Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 44

 

    "కనీసం తోచింది మాట్లాడే హక్కయినా నాకు లేదా కిన్నెరా!


    కిన్నెర ఇక మాట్లాడలేదు. కిన్నెర మొహం ముడుచుకుని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. "నువ్వు అలా ఎందుకు సీరియస్ గా అయిపోయావో నాకు తెలియదు కానీ, మగవాడికి 'మీసం', మాటల్లో 'కనీసం' చాలా ముఖ్యమైనవి కిన్నెరా! కనీసం నాకీ మాత్రం స్వేచ్చనైనా దక్కనియ్!"


    కిన్నెర ఏ స్థాయిలో ఆవేశాన్ని ఉగ్గబడుతున్నది అర్ధమైపోయింది రాఘవకు.


    "అయినా, నీకు నా జోహార్లు ఉమర్! నీ కవితలు అమర్! ఏమిటి ప్రాస కుదిరింది కానీ భావం సరిపోయినట్టు లేదు."


    కిన్నెర తల తిప్పి తనలో తాను గొణుక్కుంటున్న రాఘవను చూసింది.


    "ఉమర్ అంటే అమ్మాయి కాదు. షియాసుద్దిన్ అబుల్ ఉమ్రబిన్ ఇబ్రహీం ఖయ్యాం. అంటే మనకు తెలిసిన ఉర్దూ కవి ఉమర్ ఖయ్యాం."


    "పాపం, హటాత్తుగా ఆయనెందుకు గుర్తుకొచ్చాడు?"

    
    "మన దాంపత్యానికి సరిపడ్డ రుబాయీ నొకదాన్ని రాశాడు"

    
    "అలాగా?" అంది మూతి ముడుచుకుని.


    "తెరచుకోనని ఆ తలుపును తెరచుటకును


    తాళమును కొననైతివి ఏతావు నందు


    తియాలే వట్టి ఆ తెర తీయుటకును

    
    వీలు పడదయ్యే ఏ ప్రయత్నాలకైనా......"

 

    రాఘవ ఉత్సాహంగా అన్నాడు "బాగుంది కదూ?"

 

    "ఇప్పుడు హటాత్తుగా అయన రుబాయీ ఎందుకు గుర్తుకొచ్చినట్టు"


    "తూర్పు బాలిక రెప్ప లల్లార్పగనె


    కదిలె కాయలు దిశల, నా కలలు కరిగి

    
    వేగమే లేవ దేమి జీవితపు మధువు

    
    పూర్తిగా పాత్రల యిగిరిపోక ముందే


    ఏల సేవింపరు ఆలస్య మేల యింక!"


    రుబాయీ పూర్తి చేస్తూ అన్నాడు రాఘవ--"ఇలా ఎందుకన్నాడా అని ఆ రోజుల్లో ఆలోచించేవాడిని. ఇప్పటికి అర్ధమయింది."


    "ఏమిటి?"


    "నువ్వు ఆ రుబాయీలను చదవలేదని. ఉర్దూ నాకు రాదనకు తెలుగులో అనువాదాలు వచ్చాయి నిజం!"


    "నేనూ చదివాను."


    "కాని సుఖమేమిటి?"


    "ఇంటి కెళ్ళాక చెబుతాను.'


    విప్పరిత నేత్రాలతో చూశాడు. "నిజమా? మరి చెప్పవేం?"


    కారు వేగాన్ని మరింత పెంచాడు.


    అయిదు నిమిషాలలో లోగిలిని చేరుకున్నారిద్దరూ.


    డైనింగ్ టేబుల్ ముందు అప్పటికే లంచ్ ఏర్పాటై వుంది.


    గడియలోనో, క్షణంలోనో ఉహించలేని ఏ అదృష్టనికో నోచుకోబోతున్నట్టు ఆదరా బాదరాగా తినేశాడు.


    అప్పటికే లోపలికి వెళ్ళి చీర మార్చుకుని వచ్చిన కిన్నెర అంది- "మీరు తొందరగా బట్టలు మార్చుకోండి.'


    "ఎందుకు?" అర్ధం కాని ఓ రహస్యంలా అన్నాడు. "వున్న బట్టలతో ఇక అవసరం లేదనుకుంటే మరో డ్రెస్ తో పనేమిటి బాలికా?"


    "ఇప్పుడు మనం మేటిని సినిమాకి వెళ్తున్నాం."


    "వ్వాట్?" జావగారిపోయాడు. "నువ్వింత హడావుడి చేసింది ఇందుకా?"


    "అవును, మనం ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం."


    "అవతల బ్యాంకు సెలవు."


    "నేను ఫోన్ చేసి చెప్పేశాను మీ బాస్ కు."


    "ఎప్పుడు?"

 

    "మీరు భోంచేస్తుండగా."


    "అది కాదు కిన్నెరా! ఇలా వున్నపాటున సెలవంటే....."


    "వుద్యోగం ఉడుతుంది. అంతేగా?"


    "అయ్యో!" తల పట్టుకున్నాడు.


    "పీడ విరగడవుతుంది." బామ్మ కంఠం వినిపించింది సమీపంలో.


    "అతిధి పాత్రలా మధ్యలో నువ్వేమిటి?"


    "అమ్మాయి ముచ్చట పడుతోంది. నోర్ముసుకుని వెళ్ళు!"


    "నీకు తెలియదే!"


    "ముందు బయలుదేరతావా , లేకపోతే కాళ్ళు విరగొట్టమంటావా?" బామ్మ కేకలతో పనివాళ్ళంతా అటుకేసి వస్తుంటే సిగ్గుతో నలిబిలైపోయాడు.


    "నడవమంటుంటే!"


    బామ్మకు రహస్యంగా నచ్చచెప్పబోయాడు. "అవతల నాకు అర్జెంటు పని వుందే!"


    "వదిలేయండి బామ్మా!" కిన్నెర జోక్యం చేసుకుంది. అంతే కాదు. తన కోపాన్ని ప్రకటిస్తూ రోషంగా పడకగదిలోకి నడిచింది.


    "కిన్నెరా!" నచ్చచెప్పబోయాడు రాఘవ.

    తను అంత ప్రాధేయపడినా, పనివాళ్ళ ముందు తన మాటను తిరస్కరించిన రాఘవ ప్రవర్తనను ఆమె జిర్ణించుకోలేక పోయింది.


    "మీ ఇష్టం. బ్యాంకుకే వెళ్ళండి.'


    ఈ లెక్కన ఈరోజు దగ్గరికి రానివ్వదు. అలా అనిపించిన వెంటనే మోహంలో భావాలు మార్చేశాడు. "పిచ్చి పిల్లా! చెక్ చేశాను అంతే!" అట్టహాసంగా నవ్వేశాడు కూడా.


    "ఏమిటా చెక్ చేసింది?"

 

    ఇక్కడా అవకాశం చేజార్చుకోలేదు రాఘవ_"నేను కాదన్నప్పుడు నువ్వెలా రియాక్టవుతావో చూద్దామని."


    ఈ 'కాదనడం' అనే పదాన్ని దేన్ని ఉద్దేశించి అన్నాడో ఆమెకు తెలిసిపోయింది.


    "పద వెళ్దాం."


    "మీరేం జాలిపడనక్కరలేదు."


    "నీకు లేకపోయినా కనీసం నాకు జాలి వుండటం తప్పుకాదుగా!" అన్నాడు 'కనీసం' అన్న పదాన్ని మరోసారి ఒత్తిపలుకుతూ.


    అది తగలకూడని చోటనే తగిలినా ఓ జోక్ లా నవ్వేసింది కిన్నెర.


    సినిమాకు వెళ్ళే ఆ ప్రయత్నంలో ఉదయం రమణి కిచ్చిన మాట మరిచిపోయాడు రాఘవ.

 

                                                            *    *    *    *


    సినిమా తర్వాత శారదా నది ఒడ్దుకు, అక్కడి నుంచి ఓ రెస్టారెంట్ కు వెళ్ళి భోంచేసి వచ్చారు రాఘవా, కిన్నెరా. వచ్చింది ఏడున్నరకే అయినా ఆ తర్వాత కిన్నెర జాడ లేదు, రాత్రి తొమ్మిదిన్నర కావస్తోంది.


    అప్పటి దాకా కావాలనే బామ్మతో హస్కు కొడుతూ గడిపింది కిన్నెర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS