"అయితే ఇంకేం....అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కమీషనర్ గార్కి చెప్తా" అన్నాడు రాంబాబు.
ఆటో కమీషనర్ లింగారావ్ ఇంటి ముందు ఆగింది. ముగ్గురూ ఆటోలోంచి క్రిందికి దిగి, డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించేశారు.
ఆ వీధంతా పార్టీకి వచ్చిన కార్లతో నిండిపోయింది.
ఎంత కమీషనర్ తమని ఇష్టపడ్తారని తెల్సినా పెద్ద పెద్దవాళ్ళు వచ్చే అలాంటి పార్టీకి మొదటిసారిగా రావడంవల్ల రాంబాబు, చిన్నారావ్ లకి ఇబ్బందిగా, బెరుకుగా అనిపించింది.
ముగ్గురూ లోపలికి అడుగుపెట్టారు. హాలంతా పూలతో, బెలూన్లతో అలంకరించబడి వుంది. హాలు మధ్యలో టేబులు వేశారు. దానిమీద బర్త్ డే కేక్ రెడీగా వుంది. ఆ పార్టీకి వచ్చినవాళ్ళలో సగంమంది పోలీసు అధికారులే కావడంతో రాంబాబు, చిన్నారావ్ లు మాటి మాటికీ సెల్యూట్ లు కొట్టాల్సి వస్తోంది.
రాంబాబు, చిన్నారావ్ లను చూడగానే ఎక్కడో దూరంగా ఫ్రెండ్స్ మధ్యలో వున్న దీప "అంకుల్స్...." అంటూ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది.
రాంబాబు "హాప్పీ బర్త్ డే టూ యూ...." అంటూ దీప బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు.
"ఛీ....అప్పుడే చెప్పకూడదు. కేక్ కట్ చేశాక చెప్పాలి! సరేగానీ, మనం ఇప్పుడు ఉయ్యాలాట ఆడ్దామా అంకుల్?" అడిగింది దీప ఉత్సాహంగా.
రాంబాబు గతుక్కుమన్నాడు.
"ఇప్పుడొద్దు పాపా! మరేమో....ఇప్పుడు నా పీకకి తాడుకట్టి నువ్వు ఊగావనుకో, అప్పుడు తాడు బిగుసుకుని నేను చచ్చాననుకో....బర్త్ డే పార్టీ కాన్సిల్ అయిపోతుందికదా మరి?!" వెర్రినవ్వు నవ్వుతూ అన్నాడు రాంబాబు.
కాదు. ఉయ్యాలాట ఆడాల్సిందేనని దీప మారాం చేస్తుండగా అక్కడికి కమీషనర్ లింగారావ్, అతని భార్య శ్రీలక్ష్మి వచ్చారు.
రాంబాబు, చిన్నారావ్ లు అతనికి సెల్యూట్ చేశారు.
"ఏంటోయ్ మీరిక్కడే నిలబడిపోయారు? రండి రండి" అంటూ కమీషనర్ లింగారావ్ రాంబాబు, చిన్నారావ్ లను హాలు మధ్యకి తీస్కేళ్ళాడు. వాళ్ళ వెనకాలే నాగరాజు కూడా వెళ్ళాడు.
రాంబాబు కమీషనర్ లింగారావ్ కి నాగారాజుని తన క్లోజ్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. బర్త్ డే కేక్ కట్ చేసిన తర్వాత తను మ్యాజిక్ షో ఇస్తానని నాగరాజు కమీషనర్ లింగారావ్ కి చెప్పాడు. కమీషనర్ సంతోషంగా సరేనన్నాడు.
పార్టీకి ఇన్స్ పెక్టర్ అప్పారావు కూడా వచ్చాడు. అతను చేసే కుక్కచేష్టలన్నీ పార్టీకి వచ్చిన వాళ్ళని చచ్చేట్టుగా నవ్వించాయ్. ఇంక తట్టుకోలేక ఇన్స్ పెక్టర్ అప్పారావు ఇంటి వెనక్కి వెళ్ళి జామచెట్టుక్రింద కూర్చుని భోరున ఏడ్చాడు.
దీప ఏడు గంటలకి కేక్ కట్ చేసింది. పార్టీకి వచ్చిన అందరి పిల్లలూ "హాప్పీ బర్త్ డే టూ యూ...." అంటూ కోరస్ గా పాడారు.
తర్వాత నాగరాజు పిల్లలకోసం మ్యాజిక్ షో స్టార్ట్ చేశాడు. ఖాళీ ప్లాస్టిక్ సంచిలోంచి చాక్లెట్లు తీసి అందరు పిల్లలకీ పంచాడు. గుడ్డపీలికల్ని రంగు రంగు రిబ్బన్లుగా మార్చి దీపకి యిచ్చాడు. గాల్లోంచి ఐస్ క్రీమ్స్ సృష్టించి దీపకి తినిపించాడు. ఇంకా చిన్న చిన్న మ్యాజిక్కులు చాలా చేసి అందరు పిల్లల మనసుల్నీ దోచుకున్నాడు. ముఖ్యంగా దీప మనసుని, కమీషనర్ లింగారావ్ నాగరాజుని అభినందించాడు. తర్వాత రాంబాబు, చిన్నారావ్ లతో ఇలా అన్నాడు.
"ఈ వేళ నా మనసెంతో ఆనందంతో వుంది. ఈ సందర్భంలో మీకో గుడ్ న్యూస్. దీపాని మంగులు నుండి కాపాడినందుకు మీ యిద్దరికీ డబుల్ ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేస్తున్నాను."
రాంబాబు, చిన్నారావ్ లు అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
డిన్నర్ అయిన తర్వాత ఒక్కొక్కరే కమీషనర్ లింగారావ్ దగ్గర శలవు తీస్కుని వెళ్ళసాగారు. చివరికి రాంబాబు, చిన్నారావ్, నాగరాజు మిగిలారు.
అప్పుడు కమీషనర్ లింగారావ్ ఖాళీగా ఉన్నాడని, రాంబాబు నాగరాజు దీనగాధ గురించి ఆయనకి క్లుప్తంగా చెప్పి "మీరే నా ఫ్రెండ్ కి దారిచూపించాలి సార్!" అన్నాడు.
నగరాజుని కమీషనర్ లింగారావ్ కి రికమెండ్ చెయ్యడంవల్ల తన జీవితం ఓ పేద్ద మలుపు తిరగబోతూందని ఆ క్షణంలో రాంబాబుకి తెలీదు.
* * * *
కమీషనర్ లింగారావ్ ఆలోచనగా మొహం పెట్టాడు.
"ఏం చదువుకున్నావ్....?" అడిగాడు నాగారాజుని రెండు క్షణాల తర్వాత.
"టెన్త్...." చెప్పాడు నాగరాజు.
"టెన్త్ కి ఏం ఉద్యోగం చూడగలం? కనీసం డిగ్రీ వుంటే బాగుండేది" అన్నాడు లింగారావ్.
అదే సమయంలో దీప అక్కడికి పరుగున వచ్చింది.
"మామయ్యా....నువ్వెళ్ళకు మామయ్యా! నువ్వు మా ఇంట్లోనే వుండు మామయ్యా!" అంటూ నాగరాజు చెయ్యి పట్టుకుంది.
నాగరాజు మేజిక్ షోని చూసిన దీపకి నాగరాజు బాగా నచ్చాడు.
కమీషనర్ లింగారావ్ నాగరాజుని పైనుండి క్రిందిదాకా గమనించి చూశాడు.
మనిషి బుద్దిమంతుడిలాగానే వున్నాడు. కమీషనర్ లింగారావ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను రాంబాబుతో ఇలా అన్నాడు.
"నువ్వు, చిన్నారావ్ పాప సెక్యూరిటీ గురించి కేర్ తీస్కుంటారు. నాగరాజు మా ఇంట్లోనే వుండి పాపని ఎంటర్ టైన్ చేస్తూ, పాప ఆలనా పాలనా చూస్కుంటాడు. భోజనం, కాఫీ, టిఫిన్లు అన్నీ ఇక్కడే. మరి జీతం ఏమాత్రం కావాలో!" అంటూ నాగరాజు వైపు చూశాడు.
"అయ్యో....మిమ్మల్ని అడిగేంతటి వాడినా? మీకు ఏం తోస్తే అది యివ్వండి!!" అన్నాడు నాగరాజు.
"ఫర్వాలేదు. మొహమాటపడకుండా చెప్పు!" అన్నాడు కమీషనర్ లింగారావ్.
