"ఫర్వాలేదు . ఏదయినా సరే వినగలను!"
"బామ్మ అకస్మాత్తుగా పోయింది."
"అవును, కూతురు పోయిన షాక్ తో పోయిందన్నారు!"
"ఆ అప్పుడు ఆమె ఓ పని చేసింది."
"నీతో ఆ యింటి బాధ్యత మోసేట్టుగా ప్రమాణం చేయించిందా? ఫరవాలేదు . ఆమె కిచ్చిన మాట తప్పినా తప్పులేదు!" అత్తగారిపై ఉండే కోపం అంతా వెళ్ళగ్రక్కింది.
"అంతే అయితే చిక్కేమిటి?"
"మరింకేమిటి" కుతూహలంతో ఆదుర్దాతో అడిగింది.
చప్పున చెప్పలేకపోయాడు రవి.
ఆమె మనస్సులో ఊహ మెరుపులా మెరిసింది. ఆ భావనల తాకిడికీ ఆమె పేదగుండె తట్టుకోలేకపోయింది భారంగా కళ్ళు మూసుకుంది.
కొన్ని క్షణాల తర్వాత నిగ్రహించుకుని "ఫర్వాలేదులే! చెప్పు! నిన్ను తన మనవరాలు స్వప్నని పెళ్ళి చేసుకోమని కోరింది కదూ! అప్పుడు నన్నూ నా భర్తనీ దూరం చేయాలని చూసింది. ఆఖరికి మమ్మల్ని దూరంగా తోసింది. అల్లుడినీ కూతుర్నీ తరిమేసి మనవరాలనీ తన చెప్పు చేతల్లో పెట్టుకుంది . ఇప్పుడు -----ఆఖరికి చావు మంచం పై కూడా తన రాజనీతి ప్రదర్శించిందన్న మాట. భేష్! నీతో వాగ్దానం తీసుకుందా?" అని కోపంగా, వ్యంగ్యంగా అడిగింది.
ఆ ఎద్దేవాలోని కసి, ఆ మాటల్లోని పదును రవికి కాగా తెలిసిపోయింది. అతను జవాబివ్వలేదు. తలవంచుకున్నాడు.
"అంతేనా?"
"ఊహు మా ఇద్దరి చేతులూ కలిపింది. అదే పెళ్ళి కాగా ప్రమాణం చేయించింది!" చప్పున చెప్పేశాడు.
"ఆ ప్రయోజకుడా!" ఖంగున మొగేట్టుగా అందామె. ఆమె ముఖం అంతా కదిపోయి వాడిపోయింది. కోపంతో నరాలు బిగుసుకున్నాయి. అసహాయతతో చేతులు వణికాయి.
అయితే కొన్ని క్షణాల తర్వాత తన్నుతాను సంబాళించుకుంది. మనస్సుని నిగ్రహించుకుంది. మరేమీ అనకుండా మౌనం వహించింది.
రవి కిక్కురు మనకుండా ఉండిపోయాడు.
కొంతసేపు అలా వేసవిలో ఉక్కగడిలోలా గడిచిపోయింది.
"సరే! నువ్వెళ్ళు!"
"అమ్మా!"
"అలా పిలవ్వద్దనటానికి నాకు నోరు రావటం లేదు, కానీ ------"
"మా పెళ్ళి నిశ్చయం చేయించడానికి అక్కడంతా త్వరపడుతున్నారు. నువ్వు వచ్చి -------"
అతనే మాటలు పూర్తీ కాకుండానే చప్పున తలెత్తి అతని వైపు సూటిగా చూసి "ఏ ముఖం పెట్టుకుని రాను?" అంది.
"అది నీ అత్తగారిల్లు-"
"హూ నా భర్త కే కాకపోయినా నాకేక్కడి అత్తగారిల్లు--"
"ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ యింటి పెత్తనం అంతా మనది!
"అవును. నువ్వు పెద్ద పాలేరువి. జీతం లేని పాలేరువి."
"నా తండ్రి ఆస్తి అది!"
"కాదు -- అది ఆ కృష్ణవేణమ్మ అస్తీ-------"
"ఆమెకి నా తండ్రి దత్తుకొడుకు--"
"ఆ కొడుక్కే అక్కర్లేని ఆస్తి అయన కొడుక్కి కావలసి వచ్చిందా?"
"అవసరం అలా చేసింది."
"రవీ ! ఇవన్నీ వ్యర్ధ వాదాలు. నీ దృష్టి నీది నా దృష్టి నాది, ఈ ఇంట్లో తొలినుంచీ అత్తాకోడళ్ళకీ చెల్లటం లేదు. ఆమె నన్ను కోడరికం చేయనివ్వలేదు. నాకూ అప్రాప్తి లేదు. ఆగర్భ శ్రీమంతురాలైన కోడలి ముందు గర్భ దారిద్ర్యం అనుభవించిన నేనూ ఎందుకూ చెల్లను. నేను రాను రాలేను నువ్వు అక్కడ చిక్కుకుని పోయావని తెలిసిపోయింది. నువ్వు బయట పళ్ళేవు. అందుకోసం కనీసం ప్రయత్నం చేయలేవు. నిన్నూ రమ్మని అననూ లేను. ఒకవేళ అన్నా నా అజ్ఞాపాటించే స్థితిలో నువ్వు లేవు. ఇక ఎందుకు వృధా ప్రయాస వెళ్ళిరా."
"అమ్మా! అమ్మా! మరీ యింత కాఠిన్యమా? ఎక్కడైనా కఠినుడైన కొడుకు వుంటాడు కానీ కఠినురాలైన తల్లి ఉంటుందా? మమ్మల్ని క్షమించలేవా? మళ్ళీ అంతా కలసి వుందాం. నీకు స్వప్న విషయం తెలియదూ, నీ విషయం స్వప్నకి తెలియదు. మీరిద్దరూ కలిస్తే మీ మనస్సులూ కలిసిపోతాయి ---"
రవి యింకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఆమె లేచింది. "నాకు అవతల పని వుంది. నువ్వు వెళ్ళిరా! స్వాతి జాగ్రత్తా! ఆ మీ ప్రవాహంలో అది కొట్టుకుపోయేలా చేయకు. నీకు భారం అనిపించిన రోజు దాన్ని యిక్కడికి తీసుకునిరా! ఈ యింటిని అమ్మేసి దాన్నో అయ్యచేతిలో పెడతాను!"
తరతరలాడి పోయాడు రవి.
యుద్ధంలో ప్రత్యర్ధి విష లిప్త బాణాలు వేస్తుంటే అసహాయుడైన శూరుడిలా వుండిపోయాడు. కఠినంగా మాటాడటానికి అతనికి మాటలు రాలేదు.
ఆమె లోపలికి వెళ్ళిపోయింది. యింకేమనటానికి చోటివ్వకుండా.
పాడైపోయిన మనస్సుతో రవి లేచి వచ్చి జీపు ఎక్కెడు. జీపూ భారంగానే కదిలింది.
34
ఎవరెంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా కొన్ని జరిగేవి జరిగిపోతాయి. చివరికి ఆ భగవంతుడు అడ్డుపడినా అవి ఆగవు.
అలాగే స్వప్న రవి భార్య అయింది.
భునభోంతరాళాలు దద్దరిల్లేట్లుగా ఆకాశమంత పందిరి, భూమి అంత అరుగు వేసి, ముత్యాల ముగ్గుల, రత్నాల తోరణాలు, తీర్చి పెళ్ళి జరిపించి ఉండేది కృష్ణవేణమ్మే బ్రతికే వుండి వుంటే. ఇప్పుడంత శ్రద్ధతోనూ, అభిమానంతోనూ జరిపించెందుకూ సిద్దంగా వున్నాడు విశ్వేశ్వరం.
కానయితే స్వప్న అందుకీ సిద్దంగా లేదు.
రవికి అసలే యిష్టం లేదు....
అందుకే వాళ్ళ పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది.
స్వప్న తరుపు బంధువులు ఎవరూ లేరు. రవి తల్లి గారూ పెళ్ళికి రాలేనంది. అందుకని ఎవరినీ పిలవలేదు. సింపుల్ గా పెళ్ళి జరపాలనుకున్నారు.
హైదరాబాద్ నుంచి విమానంలో స్వప్న, స్వాతి, రవి, విశ్వేశ్వరం దంపతులు, కృష్ణ దంపతులు వెళ్ళేరు పెళ్ళికి.
పెళ్ళి రేపనగా స్వప్న స్నేహితులకి, హితులకి, పరిచయస్తులకి, బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు విశ్వేశ్వరం. స్వప్న ఎంత కాదంటున్న ఆయన వినలేదు.
అలాగే స్వప్న కాదన్నా ఆయన చేసిన మరో పని నరసింహం కోసం వెతికించటం. అయితే ఆయన అందులో పూర్తిగా ఫెయిలయ్యాడు.
అదే రోజే ఆ యింటి పనిమనుషులకి, పాలేర్లకి అందరికీ బట్టలు పెట్టారు. ఓ నెల బోనస్ యిచ్చారు. అందరికీ ఆమె పెళ్ళవుతున్నందుకు ఆనందం, అమ్మమ్మగారు పోయినందుకీ దుఃఖం.
ఓ కంట్లో ఆనందం, ఓ కంట్లో విషాదం అన్నదానికి సజీవ ఉదాహరణగా కనిపించింది ఆ సన్నివేశం...
అయితే ఎంత గంభీరంగా వున్నా ఎక్కడ చూసినా ఆనందం కొరతగా వున్నా స్వప్న మాత్రం ఆనంద దీపికగా అయింది. ఆ అమ్మాయి ముఖంలో పెళ్ళికళ కొట్టొచ్చినట్టుగా కనిపించింది.
పెళ్ళయిన రాత్రికి అంతా హైద్రాబాదుకి తిరిగొస్తే స్వప్న, రవి మద్రాసు వెళ్ళేరు. కొన్నాళ్ళు అలా తిరిగిరమ్మని బలవంతంగా పంపేరు విశ్వేశ్వరంగారు.
35
మదరాసులో అడుగు పెట్టగానే ఏదయినా హోటల్ కి వెళదామన్నాడు రవి.
