Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 46

    "నన్నే ఎవరని అడుగుతున్నావా....? నేను ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని" గర్జిస్తూ అన్నాడు అప్పారావ్.

    "అంటే కుక్కకిడ్నీల అప్పారావేనా?" అడిగింది సరోజ.

    ఆ మాట వినగానే అంతకుముందులా పులిలా గర్జించిన ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వెంటనే పిల్లిలా అయిపోయాడు.

    "ఆ విషయం మీకెలా తెల్సు మేడం? ఇంతకీ మీరెవరు మేడం?"

    మెల్లగా గుసగుసలాడుతూ, బాధగా, భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    నేనెవరయితే  ఏంగానీ....రాంబాబుని ఓసారిలా పిలువ్" అంది సరోజ.

    "ఇదిగో రాంబాబూ! ఓసారిలా వస్తావా?" గట్టిగా పిలిచాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    వసారాలో కూర్చుని చిన్నారావ్ తో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న రాంబాబు చిరాగ్గా వెనక్కి తిరిగి అరిచాడు.

    "ఏంటి రమ్మని చెవి తెగిన మేకలా అలా అరుస్తున్నావ్? ఏం....రెండు రూపాయలిచ్చి రమ్ముబాటిల్ తెమ్మంటావా?"

    నిన్ను రమ్మన్నది నా గురించి కాదయ్యాబాబూ....! నీ కోసం ఎవరో అమ్మాయ్ ఫోన్ చేసింది" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    అంతే....రాంబాబు ఒక్క గెంతు గెంతి లోపలికి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.

    అతని వెనకాలే చిన్నారావ్ కూడా లోపలోకి వచ్చాడు.

    "హలో....!" అన్నాడు రాంబాబు.

    "నన్ను సరోజ అంటారు. గుర్తున్నానా?" అడిగింది అవతలి నుండి సరోజ.

    "అదేంటి సరూ? మనం ఎన్నిరోజుల నుంచి కలవనట్టు మాట్లాడ్తావ్? రెండు రోజులక్రితమేగా కలిశాం" అన్నాడు రాంబాబు.

    "అంటే నీకు కలవాలని లేదా?" అడిగింది సరోజ సీరియస్ గా.

    "అయ్యో....! అలాగంటావేంటి....? నిన్నా,మొన్నా కమీషనర్ లింగారావ్ గారింట్లో లేటయ్యింది....నిన్ను కలవాలని నాకెందుకు  వుండదు."

    "అయితే రేపు పార్కుకి రా....నీతో అర్జంట్ విషయం మాట్లాడాలి. నీతోబాటు నీ ఫ్రెండ్ చిన్నారావ్ ని కూడా తీస్కురా!"

    "మనమధ్య వాడెందుకూ?" చిరాకుపడ్డాడు రాంబాబు.

    "మనమధ్య కాదు....అతని కోసం సునీత కూడా పార్కుకి వస్తుంది" అంది సరోజ.



                               *    *    *    *


    మర్నాడు....

    పార్కులో....

    రాంబాబూ, సరోజ, చిన్నారావ్, సునీతా నలుగురూ ఒక దగ్గరే కూర్చున్నారు. రాంబాబు, చిన్నారావ్ చేతుల్తో మిక్సర్ పొట్లాలు. ఇద్దరూ పరపరా నమలసాగారు.

    "ఇంక మీరు ఆ మిక్సర్ తినడం ఆపితే మేం మాట్లాడాలనుకున్నది చెప్తాం" అంది సరోజ విసుక్కుంటూ.

    రాంబాబు నాలుక కర్చుకున్నాడు.

    "ఓ....సారీ....మీరిద్దరూ మౌనంగా కూర్చుని వుంటే టైం పాస్ కి మిక్సర్ కొనుక్కుని తింటున్నాం" అన్నాడు రాంబాబు.

    "అవును....రాంబాబు చెప్పింది కరుక్ట్!...." అన్నాడు చిన్నారావ్ కాస్త మిక్సర్ నోట్లో వేస్కుంటూ.

    సునీత చిన్నారావ్ చేతిలోని మిక్సర్ పొట్లం లాగి దూరంగా పారేసింది.

    సరోజ రాంబాబు వంక చూసింది.

    "వద్దులే....నేనే పారేస్తాను!" అని అంటూ పొట్లాన్ని ప్రక్కకి విసిరేశాడు.

    "ఇప్పుడు చెప్పు!" అన్నాడు రాంబాబు.

    "మనం ఇలా పార్కులకనీ, సినిమాలకనీ, హోటళ్ళకనీ తిరిగితే ఏమైనా బాగుంటుందా?" అడిగింది సరోజ.

    "నాకైతే చాలా బాగుంది. ఏం నీకు బాగోలేదా....?" అన్నాడు రాంబాబు.

    "నాక్కూడా చాలా బాగుంది" అన్నాడు చిన్నారావ్.

    "మా ఇద్దరికైతే ఏం బాగోలేదు!" అంది సునీత.

    "ఏం? మీ ఇద్దరికీ మా కంపెనీ నచ్చడంలేదా....?" అడిగాడు చిన్నారావ్.

    "మా ఇద్దరికీ మీ ఇద్దరి కంపెనీ చాలా యిష్టం....అందుకే అప్పుడప్పుడూ ఇలా పార్కులో, సినిమాల్లో కలుసుకోవడం కాకుండా, మీ కంపెనీని పర్మినెంట్ గా కోరుకుంటున్నాం" అంది సునీత.

    "అంటే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం!" అంది సరోజ.

    "యాహూ....!" అంటూ సంతోషంగా గట్టిగా అరిచారు రాంబాబు, చిన్నారావ్ లు.

    ఆ అరుపుకి సునీత, సరోజ పచ్చికమీద వెల్లికితలా పడిపోయారు.



                               *    *    *    *


    కమీషనర్ లింగారావ్ ఇల్లు....!

    రాత్రి ఎనిమిది గంటలైంది. వరండాలో దీప నాగరాజుతో ఆడుకుంటూ వుంది.

    లోపలినుండి శ్రీలక్ష్మి బయటికి వచ్చింది.

    "దీపా! ఆడింది చాలుగానీ....లోపలికి రా. అన్నం తిందువుగాని!" అంది.

    "ఊఁ! నేను అప్పుడే తినను. డాడీ వచ్చాక తింటాను...." అంది దీప.

    "డాడీ అప్పుడే రారు. ఇప్పుడే ఫోన్ చేశారు ఏదో మీటింగ్ వుందని!"

    "అయ్యగారు వచ్చేసరికి బాగా లేటవుతుందమ్మా....?" అడిగాడు నాగరాజు.

    "అవును! మీటింగ్ అయ్యేసరికి రాత్రి పది గంటలవుతుందని చెప్పారు. దీపా! నువ్వు  భోజనం చెయ్యి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS