Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 45

                                                          ఓ మారిస్తారా?
    "నమస్కారండీ..."
    వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న రామారావు తలెత్తి చూశాడు. ఎదురుగా ఒక వ్యక్తి వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు.అతనికి నలభై ఏళ్ల వయసు ఉండొచ్చు.
    "నమస్కారం! మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదండీ" బుర్ర గోక్కుంటూ అన్నాడు రామారావు.
    "నన్ను మీరు చూళ్ళేదు... కానీ నేను మిమ్మల్ని రోజూ చూస్తూనే ఉన్నా... మీరు మాయింటి ముందునుండే మోటార్ సైకిల్ మీద రయ్యిన పోతూ ఉంటే... నా సామిరంగా అచ్చు సినిమా హీరోలా అన్పిస్తారు..."
అన్నాడతను.
    రామారావు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
    అతను రామారావు వంక ఆశ్చర్యంగా చూశాడు.
    "అదేంటి సార్...ఇందాక మీరు సన్నగా ఉండేవారు... హఠాత్తుగా ఇలా లావెలాఅయ్యారు?... మీకు మాయమంత్రాలు గానీ వచ్చాసార్?..."
    "అదేంకాదు... మీరు నన్ను పొగుడ్తున్నరుగా...అందుకే నేను ఉబ్బిపోతున్నానన్నమాట!!..." సిగ్గుపద్తూ అన్నాడు రామారావు.
    "మీరు భలేవారు సార్... సలసలా కాగే నూనెలో వేసిన పూరీలా బుస్సున ఇట్టే పొంగిపోతారు... మీలాంటి మనిషిని నేనస్సలు ఎక్కడా చూళ్ళేదండీ..."
    అంతే...రామారావు చొక్కా బొత్తాలు ఫట్... ఫట్ మని తెగిపోయాయ్.
    "అబ్బ.... ఇంక చాల్లేవయ్యా బాబూ... ఆ పొగడ్తలు ఆపకపోతే నా వంట్లాంపని కూడా అయిపోతుంది..." అన్నాడు రామారావు ప్యాంటుకి రెండుచేతులూ అడ్డుపెట్టుకుంటూ.
    "ఊహో... నేనాపను... మేరింద్రుడు సార్... మీరు చంద్రుడు సార్... మీరెంతో మంచివారట సార్..."అన్నాడతను.
    అంతే..
    రామారావు మొహం ఇబ్బందిగా మారిపోయింది. అతని మొహం ఎర్రగా కందిపోయింది.
    గబుక్కున కుర్చీలోంచి లేచి న్యూస్ పేపరు నడుంచుట్టు చుట్టుకుని ఇంట్లోకి పరుగు తీశాడు.
    ఒక రెండు నిముషాల తర్వాత వేరే ఫ్యాంటుతో బయటికి వచ్చాడు.
    "ఇంక నన్ను పొగడకండి బాబూ... అసలు ఏమిటో ఎందుకొచ్చారో చెప్పండి ముందు..."అన్నాడు.
    "నా పేరేమో బ్రహ్మానందం అండీ... నేనేమో మీ యింటికి నాలుగిళ్ళ అవతల ఉంటానండీ... మరేమో మీరు ఈ యింట్లో కొత్తగా దిగారు కదా... మిమ్మల్ని పరిచయం చేస్కుందామని వచ్చానండీ..." అన్నాడు బ్రహ్మానందం చేతులు నలుపుకుంటూ.
    "అవునవును... ఇరుగూ పొరుగూ అన్నాక ప్రేమాభిమానాల్తో ఉండాలి కదా! మీరు కూర్చోండి..." అన్నాడు రామారావు అతనితో తనూ కూర్చుంటూ.
    బ్రహ్మానందం రామారావుకి ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు.
    "కమలా... కమలా..." అంటూ రామారావు లోపలికి చూస్తూ భార్యని పిలిచాడు.
    అతని పిలుపు విని తాని భార్య కమల బయటికి వచ్చింది. రామారావు బ్రహ్మానందానికి తన భార్యని పరిచయం చేశాడు.
    "ఎప్పుడైనా మీ ఆవిడని కూడా మాయింటికి తీస్కుని రండి... ఒక కాలనీలో ఉన్నతర్వత కాస్త ప్రేమాభిమానాల్తో ఉండాలి కదా మరి?" అంది కమల బ్రహ్మానందంతో చిరునవ్వు నవ్వుతూ.
    "నువ్వెళ్లి మా యిద్దరికీ టీ తీస్కురా..." భార్యతో అన్నాడు రామారావు. కమల వంటగదిలోకి వెళ్లిపోయింది.
    "ఆహా...ఏం అతిధి మర్యాదండీ... మీ అంత మంచివారూ... మీ అంత మర్యాదస్తులూ ఈ ఊళ్లోనే లేరండీ..."అంటూ రామారావుని పొగడడం మొదలుబెట్టాడు బ్రహ్మానందం.
    "ఏదో... అభిమానంకొద్దీ మీరలా అంటున్నారు..." మొహమాటంగా నవ్వుతూ అన్నాడు రామారావు.
    "అవును గానీ మీరు చారల చారల బట్ట కొని డ్రాయర్లు కుట్టిస్తారా?... రెడీమేడ్ వి కొనరా?'
    "నేను చారలచారల డ్రాయర్లు కుట్టించి తొడుగుతానని మీకెలా తెల్సింది?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రామారావు.
    "ఎలా తెలియడం ఏంటి? కనిపిస్తుంటేనూ?" కులాసాగా నవ్వుతూ అన్నాడు బ్రహ్మానందం.
    రామారావు కంగారుగా ముందుకు వంగి పంట్లాంవంక చూస్కుని కెవ్వుమని అరిచి లోపలికి పరిగెత్తి నెత్తిపై ఫట్ ఫట్ మని కొట్టుకుని "పాడు పొగడ్తలతో చంపేస్తున్నాడు ఎక్కడో..." అని విసుక్కుంటూ ఇంకో పంట్లాం మార్చుకుని బయటికి వచ్చాడు.   
    "మీరిహ నన్ను పొగడకుండా ఉంటే చాలా సంతోషిస్తాను..." అన్నాడు రామారావు బ్రహ్మానందంతో.
    అంతలో కమల రెండు కప్పుల్తో టీ తీస్కుని వచ్చింది.
    టీ తాగిన బ్రహ్మానందం మొహం వికసించింది.
    "ఆహా... ఎంత రుచిగా ఉండమ్మా ఈ టీ... అమృతం తాగుతున్నట్టుంది... ఆ చేతిలోనే ఉంది..."అంటూ పొగడ్డం మొదలు బెట్టాడు.
    కమల బ్లవుజ్ హుక్ ఒకటి ఫట్ మంది.
    రామారావు కంగారుగా లేచి నిలబడి కమలని రెండు భుజాలూ పట్టి లోపలికంటా తోస్కునిపోయి మళ్లీ బయటికి వచ్చి "మా ఇంట్లో అందరికీ పొగడ్తలంటే ఉబ్బిపోయే స్వభావం ఉంది. మీరిక పొగడకండి"అన్నాడు బ్రహ్మానందంతో పళ్ళు కొరుకుతూ.
    "అలాగే... అలాగే..." అన్నాడు బ్రహ్మానందం వస్తున్న నవ్వాపుకుంటూ.
    కాస్సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తర్వాత "ఇప్పుడేమో అసలు విషయం చెప్తానేం?.." అన్నాడు బ్రహ్మానందం కొంటెగా రామారావు వంక చూస్తూ.
    "ఏంటిది?" అడిగాడు రామారావు.
    "నాకు కాస్త హిమాయత్ నగర్ వెళ్లేపని ఉంది... మీ మోటార్ సైకిల్ ఓసారిస్తారా?... పంజూసుకుని వచ్చేశాక ఇచ్చేస్తా..." అన్నాడు బ్రహ్మానందం చేతులు నలుపుకుంటూ.
    "ఓ... దాందేముంది... ఓ కాలనీలో ఉండేవాళ్లం. ఒకరికొకరం సాయం చేస్కోపోతే ఎలా?... కానీ నన్నుమాత్రం పొగడకండేం?" అన్నాడు రామారావు ఫ్యాంటుకి చేతులు అడ్డుపెట్టుకుంటూ..
    "సర్లే... సర్లే... అలాగే..."అని రామారావు మోటార్ సైకిలు తీస్కుని రివ్వుమంటూ వెళ్లిపోయాడు బ్రహ్మానందం. మళ్లీ దానిని రాత్రి పదిగంటల సమయంలో తెచ్చి ఇచ్చాడు.
    ఉదయం రామారావు మోటార్ సైకిలుమీద ఆఫీసుకెళ్తుంటే పెట్రోలు అయిపోయి మధ్యదార్లో ఆగిపోయింది. అంతకు ముందు రోజే అయిదు లీటర్ల పెట్రోలు కొట్టించాడు అతడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS