"నేనేం చేశాను?"
