Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 45


    
    "అబ్బాయికి ఏం ఉద్యోగం? భార్యకి అన్నం పెట్టుకోగలడా?"
    
    "ఆ.....అన్నం వండిపెట్టే ఉద్యోగమేలే దీనికి పెట్టగలడో లేదో కానీ" అంది తేలిగ్గా.
    
    "లీల! నిన్ను చూస్తుంటే చాలా ఈర్ష్యగా వుంది. ప్రతి విషయాన్నీ ఎంత తేలిగ్గా తీసుకోగలవూ" అంది ధృతి సన్నగా కంపిస్తూ.
    
    "తీసుకోక ఏం చెయ్యను? బాధపడుతూ కూర్చుంటే ఎలా? ప్రతి విషయానికి మనసు పాడుచేసుకుని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే వున్న ఉద్యోగం వూడిపోయి ఈ మాత్రం సుఖంగా వుండే అవకాశం కూడా పోతుంది" అనేసి "చాలా ఆకలిగా వుందివాళ ఏం తెచ్చావు?" అని అడిగింది.
    
    ధృతి మౌనంగా టిఫిన్ బాక్సు తీసిచ్చింది.
    
    లీల ఆవురావురుమని తింటూంటే రెప్ప ఆర్పకుండా చూస్తూ కూర్చుంది.
    
    చాలామంది ప్రతి చిన్న విషయానికి అన్నం మానేసి ఏదో సాధించేస్తున్నా మనుకుంటారు.....ఆమె ఆలోచిస్తూండిపోయింది.
    
                                                                * * *
    
    ఆరోజు ప్రొద్దుటే సుబ్బరాజు వచ్చి చెప్పాడు. "అయ్యగారు ఎనిమిదింటికల్లా రెడీగా వుండమన్నారమ్మా ఎక్కడికో వెళ్ళాలట" అని.
    
    ధృతి "సరే" అని త్వరత్వరగా పనులు పూర్తిచేసుకుంది. ఎనిమిదింటికల్లా బంగళా చేరుకుంది. అక్కడ నవీన్ నిలబడి వున్నాడు. ధర్మానందరావుగారు ఏదో చెప్తున్నారు.
    
    ధృతి "గుడ్ మార్నింగ్ సార్!" అనగానే ఆయన ఆమెవైపు క్రిందనుండి మీదకోసారి చూసి -
    
    "ఇంతకంటే మంచి చీరలు లేవా?" అన్నారు.
    
    అనుకోని ఆ సంఘటనకి ఆమె మ్రాన్పడిపోయింది. అంతలోనే కళ్ళెత్తి నవీన్ వైపు చూసింది. అతను తల వంచుకుని నిలబడి కనిపించాడు. అతని కళ్ళల్లో కదలాడే భావాలు చదవడం అసాధ్యం.
    
    "వెళ్ళు! వెళ్ళి త్వరగా మార్చుకునిరా" అన్నారు అధికారపూరితంగా.
    
    ఆమె కదలలేదు. "నాకు ఇలాగే ఇష్టం" అంది కాస్త మొండిగా అప్పటికే ఆమె గొంతు వణికి, కళ్ళు వర్షించటానికి సిద్దంగా వున్నాయి.
    
    ఆయన ఓ నిమిషం ఆమె కట్టుకున్న సాధారణమైన కాటన్ చీర వైపు చిరాగ్గా చూసి "సరే పద" అన్నారు లేస్తూ.
    
    ఆమె ఆయన్ని అనుసరించింది.
    
    నవీన్ వెనుకగా నడిచాడు.
    
    కారు దగ్గరకి చేరాక ఆయన అసహనంగా గడియారం వైపు చూస్తూ "సుబ్బరాజూ! ప్రేమ్ బాబుని త్వరగా రమ్మనూ" అని కేకేశారు.
    
    ఆయన అలా అన్న మరో ఐదు నిమిషాల తర్వాత ప్రేమ్ ఫుల్ సూట్ లో వస్తూ "అంకుల్! మీకు డాక్టర్ గారు ఫోన్ చేశారు! ఏదో అర్జెంట్ విషయమట" అన్నాడు.
    
    ఆయన కంగారుగా - "అరే! అయితే నేను రాలేను. మీరిద్దరూ వెళ్ళండి. 'టైం' అయిపోతోంది. నవీన్ స్టార్ట్ చెయ్యి" అంటూ లోపలికి నడిచారు.
    
    నవీన్ కారు స్టార్ట్ చేశాడు. వెనక సీట్లో ప్రేమ్ పక్కన ధృతి కూర్చుంది. కారు గేటులోంచి బయటికి వచ్చాక ఎక్కడికి వెళుతున్నాం?" అడిగింది ధృతి.
    
    "చూస్తావుగా!" నవ్వాడు ప్రేమ్
    
    ఆమె ఏమీ జవాబియ్యకుండా బయటికి చూస్తూ కూర్చుంది.
    
    "ధృథీ! ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నావు...." అన్నాడు ప్రేమ్.
    
    ఆ మాటలు ఆమెని ఎంత ఇబ్బందిపెట్టాయంటే ఆమె వెంటనే తప్పుచేసినట్లు నవీన్ వైపు చూసింది. అతని మొహం ఎప్పటిలాగే ప్రశాంతంగా కన్పించింది.
    
    "నేను ఎలా వున్నానూ?" అడిగాడు మళ్ళీ.
    
    ఆమెకి చాలా అసహనంగా అనిపించింది.
    
    "ఏమిటి ఇవ్వాళ అంత ప్రత్యేకత?" అంది.
    
    "చెప్తాను" అని అతను పెద్దగా నవ్వి.....
    
    "డ్రైవర్! కొంచెం స్పీడ్ పెంచు" అన్నాడు.
    
    ధృతికి మనసు కుతకుతలాడిపోయింది.
    
    "ఎస్ సర్!" అని స్పీడ్ పెంచాడు నవీన్.
    
    ఆమెకి కంట నీరు గిర్రున తిరిగింది. ప్రేమ్ ని ఏదో అనెయ్యాలని ఆమె నోరు తెరవబోతుండగా"
    
    "వండ్రఫుల్! నీ డ్రైవింగ్ అద్భుతం!" అన్నాడు.
    
    "థాంక్యూ సర్!" అన్నాడు నవీన్ అదే నమ్రతతో.
    
    కొంచెంసేపట్లోనే 'ఏర్ పోర్ట్' లో అడుగుపెట్టారు.
    
    నవీన్ బయట నిలబడి వెయిట్ చేస్తుండగా, వారిద్దరూ లోపలికి నడిచారు.
    
    అప్పటికే ఏదో ఫ్లయిట్ వచ్చేసిందనడానికి నిదర్శనంగా జనం లోపలి నుండి వరుసగా వస్తున్నారు. వాళ్ళ వాళ్ళు ఆనందోత్సాహాలతో ఎదురు వెళుతున్నారు.
    
    "ధృతీ! అదిగో మమ్మీ, డాడీ!" అని ఆమె భుజంమీద చెయ్యివేసి నొక్కి ఆనందంగా చెప్పాడు ప్రేమ్.
    
    ఆమె అతను చూపించిన వైపు చూసేలోగానే, అతను ఆమెని వదిలి రివ్వుమని వాళ్ళవైపు దూసుకుపోయాడు.
    
    ధృతి అక్కడే నిలబడి అడుగు కదపకుండా వాళ్ళనే గమనించసాగింది. చాలా స్టయిల్ గా, విలువైన నగలు ధరించిన ప్రేమ్ తల్లి అతనికి అక్కలా కనిపిస్తోంది. మాటిమాటికీ చీరా, జుట్టూ సవరించుకుంటూ ఏదో అడుగుతోంది. ఫుల్ సూట్ లో లావుగా, గుండ్రంగా వున్న తండ్రి అక్కడే ఏవో బిజినెస్ వ్యవహారాలు తిరగేస్తున్నాడు. ప్రేమ్ బుద్దిగా జవాబులిస్తున్నాడు.
    
    వాళ్ళు ధృతిని పట్టించుకోకుండా బయటికి నడిచారు. ఆమె నిశ్శబ్దంగా వారితోబాటు నడిచింది.
    
    కార్లోకి వారందరూ ఎక్కాక ధృతి చివరగా ఫ్రంట్ డోర్ తెరుచుకుని ఎక్కి నవీన్ ప్రక్కన కూర్చుంది. ఆమెకి ఎందుకో ఒక్కసారిగా ఊపిరి అందినట్లుగా, అప్పటిదాకా తెగ ఉక్కిరి బిక్కిరి అయినట్లుగానూ అన్పించింది.
    
    "ఆ అమ్మాయి ఎవరు?" ప్రేమ్ తల్లి అడిగింది.
    
    ప్రేమ్ అప్పుడే గుర్తొచ్చినవాడిలాగా "ధృతీ" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS