Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 45

 

    శోభన ముహూర్తం నిర్ణయించిన రోజు ఉన్నట్టుంటి పెళ్ళికూతురు నందిని రెడ్ ప్లాగ్ ఎగురవేయడంతో ఆ శుభకార్యం కాస్తా వాయిదా పడిపోయింది.
    తరువాత మంచి ముహూర్తం చూసి కార్యం జరిపించుకోవచ్చని మిగిలిన తంతులన్నీ పూర్తి చేశారు.
    పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
    మూడు రోజుల తరువాత చూశాడు విష్ణు........తన సహా ధర్మచారిణి అసలు విశ్వ రూపం ఏమిటో!
    బయటకు వెళ్ళబోతున్నది నందిని....
    "నందినీ.......'
    అతని పిలుపుకి ఆగి విసుగ్గా చూసింది.
    "ఎక్కడికి.......'
    అతని మాటలు ఇంకా పూర్తి కానేలేదు.....
    అంతే....
    అప్పుడు ప్రారంభమయ్యింది వాళ్ళిద్దరి ప్రత్యక్ష యుద్ధం.
    'అంటే! నేనెక్కడకు వెళ్ళినా నీతో చెప్పి, నీ పర్మిషన్ తీసుకోవాలా?" నందిని తోకతొక్కిన త్రాచులా గయ్ మంటూ లేచింది.
    'అది కాదు నందూ......"
    "ఎమిట పిలుపు? నందూ, బొందూ అంటూ , నేనేమన్నా నీ పెట్ డాగ్ ననుకున్నావా?" ఆమె కంఠంలో కోపం.......అసహనం.....
    తన ముఖాన్ని కొరడాతో చరిచినట్టు ఉలిక్కిపడ్డాడు విష్ణు.
    "భార్యను ముద్దుగా పిలవడం కూడా తప్పేనని నాకు ఇప్పటివరకు తెలియదు సుమా"
    'అదిగో నాకు నచ్చదు. ముద్దు ముచ్చటా......హు....నాకేం పాఠాలు చెప్పనవసరం లేదు. నా మాటకు ఎదురు చెబితే సహించను" రోషంతో ముక్కులు ఎగబీలుస్తూ అన్నది నందిని.
    "ఇది మరీ బాగుంది......భార్యతో మాట్టాడాలనుకోవడం కూడా నీ దృష్టిలో ఎదురు చెప్పడం అన్నమాట. ఇంకా నయం అసలు మాట్టాడకూడదనలేదు?"
    "అసలు ఆ మాటే చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో ఇటు చూడు......ఎంతయినా నా మెడలో తాళి కట్టిన మొగుడువి కాబట్టి నేను నీకిచ్చే గౌరవం ఇదే.....నన్ను నువ్వు అని పేలిస్తే నిన్నూ అలానే పిలవవలసి వస్తుంది......."
    'అంటే భార్యను ఏకవచనంతో కూడా పిలవకూడదన్నమాట......"\
    "అవును మిస్టర్.......స్త్రీకి సమాన హక్కులు కావాలి అన్నదే నా సిద్దాంతం. ఇంకా నయం ఒరేయ్......ఏరా అని పిలవనందుకు సంతోషించు....."
    'అంటే నేను నిన్ను మీరు అని పిలవాలంటావు..... అసలు నువ్వు మాట్టాడేదేమిటో నీకు అర్ధమవుతుందా?' ఎంతో ఓర్పుగా సహించాడు.
    "నాన్సెన్స్........నేను నా తండ్రి పోరు పడలేకే నిన్ను పెళ్ళి చేసుకున్నాను తప్ప నిజానికి నీలాంటి లేబర్ గాడిని నా దృష్టిలో మొగుడిగా భావించలేను. ఏం చేయమంటావు చెప్పు. నన్ను రెచ్చగొడితే ఏదేదో ఇలాగే వాగేస్తుంటాను. అందుకే నాకు ఇష్టం లేని పనులు ఇక మీదట చేయవద్దు.  కష్టంగా వుండే మాటలు మాట్టాడవద్దు. అసలు ఇకమీదట నాకు ఎదురు చూడవద్దు. పడినా న మాటలకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయవద్దు. అర్ధమయిందా మిస్టర్ విష్ణు......"
    అప్పటికీ నందిని అంటే ఏమిటో పూర్తిగా బోధపడిపొయిందతనికి.
    'అంటే నేను నీకు నచ్చలేదా.........అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదా?"
    "అలా అడిగావు బాగుంది.......నిజం చెప్పాలంటే రెండూ నాకు అయిష్టమయినవే . నేను కలలుగన్న ఆరు అడుగుల అందాల రాకుమారుణ్ణి నీలో నేను చూడలేను. నేను ఇష్టపడే ఫ్రీ సొసైటీ రొమాంటిక్ లవ్ లీ లిప్కు ఈ పెళ్ళి అనేది ఒక ఝంఝాటం ఈ వివాహబంధం అనేది ఒక పెద్ద బోగస్..........    
    "ఎస్ .........ఐ హెట్ దిస్ బ్లడీ మేరేజ్........ఐ వాంట్ ఫ్రీ లైఫ్.......కానీ సమాజం అనేది ఒకటి ఏడ్చింది కదా. అందుకోసమయినా వాకు పెళ్ళి అయిందనిపించుకోవడానికి ఒక మొగుడు కావాలి. కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. యూనో దట్.......నీ స్థానంలో ఏ అనాకారి వున్నా తాళి కట్టించుకునే దానిని.
    "ఎందుకో తెలుసా? నాకు కావాల్సింది నేను చెప్పినట్టు విని తల వూపే పెంపుడు కుక్కలాంటి మగవాడు. కేవలం నాకు అలంకార ప్రాయంగా , నా ఆస్తికి కాపలా కాయడానికి మాత్రమే నువ్వు మొగుడిగా చలామణి కావాలి తప్ప.....నాపై ఎలాంటి దర్పం చూపినా నేను సహించేది లేదు.....
    విసురుగా వెళ్ళిపోయింది నందిని.
    మరు నిమిషంలోనే ఆమె ఎక్కిన కారు వేగంగా దూసుకువెళ్ళింది.
    అంతవరకూ క్రింది హాలులో నుంచి ఆ సంభాషణంతా వింటున్న గోవిందయ్య నిర్లిప్తంగా అల్లుడి వైపు చూశాడు.
    ఇదంతా గోవిందయ్య తెలిసి కూడా తనను బలి పశువును చేశాడనే విషయం అర్ధం కావడంతో అతనిపై పీకల వరకు కోపం ముంచుకొచ్చి ఆవేశంగా అతనివైపు దూసుకు వెళ్ళాడు విష్ణు.
    'అల్లుడూ........నీవేమనుకుంటున్నావో నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు చెప్పు......ఒక్కగా నొక్క కూతురు కదా అనే ప్రేమతో గారాబం చేయడం వలన అది అలా పెంకిపిల్లలా తయారయ్యింది. నీలాంటి వాడయితేనే దాని ముక్కుకి తాడు వేయగలడని, హిందూ సంప్రదాయంలో వున్న గొప్ప దనంఏమిటో డానికి తెలియ జెప్పగలవని కావాలనే నిన్ను అల్లుడుగా చేసుకున్నాను తప్ప నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు" అన్నాడతను సంజాయిషిగా.
    విష్ణు ఆవేశం ఆ మాటలతో చప్పున చల్లారిపోయింది.

                                                       *    *    *    *

    తన గుండె వేయి శకలలైనట్టు కుప్పకూలీపోయిందామే.
    మల్లెపూవు కన్నా సుకుమారమయిన ఆమె చెక్కేళ్ళు కన్నీటి ధారాలతో బండబారిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS