ఎప్పుడయితే ఇలా ఆలోచించిందో వెంటనే ఆ వ్యక్తి ఎవరయి వుంటారో తెలిసిపోయి "దొంగా-దొంగా" అంటూ గట్టిగా అరిచింది.
ఆ కేకలకు చుట్టుపక్కల ఇళ్లలోని వ్యక్తులతో పాటు గోకుల్ కూడా ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు.
దూరం నుంచి కుక్క పరిగెత్తుకొస్తూ వుందని దగ్గరౌతున్న దాని అరుపుల ద్వారా కనిపెట్టాడు.
ఠక్కున లేచి నిల్చున్నాడు.
పార్వతమ్మ నిలుచున్న చోటు నుంచి కదలడం లేదు. భయంతో బిగుసుకు పోయింది కాబోలు చలనం లేదు.
ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదతను.
లుంగీ అలాగే కప్పుకుని పరిగెత్తాడు.
నిద్రమత్తు వదిలించుకుని చుట్టుప్రక్కల వాళ్ళు గుమిగూడేటప్పటికి అతను తన వూరిదారిలో వున్నాడు.
అలా తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
అప్పట్నుంఛీ పద్మజ కోసం ఆమె ఇంటికి వెళ్ళేవాడు కాదు.
ఎప్పుడోగానీ ఆమె రాకుండా వుండేది కాదు.
వాళ్ళిద్దరికీ హాయిగా గడిచిపోతోందిగానీ గోకుల్ తల్లిదండ్రులకు మాత్రం బెంగ పట్టుకుంది.
కొడుకులో రోజు రోజుకూ వచ్చే మార్పుల్ని వాళ్ళు కనిపెడుతూనే వున్నారు. రోజూ పొద్దుపోయేటప్పటికి అతను తయారవడం ఏ అర్ధరాత్రో ఇంటికి రావడం- పొలం పనుల మీద శ్రద్ద తగ్గడం- మనిషి తగ్గిపోవడం- ఇంతకు ముందు గలగలా మాట్లాడేవాడు నిశ్శబ్దంగా ఐపోవడం- ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి భయమేసింది.
అయితే అతని ముఖ్మలో జీవకళ ఉట్టి పడుతుండడంతో కొంతలో కొంత మేలు కంగారుపడడం లేదు గానీ తన కొడుక్కి ఏమైందో అర్ధం కాక బాధపడేవాళ్ళు.
ఇదిగో ఇలాంటప్పుడు సుబ్బరామయ్య నా దగ్గరికి వచ్చాడు.
"వాడి వాలకం చూస్తుంటే ఏదో భయంగా వుంది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో వుంటున్నాడు. ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకోవడం లేదు. వయసులో వున్న కుర్రాడు. ఏదయినా ఆకర్షణలో చిక్కుకుంటే వాడి జీవితం నాశనమైపోతుంది. నిజంగా వాడికి ఏమయిందో నువ్వు కనిపెట్టాలి" అన్నాడు.
అప్పటివరకు నాకూ గోకుల్ గురించి ఏమీ తెలియదు. పెద్దింటి బిడ్డ చదువుకున్నాడు- వయసులో వున్నాడు గనుక ఆకర్షణీయంగా వుంటాడు- ఇంతవరకే తెలుసు. అతని వ్యక్తిగత జీవితం గురించి వివరాలు తెలియవు.
"వాడికి ఏమైందో నువ్వు కనిపెట్టాలి- నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను" అన్నాడు ఆవేశంతో.
"నేను చేసే వృత్తి అదే ఏం జరుగుతూ వుందో తెలుసుకుంటాను తప్ప బెత్తం ఎత్తుకుని ఇతరులను బాగు చేయడమంటే నాకు ఇష్టం లేని పని ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతకడమే జీవితం యొక్క పరమావధి అని నమ్మిన దాన్ని" అన్నాను.
"సరే- నువ్వు అంతవరకే చెయ్" అని ఆయన లేచాడు.
బయటికి సాగనంపి ఇంట్లోకి వచ్చాను. ఏదైనా కేసు టేకప్ చేస్తే ఆ ధ్యాస తప్ప నాకు మరేమీ వుండేది కాదు. నా వృత్తి విషయంలో నేనంత సిన్సియర్ ని.
రెండో రోజునుంచే పనిలో దిగిపోయాను.
గోకుల్ కి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారేమోనని వాకబు చేశాను.
ఇలాంటి విషయాల్లో మిత్రులు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంటారు.
కానీ దురదృష్టం కొద్దీ అతను ఎవరితోనూ క్లోజ్ గా వుండేవాడు కాదు. సాధారణ పరిచయాలున్నాయి గానీ ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడేవాడు కాదు.
ఈ దారి లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు.
మరెలా?
రోజూ అతని దినచర్య ఏమిటో, అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటే కొంత ఉపయోగం వుంటుందనుకున్నాను.
రోజూ సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళడం ప్రారంభించాను.
అన్నీ మామూలుగానే వున్నాయి.
అతను అంతకు ముందు ఇంట్లో బాగా మాట్లాడేవాడేమో గాని ఇప్పుడు మాత్రం మాట్లాడడం బాగా తగ్గించాడు.
ఆ ఇంట్లో అతనికి ఓ గది వుంది.
ఎప్పుడూ అందులోనే వుండేవాడు. చేతిలో పుస్తకం లేకుండా ఇంట్లో అతనిని చూడలేం.
సుబ్బరామయ్య చెప్పినంత అన్యాయంగా ఏమీలేదు. వ్యవసాయం పనులు చేస్తున్నాడు గానీ ముందంత ఇంట్రెస్టు వుండడం లేదు.
ఇక సాయంకాలమైతే అతనిలోకి ఓ కొత్త జీవకళ ప్రవహించేది. రోజంతా ఆ సమయం కోసమే చూస్తున్నట్టు ఒక్కసారిగా ఉత్సాహంతో ఉరకలు వేసేవాడు.
శుభ్రంగా తయారై ఏటిగట్టు భూములవైపు వెళ్ళేవాడు.
సాయంకాలం ఆరుగంటలకు బయల్దేరినవాడు తిరిగి తొమ్మిది గంటల ప్రాంతానింటికి చేరుకునేవాడు.
అతను ఇంటికి వచ్చినప్పుడు అతని కోసమే వెయిట్ చేస్తూ వుండేదాన్ని.
అతని ముఖం వెలిగిపోతుండేది. కళ్ళు స్వర్గాన్ని చూసినట్టు ఆనందంలో తేలేవి.
నాకప్పుడు అనుమానం మొదలైంది. ఏటిభూముల దగ్గరే ఏదో జరుగుతూ వుండాలనిపించింది.
ఓ పెళ్ళికాని యువకుడు సాయంకాలం ఆరుగంటలకెళ్ళి తొమ్మిది గంటలకొస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతూ వుందో సులభంగా తెలిసిపోతుంది.
అయితే ఆ అమ్మాయి ఎవరు?
నాకైతే ఇది రెండు బస్తాల ధాన్యం ప్రశ్న.
