జగత్ రాం పండా కళ్ళు నులుముకుంటూ పరుగెత్తుకుని వచ్చాడు. ''ఎంత సంతోషం! ఓ విశ్వేశ్వర ప్రభూ! నువ్వు రక్షించావు మమ్ముల నందరినీ!'' అని చేతులతో మొగం కప్పుకొని నవ్వుతూ, ఏడుస్తూ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దేవతార్చన గదిలోకి పరుగెత్తాడు.
నాకు కొన్ని రోజులవరకూ ముద్ద మాటలే! కొన్నినాళ్ళ వరకూ భోజనం సయించలేదు. మా అమ్మ ఇంత రససింధూరం, మిరియాలూ నూరి మాత్రలు చేసి వేసేది. పులికడుగు చారు పెట్టేది. అప్పటినుంచి నాకు ఆకలి పుట్టింది. అన్నీ తినాలని బుద్ది పుట్టింది. అతి జాగ్రత్తగా నాచేత పథ్యం చేయించారు. ఆ పట్టు పట్టు ఆరు నెలలకు కోలుకున్నాను. నాకు జబ్బు నెమ్మదించిన నెలరోజులకు నేనూ, మా అమ్మా నా ఆరోగ్యం కోసం హిమాలయాలలో'మస్సోరీ' వెళ్ళవలసిందని డాక్టరుగారు సలహాయిచ్చారు. మా మేనమామ తన కొడుకు కస్తూరి సుబ్రహ్మణ్యాన్ని పంపించాడు. సుబ్రహ్మణ్యం నాకన్న రెండేళ్ళు పెద్ద. అంత పెద్ద చదువు లేదు. కాని చాల మంచివాడు. వ్యవహారవేత్త. మా హేమ అతన్ని చూచింది, రండు మూడు సార్లు. (జ్ఞాపకం తెచ్చుకో హేమా)
మేమంతా ఆ వేసవికాలం జూన్ నెల వానలవరకూ మస్సోరీ నగరంలోనే ఉన్నాము. మేము మస్సోరీ వెళ్ళేటప్పుడు సుశీల ఎంత ఏడ్చిందో వర్ణించలేను. నన్ను అమిత గాఢంగా నన్ను కౌగలించుకొని వదలలేదు. ఆమెకు ఏడవనెల గర్భం. ఆమె భర్త జగత్ రాం పండా అన్ని ముచ్చట్లు జరిపించినాడు.
''మూర్తీ! నువ్వు నా జీవితంలోంచి వెళ్ళడానికి వీలులేదు. నువ్వు బ్రతికావు! నేనూ బ్రతికాను. నువ్వు మస్సోరి నుంచి ఇక్కడికే రా. మా ఇంట్లో ఉండు. ఉంటావుకదూ?'' అని ఎంతో బ్రతిమాలింది. నే నామేను ముద్దుపెట్టుకొంటూ'' తప్పక వస్తాను సూసీ'' అని వీడ్కోలిచ్చాను. నే నాక్షణంలో ఏమీ ఆలోచన చేయలేని నల్లరాయిలా అయిపోయాను.
మస్సోరీలో మొదటి రెండు మూడు వారాలు నేనూ, మా సుబ్బులు బావా మహా ఆనందంగా గడిపాము. సుశీల, శకుంతలా ఎవరూ నా హృదయంలో లేరు. ఆ తర్వాత నాకు కాశీ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. రాత్రిళ్ళు నిద్రపట్టకపోవడం తిరిగి ప్ర్రారంభించింది.
బలం త్వరలో పట్టడంచేత ఆ మహాపర్వత సానువులన్నీ మా సుబ్బులుతో తిరిగేవాణ్ణి, దూరాన మాకు ధవళహిమ కిరీట సుందరాలైన ఆ పర్వతరాజు శిరము లెన్నో గోచరించేవి. ఆ కొండల్లో ఒక్కొక్క రోజు గంటలకొలదీ నడిచేవాళ్ళము? చెట్లను కోసిన ఆపిల్సుపండ్లు, దానిమ్మపండ్లు, ద్రాక్షపండ్లు విపరీతంగా తినేవాణ్ణి. నడిచి నడిచి వచ్చి, సొమ్మసిలి నిద్రపోయేవాణ్ణి. ఈ నడకలు శకుంతలా సుశీలలను దూరంగా తోలటం కోసమే! నాలో సుడిగాలులు వీస్తున్నవి మా సుబ్రహ్మణ్యానికేం తెలుసును!
నెలరోజు లుండేటప్పటికి, మస్సోరీ నాకు విసుగు పుట్టించింది. ఆ ప్రపంచంలోనే నొంటి వాణ్ణయ్యాను. నా శకుంతలను మరచి, ఒక విధంగా స్వైరిణి అయిన సుశీలతో కామవాంఛ తీర్చుకున్న ద్రోహిని నేను. శకుంతల నాపై దీనదృష్టులు పరుపుతోన్నట్లే భావించేవాణ్ని.
సుశీల మాత్రం ఏం తప్పుచేసింది? ఆమె ధర్మం ఆమె నిర్వర్తించింది. నేనే నీరసుణ్ని. ఏమిటా ప్రేమ? ప్రేమకోసం జీవితాలు బ్రహ్మచర్యానికి అంకితం చేస్తారా? వెనుకటి కథలే నిజమైతే విశ్వామిత్రుడు మేనకతో, వేదవ్యాసుడు మరదళ్ళతో నిర్వహించిన ధర్మం ఏమిటి? పుణ్యపాపాలూ సత్యంలా సర్వకాలాలూ ఒకేరీతి ఉండాలి. అవి కాలాన్ని బట్టి మారితే సుశీలకూ నాకూ, ఆ సాయంకాలం సంభవించిన కామవాంఛా నిర్వహణం పాపం ఎలా అవుతుంది?
నెమ్మదిగా నా ఆలోచనలు నశించాయి: ఒక విధమైన స్థాణుత్వం వచ్చి చేరింది. మూర్ఖుడు సర్వప్రపంచంపైన అమితక్రోధం వహించినట్లుగా నాకు అన్నింటిమీద కోపం ఆవహిల్లింది. మా సుబ్రహ్మణ్యంపై ఉదయాత్తు సాయంకాలం వరకూ నాకు విసుగూ, కేకలూ ప్రబలాయి. మా అమ్మపై కస్సు బస్సులు సాగించాను. ఆమె నే నెన్నన్నా ఎప్పుడూ నవ్వుతూ చాకిరి చేసేది, మా సుబ్బులు గంగిగోవులా ఏమీ మాట్లాడకుండా నాకు పరిచర్య చేసేవాడు. సేవకులమీద కోపం, బండివాళ్ళపై, కూలీలపై అందరిపైన కోపం, మా అమ్మ రహస్యంగా కంట నీరెట్టుకొనేదట. బక్కకోపం ఎక్కువైంది మా వాడి కని, అన్నీ భరించేది. మా అమ్మ.
''నే నిక మస్సోరీలో ఉండలేనురా'' అంటే మా సుబ్బులు కాశ్మీరం పోదామన్నాడు. కాశ్మీరం పోయాము. అందరి కళ్ళబడే షాలిమారు ప్రమదావనం, డాలు సరస్సు, జీలంపై కాశ్మీరు నౌకాయాత్రలకన్న, అక్కడ అనంతంగా పండే పళ్ళయినా తినడానికి పైసాలేని బీదవాళ్ళ స్నేహం ఎక్కువయింది. నా దృష్టి ఎప్పుడూ అందమైన స్త్రీలమీదనే. ఎన్ని వస్త్రాలు ధరించిన జవ్వనినైనా నా మనస్సులో విగతవస్త్రను చేసి ఊహిస్తూ, నా నీరసత్వానికి పళ్ళు కొరుక్కుంటూ ఉండేవాణ్ని.
అయోధ్య ప్రాంతాల స్త్రీలు పట్టపగలు ఆడవాళ్లచేత స్వల్ప వస్త్రాచ్చాదితలు మాత్రమై వళ్ళు వట్టించుకోడం చూస్తూ నా రాక్షస హృదయానికి ఆనందంగా సమకూర్చుకున్నాను. అలాగే ధనం ఇచ్చి, చక్కని పిల్లలను శ్రీనగర్ గల్లీలలో ఏరితెచ్చి, అక్కడ నా కేర్పడిన నేస్తం ఒక స్త్రీ వ్యాపారిణి ఇంట్లో రహస్యంగా వాళ్ళను దిగంబరం చేసి, ఆ బంగారు మాలామా దేహాంగాలను తనినోవ స్పృశిస్తూ ఆనందం పొందేవాణ్ని. వాళ్ళూ తమ దేహాలు కామతృప్తికి బాలి యివ్వకుండా, ఆ బలివల్ల వచ్చే రుసుంకన్న స్పర్శానందం ఇచ్చే రుసుం ఎక్కువగా దక్కడానికి సంతోషిస్తూ, నాకు సలాములుకొట్టి, నా చెంపలు తాకి మొటికలు విరుచుకుని వెళ్ళిపోతూ ఉండేవారు.
ఈ నా పిచ్చిచేతలు మా సుబ్బులుకు చూచాయగా తెలిసాయి. ఓ సాయంకాలం నావపై తట్టుపైన కూర్చుని డాలు సరస్సులోని అందాలు ఖాళీ చూపులతో చూస్తున్న నా దగ్గరకు మా సుబ్బులు చేరాడు.
