"అబ్బే....మీరేం ఇచ్చినా ఫరవాలేదండీ. మూడుపూట్లా ఫుడ్ పెడ్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి?!" అన్నాడు నాగరాజు.
"సరే....నువ్వు మంచిరోజు చూస్కుని రా! నువ్వు ఇక్కడ పనిచేస్తుండగానే వేరే ఏదైనా ఉద్యోగం చూస్తాను. అప్పుడు అందులో జాయిన్ అవుదువుగాని! అడ్వాన్స్ గా ఇది వుంచు...." అంటూ నాగరాజు చేతిలో వెయ్యి రూపాయలు వుంచాడు కమీషనర్.
నాగరాజు లింగారావ్ కి నమస్కరిస్తూ "ఇంక పాపని గురించి మర్చిపోండి బాబూ! నేనున్నాను కదా! ఇక మంచిరోజంటారా....మనకి ఏరోజు మేలు జరిగితే అదే మనకి మంచిరోజు. కాబట్టి ఇప్పుడే నేను డ్యూటీలో జాయిన్ అయిపోతా...." అన్నాడు.
కమీషనర్ లింగారావ్ నాగరాజు భుజం తట్టి లోపలికి వెళ్ళాడు.
"దీప ఉయ్యాలాట ఆడ్దాం అని అడిగిందంటే సరేనని ఒప్పుకోకు. చాలా డేంజర్!" రాంబాబు నాగరాజు చెవిలో చెప్పాడు.
"ఇంతో అంతో తెలివితేటలున్నవాడిని....దీపని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెల్సు" అన్నాడు నాగరాజు.
రాంబాబు, చిన్నారావ్ లు ఇంటికి బయలుదేరుతుండగా నాగరాజు వాళ్ళు చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పాడు.
18
మర్నాడు రాంబాబు, చిన్నారావ్ లు దీపని స్కూలుకి తీస్కెళడానికి జీపులో నలుగురు గం మెన్ లతో వచ్చారు.
గుమ్మంలోనే వాళ్ళకి నాగరాజు ఎదురయ్యి "గుడ్ మార్నింగ్ బ్రదర్స్ " అన్నాడు.
ప్రతిగా రాంబాబు, చిన్నారావ్ లు అతనికి గుడ్ మార్నింగ్ చెప్పారు.
"ఏంటీ....? దీప ఉయ్యాలాట ఆడ్దామని అడిగిందా?" రాంబాబు అడిగాడు నవ్వుతూ.
"ఆ....అడిగింది.కానీ అది చాలా డేంజరస్ ఆటే!" అన్నాడు నాగరాజు.
"అయితే ఆడావా? మరి నీ మెడ వంకరపోకుండా మామూలుగానే వుందే!" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చిన్నారావ్.
"నేను ఆడ్తానా?! దీప తెచ్చిన తాడుని నా మ్యాజిక్ తో పాములా కన్పించేలా చేశా. దెబ్బకి భయపడిపోయి తాడుని దూరంగా పారేసింది....ఇంకెప్పుడూ నన్ను ఉయ్యాలాట ఆడ్దామని అడగదు" అంటూ నవ్వాడు నాగరాజు.
రాంబాబు, చిన్నారావ్ లు అతనితో శృతి కలిపారు.
దీపని తీస్కుని కమీషనర్ లింగారావ్, శ్రీలక్ష్మి బయటికి వచ్చారు.
రాంబాబు, చిన్నారావ్ లు లింగారావ్ కి సెల్యూట్ చేశారు.
దీపని తీస్కుని రాంబాబు, చిన్నారావ్ లు జీప్ ఎక్కారు.
"మ్యాజిక్ అంకుల్....నువ్వు కూడా రా" అంటూ జీపులోంచి దీప అరిచింది.
"ఇంట్లో వుండి ఏం చేస్తావ్. నువ్వు కూడా వెళ్ళు...."అన్నాడు కమీషనర్ లింగారావ్ నాగరాజుతో.
నాగరాజు కూడా జీపు ఎక్కాడు. జీపు ముందుకి కదిలింది.
జీపు అరకిలోమీటరు వెళ్ళిన తర్వాత దారి ప్రక్కగా ఉన్న పొదలచాటున పొంచి వున్న గజదొంగ మంగులు ఆ వైపుగా వెళుతున్న జీపునీ, దాంట్లో వున్న దీపనీ, రాంబాబు, చిన్నారావ్, నాగరాజుల్ని చూసి కసిగా నవ్వాడు.
"కమీషనర్....! నీ టైమ్ దగ్గరపడింది...." అంటూ పళ్ళు నూరాడు.
* * * *
స్కూల్ కెళ్ళే దార్లో నాగరాజు దీపకి జోకులు చెప్పి నవ్వించాడు. చిన్న చిన్న మేజిక్కులు చేసి దీప ఆశ్చర్యపడేలా చేశాడు.
మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా బాగా ఎంటర్ టైన్ చేశాడు నాగరాజు.
ఆ విధంగా దీపకి చాలా బాగా నచ్చాడు నాగరాజు.
రోజూ నాగారాజుని తన కూడా తీస్కెళ్తుంది దీప. నాగరాజు వచ్చాక రాంబాబు, చిన్నారావ్ ల ఇంపార్టెన్స్ కాస్త తగ్గింది....దీప విషయంలో.
దీప ఎక్కువగా నాగరాజుతోనే మాట్లాడుతోంది. అంతేకదా-చిన్న పిల్లలకి ఎవరు ఎక్కువ కాలక్షేపం ఇస్తారో వాళ్ళనే యిష్టపడతారు.
ఇంట్లో కూడా దీప నాగరాజుతోనే కాలక్షేపం చేస్తుంది. అన్నం కూడా నాగరాజే తినిపించాలి. ఆఖరికి స్నానం కూడా నాగరాజే చేయించాలి.
ఏమాత్రం ఖాళీ వున్నా నాగరాజుని జోక్స్ చెప్పమనీ, మ్యాజిక్ చేయమని, ఆడదామనీ చంపుకుతింటుంది దీప.
ఇదిలా ఉంటే....
రాంబాబూ, చిన్నారావ్ లు పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ అప్పారావుని కాల్చుకు తినసాగారు.
అయిదు రూపాయలిచ్చి చికెన్ బిర్యానీ తెమ్మనడం, పది రూపాయలిచ్చి ఫుల్ బాటిల్ విస్కీ తెమ్మనడం....ఇలాంటివి చెయ్యడమే కాకుండా అప్పారావు యింటి దగ్గర అతని భార్య మదన మనోహరితో అవీ ఇవీ పిండివంటలు వండించుకుని తినడం కూడా చెయ్యసాగారు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తమని ఏడ్పించుకు తిన్నదానికి రెట్టింపు ఏడ్పించుకు తినసాగారు ఆ ఇద్దరూ.
* * * *
ఆ రోజు....
ట్రింగ్....ట్రింగ్."
పోలీస్ స్టేషన్ లో ఫోన్ మోగింది.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఫోన్ లిఫ్ట్ చేసి "హలో! పోలీస్ స్టేషన్!" అన్నాడు.
"మేము పోలీస్ స్టేషన్ నెంబర్ తిప్పాం కాబట్టి అది పోలీస్ స్టేషనే అని మాకు తెల్సు. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు?" అంది అవతలి నుండి సరోజ.
