Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 46


    ఆమె మనసు కలుక్కుమంది.
    ఎక్కడ చూసినా నిన్నటి జ్ఞాపకాలే.
    ఎక్కడ తిరిగినా, నిన్నటి హడావిడే. శ్రీచరణ్ తన గదిలో ఉన్నాడు.
    ప్రనూష తన గదిలో వుంది.
    ఇద్దరూ ఆ రోజు వంట చేసుకోలేదు. ఇద్దరికీ ఆకలి వేయటం లేదు. ఎదురుగా తాజ్ మహల్ సగభాగం ప్రనూషను వెక్కిరిస్తూ కనిపించింది.
    "ఇలాగే కాసేపుంటే పిచ్చెక్కేలా వుంది" అనుకుంది ప్రనూష. కాసేపు ఈ బాధల నుంచి డైవర్షన్ పొందడానికి బీరువాలోని బట్టలన్నీ తీసి చిందర వందర చేసి మళ్ళీ నీట్ గా సర్ది సాగింది.
    అలాగైనా తనని తాను డైవర్ట్ చేసుకోగలుగుతుందేమో.
    ఏడుపొచ్చేస్తోంది ప్రనూషకు.
    ఒక్క క్షణం శ్రీచరణ్ మీద కోపమొచ్చింది. తన దగ్గరికి వచ్చి ఓదార్చవచ్చుగా అనుకుంది.
    
                                                             * * *
    
    శ్రీచరణ్ కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నాడు. ఇల్లంతా హడావిడిగా వుండేది నిన్నటి వరకూ.
    ఒక్కరోజులో ఎంత తేడా?
    ఆత్మీయులు లేని లోటు తెలుస్తోంది.
    వాళ్ళకూ, తనకూ రక్త సంబంధం లేదు.
    కేవలం కొన్ని నెలల క్రితం ఏర్పడిన బంధుత్వం.
    మరికొన్ని నెలల్లో తెగిపోబోతున్న అనుబంధం.
    ఈ అనుబంధాన్నే తను మరచిపోలేకపోతున్నాడు. దీన్నేమంటారు? పాపం ప్రనూష కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ వుండివుంటుంది.
    ఆమెను ఓదారిస్తే పోలా? అనుకున్నాడు.
    ఎదురుగా టేబుల్ మీద తన ఎండి ఇచ్చి తాజ్ మహల్ గిఫ్ట్...సగభాగం వుంది. అతనన్న మాటలు గుర్తొచ్చి...ఓ క్షణం నిట్టూర్చాడు.
    కొద్ది నెలల్లో తనకూ, ప్రనూషకూ ఏ సంబంధమూ ఉండదు. తనెవరో ఆమెవరో.
    తన పక్కన శశికళ.
    మరి ప్రనూష పక్కన...?
    శ్రీచరణ్ మనస్సు కలుక్కుమంది.
    ప్రనూష పక్కన మరో మగాణ్ణి తానూహించుకోగలడా?
    ఆ ఆలోచనే అతడ్ని బాధ పెడుతోంది.
    ఎందుకో తెలియకుండానే అతని కళ్ళలో సన్నటి కన్నీటి మెరుపు ప్రత్యక్షమైంది.
    గుండెలో చిన్న ప్రకంపనం.
    మెల్లిగా లేచి ప్రనూష గదిలో అడుగుపెట్టాడు.
    
                                                           * * *
    
    బీరువా మొత్తం సర్ది, లాకర్ ఓపెన్ చేసిన ప్రనూష ఒక్క క్షణం షాక్ తింది.
    తను, శ్రీచరణ్ రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ మడత విడిపోయివుంది.
    ఆ అగ్రిమెంట్ పేపర్ ని ఎవరో చ....ది.....వి.....న.....ట్టు....
    ఒక్క క్షణం ఆమె మనో శరీరాలు జలదరించాయి. వేలవేల విషాదాల వీచికలు చుట్టుముట్టినట్టు.... అక్కడ అగ్రిమెంట్ పేపర్ పక్కన తండ్రి క....ళ్ళ.....జో....డు.....ప్రనూష తన గదిలో ఏం చేస్తుందో చూద్దామని వచ్చిన శ్రీచరణ్, ప్రనూష షాకింగ్ గా అలాగే నిలబడి వుండటంతో...
    "ఏమైంది ప్రనూషా..." అంటూ అడిగాడు కంగారుగా ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. "నిన్నే ప్రనూషా....ఏమైంది?"
    "నాన్న...... నాన్న....."
    "ఊ.....నాన్న....." అంటూ బీరువాలోకి తొంగిచూశాడు. మామగారి కళ్ళజోడు, అగ్రిమెంటు పక్కనే కనిపించింది.
    "మన అగ్రిమెంట్ చూశాడు" మెల్లిగా చెప్పింది ప్రనూష.
    అగ్రిమెంట్ చదివిన వెంటనే తండ్రి మొహంలో కనిపించే ఫీలింగ్స్ ఊహించుకోవడానికే భయంగా వుంది ప్రనూషకు.
    ప్రనూషను ఎలా ఓదార్చాలో, ఆమె కెలా ధైర్యం చెప్పాలో అర్ధం కాలేదు.
    "ఊర్కో..... ప్రనూష..... ఏమీ కాదు...." అన్నాడు ఆమె భుజం మీద చేయేసి ఓదారుస్తూ.
    ఒక్క క్షణం తన తలని శ్రీచరణ్ భుజం మీద వాల్చింది వెక్కిళ్ళు పెడుతూ.
    అనుకోకుండా శ్రీచరణ్ చేయి, ప్రనూష తలని నిమిరింది.
    కొన్ని క్షణాల ఉద్వేగం. మరికొన్ని క్షణాల అనుభవవేద్యం....మధురంగా.... అపురూపంగా ...ఏదో నిశ్చింత....ఇద్దరిలోనూ...
    కొన్నిక్షణాల తర్వాత ముందుగా ప్రనూషే తేరుకుని కళ్ళు తుడుచుకుని అవతలకి జరిగింది.

 

                                                              * * *
    
    "ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు.... మన గడువు దగ్గర పడుతోంది. ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి..." అలా అంటున్నప్పుడు అప్రయత్నంగా శ్రీచరణ్ గొంతు వణికింది.
    ఏ బాధా వినిపించక గొంతు కద్దుపడిందీ...
    ఏ అపరాధ భావం గుండెను కుదిపి కదిపిందో...?
    
                                                              * * *
    
    కొన్ని నిర్ణయాలు తీసుకునే వరకే కష్టం....
    ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక....మిగతావన్నీ చకచకా జరిగిపోతాయి. కాలంతో పాటే పరుగెడతాయి.
    ప్రభాత్, ప్రనూశాల మధ్య చనువు పెరిగింది.
    ఇద్దరూ ఒకరి మీద మరొకరు 'కన్ సర్న్ ఫీలింగ్ ని ప్రదర్శించడం మొదలెట్టారు.
    ఓ రోజు చేతికి కట్టు కట్టుకుని వచ్చాడు.
    "ఏమైందని?" అడిగింది ఆదుర్దాగా ప్రనూష.
    "నీకోసం సేమ్యాపాయసం చేద్దామని ప్రయత్నం చేశాను. అలవాటు లేని పని కదా.... గిన్నెని పట్టకారుతో దించుతుంటే చెయ్యి మీద చిందింది. కాలి బొబ్బలెక్కాయి...." చెప్పాడు.
    వెంటనే ఆ చేతిని తన చేతిలోకి తీసుకుంది.
    కదిలిపోయింది. కన్నీటితో మెరిసిపోయింది.
    అది కేవలం మామూలు కట్టు మాత్రమేనని ప్రనూషకు తెలిసే అవకాశం లేదు.
    ఇలాంటి సంఘటనలు కొన్ని తనే సృష్టించి, ప్రనూష ప్రేమను మరింతగా సంపాదించడానికి ట్రిక్స్ ప్లే చేయసాగాడు ప్రభాత్.
    ఆఫీసులో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రనూష మెంటల్ గా కూడా ప్రిపేరయింది.
    అయితే, తనకు పెళ్ళయిందన్న విషయం ప్రభాత్ కు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
    సాయంత్రం ఆఫీసు వదలగానే ప్రభాత్ లో రెస్టారెంట్స్ కు వెళ్ళడం, రాత్రి పొద్దు పోయేవరకూ టాంక్ బండ్ మీద గడపడం...
    ఇది ఆమె నిత్యకృత్యమైంది.
    ఆమె వ్యవహారం ఎంత వరకొచ్చిందంటే....ప్రభాత్ ఫోటోని తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకునేంత వరకూ...
    ఆ రోజు ఓ అన్యూహ్య సంఘటన జరిగింది.
    కామాక్షి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.
    ఆ వార్త ఆఫీసులో గుప్పుమంది.
    స్టాఫ్ అంతా ఆమెను పరామర్శించడానికి వెళ్ళారు. ప్రనూష కూడా.
    
                                                          * * *
    
    స్టాఫ్ అంతా వెళ్లేసరికి కామాక్షి మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడుస్తోంది.
    ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందో కనుక్కునే ప్రయత్నం చేశారు.
    "మా బావ అమెరికాలో మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు" వెక్కిళ్ళ మధ్య చెప్పింది కామాక్షి.
    ప్రసూనాంబ సిన్సియర్ గానే బాధపడింది.
    కామాక్షి తన బావమీద బోల్డు ఆశలు పెట్టుకుంది. కామాక్షి బావ స్టేట్స్ కు వెళ్ళడానికి ముందు, స్టేట్స్ కు వెళ్ళడానికి డబ్బులు అవసరమైతే, కామాక్షి తన మెడలోని గొలుసు, బంగారు గాజులు అమ్మి ఇచ్చింది.
    తన జీతంలోని ఎక్కువ మొత్తం బావకే పంపించింది. ఎప్పుడో....ఒకప్పుడు తనని పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది.
    ఉత్తరాలలో కూడా అదే భావం వ్యక్తం చేసేవాడు. కామాక్షి ఆశలన్ని బావమీదే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS