దామోదరానికి అర్ధమై పోయింది. కామినీ దగ్గర ఉన్న ఫోటోలు క్యాసెట్స్ తను సంపాయించ గలిగితే ఒక్కసారిగా తను లక్షాధికారి అయిపోతాడు. అవి చేజిక్కనంతవరకు తను ఏమీ చేయలేడు. మాటలతో కాలయాపన తప్ప. రావుగారికి నాలుగురోజులు టైమ్ పెట్టి కామినీ నుండి క్యాసెట్ సంపాదించాలి. కనుక...
"నేను కాస్త ఆలోచించుకోవాలి మీరు నాకు వారం రోజులు టైమ్ ఇవ్వాలి." దామోదరం అన్నాడు.
"వారం కాకపోతే పది రోజులు తీసుకో లేకపోతే ఒక్కరోజే తీసుకో. నాక్కావలసింది ఫోటోలు, క్యాసెట్లు మరోమాట కామినీతో ఈ విషయం చర్చించి మళ్ళీ మీరు పార్టనర్స్ అయ్యే ఆలోచన చేస్తే, కామిని నీకు మళ్ళీ టోకరా ఇవ్వవచ్చు. కనుక బాగా ఆలోచించి నీ దగ్గర ఉంటే తెచ్చివ్వు. లేక అవి కామినీ దగ్గర వుంటే కామినీ రహస్యాలన్నీ నీకు తెలుసు కాబట్టి, కామిని ఏవి ఎక్కడ దాస్తుందో అదీ తెలుసు కాబట్టి కామినీనుంచి నువ్వు సంగ్రహించి వాటిని నాకు తెచ్చివ్వు. బ్లాక్ మెయిలర్ నువ్వే అని తెలిసిపోయింది కాబట్టి, ఇహపై మా వాడికి బెదిరింపు లేఖలు రావు, ప్రస్తుతానికి అది ఒక్కటే నాకు సంతోషం నీవు వాటిని కూడా నాకు ఇస్తే పరమానందం. ఇంతకన్నా నేను చెప్పేదేమీలేదు దామోదరం!"
"చెప్పానుకదా! వారం రోజులు గడువు కావాలి. మాట అంటే మాటే!" సగం కాలిన బీడీని దూరంగా విసిరేస్తూ అన్నాడు దామోదరం.
మరి కొద్దిసేపు మాట్లాడుకుని, ఇరువురూ లేచి ఎవరి దోవన వారు బయలుదేరారు.
దోవ పొడుగూనా దామోదరం ఆలోచిస్తూనే వున్నాడు. "కామినీ దగ్గరవున్నా రహస్యమేదో తనకు ఇంత వరకూ తెలియదు. కిరణ్ చేసిన ఏదో తప్పు పనిని కామినీ ఫోటోలు తీసి రికార్డు చేసింది. వాటినెక్కడో దాచి బెదిరిస్తున్నది. అదేదో పెద్ద నేరంతో కూడిన రహస్యమే. ఆ రహస్యం తెలిసి చావకపోయినా ఫరవాలేదు. ఫోటోలు క్యాసెట్ లు సంపాదిస్తే తను లక్షాధికారి అయిపోతాడు. అమ్మ నాకొడకా! నీకు ఎంత అదృష్టం పట్టబోతున్నదిరా! (తనని తానే తిట్టుకున్నాడు ముద్దుగా).
మరి కిరణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉత్తరాలు రాస్తున్నది ఎవరు కామినీ కాదు. కామినీకి అంత అవసరంలేదు. ఆ బ్లాక్ మెయిలర్ ఎవ్వడో కాని తనకు చాలా మంచి చేసాడు. రావుగారు తననే ఆ బ్లాక్ మెయిలర్ అనుకుంటున్నాడు. అంతవరకూ బానేవుంది. కామినీకి కాక ఈ రహస్యం ఆ బ్లాక్ మెయిలర్ గాడికి కూడా తెలుసన్నమాట. ఇప్పుడు తనో ముఖ్యమైన పని చేయకపోతే విషయం రసాభాస అవుతుంది. కిరణ్ కి బ్లాక్ మెయిలర్ గాడు మళ్ళీ ఉత్తరం రాయొచ్చు. ఆ లెటర్ కనుక వాళ్ళకందితే రావుగారికి తనమీద అనుమానం వస్తుంది. అలా అనుమానం రాకుండా చూసుకోవాలంటే వాళ్ళకి ఆ లెటర్ అందకూడదు. రావుగారింటికి వచ్చే ఉత్తరాలన్నింటినీ తను ముందుగా చేజిక్కించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దీని పైనే ఆధారపడి వుంది. తను లక్షాధికారి అయ్యేది, భిక్షాధికారి అయ్యేది.
"పోస్ట్ మాన్ కి లంచం పెడితే తింటాడా? తినకపోనూ వచ్చు! ఆ మ్యామ్యా తింటే సరే, తినకపోతే ఏం చెయ్యాలి అన్నది తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు సాగాడు దామోదరం.
27
దామోదరం ప్రక్కకు ఒక్క దూకు దూకాడు. దామోదరాన్ని రాచుకున్నంత ప్రక్కగా ఓ చిన్న కారు వచ్చి కీచుమంటూ ఆగింది.
దామోదరం కోపంగా కారు ప్రక్కకు వచ్చి "ఎవరివయ్యా! నువ్వు. కాస్తుంటే నీ కారు కిందపడేవాడిని. నన్ను చంపితే నీకే మొస్తుంది!" కోపంగా అరిచాడు.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మనిషి కారు డ్రైవరు కాదు. అతి ఖరీదైన పెద్దమనిషి. అతను విండోలోంచి తల బయటపెట్టి "నిన్ను చంపితే నాకు వచ్చేది బారెడు ఉరిత్రాడు ముక్క. నీవు బ్రతికివుంటే నాకు కాదు నీకు వచ్చేది కొన్ని లక్షలు" నవ్వుతూ అన్నాడు ఆవ్యక్తి.
దామోదరానికి అయోమయమయిపోయింది.
"వీడు ఖరీదైన పిచ్చివాడా? పిచ్చివాడైతే కారు ఎలా నడుపుతాడు?" అనుకున్నాడు.
"నా మాటలు నీ కర్ధం కాలేదా! లేక నన్ను పిచ్చి వాడికిందా, వెర్రివాడికిందా భావిస్తున్నావా! నీవెవరివో నాకు బాగా తెలుసు. నీతో నాకు పని బడింది. కారెక్కు నీతో మాట్లాడాలి." అతని స్వరం హుందాగా వినవచ్చింది.
జంకుతూ ఒక అడుగు వెనక్కువేసి "నాతో ఏంపని?" అడిగాడు.
"పిరికివాడు లక్షలు సంపాదించలేడు అబ్బాయ్! నువ్వు అందమైన ఆడపిల్లవు కాదు ఎత్తుకు పోటానికి, నీ దగ్గర మణి మాణిక్యాలు లేవు దోచుకోవటానికి. ఓ విషయంలొ నీవు నాకు సహాయం చేస్తే నీకు లక్షలు ముడతాయి. విషయం చెప్పిన తరువాత ఇష్టం లేకపోతే అప్పుడే కాదు దిగి పోదువుగాని, ఇష్టపడితే నాతో చేయి కలుపుదువు కాని. నడి బజారులో మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది. నీ కిష్టమైతే త్వరగా కారు ఎక్కు!"
"తన దగ్గర దోచుకుపోయేవి ఏమీలేవు. తనని ఏ దొంగముండాకొడుకు ఎత్తుకెళ్ళడు. కారు ఎక్కితే వచ్చే నష్టమేమీ లేదు" అనుకున్న దామోదరం మారు మాట్లాడకుండా కారు ఎక్కాడు.
కారు శరవేగంతో బయలుదేరి ఒక చిన్న అందమైన బంగళా ముందు ఆగింది. ఆయన కారులోంచి హుందాగా దిగారు. "దిగు బాయ్!" అన్నాడు.
ఆయన ముందు నడుస్తూంటే దామోదరం ఆయన వెనుకనే నడుస్తున్నాడు.
ఆ భవంతిలో ఎవరూ లేరు. తాళంతీసి లోపలికి ప్రవేశించాడు. దామోదరం కూడా వెనుకనే వచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళంగానే సోఫావైపు చేయి చూపి దామోదరాన్ని కూర్చోమని సైగ చేశాడు. ఫ్రిజ్ తెరిచి అతి ఖరీదైన విస్కీ బాటిల్. కారం వేసిన జీడిపప్పు పలుకులు, రెండు గాజుగ్లాసులు, టీపాయ్ మీద పెట్టాడు. ఆయన కూడా వచ్చి దామోదరానికి ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు.
దూదిలోవున్న మెత్తటి సోఫా, ఎయిర్ కూలర్ లోంచి వచ్చే చల్లటిగాలి, ఎదురుగా కూర్చున్న మనిషి యొక్క ఖరీదైన వస్త్రధారణ, నాలుగు వేళ్ళకి రవ్వల ఉంగరాలు, మెళ్ళో పులిగోరు గొలుసు, గోల్డ్ చైన్ కల వాచీ. ఈ బంగళాలోని ఫర్నిచర్ కూడా ఖరీదైనది, కళ్ళముందు అమృతం (విస్కీ) బాటిల్ ఇవన్నీ చూస్తూవుంటే దేవేందృడితో కలసి ఇంద్రభావానికి వచ్చినట్టుగా వుంది దామోదరానికి.
