Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 44

    "అయితే మా సార్ కి కాస్త ఎక్కువ లడ్డూలు అమ్మవే... హి...హిహి..." అన్నాడు సెంట్రీ.
    "సెంట్రీ నువ్వు కాస్త నోరుముయ్" గద్దించాడు జైలరు.
    "అలాగే సార్... హి... హిహి..."
    జైలరు క్రింద ఉన్న గంపలోకి ఓసారి తొంగి చూశాడు.
    "కానీ... నీ లడ్డూలు కాస్త చిన్నవిగా ఉన్నట్టున్నాయ్!" సందేహంగా అన్నాడు జైలర్.
    రాధ చురుకుగా జైలరువంక చూసింది.
    "ఏవయ్యోయ్ బలే మాట్టాడుతుండావే. నా లడ్డూల సైజుకే పేరు పెడ్తా వుండావే. ఈ రత్తాలు లడ్డూల సైజున్న లడ్డూలు ఈ దేసెం ఓల్ మొత్తం మీదా ఎక్కడా దొరకవు తెల్సా? మీ కిష్టం లేకపోతే సెప్పండి. నే పోతా"
    రాధ నేల మీది గంపని నెత్తికి ఎత్తుకుంది.
    జైలరు కంగారుపడిపోయాడు.
    "హయ్యో... హయ్యో... అంత కోపం అయితే ఎలాగమ్మా కాస్తాగు. నీ లడ్డూలు చూస్తూంటే నోరూరిపోతూంది. కొనకుండా ఎలా ఉంటాం. ఇంతకీ ఎలా ఇస్తున్నావ్."
    అని అడిగాడు జైలరు.
    "జోడు లడ్డూలు మూడు రూపాయలు"
    "ఏదీ నాకు రెండు లడ్డూలు ఇవ్వు."
    "నాక్కూడా రెండు లడ్డూలు ఇవ్వు" సెంట్రీ కూడా ముందుకి వచ్చి అన్నాడు.
    అప్పటికే రాధ పాటవిని జైల్లోని అందరు సెంట్రీలూ అక్కడ మూగారు. వాళ్ళలో గోపీ సెల్ దగ్గర ఉండే ముసలి సెంట్రీ కూడా ఉన్నాడు.
    అందరూ రాధ దగ్గర లడ్డూలు కొనుక్కుని తిన్నారు.
    లడ్డూలు తిన్న నిమిషానికే అందరూ మూర్ఛపోయారు. అవి మత్తుమందు కలిపిన లడ్డూలు.
    రాధ గబగబా జైలరు టేబులు సొరుగులోంచి తాళాలగుత్తి తీసి గోపీ ఉన్న సెల్ దగ్గరికి పరుగు తీసింది.
    రాధ సెల్ తాళం తెరవగానే గోపీ రాధని లపక్కున కౌగిలించుకుని "రాధా" అన్నాడు నోరంతా కప్పలా తెరిచి.
    "హేవండీ" అంది రాధ కూడా బాధనంతా గొంతుతో కష్టపడి  పలికిస్తూ.
    "రాధా. చూశావా జైలు గోడల మీదంతా నీ బొమ్మలు ఎలా గీశానో?" గర్వంగా అన్నాడు గోపి.
    "అబ్బ మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడ్డానికి ఇది సమయం కాదండీ... మనం వెంటనే ఇక్కడినుండి తప్పించుకుని పోవాలి! పదండి" గోపీని కంగారుపెట్టింది రాధ.
    ఇద్దరూ జైలరు గదిదాకా పరుగెత్తుకుని వచ్చారు. అక్కడ నేలమీద అందరూ చెల్లా చెదురుగా పడివున్నారు.
    గోపి జైలరు దగ్గరకు వెళ్ళి "క్షమించండి జైలరుగారు. మీకు నా మీద మంచి నమ్మకం ఉంది. అయినా మిమ్మల్ని మోసంచేసి ఇలా తప్పించుకోవలసి వచ్చింది. నా నిర్దోషిత్వం నిరూపించుకోవాలి జైలరుగారూ. నిరూపించుకోవాలి. నన్ను దీవించండి."
    అంటూ జైలరు కాళ్ళు మొక్కాడు.
    రాధ కూడా ఎందుకనో జైలరు కాళ్ళు మొక్కింది.
    ఇద్దరూ జైల్లోంచి బయటికి పోతుంటే ముసలి సెంట్రీ మెల్లగా ఒక కన్ను తెరిచి వాళ్ళవంక చూస్తూ దీవించాడు.
    అతను మత్తుమందు కలిపిన లడ్డూ తినలేదు. ఊరికే నటించాడు అంతే.
                                                                 36
    సరస్వతి యింట్లో దేవుడి పటాలముందు మోకరిల్లింది.
    వరసగా పేర్చివున్న దేవుడి ఫోటోలవంక అరమోడ్పు కన్నులతో చూసింది.
    తర్వాత కృష్ణుడు బొమ్మవంక చూస్తూ చేతులు జోడించి అంది.
    "స్వామీ! నా తండ్రికి ఏ ఆపదా రాకుండా చూడు స్వామీ. తండ్రి అంటే నా నాన్న అనుకుని పొరపాటు పడేవు. నా నాన్న ఏనాడో టపా కట్టేశాడు స్వామీ. నేనిప్పుడు చెప్తున్నది నా కొడుకు గోపీ గురించి స్వామీ. వాడికి ఏ ఆపదా రాకుండా చూడడం నీ భాద్యత స్వామి. ఎందుకంటే... ఎందుకంటే... ఎందుకంటే..." ఆలోచించింది సరస్వతి. కానీ, ఆమెకి తట్టలేదు.
    "ఏమోలే ఎందుకోలే కానీ, నీ బాధ్యత అంతే" అంది.
    ఆమె దృష్టి శివుడి బొమ్మమీద పడింది.
    అంతే. ఆమె మొహంలో అయోమయం!
    కొంపదీసి కృష్ణుడికి మాత్రం మొక్కానని శివుడికి కోపం రాదు కదా?
    సరస్వతి చెంపలేస్కుని శివుడికి మొక్కింది.
    "స్వామీ! నువ్వు కూడా నా గోపీని, నా కోడలుని రక్షించు స్వామీ. కృష్ణుడు తన ప్రయత్నాలు తాను చేస్తాడుగానీ నువ్వు కూడా నీ ప్రయత్నంలో నువ్వుండు స్వామీ" అంది.
    అంతలోనే సరస్వతికి మరో సందేహం పట్టి పీడించింది. కేవలం కృష్ణుడూ, శివుడూ వీళ్ళిద్దర్నే వేడుకుంటే మిగతా దేవుళ్ళకి కోపం వస్తుందేమో!?
    అంతే! సరస్వతి ఫటాఫట్ చెంపలు వాయించుకుని మిగత దేవుళ్ళందరికీ కూడా మొక్కింది.
    సరిగ్గా అప్పుడే ఎవరో తడిక తలుపుని తప తపా కొట్టాడు.
    సరస్వతి ఒక్క ఉదుటున లేచి నిలబడింది.
    "గోపీ? నా గోపీ వచ్చేశాడు!!..."
    పరుగు పరుగున వెళ్ళి వీధి తలుపు తీసింది సరస్వతి.
    ఎదురుగా గోపి నిల్చుని ఉన్నాడు. నిజంగానే గోపి వచ్చేశాడు.
    కాని గోపిని, తన కన్నకొడుకు గోపిని సరస్వతి గుర్తు పట్టలేదు.
    కారణం గోపి నొసలుమీద పడే ముంగురుల చుట్టని మిగతా జుట్టుతో కలిసి వెనక్కి దువ్వేశాడు. గోపి కావాలనే అలాచేసాడు తల్లిని ఏడిపించాలని!
    "ఎవరుబాబూ నువ్వు" కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది సరస్వతి.
    "నేనా? నేను సి.ఐ.డి.ని, గోపీ జైల్లోంచి తప్పించుకునిపోయాడు!" గంభీరంగా అన్నాడు గోపి.
    "ఆ. నా గారాలకన్న, నా వరాలమూట, నా గోప జైల్లోంచి తప్పించుకుని పోయాడా? ఎంత మంచి వార్త చెప్పావు బాబూ? ఉండు బాబూ ఉండు. ఇప్పుడే నీ నోట్లో లడ్డుండ పెడ్తా" సంబరంగా లోపలికి వెళ్ళబోయింది సరస్వతి.
    "నేను ఇక్కడికి లడ్డులు తినడానికి రాలేదు." కర్కశంగా అన్నాడు గోపి."జైల్లోంచి పారిపోయిన గోపి ఇక్కడ ఉన్నాడేమో చూసి మళ్ళీ అరెస్టుచేసి తీసుకెళ్ళడానికి వచ్చాను!"
    ఆ మాట వినగానే సరస్వతి వడవడా వణికింది.
    "బాబూ, సి.ఐ.డి.బాబూ. మంచివార్త చెప్పినట్టే చెప్పి ఎంతటి దుర్వార్త చెప్పావుబాబూ. నా గోపిని అరెస్టు చేయకు బాబూ. వాడు నిర్దోషి బాబూ" కళ్ళనీళ్ళు కారుస్తూ అంది సరస్వతి.
    "కానీ చట్టం దృష్టింలో గోపీ నేరస్థుడు.
    "ఈ మాయదారి చట్టానికి చెవులేగానీ కళ్ళుండవు బాబూ."
    "ఊ... . కళ్ళగురించీ, చెవులగురించీ నువ్వు చెప్పేసోది వినడానికి నాకు టైంలేదుగానీ, అడ్డులే. గోపిని అరెస్టు చేయాలి!" అన్నాడు గోపి వస్తున్న నవ్వును ఆపుకుంటూ.
    "బాబూ! గోపి ఇక్కడలేడు బాబూ" అంది సరస్వతి.
    "గోపి ఇక్కడ లేడంటే నేను నమ్మను. మీ తల్లి కొడుకుల మధ్య అనురాగం తీగెలు తీగెలుగా అల్లుకొని చిక్కులుపడిపయిందని నాకు తెలుసు. జైలునుంచి తప్పించుకోగానే అతను ఇక్కడికే వస్తాడని నాకు తెల్సు. తప్పుకో" అంటూ గోపి ఆమెని పక్కకితోసి వెళ్ళి ఇల్లంతా వెతికినట్టు నటించాడు.
    "హు! ఎక్కడా లేడు!! అంటే ఇంకా ఇక్కడికి రాలేదన్నమాట! రాక ఎక్కడికి పోతాడు? ఈ ఇంటిమీద పోలీసుల నిఘా పెడ్తాను. గోపి రాగానే అరెస్టు చేస్తారు." అన్నాడు గోపీ గంభీరంగా.
    సరస్వతి కేర్... బేర్ మంటూ ఇలా అంది.
    "బాబూ... కేర్ బాబూ... బాబూ... బేర్ బాబూ... గోపి నిర్దోషి బాబూ... వాడిని అరెస్టు చెయ్యడం కేర్ బేర్ బాబూ."
    వెంటనే గోపి పకపకా నవ్వి సరస్వతిని రెండు చేతుల్తో పైకెత్తి గిరగిరా తిప్పాడు.
    "బాబూ! ఏంటి బాబూ ఈచేష్టలూ. నేను నీకు తల్లిలాంటిదాన్ని బాబూ" బెంబేలెత్తి అంది సరస్వతి.
    సరస్వతిని క్రిందకిదించి మళ్ళీ పకపకా నవ్వాడు గోపి.
    "తల్లిలాంటిదానివి ఏంటి? తల్లివే అమ్మా. దేవతలాంటి తల్లివి!" అంటూ నున్నగా పైకిదువ్విన జుట్టులోంచి కొన్నిపోచలు ముందుకుపీకి నుదుటి మీద ముంగుర్ల చుట్టగా వేస్కున్నాడు.
    హంతే! అప్పుడు సరస్వతి తన కన్నకొడుకు గోపిని గుర్తుపట్టేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS