భార్య సలహా మేరకు సాంబమూర్తి డాక్టర్ అత్యాశానాథ్ నర్సింగ్ హూంకి వెళ్ళాడు. నర్సింగ్ హోం మెట్ల మీద ఎవరో ఒకావిడ పడుకుని ఉంది. ఆవిడని జాగ్రత్తగా దాటుకుని లోపలికి వెళ్ళాడు సాంబమూర్తి. కారిడార్లో నడుస్తుండగా కాళ్ళకి అక్కడ పడుకున్న మనిషి కాళ్ళు తట్టుకుని దభేల్మని పడ్డాడు సాంబమూర్తి.
తన్నినందుకు అతనికి సారీ చెప్పి సాంబమూర్తి డాక్టర్ అత్యాశానాథ్ గదిలోకి వెళ్ళాడు.
"ఏంటి మీ ప్రాబ్లెం?..." అడిగాడు డాక్టర్ సాంబమూర్తిని.
"ఉదయం నిద్రనుండి లేచేసరికి నాకళ్ళు అంటుకుపోతున్నయండీ..." చెప్పాడు సాంబమూర్తి.
"కళ్ళంటుకుపోతున్నాయా?...ఏదీ ఇలాగేనా?" అంటూ పక్కనున్న నర్సుని గాఠిగా కౌగిలించుకుని "ఇలాగె కదూ... హిహి.. ఇట్టానే అతుక్కుపోతున్నాయ్ కదూ? హి?..."అన్నాడు నర్సుని గుండెలకేసి హత్తుకుంటూ.
"అట్టానేగానీ నా కళ్ళు అతుక్కుంటే అంత హాయిగా ఉండదు డాక్టర్..." దీనంగా చెప్పాడు సాంబమూర్తి.
అది విని డాక్టర్ అత్యాశానాథ్ నర్సుని వదిలిపెట్టి ఘొల్లుమని నవ్వాడు.
తర్వాత సాంబమూర్తి కళ్ళని పరీక్షించి "ఊ... ఊ... కళ్ళు బాగా ఎర్రగా కూడా ఉన్నాయే!!..."అన్నాడు.
"సార్... సార్... నాకు అట్టాంటి ఎరుపులో ఓ చీర కొనిపెట్టరా?" గారాలుపోతూ డాక్టర్ ని అడిగింది నర్సు.
"అలాగే... అలాగే..." అన్నాడు డాక్టర్ నర్సు పిర్రమీద కులాసాగా ఒక్కటిస్తూ.
ఆ తర్వాత సాంబమూర్తి కళ్ళు పరీక్షిస్తూ కళ్ళలోకి "ఉఫ్..."మని గాలి ఊదాడు.
సాంబమూర్తి చటుక్కున కళ్ళు మూశాడు.
"ఊ... వెరీ సీరియస్..."అన్నాడు డాక్టర్ సాలోచనగా.
"కళ్ళలోకి ఊదితే ఎవరైనా అలానే కళ్ళు మూస్తారమ్మా... ఆ..."అన్నాడు సాంబమూర్తి బుంగమూతి పెడ్తూ.
"డాక్టర్ని నేనా నువ్వా?...చెప్పింది విను లేకపోతే కళ్ళుపోతాయ్..."అన్నాడు డాక్టర్ అత్యాశానాథ్.
ఇంతలో ఓ నర్స్ పరుగెత్తుకుని గదిలోకి వచ్చింది.
"డాక్టర్.. డాక్టర్... ఆ మెట్లమీద ఆవిడ పండంటి మగబిడ్డని ప్రసవించింది డాక్టర్" సంబరంగా చెప్పింది ఆ నర్స్.
"హమ్మో... హమ్మో... ఆవిడ అప్పుడే ప్రసవించేసిందా?" గుండెలు బాదుకున్నాడు డాక్టర్. "అయినా ఏంటా సంతోషం ఆ బిడ్డనేదో నువ్వే కన్నట్టు!!... సిజేరియన్ ఆపరేషన్ చెయ్యకుండా ఆవిడ బిడ్డనెలా కందసలు!!" రంకెలు వేశాడు డాక్టర్.
ఆ నర్స్ తలవంచుకుంది.
"ఇంకోసారి సిజేరియన్ ఆపరేషన్ చెయ్యకుండా ఎవరైనా కంటే మీ అందర్నీ ఉద్యోగాల్లోంచి తీసేసి కొత్త స్టాఫ్ ని వేస్కుంటానంతే... నువ్వింక వెళ్ళు" కసిరికొట్టాడు డాక్టర్ అత్యాశానాథ్ .
నర్స్ తలవంచుకుని వెళ్ళిపోయింది. వస్తున్నప్పుడు మెట్లమీద పడుకుంది! ఆవిడ మీ పేషంటా?... నేనింకా ఎవరో అనాధ అనుకున్నా..." ఆశ్చర్యంగా అన్నాడు సాంబమూర్తి.
"ఇంకా నయం బిచ్చగత్తె అనుకుని డబ్బులేశావ్ కాదు...చెమ్దాలెక్కదీసి ఉండేది... అబ్బే అనాధేంటి... ఆమెకి వందెకరాల మాగాణి ఉంది..."
"మరి అలా మెట్లమీద పడుకుందేం?..."
"నర్సింగ్ హోంలో రూములు ఖాళీలేవు. ఏం చెయ్యను మరి?... అందుకే ఆవిడకి మెట్లమీద స్థలం ఇచ్చాను... అందుకే రోజుకి ఇరవై రూపాయలు మాత్రమే అద్దె వసూలు చేస్తున్నా ఆమె దగ్గర..."
"అలాగైతే కారిడాల్లో పడుకుని ఉన్నాడూ? అతనూ మీ పేషంటేనా?" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు సాంబమూర్తి.
"ఆ... మా పేషంటే...బెడ్ లు ఖాళీ లేవుగా... అందుకని కారిడార్లో పడేశాం. అతని దగ్గర రోజుకి ముప్ఫై తీస్కుంటున్నాం... బాగా పేరున్న నర్సింగ్ హోంగా మాదీ... అందుకనే ఎక్కడ పడేసినా ఉంటారు. ఎంతడిగినా ఇస్తారు..."నవ్వుతూ అన్నాడు డాక్టర్ అత్యాశానాథ్.
ఆ తర్వాత మరికాస్సేపు సాంబమూర్తి కళ్ళుపరీక్ష చేసి "మీ కళ్ళకి ఆపరేషన్ చేయించాలి!... లేకపోతే కళ్ళు పోతాయ్" అని తేల్చి చెప్పాడు.
,మొదట్లో మందుల్తో తగ్గించమని అడిగినా డాక్టర్ కుదర్దు, కళ్ళుపోతాయ్ అని పదే పదే అనడంతో సాంబమూర్తి ఆపరేషన్ కి ఒప్పుకోక తప్పలేదు.
"ఆపరేషన్ చెయ్యడానికి నగరంలోని పేరున్న కళ్ళ స్పెషలిస్టుని తెప్పిస్తా. అతని ఫీజు మూడువేల నుండి అయిదువేల మధ్యలో ఉంటుంది. మా ఆపరేషన్ థియేటర్ అద్దె నాలుగొందలు. రూముకి రోజుకి వంద రూపాయల అద్దె, మందు మాకుల ఖర్చు ఇవ్వాలి, విజిట్స్ కి వచ్చినందుకు కళ్ళడాక్టర్ కి రోజుకి యాభై రూపాయలు ఇవ్వాలి. నేను కూడా విజిట్స్ కి వస్తాను. నాకు ముప్ఫై ఇస్తే చాలు.ఇవికాక నర్సులకీ ఆయాలకీ మామూళ్ళు ఉంటాయని నీకు వేరేగా చెప్పనవసరం లేదనుకుంటాను... ఆ... మర్చిపోయాను. కళ్ళ ఆపరేషన్ కి ముందు ఆపరేషన్ చేసేప్పుడు పొరబాట్న కళ్ళు పోతే డాక్టర్ బాధ్యత ఏమీ లేదని అన్నింటికీ నువ్వే బాధ్యత వహిస్తున్నావనీ కాగితాల మీద సంతకాలు పెట్టి ఇవ్వాలి!" అన్నాడు డాక్టర్ అత్యాశానాథ్.
అన్నింటికీ ఒప్పుకుని ఆపరేషన్ తేదీ పై వారానికి నిర్ణయించుకుని యింటికి సీర్సంగా చేరాడు సాంబమూర్తి.
ఇంటి దగ్గర అతని కోసం అతని చిన్ననాటి స్నేహితుడు రామ్మూర్తి ఎదురు చూస్తున్నాడు. రామ్మూర్తి డాక్టర్. తను కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్నాడు.
"ఊళ్ళో బంధువులు పెళ్ళి ఉంటే వచ్చాను... అవునుగానీ నువ్వేంటి అలా డల్ గా ఉన్నావ్?" సాంబమూర్తిని అడిగాడు డాక్టర్ రామ్మూర్తి.
సాంబమూర్తి జరిగిందంతా చెప్పాడు.
రామ్మూర్తి సాంబమూర్తి కళ్ళు పరీక్షించి "వాడి బొంద.. నీకళ్ళకేమీ అపరేషనక్కర్లా...నేనో ఆయింట్ మెంట్ రాసిస్తా... అది కళ్ళలో రాత్రి నిద్రపోయే ముందు ఓ నాలుగు రోజులపాటు పెట్టుకో...తగ్గిపోతుంది" అంటూ చెప్పి ప్రిస్ర్కిప్షన్ రాసిచ్చాడు.
ఆ ఆయింట్ మెంట్ నాలుగు రోజులు వాడిన తర్వాత సాంబమూర్తి కళ్ళు మామూలుగా అయిపోయాయ్.
* * *
