శ్రీచంద్ర పక్కనే అంబులెన్స్ ఆగింది.
నలుగురు వ్యక్తులు స్ట్రెచర్ మీద శ్రీచంద్రను అంబులెన్స్ లోకి ఎక్కించారు. సత్తిపండు కూడా అంబులెన్స్ ఎక్కాడు.
డ్రైవర్ అంబులెన్స్ స్టార్ట్ చేసి స్టిరింగ్ తిప్పుతూ "నారాయణ.....నారాయణ" అన్నాడు.
డ్రైవర్ ప్రక్కనే వున్న వ్యక్తీ "నారదా! మీరిప్పుడు రధచోదకులు" అన్నాడు.
"ఏమిటో యమధర్మరాజా! నా చేత చిత్రవిచిత్ర వేషములు వేయించుచున్నారు. తంబుర పట్టుకునే ఈ చేయి ఫోర్ వీలర్స్ చక్రం పట్టుకోవాల్సి వచ్చింది" అన్నాడు డైవర్ గెటప్ లో వున్న నారదుడు.
అతని పక్కనే వున్న యమధర్మరాజు ఓ చిర్నవ్వు నవ్వి వెనుక స్టేచ్చర్ ,మీద వున్న శ్రీచంద్రను చూసాడు. నలుగురు వ్యక్తులు తెల్లబట్టల్లో హాస్పిటల్ సిబ్బందిలా వున్నారు.
"మన యమభటులు భలే కుదిరారు" అన్నాడు నారదుడు.
"అవునవును" అన్నాడు యమధర్మరాజు మీసం మీద చేయ్యేస్తూ.
"ఈ మానవుడ్ని ఎక్కడికి తీసుకువెల్దాం?" నారదుడు అడిగాడు.
"నా దివ్యదృష్టితో చూసా. ఈ వీధి చివర ఓ హాస్పిటల్ వుంది. గత నెలరోజులుగా అతను ఈగలు , దోమలు వంటి ప్రాణులను తోలుకుంటూ ఉన్నాడు. అతనికి ధనం ఆశ చూపిన చెప్పినట్టు చేయును. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను" చెప్పాడు యమధర్మరాజు.
* * *
డాక్టర్ పరధ్యానం తన చేతిలోని స్టేతస్కోప్ ను గాల్లోని అటూ ఇటూ వూపుతూ ఈగలను, దోమలను తోలుకున్నాడు.
"సార్ వంద....."అన్నాడు కాంపౌండర్.
"ఏంటి.....వంద రూపాయలు దొరికాయా? ఏవేవి? ఎక్కడేక్కడ?" అడిగాడు ఆత్రంగా డాక్టర్ పరధ్యానం.
కంపౌండర్ జాలిగా డాక్టర్ వంక చూసి....
"హు....మనం వందనోటు చూడక ఎన్రోజులైంది. ఒక్కటంటే ఒక్క కేసు రావడం లేదు. రాకరాక ఓ చెవిపోటు కేసు వస్తే మీరు బైపాస్ సర్జరీ చేయాలని రెండు వందలు అడిగారు. అప్పుడు వాళ్ళు మనవైపు చూసిన చూపు నాకింకా గుర్తింది సార్.'
"అయినా మీరు ఎంతకు కొన్నారు సార్ డిగ్రీని" అడిగాడు కాంపౌండర్.
"అబ్బ.....ప్లాష్ బ్యాక్ వద్దు......ఇంతకీ వంద అని ఎందుకు అన్నానో చెప్పు. నాకెందుకో ఆశ పుడుతోంది" ఆశగా అన్నాడు డాక్టర్ పరధ్యానం.
"ఇవ్వాళ ఉదయం నుంచి వంద ఈగలను చంపాను" అన్నాడు కాంపౌండర్.
"హు....ఒక్క పేషంట్ అయినా రాడా? అయినా నీకేం చెప్పాను ప్యారడైజ్ సెంటర్ దగ్గర నిలబడి పేషెంట్లను వెతికి పట్టుకొమ్మని చెప్పలెదూ" అన్నాడు డాక్టర్.
"ముందు మీరు స్టేతస్కోప్ చెవిలో పెట్టి పరీక్షించు కోవడం నేర్చుకోండి సార్. మొన్నటికి మొన్న చెవుల్లో పెట్టుకోకుండానే నీ గుండె కొట్టుకోవడంలేదని చెప్పారు."
సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు డాక్టర్.
సరిగ్గా అప్పుడే ఆ క్లినిక్ ముందు అంబులెన్స్ ఆగింది. హస్పిటల్ ముందు వున్న సాలిళ్ళ గూళ్ళను చెదరగొడుతూ శ్రీచంద్రను లోపలికి తీసుకెళ్ళారు బోయ్స్.
* * *
డాక్టర్ పరధ్యానంకు పిచ్చ సంతోషంగా వుంది. దొరక్క దొరక్క ఓ కేసు దొరికింది.
"ఇవ్వాళ ప్యారడైజ్ లో చికెన్ సిక్స్ టి పైవ్ తినాలి.
న్యూ హెవెన్ బార్ లో రెండు క్వార్టర్లు స్కాన్ కొట్టాలి" ఇలా అనుకుంటున్నాడు డాక్టర్ పరధ్యానం.
"హమ్మయ్యా! సంవత్సరంగా జీతం లేదు. ఈరోజు మొత్తం లాక్కోవాలి" అనుకున్నాడు కాంపౌండర్.
* * *
శ్రీచంద్ర తలకు కట్టుకట్టారు.
సత్తిపండు కంగారుగా పరధ్యానం వైపు చూస్తున్నాడు. పరధ్యానం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
"డాక్టర్ గారూ! పచార్లు చేయడం ఆపండి. మీ వెనకే నేను పచార్లు చేయలేక చచ్చిపోతున్నాను. నా కాళ్ళు పికుతున్నాయి" సత్తిపండు అన్నాడు డాక్టర్ తో.
గంభీరంగా మొహం పెట్టాడు డాక్టర్.
"చెప్పండి డాక్టర్ మా గురూజీని ఇంటికి తీసుకెళ్ళమంటారా?"
"అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వుంటే పిలిపించండి."
"ఎందుకు డాక్టర్? కొంపదీసి బ్లడ్ క్యాన్సర్ కాదు కదా!"
ఓసారి శ్రీచంద్ర స్పృహలో వున్నాడో లేడో చూసి .....కాంపౌండర్ ని పిలిచి లో గొంతులతో "ఆ పేషంట్ కు స్పృహ వచ్చిందా?" అని అడిగాడు.
"లేదు" అన్నాడు కాంపౌండర్.
"మొహం మీద నీళ్ళు చల్లి లేపు."
"నీళ్ళు....నీళ్ళు అయిపోయాయి సార్! మెయింటేనేన్స్ డబ్బులు కట్టలేదని నల్లా కనెక్షన్ కట్ చేసారు."
"అయితే సరే....వెళ్లి చేత్తో గిల్లి లేపు" అన్నాడు.
"అలాగే" అని వెళ్ళిపోయి శ్రీచంద్ర తొడమీద గిల్లాడు కాంపౌండర్.
శ్రీచంద్ర మెల్లగా కళ్ళు తెరిచాడు.
అదే సమయంలో శ్రీచంద్రకు వినబడేలా చెబుతున్నాడు డాక్టర్ పరధ్యానం సత్తిపండుకు.
"వేరీ బ్యాడ్ మ్యాన్....మీ ఫ్రెండ్....అదే పేరేమిటన్నావ్ శ్రీచంద్రకదూ....అయన ఎక్కువ రోజులు బ్రతకడు." అన్నాడు గంభీరంగా.
శ్రీచంద్ర షాక్ తిన్నాడు.
డాక్టర్ మొహం కనిపిస్తోంది స్పష్టంగా. మాటలు అంతకన్నా స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినిపిస్తున్నాయి.
"డాక్టర్ నిజమా?"
"నిజ్జం మీ ఫ్రెండ్ కు గుండె దగ్గర వున్న మూడు కిడ్నీలు ఫెయిలయ్యాయి. రేపో మాపో ప్చ్....అతనికి ఆత్మహత్య తప్ప మార్గం లేదు."
"డాక్టర్" అరిచాడు సత్తిపండు.
ఆ అరుపుకి డాక్టర్ ఉలిక్కిపడి వీపు చరచుకొని "అంత గట్టిగా అరిచావేంటయ్యా? హడలిచచ్చాను. వెళ్ళండేళ్ళండి . అతన్ని త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. చూస్తే హీరోలా వున్నాడు" అన్నాడు సీలింగ్ ప్యాన్ వంక చూస్తూ.
"మా ఫ్రెండ్ బ్రతికే చాన్సే లేదా? వుంటే చెప్పండి డాక్టర్. కావాలంటే నా కళ్ళజోడిస్తాను. నా చొక్కా ఇస్తాను. ఇంకా సరిపోకపోతే నా పోట్టిలాగు ఇస్తాను" సత్తిపండు ఏడుపు ఆపుకుంటూ అన్నాడు.
"నువ్వు ఆ మొత్తం ఇచ్చినా అతను బ్రతకడు.....బ్రతకడు" అన్నాడు డాక్టర్.
