"వాళ్ళ చదువుగురించి ఎందుకండీ?" అమాయకంగా ప్రశ్నించాను నేను.
"మరి మేము పిల్లవాడికిచ్చే 'హోంవర్కు ఎవరు చేస్తారు?" పళ్ళు బిగబట్టాడు ఫిలిప్స్.
"అర్థం అయ్యింది - చెప్పండి"
"తరువాత అయిదుగురు జీనియస్ లు గల ఇంటర్య్వూ చేస్తుంది. ఇంటర్య్వూ లో సెలెక్ట్ అయిన పిల్లవాడి తల్లిదండ్రులు రెండువేల రూపాయలు బిల్డింగ్ ఫండ్ కడ్తే అప్పుడు పిల్లవాడికి లోయర్ కె.జి.లో సీటు ఇస్తాం"
"మరి మా ఆఫీసరుగారి అబ్బాయికీ సీటు రావడం వట్టిదేనా? వేరే మార్గం లేదా?" సాధ్యమయినంత జాలి గొలిపే విధంగా నాటక ఫక్కీలో అన్నాను.
"లేదు-" పళ్ళు బిగబట్టాడు ఫిలిప్స్.
సందేహం లేదు, పళ్ళు బిగబట్టడం కచ్చితంగా అతని హాబీనే.
నీరసంగా స్కూల్లోనుంచి బయటపడ్డాను. మర్నాడు ఆఫీసరుకి విషయమంతా చెప్పాను.
"అదంతా నాకనవసరం - మా వాడికి స్కూల్లో సీటిప్పించే బాధ్యతనీది.హెడ్డాఫీసు నుండి ఈవేళ లెటరొచ్చింది. నీకు ప్రమోషను ఇవ్వోచ్చా లేదా అని నా కామెంట్సు వ్రాయమన్నారు. తరువాత నీ ఇష్టం."
నా ప్రమోషను కె.జి. క్లాసు సీటుకి ముడిపడడంతో విలవిలలాడి పోయాను.
సాయంత్రం గదికి వెళ్ళి కాస్త చన్నీళ్ళతో మొహం కడుక్కుని కాఫీ పెట్టుకుని తాగి ఆలోచించడం మొదలెట్టాను.
నాకు ప్రమోషను రావాలంటే ఆఫీసరు కొడుక్కి కె.జి.క్లాసులో సెయింట్ డన్స్ స్కూల్లో సీటు రావాలి... కానీ అది అంత సులభమైన విషయంలా లేదు.. ఎలా... ఎలా... ఎలా?
జుట్టు పిక్కున్నాను.
నా ఆలోచనలతో గంటపైగా గడిచి పోయింది.
ఇంతలో తలుపుమీద శబ్దం...
"దబ...దబ... డబ్"
చెక్కలూడేలా తలుపుమీద కొడ్తున్నాడంటే అది తప్పకుండా చంచల్రావే.
ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి గడి తీశాను.

"ఏవిటోయ్ బుచ్చిబాబూ! షేక్స్పియర్ మొహంలా వేలాడేశావ్?" అన్నాడు గదిలోకి వస్తూనే చంచల్రావ్.
అదే చంచల్రావులో గొప్పదనం, మొహం చూడగానే ఇట్టే పసిగట్టేస్తాడు.
"సమయానికి వచ్చావురా, నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నా-"
చంచల్రావు ఓసారి గదినంతా పరిశీలనగా చూశాడు.
"సెలూన్ కి వెళ్ళడం మానేసి మంగలాడిని గదికే పిలిపించుకుని క్షవరం చేయించుకుంటున్నావా?" అన్నాడు మంచంమీద కూర్చుంటూ.
"లేదే!" అన్నాను ఆశ్చర్యపోతూ.
"ఓసారి నేలమీద చూడు-"
గదిలో నేలమీదంతా వెంట్రుకలు!
"అవా? నాకో సమస్య వచ్చిందిరా చెంచూ. అది తెగక జుట్టు పీక్కున్నా" అన్నాను అయోమయంగా నేలమీది వెంట్రుకలను చూస్తూ. నాకు తెలీకుండా చాలాజుట్టు పీకేసుకున్నాను.
"తల బట్టతల కావడం సులభమేకానీ బట్టతల తలకావడం చాలా కష్టంరా బుచ్చీ. ఇంకోసారిలా జుట్టు పీక్కోకు. ఇంతకీ, నీ సమస్య ఏమిటీ?"
"నాకు కె.జి. క్లాసులో సీటొస్తే మా ఆఫీసరు కొడుక్కి ప్రమోషనొస్తుంది"
"చూడు-నీ మనసేం బాగోలేదుగానీ ముందు కాస్త స్ట్రాంగ్ కాఫీ వేడివేడిగా తాగు-"
వాడికి కాఫీతాగాలని అనిపించి నప్పుడు నన్ను తాగమంటాడు.
స్టౌ అంటించి కాఫీ పెట్టుకుని ఇద్దరం త్రాగాం.
"ఇప్పుడుచెప్పు నీ సమస్య ఏమిటో?"
నేను చెప్పాను.
"పెళ్ళికార్డు రిజిష్టరు చేయించడం, పిల్లవాడికి ఇంటర్య్వూ పెట్టి సెలక్టు చేయడం ఇదంతా వట్టి బోగస్. ఓ అయిదువేలు మొహానకొట్టేస్తే రేపీపాటికి సీటు రెడీగా ఉంటుంది" అన్నాడు చంచల్రావు వక్కపొడి నోట్లో వేసుకుంటూ.
"అయిదువేలు ఎవడిస్తాడు?"
"ఇంకెవరు మీ ఆఫీసరే"

బాగానే ఉంది, సీటు సంపాదించి పెట్టమని అన్నాడూ అంటే అందుకయ్యే ఖర్చులూ, కష్టనష్టాలూ, నేనే భరించాలని అర్థం.... ఏదో వెయ్యి రూపాయలైతే ఆఫీసులో ఏ పర్సనల్ లోనో తీసుకుని కట్టెయ్యవచ్చు....కానీ అయిదువేలు ఎక్కడినుండి తేను?... ఎక్కడినుండి తేనురా చెంచూ... ఎక్కడినుండి??.."
