ఏం చేసింది తను,
మనశ్శాంతిగా వుండలేకపోయిన సామ్రాజ్యం ధన్వి వెళ్ళిన దగ్గర్నుంచి జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ అర్ధం కాని అంతర్మధనానికి గురైపోయింది.
మధ్యాహ్నం భోంచేయలేదు.
సాయంత్రం కావస్తున్న అలజడి నుంచి తేరుకోలేకపోయింది.
మచ్చలేని వసంతంలా అనిపించే ధన్వి ముందు అంతలా ఎలా దిగాజారగలిగింది? కోరిన జీవితం నుంచి దూరమయినా గానీ, చచ్చిపోని పచ్చదనంతో ఆలోచనల ముత్యాలరాసుల్ని మస్తిష్కంలో నింపుకుని, కాంక్షతో చూసే ఏ మగాడినైనా కంగారు పెట్టగల ధైర్యంతో బ్రతికిన తను యింత బేలగా మారిపోయిందేం!
ఒకనాడు తన భర్త స్టానంలో వుండి తనను బాధపెట్టి వెళ్ళిన సంజీవి పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తుంటే తట్టుకోలేకపోయిందా? లేక సంజీవిని జీవితంలోకి ఆహ్వానిస్తే యింత అవాంతరంగా భావించి కలవరపాటుతో తాగి ధన్వి ముందు తేలిపోయిందా?
ఒంటరితనంలో అయినా గానీ ఓడిపోయిన పావురంలా కాక వయసు పూలగుత్తిలో దాగి వున్న చురకత్తిలా తెగువతో యింత కాలము ఉల్లాసంగా బ్రతికిన తను బలహీనత మూలంగా ఇంత దిగజారిపోయింది.
ఇది నిజంగా ధన్వి మీద కోరికేనా?
లేక.....
భాష్యం చెప్పలేని పలాయనవాదంలాంటి ప్రయత్నమా?
"హల్లో...."
సాయంత్రం ఆరుగంటల సమయంలో యింటిలో అడుగుపెడుతూనే పలకరించింది మధూళీ.
సామ్రాజ్యం బిడియంగా తడబడింది "మీరా?" అంటూ.
"ఏం వస్తానని ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారా?" మధూళీ ఏకాగ్రతగా చూస్తూ అంది. ......"మీకు తెలీదు సామ్రాజ్యం.....వెంటనే రావాలనుకున్నాను.....మీరేందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కాక చాలా బాధపడ్డాను కూడా. అయినా రాలేకపోయాను.....ఎందుకంటే మీరు చల్లబడ్డాకనే మీ నుంచి విషయం వినాలని."
మధూళీ ఆత్మీయత వూరట నందిస్తున్నా గానీ జవాబు చెప్పలేకపోయింది సామ్రాజ్యం.
అయినా ఏం చెప్పాలి?
ఫోన్ చేసి అందోళన పెడుతున్న మాజీ భర్త సంజీవిలో వచ్చిన మార్పు గురించి చెప్పాలా? లేక ధన్వి తన దృష్టిలో పిపీలికంలా కుంచించుకుపోయిన తన తప్పిదం గురించి ఏకరవు పెట్టాలా?
అసలు ధన్విని తను కోరుకుంటున్న విషయం మధూళీకి తెలిస్తే ఎలా రియాక్ట్ ఆవుతుంది.
"మీరలా మౌనవ్రతం పాటిస్తే నేను భాధపడతాను సామ్రాజ్యంగారూ.....మీరు అంగికరించినా అంగికరించకపోయినా ఒక్కటి మాత్రం నిజం ,,,,నాన్న తప్ప నాకంటూ ఎవరూ స్నేహితులులేని ఒంటరిదాన్ని నేను కూడా. కానీ మీ పరిచయం తరువాత మిమ్మల్ని ముందు స్నేహితురాలిగా అనుకున్నాను. ఇప్పుడు నవ్వకండి.....నాకన్నా ముందు పుట్టిన నా తోబుట్టువుగా అనుకుంటున్నాను అంది మధూళీ.
ఎంత పరవశమనిపించిందని......
పరిచయం వయసు ఎంతయితేనేం? మనసులోకి చాలా లోతుగా చొచ్చుకుపోయింది మధూళీ.....అందుకే తెరిచిన స్పటికపు కిటికిలా మనసుని చదివేసింది వెంటనే.
"మీకు తెలుసు మధూళీ! కేరెక్టర్ లేని మగాడిగా నేను కాదని విడిచిపెట్టిన సంజీవి తను మారనంటూ నా వెంట పడుతున్నాడు.....ఏం చేయాలి?"
నవ్వింది మధూళీ.
"మీరు సమస్యకి పరిష్కారం అడగడం లేదు. పరిష్కారం తెలిసి కూడా నిర్ణయం తీసికోలేకపోతున్నట్టుగా వున్నారు."
ఉలిక్కిపడింది సామ్రాజ్యం.
"ఆ వ్యక్తిని మీరు ఇప్పటికి అభిమానిస్తున్నారు సామ్రాజ్యం."
"లేదు....." ఏదని ఎరలా కోరికేస్తున్న ఏ జ్ఞాపకాలో సామ్రాజ్యాన్ని కలవరపెడుతుంటే అంది.
"అతడు నన్ను మోసం చేసిన విషయాన్ని యిప్పటికి మరిచిపోలేకపోతున్నాను......నీకు తెలిదు మధూళీ. తను మరో ఆడదానితో సంబంధం పెట్టుకున్న విషయం అతను అంగికరించాడు కూడా."
ఆటను మరో అమ్మాయితో మీకు రెడ్ హండెడ్ గా దొరికిపోయాడా?
"లేదు.....మరెవరి ద్వారానో తెలిసి నిలదిశాను. నిజం ఒప్పుకున్నాడు."
"ఒకవేళ ఒప్పుకుని వుండకపొతే ......."టక్కున అడిగింది మధూళీ.
"ఆ విషయాన్ని మీరంత సులభంగా నిరూపించగలిగేవారా సామ్రాజ్యంగారూ?"
నవ్వేసింది మధూళీ. "వంటింట్లో భార్యను పెట్టుకుని బాత్ రూంలో పరాయి ఆడదానితో శృంగారం నడిపే మగాళ్ళున్న ఈ సొసైటీలో, హోటల్లో పోలీసులకి మరో అడామేతో పట్టుబడ్డా తమ శత్రువుల ట్రేడ్ లో చిక్కుకున్న రాముడ్ని అంటూ అందరి ముందూ నీతి వాక్యాలు వల్లే వేసే ప్రబుద్దులున్న ఇప్పటి సంఘంలో మీ భర్త సంజీవి అంత సులభంగా నేరం ఒప్పుకున్నందుకు అభినందించాలి సామ్రాజ్యం."
"ఒకవేళ మీరే నా స్థానంలో వుంటే....."
"మీరన్నట్టు అంత ప్రేమగా చేసుకునే మగాడే అయితే కొంత రప్చర్ తరువాతయినా క్షమించేసేదాన్ని " మధూళీ మరింత విశ్లేషించి చెప్పింది. "మిమ్మల్ని కాదని మరో ఆడదానితో శారీరకంగా కలిసినవాడ్ని నిజాయితీ నటిస్తూ బీట్ చేసేవాడ్ని ఎలా మన్నించగలరు అన్నది మీ ఆలోచన కావచ్చు సామ్రాజ్యంగారూ! కానీ మనిషి జీవితం ఎన్నో సంఘటనల కలయికగా భావించాలి తప్ప ఒక్క సంఘటన్నే జీవితంగా అనుకోవాల్సిన అగత్యంలేదు. అది కాకుండా అంత పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాక."
"ఒకవేళ ఇప్పుడు నేనూ అలాంటి ఓ సంఘటనతో మరో మగాడికి దగ్గరయితే....."
అది ధన్వి జ్ఞాపకాలనుంచి ఇంకా తేరుకోలేకపోవడమో లేక ధన్వి మీద పెంచుకున్న ఇష్టం సంజీవిపై గల సానుభూతిని డామినేట్ చేస్తూ మాట్లాడిందో సామ్రాజ్యానికి తెలీదు.
