చాలామంది జానకిని సరుసు కివ్వమని సలహా ఇచ్చారు. కాని ఆడపిల్ల మేనత్తకొడుకును చేసుకోవటం సబబుగాని మేనమామ కొడుకును చేసుకోరాదని ఆవిడ అనుమానం.
"అదేమిటమ్మా చాదస్తం? మేనమామను చేసుకోంగాలేందీ మేనమామ కొడుకెందుకు పనికిరాడు? ముడిపెట్టెయ్యి. అయిన సంబంధం తేలికయిపోతుంది" అని చాలామంది సలహాచెప్పారు.
ఆడపిల్లను మేనమామ కొడుక్కు చేసుకోరాదన్న విశ్వాసం తనకు తప్ప ఇంకెవ్వరికీ తీవ్రంగా ఉన్నట్టు కనబడలేదు. సీతమ్మగారికి.
"అది ఎట్లాగైనా రెండో పక్షమేగాని నిషేధంమటుకు కాదు" అన్నారు కొందరు.
సీతమ్మగారు అన్నకు కబురుచేసింది.
"నాదేం ఉందీ? నీ కిష్టంఉంటే అట్లాగేచేద్దాం. ముహుర్తంకూడా చూడనక్కర్లా. మేంమాత్రమే వస్తాం. గుట్టుచప్పుడు కాకుండా చేసెయ్యి పెళ్ళి" అన్నాడు శేషగిరి.
అన్నగారి వైఖరి సీతమ్మగారికి ఎందుకో అసంతృప్తి కలిగించింది. జానకమ్మ పెళ్ళి తన జీవితంలో ఒక గొప్ప విషయంగా ఉండాలని ఆవిడ కోరిక. తాను, ఒంటరిగత్తె అయిఉండికూడా, కూతురికి గొప్ప సంబంధం తెచ్చిందని అందరూ సంతోషించాలనీ, తన కూతురు భాగ్యవంతులయింట కాకపోయినా గొప్పవాళ్ళింట పడాలనీ ఆవిడ కలలుకన్నది. అయితే ఇవి నిజమయే కలలు కావని ఆవిడకు తెలుసు. గొప్ప సంబంధాలకోసం ఆలోచించటానికి తనకు వెనక ఏమంత ఉన్నదని? ఏదో ఇంత తినటానికున్నది. అంతకన్న చెప్పుకునేటందు కేమీలేదు.
ఆదినారాయణగా రబ్బాయి కృష్ణమూర్తికి తన కూతుర్ని చేసుకుంటే, బాగుండునని ఆవిడకు కొండంత కోరిక కలిగింది. కాని వాళ్ళను అడగటానికి అభిమానమయింది. వాళ్ళు చేసుకోమంటే? పైగా ఆ పిల్లవాడికి రెండు వేలిస్తామనీ, మూడు వేలిస్తామనీ వస్తుంటే పెద్దవాళ్ళు, మా వాడికిప్పుడు పెళ్ళి చేసే ఆలోచనలేదు" అని చెబుతున్నారు. ఆదినారాయణగారి భార్య ధోరణి చూస్తె ఆవిడకు అయిదారు వేలదాకా ఆశ ఉన్నట్టు కనబడింది. అంత కట్నం పొయ్యటం తనవల్ల ఎట్లా అవుతుంది? ఉన్నదంతా అమ్మాలి. ఆ తరువాత చిప్పపట్టుకోవలసిందే!
అప్పటికీ సీతమ్మగారు ఊరుకోలేక ఆదినారాయణగారి భార్యతో, "ఏమండీ వదినెగారూ , మా పిల్లకు, మీ ఎరికెన ఎక్కడన్నా ఉంటే, మంచి సంబంధం చూసి పెడుదురూ!" అన్నది.
"మీ పిల్లకేమండీ, రత్నంలాంటి పిల్ల! దానికి పండునాయనంటి మొగుడొస్తాడు" అన్నది ఆదినారాయణగారి భార్య భ్రమరాంబ.
ఈ మాటతో సీతమ్మగారికి కాస్త ధైర్యం వచ్చింది. "ఏమో, వదినెగారూ ఇన్నేళ్ళనుంచి పొరుపూ పొచ్చెం లేకుండా కలసి ఉంటున్నాం. మేమేం కట్నాలూ, కానుకలూ ఇవ్వలేక పోయినా, పిల్లని మీబోటివాళ్ళ చేతుల్లో పెడితే అవునని ఉన్నది. కాని మీరు చేసుకుంటారా?"అన్నది.
భ్రమరాంబగారు చేతులు తిప్పుతూ "అయ్యో, మీ జానకంటిపిల్ల కోడలైతే ఇంక కావలసిందేమిటండీ? కాని మా వాడు బియ్యే పాసయ్యే దాకా పెళ్ళే వద్దంటూండె . ఈ కాలంలో ఆడపిల్లలకే ఇష్టంలేనిపెళ్ళి చెయ్యలేకుండా ఉన్నాంకదా, మగ పిల్లాడికెట్లా చేస్తాం చెప్పండి, అక్కగారూ?" అన్నది.
భ్రమరాంబను సీతమ్మగారు వదినెవరసపెట్టి పిలవటమూ, సీతమ్మగారిని భ్రమరాంబ అక్కవరస పెట్టి పిలవటమూ కూడా ఆ రోజే మొదలూ, ఆ రోజుతోనే చెల్లుకూడానూ....
జానకి పెళ్ళికోసం తనతల్లి పడుతున్న తాపత్రయం సుందరానికి కొంతకాకపోతే కొంతయినా తెలుస్తూనే ఉంది. వాడికి ఎన్నడూ కృష్ణమూర్తి అంటే అట్టే సదభిప్రాయం లేదు. ఏమోయంటే ఏమోయని ఇద్దరూ పలకరించుకునేవాళ్ళుగాని ఇద్దరూ కలసి దోస్తీగామాత్రం తిరిగేవాళ్ళుకారు. చదువులో, మార్కుల్లో వాళ్ళకు కనపడనిపోటీ ఉండేది. నాగేశ్వరావు బావమాట వినితను టైప్ రైటింగ్, షార్టుహాండ్ తీసుకుంటే కృష్ణమూర్తికి తక్కువైపోవాలిసొస్తుందన్న దురభిమానంకూడా సుందరాన్ని బాధించింది. కృష్ణమూర్తి లెక్కలు తీసుకుంటాడని సుందరం ఎరుగును.
అయినప్పటికీ కృష్ణమూర్తికి జానకి నివ్వగలిగితే జానకీ అదృష్టవంతురా లవుతుందని సుందరం గ్రహించాడు. రెండు మూడేళ్ళక్రితం రామ్మూర్తి పెళ్ళికిగాను ఆదినారాయణగారు స్వగ్రామం వెళ్ళినప్పుడు సీతమ్మగారు మాటవరసగా, "జానకి రామ్మూర్తికి ఈడుకాదుగాని, కృష్ణమూర్తి కి ఈడే" నన్నప్పుడు సుందరం "రామ్మూర్తికి ఈడూకాదు, కృష్ణమూర్తికి జోడూకాదు" అన్నమాట నిజమే. కాని ఈ రెండు మూడేళ్లలో సుందరం కొద్దిగా కళ్ళుతెరచి కృష్ణమూర్తి "మంచి సంబంధం" కింద జమఅనీ, తనకు పిల్లనివ్వనివాళ్ళు కృష్ణమూర్తి కివ్వవచ్చుననీ గ్రహించాడు. కృష్ణమూర్తికి డబ్బున్నది. కృష్ణమూర్తి తండ్రికి హోదా, పలుకుబడీ ఉద్నాయి. అంతకంటే ఇంకేం కావాలి? తన తండ్రి బతికిఉంటే తనకూ కొంతహోదా ఉండునేమో, కాని ఇప్పుడు తను ఎవరు?
జానకిని కృష్ణమూర్తికిస్తే బాగుండునని తోచినట్టే సరుసు కివ్వమంటే సుందరానికి అసమ్మతికూడా కలిగింది. ఎంత దగ్గర బంధువైతేమటుకు చూస్తూ చూస్తూ సరుసుకు జానకి నివ్వటమేమిటి? వాడు పూర్తిగా గొడ్లకాడి పిల్లలవంతు అయిపోయినాడు. బీడీలు కాలుస్తాడు. చదువు సంధ్యాలేదు. పల్లెటూరి బైతులందర్నీ చేర్చి రెండుచేతులూ హార్మోనియం వాయిస్తూ పాటలూ, పద్యాలూ పాడి వాళ్ళు నోళ్ళు తెరుచుకు చూస్తుంటే చాల గొప్ప వాణ్ణనుకోవటం తప్ప వాడి కింకేమీ చాతకాదు. వాడికా జానకినివ్వటం? వాడికన్న జానక్కి ఎక్కువ చదువొచ్చు.
సరుసు పల్లెటూరివాలకమూ, వాడి ముతక ఖద్దరు గుడ్డలూ, పల్లెటూరి హాస్యమూ తలుచుకున్నకొద్దీ సుందరానికి వాడిమీద, మరింత దురభిప్రాయం ఏర్పడటమేగాక, కృష్ణమూర్తి మీద గౌరవం హెచ్చసాగింది. కృష్ణమూర్తికి జానకి పెళ్ళాం కావటం అసంభవమనీ, సరుసుకిచ్చి ముడిపెట్టేకన్న తమకు తాహతులేదనీ తనబుద్ధికి రూఢిఅయినకొద్దీ సుందరంబుద్ధి మరింత తిరగబడిందేగాని ఉన్న పరిస్థితులకు సమాధాన పడలేదు_ ఆ మాట అని ఉన్న పరిష్టితులను మార్చటానికీ పూనుకోలేదు.*
