Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 45


    అలువేలు ఆశ్చర్యపడలేదు సుకృతి జవాబుకి. ఆనందించింది. ఫర్వాలేదు జీవితపు వైకుంఠపాళిలో రెండో పాము కాటు తరువాత కూడా ఆలోచనల్లో వంద మెట్లు పైకి ఎక్కేసింది సుకృతి మానసికంగా.
    కొన్ని సమస్యల్ని పరిష్కరించేది వ్యక్తులు కాదు- కాలమే!
    శివతో ప్రొజెక్ట్ ఆగిపోయిందని తెలిసినరోజు నారాయణశెట్టిని ఫోన్ లో కూడా ఆ విషయం గురించి కాంటాక్ట్ చేయలేదు సుకృతి.
    ఆ మరుసటి రోజు కూడా అదే జరగడంతో ముందు రియాక్ట్ అయ్యింది శెట్టి. కొన్ని రోజుల పరిచయంతో సుకృతి అతడిపై ఎంతటి ప్రభావం చూపించిందీ అంటే కనీసం ఫోన్ లో అయినా మాట్లాడకుండా వుండలేని స్థితికి చేరుకున్నాడు.
    దానికితోడు ఇండస్ట్రీలో కొందరు మిత్రులు "మీరనుకున్న ప్రోజెక్టు ఆగిపోయిందటగా?" అన్నారు. అది ఎగతాళిగా వినిపించడం మాత్రమే కాదు, సుకృతికి ఆ విధంగా తను దూరమైనంత బాధతో విలవిల్లాడి పోయాడు.
    రెండు దశాబ్దాల తన ప్రతిష్ట, రెండు వారాలుగా సుకృతితో సాగించిన వ్యవహారం దెబ్బతిన్నంత రోషంతో మండిపడ్డ నారాయణశెట్టి ఆ తరువాత యిక నిశ్శబ్దంగా వుండలేకపోయాడు.
    అదే రాత్రి శివని పిలిచాడు మళ్ళీ.
    "నువ్వు నరేంద్రనే ఓ ఆర్టిస్టు లేకపోయినంతమాత్రాన సినిమా ఆపడం అర్ధంలేని పని శివా! ఆ పాత్రని" క్షణం ఆగి అన్నాడు "నువ్వే వేస్తున్నావు....."
    ముందు ఉలిక్కిపడ్డాడు శివ.
    "ఇది నా నిర్ణయం.....అంతే!"
    శివకి మతిపోయినంత పనైంది.
    తొలిసారి డైరెక్టరుగా అవకాశమిచ్చిన వ్యక్తి అది చేజారిపోయిందనుకుంటున్న తరుణంలో యిప్పుడు హీరో పాత్ర వేయమంటున్నాయి. నిజానికి అది అవకాశం కాదు. ప్రమాదకరమైన నిర్ణయం. తను ఏకాగ్రత చూపించాల్సింది దర్శకత్వంలో నటన అన్నది తను యింతవరకూ వూహించనిది.
    "సర్" నచ్చచెప్పాడు శివ.
    "ఇప్పుడు నటుడిగా నేనే అవకాశం తీసుకునేకంటే మరో అవకాశం దొరికేదాకా వెయిట్ చేయటం బెటరన్నది నా అభిప్రాయం."
    "మరికొంతకాలం వెయిట్ చేసే సహనం నాకు లేదు" ఖండితంగా అన్నాడు.
    "కానీ నాకు నటనలో అనుభవం లేదు."
    "లేనివాడివి కొత్త నటులతో మాత్రం సినిమా ఎలా తీయగలవు.
    "ఇలా కావాలని చెప్పగలను"
    "ఆ చెప్పేదే కెమెరా ముందు నువ్వు చేసే అది నటనవుతుంది అద్భుతమైన లాజిక్ ప్రదర్శించాడు శెట్టి.
    నిజానికి నటనకి శివ యిచ్చే నిర్వచనం వేరు. మోడరన్ థియరీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శివ రేపు దర్శకత్వం చేపట్టాక ఆర్టిస్టులు ఎలా నటించాలీ అన్నదానికి ఓ థియరీని ప్రిపేర్ చేసుకున్నాడు.
    ప్రేక్షుకులు చెవిటివాళ్ళు అన్నట్టుగా నటులు అనవసరమైన అవకాశాన్ని ప్రదర్శించటం నచ్చని శివ సహజమైన 'ఈజ్'తో పాత్రలు కావాలని ముందే నిర్ధారించుకున్నాడు.
    అలాంటి ఫలితాన్ని సాధించాలీ అంటే కావాల్సింది నిజానికి నటనలో అనుభవంలేని వ్యక్తులు మాత్రమే. కాబట్టే తను ఆ పాత్ర పోషించడం కష్టంకాదు. ఇప్పుడతడి సమస్య అది కాదు. దర్శకుడి పాత్రలో నిలబడాలనుకుంటున్న తరుణంలో మరో పాత్ర అంగీకరించడం తలకి మించిన భారమవుతుంది.
    శెట్టి చివరగా అన్నాడు. అది అనడం కాదు. అల్టిమేటమ్ "నేను నిన్ను బలవంత పెట్టడంలేదు శివా..... నువ్వు కథ చెప్పేటప్పుడు ఆ పాత్రలో నిన్ను చూడగలిగాను. వయసుపరంగాగాని, రూపురేఖల్లోగాని ఆ పాత్రకి తగ్గ అర్హత నీకుందన్నది నా నమ్మకం. ఆలాంటప్పుడు ముందే నేను ఎందుకు అడగలేదని నీ అనుమానం కావచ్చు. అప్పటి పరిస్థితులు వేరు..... కాదు అంటే నీ యిష్టం. తొందరలేదు. రేపటిదాకా ఆలోచించుకుని చెప్పు. నీ జవాబుని బట్టి యీ ప్రోజెక్టు వుండేది లేనిదీ తేలిపోతుంది."
    శివ యింటికి తిరిగి రాగానే మొత్తం జరిగింది నిన్న రూమ్మేటు రాఘవ అమాంతం విరుచుకుపడ్డాడు. "రాస్కెల్.....ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే సరే అనక ముఖం వేలేడేసుకుని యింటికి తిరిగొచ్చావా.....నీకం మతిపోయిందట్రా. అసలు నీ ప్రవర్తనకి అవకాశం ఎవడిస్తాడు. దక్కిన అవకాశం చేజిక్కించుకోలేకపోవడంలో నీ వుద్దేశ్యం ఏమిటి?"
    "అది కాదురా తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సవ్యంగా వినియోగించుకోకపోతే రేపు నా కెరీర్ ఏమవుతుందో అన్న భయం."
    "అంటే నటించినవారు గొప్ప దర్శకుడయ్యే అవకాశం లేదంటావ్?"
    నిశ్శబ్దంగా వుండిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS