Previous Page
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 46

    చేసేదిలేక నెత్తికొట్టుకుని పెట్రోలుబంకు దాకా రెండు ఫర్లాంగులు మోటార్ సైకిల్ని ఈడ్చుకుని వెళ్లి అక్కడ పెట్రోలు కొట్టించుకుని ఆఫీసుకెళ్లాడు రామారావు.
    సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి కమల రెండు మూడు బ్లవుజుల్ని ముందేస్కుని వాటికి హుక్స్ కుట్టుకుంటుంది.
    "ఏంటిది?" అనుమానంగా అడిగాడు రామారావు.
    "ఓ అరగంట క్రితం మీకోసం బ్రహ్మానందం వచ్చాడండి.. ఇప్పుడే వస్తారు కూర్చోండి అన్జెప్పి ఆయనకి తింటానికని ఉల్లిపాయ్ పకోడీ పెట్టాను. అవి తిని ఆయన నన్ను తెగ మెచ్చుకున్నాడనుకోండి..." అంది కమల సంతోషంగా కళ్ళు తిప్పుతూ.
    "నీ సంతోషం సంతకెళ్ళ... వాడుగానీ సీన్లేమైనా చూశాడా?" కంగారుగా అడిగాడు హుక్స్ తెగిన జాకెట్ల వంక చూస్తూ.
    "లేదులెండి... పైట నిండుగా కప్పుకున్నాగా..." సిగ్గుపడ్తూ అంది కమల.
    "నీ సిగ్గులు బొగ్గులు కానూ... ఈసార్నుండి తను నేను లేనప్పిడొస్తే కూర్చోబెట్టి పొగిడించుకోకుండా  ఆయన తర్వాతొస్తారని చెప్పి పంపించేయ్..." పళ్ళు కొరుకుతూ అన్నాడు రామారావ్.
    అంతలోనే బయటనుండి "రామారావ్... రామారావ్"అంటూ బ్రహ్మనందం పిలిచాడు. ఆ పిలుపు విని రామారావ్ బయటికి వెళ్లాడు.
    "ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే యింటికి వెళ్లాను... మీ మోటార్ సైకిలోసారి అర్జంటుగా ఇస్తారా... మా ఆవిడకి ఒంట్లో బాగోలేదు... మండులుద్ కొనుక్కు రావాలి!" అన్నాడు బ్రహ్మానందం.
    రామారావు మనసులో తిట్టుకుంటూనే సరే అన్నాడు. బ్రహ్మానందం మోటార్ సైకిల్ తీస్కుని వెళ్లిపోయాడు.
    అలా రోజూ ఏదో ఒక పనుందని చెప్పి మోటార్ సైకిల్ తీస్కేళ్లసాగాడు బ్రహ్మానందం.
    ఒకరోజు కూరగాయల షాపు ఈ పక్కనేగా ఉంది... మోటార్ సైకిలెందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు రామారావు.
    "నిజమే గానీ... ఎక్కడికెళ్లినా మోటార్ సైకిల్ మీదనే వెళ్లడం అలవాటై ఈ నాలుగడుగులు కూడా వెయ్యాలంటే కష్టంగా ఉంది"అని చెప్పి మోటార్ సైకిల్ తీస్కెళ్లిపోయాడు బ్రహ్మానందం.
    ఇంకోరోజు "మా ఆవిడ నేనూ సినిమాకి వెళ్లాలని అనుకుంటున్నాం... ఓసారి మోటార్ సైకిలిస్తారా?" అని అడిగాడు బ్రహ్మానందం.
    "హయ్యో... మేం కూడా సినిమాకెళ్లాలని అనుకుంటున్నామే..." అన్నాడు రామారావు.
    "ఏం సినిమా?" అడిగాడు బ్రహ్మానందం.
    "దున్నపోతు రాముడు" చెప్పాడు రామారావు.
    బ్రహ్మానందం పొట్టపట్టుకుని గొల్లున నవ్వి " ఆ చెత్త సినిమా చూసేకంటే యింట్లోనే ఉండడం మేలు... మీరు అనవసరంగా టైమూ, డబ్బులూ వేస్టు చేస్కోకుండా యింట్లోనే ఉండండి" అని మోటార్ సైకిలేస్కుని వెళ్లిపోయాడు బ్రహ్మానందం.
    ఒకరోజైతే మరీ ఘోరం జరిగిపోయింది.

    "మీరు రోజూ మా ఆఫీసు మీదుగా మీ ఆఫీసుకెళ్లకూడదు!... దానివల్ల మీకు రెండు మూడు కిలోమీటర్ల దుఅరం ఎక్కువవుతుందేమో... అంటే ఓ అయిదు నిముషాలెక్కువ డ్రైవ్ చేస్తారేమో... కానీ నాకు చాలా శ్రమ తప్పుకుంది కదా?... హిహి..." మస్కాకొడ్తూ అడిగాడు బ్రహ్మానందం.
    మొహమాటస్తుడైన రామారావు అతని మాటని కాదనలేకపోయాడు. రామారావు రోజూ బ్రహ్మానందంని ఆఫీసు దగ్గర దించడం, మళ్లీ తను యింటికి వెళ్లేటప్పుడు అతన్ని ఆఫీసునుండి పికప్ చేస్కుని యింటిదగ్గర దింపడం చేస్తున్నాడు. ఇది కాక ఎప్పుడు బడ్తే అప్పుడు మోటార్ సైకిల్ తీస్కుని వెళ్లిపోతాడు.
    ఒకరోజు ఒక గమ్మతైంది. ఇంటి బయట పార్క్ చేసి ఉంచిన మోటార్ సైకిల్ ని ఎవరో దొంగలు ఎత్తుకుని పోయారు.
    "అదేంటి?... మోటార్ సైకిల్ ని దొంగలెత్తుకుపోతే అలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారేం?... పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి" అన్నాడు రామారావుతో బ్రహ్మానందం.
    "ఆ పోతే పోనిద్దూ... పీడ విరగడైపోయింది..." అన్నాడు రామారావు బ్రహ్మానందం వంక కసిగా చూసి కసిగా  నవ్వుతూ.
    బ్రహ్మానందం తెల్లమొహం వేశాడు.                                           

                                    --సమాప్తం--

                                                *     *     *


 Previous Page

WRITERS
PUBLICATIONS