మూడు సంవత్సారాలు నిండేలోపు వెంట్రుకలు తీయాలి. అందువల్ల ఆ అదివారం అతను, తన ఇద్దరి పిల్లలకీ కులదైవమయిన నూరప్పడికి మొక్కి, పిల్లలకు తలనీలాలు తీయాలి. అక్కడ్నుంచి దాదాపు ఏడుకిలోమీటర్ల దూరంలో వుంటుంది నూరప్పడి తోపు.
నూరప్పడి తోపంటే అక్కడ ఎలాంటి దేవాలయంలేదు. ఒక పెద్ద మామిడితోటుంది.
అది ఎవరో మద్రాసు వాసులది.
ఓ చెట్టు మొదట్లో చెక్కరాయి వుంది. దాన్నే నూరప్పడు అని అంటారు. నూరప్ప కులదైవం ఉన్నవాళ్ళంతా అక్కడే తలనీలాలు యిచ్చి, మొక్కులు తీరుస్తారు.
అనుకున్న టైమ్ కి అందరూ రెడి అయిపోయారు. ఎండ ఎక్కితే భరించలేమని అందరికి తెలుసు. శివరావు ఇంటిముందు రెడీగా రెండు ఎద్దులబళ్ళు వున్నాయి. అందులో ఒకటి సురేష్ వర్మది. దాని సారథి బాబు. అతను వస్తూ వుండడంవల్ల మానసకి ఆనందంగా వుంది. తన బావ విషయాలు వినచ్చు. ఆ కబుర్లతో కాలం ఎంచక్కా గడిచిపోతోంది.
రామారావు వాళ్ళకు వాళ్ళ నాన్న తరపునుంచి బంధువులు, అందుకే పిలవడం తయారయ్యాడు. కులాంతర వివాహంవల్ల ఈ మధ్య కాలంవరకు మిగిలిన బంధువులు పెద్దగా పలకరించేవాళ్లు కాదు. ఇప్పుడిప్పుడే తిరిగి మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల శివరావు పిలవడంతోనే ఇంట్లోని ఇద్దరు అడవాళ్ళని పంపిస్తానన్నాడు. శ్రీనివాసరావు.
కాంచనమాల, మానస బయటికి వచ్చేటప్పటికి ఓ చిన్నపిల్ల వచ్చి " మిమ్మల్ని రమ్మంటున్నారు" అని చెప్పి అంతే స్పీడుతో తిరిగి తుర్రుమంది.
ఇద్దరూ శివరావు ఇంటికి చేరుకున్నాడు.
మానస అక్కడ నిలబడివున్న బాబును చూడగానే పలకరింపుగా నవ్వుతూ కళ్ళెగరేసింది. " నీబండిలోనే మేం. ఎలా బండి నడుపుతావో చూడాలి. గుర్రాలు వీటిముందు ఎందుకూ పనికిరావు అనిపించాలి" కాంచనమాల ఎద్దుల్ని చూపిస్తూ బాబుతో అంది.
"గుర్రపుబండి ఏం ఖర్మ. ఏరోప్లేన్ లో వచ్చినట్లుండాల" అన్నాడు వాడూ హుషారుగా. అంత ఉదయంపూట చిన్న చెరువులో వికసించిన బొమ్మపువ్వుల్లా వున్న ఆ ఇద్దర్ని చూస్తుంటే, వాడికేదో మంచి ఫీలింగ్ కలిగింది.
అందమైన వస్తువుల్ని చూడగానే మనసు పరవశించినట్లు అయిపోయాడు క్షణకాలం. ఆ వెంటనే అతనికి తన భార్య జయలక్ష్మి గుర్తు వచ్చింది.
అమె పగలుగాని, రాత్రిగాని ఒకే టైప్ లో వుంటుంది. స్నానం చేసినప్పుడూ అంతే, స్నానం చేశాక శుభ్రంగా తయారైతే, ఆ ఫ్రెష్ నెస్ ఎదుటివారికి తెలుస్తుంది. పౌడర్ కూడా రాసుకోదు. అదేమైనా అంటే స్టాక్ డైలాగ్ ఒకటుంది. అదే అంటుంది. " నాకెందుకు? అంతా అయిపోండానికి" అమె దృష్టిలో అడపిల్లలకి పెళ్ళి కావడం అంటే, సగం లైఫ్ అయిపోయినట్టు. ఓ బిడ్డ పుడితే పూర్తిగా అయిపోయినట్టు లెక్క.
అందుకే అమె ఎప్పుడూ అలా జిడ్డుడుతూ వుంటుందనిపించింది. బాబుకి, మానస, కాంచనమాల ఇంట్లోకి వెళ్ళగానే సుమిత్ర కాఫీలిచ్చింది.
"బండి తోలేవాళ్ళకి ఇచ్చారా?" ఎక్కడికెళ్ళినా మానస బాబుకి అన్నీ అందుతున్నాయో లేదో చూస్తుంది.
"ఆ ఇచ్చాం" సుమిత్ర చెప్పడంతో ఓకే అనుకుంది.
కాఫీలయ్యాక అందరూ వచ్చారు.
అడవాళ్ళు, పిల్లలే ఎక్కువ. మగవాళ్ళు ఓ ముగ్గురున్నారు. మిగిలినవాళ్ళు భోజనం వేళకి బస్సులో వస్తామన్నారు. దేవుడికి పెట్టేవాళ్ళు బస్సులో వెళ్ళకూడదు గనుక వీళ్ళు మాత్రం బండ్లలో బయల్రేరారు. సామానులు వేసుకున్న బండి అప్పటికి చాలాసేపు ముందే వెళ్ళిపోయింది. ఆ ఆ రెండు బండ్లలో అందరూ సర్దుకుర్చున్నారు. ముందు అన్నట్లే, కాంచనమాల, మానస, బాబు బండ్లో ఎక్కారు. బండ్లు కదిలాయి.
"మీ ఓనర్ బస్సుకయినా వస్తాడా, లేకపోతే డుమ్మా కొడతాడా?" మానస మొదట అదే ప్రశ్న వేస్తుందని బాబుకి, కాంచనమాలకి తెలుసు.
"మీరు ఈ ప్రశ్న అడుగుతారనే నేనూ మా ఓనర్ ని అడిగాను. అయన వస్తాననే అన్నారు. కానీ ఆయనకి ఇలాంటి పంక్షన్లంటే అసలు నచ్చవు. అందుకే అయన అక్కడికి వచ్చేవరుక డౌటే" అన్నాడు.
ఆ మాటలు విన్న తరువాత మానస మరింత ఖుషీ అయిపోయింది. సురేష్ వర్మ వస్తాడనే అమెకి అనిపించింది.
బండ్లు గుర్రపుతోపుకి చేరుకునేటప్పటికి ఎడయ్యింది టైమ్. దట్టమైన తోపు కాబట్టి. సూర్యుడి ఆచూకీ కూడా తెలియడంలేదు. ఆడవాళ్ళు దిగటం టిఫిన్ తయారీలో మునిగిపోయారు.
పొంగలి, వడ, చట్నీ, సాంబార్, ఇవి నాలుగు తయారయ్యేటప్పకిటి ఎనిమిదైంది. ఇక అప్పట్నుంచి టిపిన్ లు మొదలయ్యాయి. కాంచనమల, మానస వడ్డనకు దిగారు.
రథసారధులు బాబుగాడు, మిగిలిన ఇద్దరికి మానస వడ్డించడానికి మూడు అరిటాకులు తెచ్చి వేసింది. పొంగలి పెట్టి పక్కన చట్ని వేసింది. దాంతోపాటు సాంబారు, వడ వడ్డించింది.
కాంచనమాల నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టింది.
"నీకు వడలంటే ఇష్టంకదా. లాగించు- మొహమాట పడకు. ఇదీ మనదే" అంటూ మానస బాబుకి మరో రెండు వడలు తీసుకొచ్చి వేసి, సాంబారుపోసింది.
అమె అటు వెళ్ళగానే పక్కనున్న వాడు " మానసమ్మకి నీమీద అభిమానంగా వుంది. కొసరికొసరి వడ్డిస్తోంది" ఒకడు కడుపుమండే ఏదో సరదాగా అన్నట్టు అన్నాడు.
"నా మీద అభిమానం కాదు. మా ఓనర్ సురేష్ వర్మమీదఅభిమానం. " వాడు అసలు విషయం చెప్పి " కావాలంటే మీకూ వడలు వేయమంటాగానీ కుళ్ళుబోతు మాటలు వద్దు" అని కటువుగా అన్నాడు.
టిఫిన్ అయిపోయాక మానస కాపీలు తెచ్చి ఇచ్చింది.
ఆ తరువాత ఓ పక్క దేవుడి కార్యక్రమాలు మరోపక్క వంట కార్యక్రమాలు మొదలయ్యాయి. మానస, కాంచనమాల వంటపనిలో సాయం చేస్తున్నారు. పొద్దు ఎక్కేకొద్ది జనం రావడం మొదలుపెట్టారు. బంధువులు స్నేహితులు చాలామందే వస్తున్నారు. కొందురు వస్తూనే వెళ్శిపోతుంటే , మరికొందరు వుండిపోతున్నారు.
పదిగంటలకల్లా మరీ ముఖ్యమైనవాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు రకరకాల కాలక్షేపాలు వెదుకుతున్నారు.
కొందరు పేకాడడం ప్రారంభించారు. మరికొందరు మాటల్లోపడ్డారు. బాబూలాంటి వాళ్ళు టవళ్ళు పరుచుకొని నిద్రకుపక్రమించారు. పిల్లలకి మొదట శిరో ముండనం, ఆ తరువాత చెవులకుట్లు అయ్యాయి. వేట తెగింది. దేవుడికి నైవేద్యం అయింది.
రథసారథులు లేచారు. భోజనాల టైమ్ కావడంతో బావిలోంచి నీళ్లు తోడే పని వాళ్ళకి అప్పగించారు. కూర నారాయుడు వేటను కోయటం ప్రారంభించాడు.
"మొత్తం కూర ఓ రెండు కేజీలో, మూడు కేజీలో ఎత్తుకుందాం. ఎంత వండినా అయిపోయేదేకదా. ఎండేసుకున్నాం అనుకో. పిల్లలు ఇష్టంగా పుప్పాసులు తింటారు" శివరావు భార్య సరోజమ్మ భర్త దగ్గిర అంది. అంత పెద్ద పొట్టేలును అందరికి వండిపెట్టడం యిష్టం లేకపోతోంది అమెకు.
