Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 45

   

      రామానికర్ధమైంది - లలితకి సంబంధంకుదుర్చుకుందామను కుంటున్నారు -మంచిదే. ఇంతకీ లలిత ఒప్పుకుందా -

    'అదే రమ్మని టెలిగ్రాం ఇచ్చింది - నీ పెళ్ళయిన వేళా విశేషం, మా లలితమ్మకి కూడా కుదిరిపోతే" - ముసలాయన ముఖంలో ఆనందంనిండింది.
   
    'టైమొచ్చేసింది అయిపోతుంది' రామంలోపలకెడుతూ లలిత వంక చూసి ఆగాడు.
   
    'రేపు చూపులు. ఎల్లుండి పెళ్ళి' అంతేనా అన్నాడు నవ్వుతూ 'ఆ - అంతే' అందిలలిత. శారదకి సహాయంచేసిన విషయం చెప్దామా అనుకున్నాడు. కానీ మళ్ళీవద్దనుకుని మానేశాడు.
   
    దినేష్ చెప్పిన వారంరోజులూ దాటి పోయాయి. నెలరోజులూ దాటిపోయాయి. శారదకి భయం ఎక్కువైపోయింది. తన మూడులక్షలు - నాన్నగారికి ఏ సమాధానం చెప్తుందీ - ఒక్కసారి రామంతోనో, శారదతోనో తనకున్న భయం గురించిచెప్తే - దినేష్ విషయం కనుక్కోమని రామానికి చెప్తే - ఛీ - తను ఏమాలోచిస్తుంది. ఏ దినేష్ అండచూసుకుని రామాన్ని దూరం చేసుకుందో మళ్ళీ ఆ రామాన్నే ఆశ్రయించడమా -
   
                                                 *    *    *
   
                                           18

   
    కలం గబగబాగడుస్తోంది. రామం భార్య కాపురానికొచ్చింది. రామం తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరువదిలి రానని భీష్మించుకుని కూచుంది. లలిత పెళ్ళి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది - శారద ఆకాశంకేసి చూస్తోంది. ఎంత అందంగా వుందో - ఎన్ని రంగులో - భగవంతుని సృష్టి ఎంత అందంగా వుంటుందో - ఆకాశంపైనే చూస్తున్న శారదకి ఎవరోపిలుస్తున్న పిలుపు వినిపించింది "ఆంటీ ఫోను." శారద ఆశ్చర్యపోయింది. తనకి ఫోను - ఈమధ్యఫోన్లులేవే .....ఆనందంతో ఆవేదనతో గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.
   
    'హలో -దినేషా'
   
    'ఆ - నేనే'
   
    'అదేమిటీ గొంతు అలావుంది. జ్వరమా'
   
    'ఆ-'
   
    'ఎప్పుడొస్తావు'
   
    'నాలుగు రోజుల్లో - పెట్టేస్తున్నా' -
   
    శారద ఫోను పెట్టేసింది. కానీ ఎందుకో ఆఫోను దినేష్ దేనా - శారద మనసు శంకించింది. పక్కన పిల్లలెవరో ఫక్కున నవ్వుతున్నారు. 'ఎవరూ' శారదకే కకి పిల్లలు పరిగెత్తారు. ఎవరీ పిల్లలు - ఎందుకు నవ్వుతున్నారు - శారద అటు ఇటు చూసింది. ఎవరూ లేరు -   
   
    సుబ్బలక్ష్మిగారి మేడమీద గదిలో ఫోను వుంటుంది. ఆ గదిలో ఎవరూ వుండరు. సుబ్బలక్ష్మి భర్తకాంపుల ఉద్యోగం - ఆ గది అతనిది శారదకిందకొచ్చేశాక కూడా అనుకుంది, ఈ ఫోను దినేష్ చేశాడా అతనిగొంతు అదేనా.
   
    శారద పుస్తకం చూస్తూ కూచుంది. లైట్లు పోయాయి. అంతలోనే వచ్చాయి. శారద అగ్గిపెట్టి కాండిళ్ బల్లదగ్గర పెట్టింది.
   
    'ఆంటీ - ఫోను' - మేడ మీదనుంచి కేక.
   
    శారద గబగబా పైకెళ్ళింది. 'హలో. హలో'
   
    'నేనూ దినేష్ - ఇందాక చెప్పటం మరిచిపోయాను రాత్రి పదకొండు గంటలకొస్తాను. తలుపుతీసివుంచు.
   
    'హలో - హలో' ఫోను పెట్టేశారు - శారద అక్కడేనుంచుంది. వొంగివొంగి నడుస్తున్న పిల్లలు, ఒక్కసారిగా లేచి నిలబడిపరిగెత్తారు శారద అక్కడే నిలబడింది పక్కింటి అబ్బాయి ఈ ఇంట్లోకి పరిగెత్తి వచ్చాడు. ఈ ఇంట్లో అబ్బాయి, ఆ ఇంట్లో అబ్బాయి గేటు దగ్గర నిలబడి నవ్వుకుంటున్నారు.
   
    ఆ ఇంట్లో అమ్మమ్మ పిల్లాడు వుంటారంతే. అబ్బాయి తల్లి తండ్రులు అమెరికాలో వుంటున్నారు. వీడు అమ్మమ్మ దగ్గర చదువు కుంటున్నాడు.
   
    శారద మెల్లగా నడిచివెళ్ళింది. గేటు దగ్గర అబ్బాయిలు గుసగుసలు చెప్పుకుంటున్నారు. శారదని చూసి పక్కింటి అబ్బాయి బాబి పరిగెత్తి వెళ్ళిపోయాడు. సుబ్బలక్ష్మి మనుమడు శారదచేతికి చిక్కాడు.
   
    పన్నెండేళ్ళవాడు రవి. శారద చెయ్యి పట్టుకోగానే భయంతో పెఫ్ఫగా ఏడుపు లంకించుకున్నాడు. అమ్మో నన్ను చంపేస్తోంది ఆంటీ - అమ్మమ్మా - అరుస్తున్నాడు పెద్దగా శారద చెయ్యి కొరికి పారిపోయాడు. శారద గదిలోకి వెళ్ళిపోయింది - ఈ పిల్లలిద్దరూ తనని తప్పించుకుపోయారూ సరే, రేపు చెప్తా వీళ్ళపని - శారదలైటు ఆర్పిపడుకుంది.
   
    వీధి తలుపు చప్పుడవుతోంటే శారద వినిపించుకోనట్లే ఊరుకుంది ఇంటి వాళ్ళకోసమయివుండవచ్చుగా. శారద లేవలేదు. మళ్ళీ చల్లుడు - బాగా బాదుతున్నారు.
   
    రాత్రి పన్నెండుగంటలుదాటింది. శారద లైటువేసింది - తలుపుతీయడానికెళ్ళి ఎవరూ అంది.
   
    'నేనే దినేష్
   
    'ఎవరూ'
   
    'దినేష్ - "శారదా తలుపుతియ్యి" - శారద ఆశ్చర్యానికి అంతులేదు. నిజంగానే దినేష్!! - తలుపు తీసింది.
   
    'ఏమిటీ - ఎక్కడనుంచీ' మాటలు తడబడుతున్నాయి.
   
    'అన్ని వివరంగా బొంబాయి నుంచి రాస్తా'
   
    'ఇంతవరకూ ఎక్కడున్నావ్'
   
    'అన్ని తరువాత చెప్తా. ఇప్పుడు నాకోసం ఒక టాక్సీ వస్తుంది దాంట్లో అర్జెంటుగా బొంబాయి వెళ్ళిపోవాలి. దినేష్ ముఖంలో ఖంగారు గడియారం వంకే చూస్తున్నాడు.
   
    'నా డబ్బులు - నాన్నగోలపెడుతున్నాడు ఆ డబ్బుతో ఫ్లాటు కొనమని "ఆడబ్బేమిటి - దానికి వందరెట్లు ఇస్తానని చెప్పు" దినేష్ గొంతులో ఖంగారు.
   
    'అవును - ఆ ఉత్తరాలు రాయడమేమిటి - ఆ ఫోన్లుఏమిటీ - ఎక్కడనుంచో ఏమీ తెలియకుండా' - శారద మాటలకి దినేష్ నవ్వాడు.
   
    'ఉత్తరాలేమిటి - ఫోన్లేమిటి అవా - సరే. నాషేర్ మార్కెట్ గొడవల్లో మునిగిపోయాను. ఈ గొడవలన్నీ తేలిపోతాయిలే ఒక్కపదిరోజుల్లో శారదా. ఆ రోజుల్లో సూట్ కేసు నీకిచ్చాను. అది ఇటుయివ్వు ఖంగారుగా మాట్లాడాడు దినేష్" శారద గుండెలాగిపోయాయి. - తన సూట్ కేసులో డబ్బా డబ్బు - అన్ని రోజులుగా ఆ సూట్ కేసు గదిలో పడివుంది. దాన్ని తను భద్రపరచనేలేదు - తనకి దినేష్ చెప్పనూలేదు - చిన్నన్నయ్య మొత్తం డబ్బంతా దినేష్ కీ ఇచ్చాడా - ఒక్క విషయం తనకి తెలియదు - "ఏమిటి దినేష్ - నువ్వేమంటున్నావ్ - నాకేమీ తెలియటం లేదు" దినేష్ కి ఈ మాటు ఖంగారు ఎక్కువైంది. డబ్బు శారద దాచేసిందా.
   
    "ఆ సూట్ కేసు పట్రా" శారద తెచ్చింది. దినేష్ సూట్ కేసు తెరిచాడు హమ్మయ్య - ఆ డబ్బుకట్టలు కట్టలు చూస్తుంటే కళ్ళు తిరిగినట్టే అయింది శారదకి - నిజమే, తన రెండుజీన్సుపాంట్లు రెండు చీరలు, జాకెట్లు కలిపితే సూట్ కేసు అంత బరువెందుకుంటుందిమరి - వచ్చేటప్పుడు రోడ్డుదాటి రావటానికి సూట్ కేసు బరువనిపించి ఈ చేతినుంచి ఆ చేతికి మార్చుకుంది - మరి ఒక్కమాట తనకి చెప్పలేదేం ఆ పెట్టి ఎక్కడపెట్టిందో అక్కడే వుంది - దినేష్ తో చాలా మాట్లాడాలనుకుంది. ఎన్నో అడగాలనుకుంది. ఈ వచ్చే ఉత్తరాల విషయం ఏమిటీ - మా నరసాపురం వాళ్ళంతా నన్ను ఒకటే అడుగుతున్నారు నువ్వెప్పుడొస్తావని ఏం చెప్పను అని దినేష్ ని అడిగితేల్చుకోవాలనుకుంది - తనుబొంబాయి ఒక్కర్తేరాగలదు - ఎడ్రసియ్యి అని తీసుకోవాలనుకుంది - ఇలా అనుకుంటూ దినేష్ వంక చూసేసరికి 'కోటు జేబులోంచి చిన్నసీసాతీసి చటుక్కున కొంచం నోట్లో పోసుకున్నాడు. సీసాకి మూత పెట్టి జేబులో వేసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS