నిస్సత్తువ నిండిన మనసుతో నిశ్చేష్టతాగా నిలిచిపోయి నిర్వేదంగా చూస్తుండిపోయాడు శరత్.
"సుగాత్రి ఫోన్ లో మాట్లాడుతుంటే....నాకు కొంచెం అర్ధమయింది రా! నీలో కూడా ఇంత నీచమైన ఆలోచనలున్నాయని తెలిస్తే....ఈ కొడుక్కి దూరంగా....ఏ కాశీకో పోయి గడిపి కన్నుమూసేవాడ్ని...ఎవరొప్పుకున్నా ఈ పద్దతి నేనొప్పుకోనుగాక ఒప్పుకోనురా....నువ్వలాంటి బిడ్డని కనాలంటే....నేను చచ్చేంత వరకూ ఓపిక పట్టరా....మన కొద్దురా....పరాయి మగాడి వల్ల పుట్టే బిడ్డ వద్దురా...."
ఆయాసంతో రొప్పుతూ, మధ్య మధ్యలో ఖళ్ ఖళ్ళున దగ్గుతూ అతి కష్టం మీద వచ్చి అంటున్న ముసలి తండ్రిని చూసేసరికి.....శరత్ కళ్ళలో నీళ్ళు ధారాపాతమే అయ్యాయి.
అతడి నాయనాల్లో నయగరా జలపాతాలు దూకుతున్నాయి....
గుండెల్లో పొంగిన కెరటాలు గొంతులో పొరలి పొరలి....కనురెప్పల కట్టల్ని సైతం దాటి...ఇసుక తిన్నెల్లాంటి చెంపలపైన జారి మళ్ళీ గుండెల మీద పడి.....గుండెల్లోకే ఇంకిపోతున్నాయి....
అతడేమీ అనలేనిస్థితిలో..." సరే నాన్నా....నువ్విక లోపలికెళ్ళు" అనేసి పైకెళ్ళిపోయాడు.
"ఈ మాయదారి సైన్సు పేరు చెప్పుకొని....మనషులు దౌర్భాగ్యులై పోయారు" అంటూ దగ్గుతున్నాడు చాదస్తపు ముదుసలి.
10
భార్గవ అందించిన లెటర్ ని విప్పాడు అమితేష్. అయినా అది చదువకుండానే ప్రక్కన వున్న వేణుకు అందించాడు. "ట్రాన్స్ ఫ్యూటర్ లో చూడమంటారా? సార్!" వినయంగా అడిగాడు వేణు.
"ఎస్. ట్రాన్స్ ఫ్యూటర్ లో ప్రింట్స్ తీసి, పాత నేరస్థుల ఫింగర్ ప్రింట్స్ తో మళ్ళీ ఓసారి పోల్చి కూడా చూడు చూసి అయిదు నిమిషాల్లో రిజల్ట్స్ తీయి." అని భార్గవ కేసి తిరిగి.....
"ఫోన్ కాల్స్ మళ్ళీ ఎప్పుడొచ్చాయి? ఏం చెప్పింది?" అన్నాడు అమితేష్.
"నిఖిల్ వాళ్ళింట్లో మాటాడుతున్నపుడు వచ్చింది. పెద్దగా ఏం చెప్పలేదు" చెప్పాడు భార్గవ.
"అప్పుడెవరెవరున్నారు?"
"నేను ఫోన్ దగ్గర్లోనే వున్నాను. నిఖిల్ కాఫీ కలుపదానికి వంటింట్లోకి పోయాడు. అయితే ఒక విచిత్రమేమంటే....ఆ అబ్నాక్షియస్ కాల్ రిసీవ్ చేసుకుని నేను మాట్లాడుతుంటే.....మధ్యలో నిఖిల్ వచ్చి మాట్లాడాడు. ఏం చెప్పేదోగాని.....నిఖిల్ గొంతు వినగానే ఠక్కున ఫోన్ పెట్టేసింది అదే నాకూ, నిఖిల్ కూ అర్ధం కావటం లేదు."
"అయితే నిఖిల్ కు తెల్సిన అమ్మాయే అయివుంటుంది. నిఖిల్ ను బాగా గుర్తుచేసుకోమన్నావా ఆ గొంతు ఎలా వుందో?"
"ఫోన్ లో గొంతు విని గుర్తించటం కష్టమే! అదే చిక్కు.'
అమితేష్ దీర్ఘాలోచనల్లో పడ్డాడు కణతలు రుద్దుకుంటూ. అసలు ఏ సరైన ఆధారమూ లేదు ఒక్క ఉత్తరాలు తప్ప. కవర్ మీద పోస్టల్ ముద్రచూస్తే ప్రతిసారి వేరు వేరు ప్రదేశాలదై వుంటుంది.
"మిగతా లెటర్స్ వి సైతం వేలిముద్రల ప్రింట్స్ తీస్తావా అమితేష్. ఇంకే ఆధారమైనా దొరుకుతుందేమో ....?" భార్గవ అడిగాడు.
"చాలా కష్టంరా! నువ్వు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ వి అవటం వల్లే ఈ మాత్రం ఇవి తీయగల్గుతున్నాం- మీకు తెలీదు- నేరస్తులవి అవునో కాదో గుర్తించడానికి....సగటున ఒక్కో వేలి ముద్రకు మాకు ఎనిమిది వేల రూపాయల ఖర్చు వస్తుంది. మా పరిశోధనల్లో వీటి ప్రాముఖ్యత అధికమే కాబట్టి...అందునా నిన్ను కాదనలేక ఈ పాటికి మూడుసార్లు తీసాం చెప్పుకోదగ్గ ఆధారాలేం కన్పించడం లేదు"
"ఒక్క వేలిముద్రకు మీ ఖర్చు ఎనిమిది వేలా?" ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ.
"అవునూ! పది మంది వచ్చి ఒకతన్ని హతం చేసి డబ్బుదోచుకుపోతే...పది మంది వేలిముద్రలు తీసేసరికి వాళ్ళు దోసుకుపోయిందాని కంటే రెట్టింపు ఖర్చు మాకు వస్తుంది. ఇంకా ఎంతో రిస్కు తీసుకోవాలి కూడా!! చెప్తే నమ్మక పోవచ్చు...ఈ ఖర్చును కొద్దిగా తగ్గించదానికి లండన్ లో ఒక ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ వాళ్ళు ఈ ముద్రల్ని భద్రపర్చడానికి, సేకరించడానికి, గుర్తించడానికి ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్ లాంటి "ట్రాన్స్ ఫ్యూటర్" ని కనిపెట్టారు. ఇది మైక్రో చిప్స్ ద్వారా పని చేస్తుంది. దాంట్లో కొన్ని వేలిముద్రల్ని గుర్తించి, పాత వాటితో క్షణాల్లో పోల్చి చూడవచ్చు వేణు కూడా అందులో శిక్షణ పొందాడు" చెప్పాడు అమితేష్.
అయితే సారథ ని ఫాలో అయినా విషయం మాత్రం చెప్పలేదు చేసిన ప్రతిదాన్ని సరిగా చెప్పరు డిటెక్టివ్ లు. పరిశోధనని బట్టి క్షణక్షణానికి వాళ్ళ నిర్ణయాలు మారుతుంటాయి.
ఈ లోగా వేణు వుత్తరం తెచ్చాడు.
"లెటర్ ముత్తగానే నీ సిక్స్త్ సైన్స్ ఏమైనా చెప్తుందా...?" అని వేణు నడిగి "హి ఈజ్ సైకోమెట్రి" అన్నాడు అమితేష్ భార్గవతో.
"నో సార్. లెటర్ నుండి ఎలాంటి మైబ్రేషన్స్ లేవు నాక్కూడా విచిత్రంగా వుంది. నాలుగు వేళ్ళు మాత్రమే ప్రింట్స్ లో కన్పిస్తున్నాయి" అన్నాడు వేణు ప్రింట్స్ చూపిస్తూ.
అమితేష్ ఏదో ఆలోచిస్తూ...."ఒకసారి ఫోన్ కాల్ వచ్చిన చోటికి మరోసారి రాలేదుకదా" అన్నాడు.
అవును రాలేదు." ముక్తసరిగా చెప్పాడు భార్గవ నిట్టూర్చి.
అంతలో కాఫీలు తెచ్చాడు ఫ్యూను.
"డాక్టర్ ముందు రోగాల్ని, లాయర్ల ముందు జరిగిన ఫాక్ట్ ని, డిటెక్టివ్ ల ముందు పూర్వ శత్రువుల్ని ఫ్రాంక్ గా చెప్పాలి భార్గవా. ఓసారి గుర్తుచేసుకో. నీకెవరైనా ఆడ శత్రువులున్నారేమో?...."
