Previous Page Next Page 
విశిష్ట పేజి 44

    "నీ కూతురి కన్నెచెర విడిపించాలంటే ఇదొక్కటే మార్గం. రామకృష్ణా! మోహావేశంతో ఒక మగవాడు పక్కమీదికి లాగిన ఒక ఆడపిల్ల మెడలో తాళిగట్టి భార్యగా జీవితంలోకి ఆహ్వానించే మగవాడెవడూ వుండడు. మావాడు మీ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడింది బహిరంగమేకదా? ఆ విషయం మీ అమ్మాయే బహిరంగ సభలో చెప్పింది కదా?"

    "కన్నెచెర విడిపించకపోతే గొంతుపిసికి బావిలో పడేస్తాను. అంతే కాని, ఒక నీచ, నికృష్టుడికి నా కూతుర్నివ్వను. దయచేసి ఇక వెడతారా?" అసహనంగా అరిచాడు.

    "ఇంకా నేను చెప్పాల్సింది వుంది పంతులూ! వియ్యానికి బదులు కయ్యానికే నువ్విష్టపడితే ఇహ బలవంతం చేయడం నాకిష్టం లేదు. మాధవరావు మంచివాడు అనిపించుకొనే ఛాన్స్ నువ్వు నాకివ్వకపోతే అది నీ తప్పే. ఫలితం - నాలోని చెడ్డమనిషి బయటికి వస్తాడు. వాడు బయటికి వస్తే నువ్వు, నీ కుటుంబం ఈ భూమ్మీద మిగలరు. సాక్షులు, సాక్ష్యాలు, కోర్టులూ ,విచారణ -ఏమీ వుండవు!

    వట్టి పుణ్యానికి మర్డరైపోతారు. అంత పాపం నాకెందుకని ఒక మంచిమాట చెప్పిపోదామని నేనొస్తే నువ్వు ససేమిరా కాదన్నావు. సరే! ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయినట్టున్నాయి. అందుకే నీ నోట ఈ మాటలు వస్తున్నాయి."

    "చావుకు భయపడేవాళ్ళం కాదు. కాని, మమ్మలందర్నీ ఒకేసారి చంపి కొంతలో కొంత పుణ్యం కట్టుకో!" నిర్లిప్తంగా అన్నాడు రామకృష్ణ.

    "సరే, ఈ విషయంలో నీ కోరిక మన్నిస్తున్నా. నీకూ నీ ఫామిలీకి ఒకేసారి టికెట్ ఇప్పిస్తాను పై లోకానికి. కాని, ఈలోగా జరుగవలసిన పని ఒకటుంది."

    "ఏమిటది?"

    "నీ కూతురి కళ్ళు పెరికి నా కొడుక్కి పెట్టుకోవాలి. వాడిని ఏకాకిని చేసింది కదా?"

    జుగుప్సతో వణికిపోయాడు రామకృష్ణ. "ఎంతటి శాడిస్టువి! కొడుకును మించిన దుర్మార్గుడివి వున్నట్టున్నావు"

    "అందుకే చెప్పాను. నాతో కయ్యం పెట్టుకోద్దు. వియ్యం పెట్టుకోమని. మూర్ఖుడివి. వినిపించుకోలేదు .అనుభవిస్తావు"

    "థూ! నీలాంటి నీచ నికృష్ట మానవుడితో వియ్యమందేకన్నా మృత్యువు చెయ్యందుకోవడం గౌరవంగా వుంటుంది నాకు." "వట్టి చవటదద్దమ్మవు! ఈ ప్రపంచంలో బ్రతకడం తెలియనివాడివి. నీకు టిక్కెట్ ఇప్పించాలనుకోవడం సరైన నిర్ణయమే. అందులో బాధ పడాల్సింది ఏంలేదు" మాధవరావు విసురుగా లేచాడు.

    "ఆగండి!" అంటూ లోపలినుండి వచ్చింది విశిష్ట.

    "కూతురు ఇంట్లో వుండగానే లేదని అబద్దమాడావే. నువ్వేం పంతులువయ్యా! బళ్ళో ఇలాగే అబద్దాలు నేర్పుతావా పిల్లలకి?" వ్యంగ్యంగా అన్నాడు మాధవరావు.

    "నువ్వెందుకు వచ్చావే బయటికి?" కూతుర్ని కోప్పడ్డాడు రామకృష్ణ.

    "నేను అంతా విన్నాను నాన్నా! చచ్చి ఎవరిని సాధిస్తాం? బతికుంటే బలుసాకు తినవచ్చునని సామెత! నేను ఈయన ప్రపోజల్ ని అంగీకరిస్తున్నాను. ఎంతో దయతో నా కన్నెచెర వదిలించి నన్ను కోడల్ని చేసుకోడానికీ వచ్చిన మహానుభావుడీయన. ఆయన్ని నిరాశపర్చి పంపడం బాగా లేదు."

    "చావుకి భయపడి నువ్వీ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా విశిష్టా? చావు ఒక్కసారే వస్తుందమ్మా మనిషికి. ఈ కిరాతకులు నిన్ను క్షణం క్షణం చంపుతారు. నా కంఠంలో ప్రాణముండగా నిన్నా నరకంలో అడుగుపెట్టనివ్వను" తండ్రి ఆవేశంగా అన్నాడు.

    "అత్తారింటిని స్వర్గాన్ని చేసుకున్నా, నరకాన్ని చేసుకున్నా ఆడదాని చేతిలోనే అంటారు కద నాన్నా! అది నిజంగా నరకమే అయితే దాన్ని స్వర్గంగా మార్చుకోగలనన్న ధీమా నాకుంది."

    "పిచ్చిపట్టిందా నీకు? ఎక్కడైనా రాక్షసులు దేవతలయ్యారా? నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించేలోగా హతమారిపోతావు. వీళ్ళు ఎంత శాడిస్టులు కాకపోతే నీ కన్ను పీకి తన కొడుక్కి పెట్టుకొంటానని చెబుతాడు?"

    "నాకు ధైర్యముంది నాన్నా! అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోగలనన్న ధైర్యం నాకుంది."
 
    "వాళ్ళు నిన్ను ప్రేమతో కోడల్ని చేసుకోవాలని రాలేదు. ఇదొక కుట్ర. పత్రికల దుమారం నుండి, ప్రతిపక్షాల దాడినుండి, కోర్టు విచారణ నుండి తప్పించుకోడానికి ఇదొక ఎత్తుగడ నిన్ను కోడల్ని చేసుకొని ఆ గొడవలనుండి బయటపడొచ్చునన్న ఆలోచన. నీతో పని అయిపోగానే ఏ మధ్యరాత్రో గ్యాస్ సిలిండర్ తిప్పి నన్ను మంటలకు ఆహుతిచేసి ఆత్మహత్య చేసుకొన్నావనో, పొరపాటుగా జరిగిందనో స్టేట్ మెంట్ ఇవ్వగల ఘనులు వీళ్ళు. చూస్తూ కిరాతకుల చేతిలో పడతానంటావేమిటి?"

    "అంతకంటే మార్గాంతరం ఏముంది? ఈయన అన్నంత పనీ చేసే మనిషి. అందరం చచ్చి ఏం సాధిస్తాం? అయినా నా ఒక్కదానికోసం మీరందరు ఎందుకు చావాలి?"

    "ఎంత పిరికిగా ఆలోచిస్తున్నావు? కొండలాంటి వీళ్ళను ఏ ఆడపిల్లా చెయ్యని ధైర్యంతో ఎదుర్కొన్నావు. ఇప్పుడా ధైర్యమంతా ఏమైపోయింది? కోర్టుల్లో న్యాయం జరగదని భయపడుతున్నావా? తప్పక న్యాయం జరుగుతుంది. మహిళాసంఘాలు నీకు మద్దతు తెలుపుతున్నాయి. పత్రికలు నీకు సానుభూతి తెలుపుతున్నాయి."

    "నేను పిరికితనంతో లొంగిపోవడంలేదు నాన్నా! పోరాడి గెలవలేమని ఖచ్చితంగా తెలిసిపోయినప్పుడు పోరాడటం వ్యర్ధం కదా! ఆయన చేత కళ్ళు పీకించుకుని, కాళ్ళు విరగగొట్టించుకుని జీవచ్ఛవాన్ని అయిపోయేకంటే, ఆయన కొడుకుని పెళ్ళాడి ఇల్లాలిగా సెటిల్ కావడం మంచిది కదా?"

    రామకృష్ణకు కూతురి ధోరణి ఎంతమాత్రం నచ్చలేదు. "ఇది బెదిరింపులకు లొంగిపోయి తీసుకొన్న నిర్ణయమే కదా! బెదిరించినంతమాత్రాన బెదిరిపోవలసిందేనా? వాళ్ళు ఎవరి మీదంటే వాళ్ళమీద గూండాగిరి చూపుతామంటే కోర్టులూ, పోలీసులూ చేతులు ముడుచుకు కూర్చుంటారా? ఈయన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడని ఇప్పుడే పోలీసులకి మరో కంప్లయింట్ వ్రాసి ఇచ్చొస్తాను."

    మాధవరావు నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS