ఆమె బయటకు వెళ్ళగానే నేనూ షాపు బయటకు వచ్చాను. ఆమె ఎటు వెడుతుందో చూడాలని. ఆమె తిన్నగా ఎదురు షాపులోనికి వెళ్ళింది.
అక్కడ ఒకతను అమెను పలకరించాడు.
"డార్లింగ్ -- ముగిసిందా నీ రిబ్బన్ల పర్చేజ్."
'ఆహా - ప్లాస్టిక్ గాజులు కూడా తీసుకున్నాను."
వాళ్ళిద్దరూ భార్యాభర్త లని తెలిసిపోయింది. క్షణ మాత్రం విచారించి ఊరుకున్నాను. అదే క్షణంలో వారిద్దరి పక్కన మరో అమ్మాయి కనిపించింది.
కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ఉన్నా నేను అ అమ్మాయిని గుర్తించాను. గుర్తించడమేమిటి అరె ఆ అమ్మాయి సునీత!
అ క్షణంలో నాలో మరే ఇతర భావాలూ లేవు. "సునీతా!" అరిచాను.
సునీత ఉలిక్కిపడి అటూ ఇటూ చూచేలోగా నేనామెను సమీపించాను.
నన్నామే పరికించి చూస్తూ - "మీరు , మీరు...." అంటోంది.
"గుర్తు పట్టలేదా నన్ను?" అన్నాను - నా గెడ్డాన్ని సవరించుకుంటూ ఆమె ఒక్క క్షణం మ్రంపదినట్లు కనబడింది. తర్వాత "అన్నయ్యా! అంది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎమోషన్స్ బలవంతంగా అపుకుందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. నేను ఆమెను షాపు లోనికి తీసుకు వెళ్ళాను.
"నువ్వు బ్రతికే ఉన్నావా అన్నయ్యా?" అంది జేబురుమాలుతో కన్నీళ్ళ ను ఒత్తుకుంటూ. నేను బ్రతికి ఉన్నానన్న ఆనందం దాని ముఖంలో కొట్టవచ్చినట్లు కనబడుతోంది.
"ఏం - బ్రతికి ఉండనని ఎందుకనుకున్నావు?"
"నిన్ను హత్య చేసిన నేరం మా మీద మోపబడుతుందనే భయం చేతనే కదా - మేము అజ్ఞాతవాసం చేస్తున్నది!: అంది సునీత.
నాకేమీ అర్ధం కాలేదు. మళ్ళీ ఏదో కొత్త రహస్యం క్రమంగా నాలో ఆవేశం తగ్గి - వాస్తవానికి రాసాగాను.
సునీత ఆరోజు వీర్రాజు దగ్గర చాలా పచ్చిగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తనను బట్టి చూస్తె వాళ్ళిద్దరికీ చాలా కాలంగా సంబంధ ముండి ఉండాలని పించింది. అ క్షణంలో అప్పుడు సునీత అంటే అసహ్యం వేసింది. కానీ ఇప్పుడు సునీత దెం తప్పులేదని పిస్తోంది. వయసు లో ఉన్న సునీత వివాహం గురించి అన్నగా నా బాధ్యత ఎంతవరకూ నేరవేర్చాను? అ సంఘటన అనంతరం మళ్ళీ సునీత గురించి తల్చుకోనైనా లేదే? ఆమె ఏమైపోవాలి? అందులోనూ ఒంటరి ఆడది. ఆమెను కలుసుకుందుకు ప్రయత్నిస్తే నేనెవరో తెలిసిపోతుందని భయపడి స్వార్ధం చూసుకున్నాను.
నా చెల్లెలిని నేనసహ్యించుకోలేదు. మాది ఒకనాటి అనుబంధం కాదు. సుమారు ఇరవై సంవత్సరాల అనుబంధం.
"నేరం మామీద అంటున్నావు? మేము అంటే?"
సునీత సిగ్గుపడింది. "నేనూ- మా ఆయనా?"
"నీకు వివాహమయిందా?" చాలా ఆశ్చర్యంగా ప్రశ్నించాను. సునీత అవునన్నట్లు తలూపింది. 'అయితే మీ అయన ఎవరు? ఆయనకూ నాకూ సంబంధమేమిటి? ఆయనేవడో కూడా నేనెరుగను కదా - అటువంటి వాడికి నన్ను హత్య చేశానన్న భయమేమిటి? ఏం అర్ధం కావడం లేదు."
సునీత తలవంచుకుని "మా అయన నీకు బాగా తెలుసు. అయన పేరు వీర్రాజు.
ఒక్కసారి పక్కలో వెయ్యి బాంబులు పేలినట్లు అదిరిపడ్డాను. "ఏమిటీ వీర్రాజు బ్రతికి ఉన్నాడా?" అన్నాను. నాకు మతి పోతుందేమోనన్న అనుమానం కూడా కొద్ది క్షణాల పాటు కలిగింది.
"చా అవెం మాటలన్నయ్యా? నిక్షేపం లా ఆయనుంటేనూ" అంది సునీత.
"ఎక్కడ?" అన్నాను ఆత్రుతగా.
'అజ్ఞాత వాసం చేస్తున్న మాకు ఇక్కడా అక్కడా అనేదేమిటి? ఉద్యోగం చేస్తున్నప్పుడు హాబీగా ఉండే జ్యోతిషం అయన కిప్పుడు వృత్తి అయింది. ప్రస్తుతం ఈ ఊళ్ళో హోటల్ అలంకార్ లో వున్నాడు."
"నీ జీవితం అతి త్వరలో గొప్ప మలుపు తిరగబోతోంది. అంటూన్న జ్యోతిష్కుడి ముఖం నుండి గెడ్డం మీసాలు తొలగిస్తే నిజంగానే నా జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆ రోజే అతను వీర్రాజని గుర్తించి ఉంటె ఎంత బాగుండేది? అయినా వీర్రాజు బ్రతికి వుంటాడని ఎలా అనుకోగలడు? స్వయానా నా చేతుల్తో నేనే అతన్ని చంపాను. ఆ క్షణం లోనే నాలో చిన్న అనుమానం రేగింది. "నువ్వు వీర్రాజు నేలా వివాహం చేసుకున్నావు? అతగాడికి అంతకు ముందే వివాహమైంది కదా!"
సునీత ముఖం బాధగా మారిపోయింది. "అదంతా పెద్ద కధ. అందులో మన మందరం పాత్రలమని అప్పట్లో నాకు తెలియదు. తెలిసి వుంటే మనకీ కష్టాలు వచ్చి ఉండేవి కావు" అంటూ ఆమె వివరాలు చెప్పడం ప్రారంభించింది.
ఆమె చెప్పినది వింటుంటే నాకు కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
అతనికి వీర్రాజు గురించి అన్ని వివరాలూ తెలుసును. ఆరోజు వీర్రాజు ను అలా ప్రవర్తించమని అతనే చెప్పాడు. అందుకు బహుమతిగా అయిదు వేలిస్తానన్నాడు. అతను వీర్రాజు నే ఎన్నుకోవడానికి మరో కారణం ఉంది. వీర్రాజు నా చెల్లెలు ప్రేమించుకున్నారు.
వీర్రాజు దగ్గర సునీత ఆ విధంగా ప్రవర్తిస్తే - ఆమెకు అయిదు వేలు బహుమతి ఇస్తానన్నాడు. వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం నేను ప్రయత్నిస్తున్నట్లు సునీతకు తెలుసు. నాకోసం అందుకు అంగీకరించింది. వీర్రాజు తన కాబోయే భర్త కాబట్టి డబ్బు కోసం వివాహం కాకపోయినా ఆ ఒక్క రాత్రీ అతని ముందు నగ్నంగా నిలబడడానికి అంగీకరించింది. వీర్రాజుకు అంతకు ముందే వివాహమైందన్న అబద్దం కేవలం నాకోసం కల్పించబడింది.
కొద్ది నిముషాల పాటు నగ్నంగా అతని ముందు నిలబడడంతోటే సునీత పాత్ర ముగుసింది. అందుకే ఆమె వెళ్ళి పోతానంది. అయితే వీర్రాజు పాత్ర యింకా వుంది. అందుకే అతనామెను బలవంత చేయబోయాడు. ఫలితంగా నేనతన్ని హత్య చేశాను. అయితే తను హత్య చేయబడతానని వీర్రాజు కి తెలుసు. నా దగ్గర ఉన్నది డమ్మీ రివాల్వర్ అని ముందుగానే అతనికి సమాచారం అందింది. కానీ తన విధి ప్రకారం అతను మరణించినట్లు నటించాడు.
తర్వాత - మర్నాడు ఉదయం వాళ్ళు అతన్ని కలుసుకున్నారు. అతను వాళ్ళకు వాగ్దానం చేసిన మేరకు డబ్బు ఇచ్చేసి హంతకుడినయ్యానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాననీ, నా శవం అప్పుడు వీర్రాజు ఇంట్లో ఉన్నదనీ కానీ పోలీసులు దాన్ని హత్యగా భావించే అవకాశాలున్నవనీ , వీర్రాజు కోసం వాళ్ళు వెతకవచ్చుననీ సూచించాడు.
వీర్రాజు భయంతో వణికి పోయాడు. అతను వీర్రాజు కి కూడా సరిగ్గా నాకిచ్చిన లాంటి సలహాయే ఇచ్చాడు. ఫలితంగా వీర్రాజు తన గుర్తులూ , బట్టలూ అతనికి సమర్పుంచుకుని అజ్ఞాత వాసం ఆరంభించాడు. సునీత అతని సహధర్మ ధారిణి అయింది.
ఇది చాలా గొప్ప పన్నాగం. ఎక్కడా రక్తపాతం లేకుండా అతను ముగ్గురు వ్యక్తుల్ని మోసం చేసి రెండు హత్యలు జరిగాయన్న భ్రాంతి సృష్టించాడు. అందుకు 20 వేలు ఖర్చు పెట్టాడు. ఏమిటి అతనికి అందువల్ల గల ప్రయోజనం? అయితే సునీత చెప్పినదానిలో నాకింకా కొన్ని సందేహాలున్నాయి. "వీర్రాజు నేను మరణించానంటే ఎలా నమ్మాడు?' అని అడిగాను.
"నువ్వు వెళ్ళి పోయిన కొద్ది క్షణాలకు అయన కూడా గది వదిలి వెళ్ళిపోయారు. అతని సూచన మేరకు అయన ఇల్లు తాళం వేయలేదు. అతను చెప్పిన ప్రకారం నువ్వు తరువాత అక్కడకు వెళ్లావు. వీర్రాజు శవం లేకపోవడం చూసి కంగారు పడ్డావు. ఏం చేయాలో తోచక, నీ సంగతి అందరికీ తెలిసి పోయిందని భ్రమ పడి అక్కడ కనపడ్డ కత్తితో నీ గుండెల్లో పోడుచుకున్నావు. ఆవార్త విని నాకెంత ఏడుపు వచ్చిందో చెప్పలేను. అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా వుంది. ఆరోజు నువ్వు అక్కడికి వస్తావని తెలుసుంటే ఈ పాడు పనికి ఒప్పుకునే ఉండేదాన్ని కాదు. అలా అందరం విడిపోయి అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుందని అనుకోలేదు." అంటూ కళ్ళు తుడుచుకుంది సునీత.
నేను తీవ్రంగా ఆలోచించసాగాను.
మమ్మల్ని అజ్ఞాతవాసం లోకి తోయడానికి అతను 20 వేలు ఖర్చు పెట్టాడు. ఆరోజు నాకు పని పురమాయించి వీర్రాజు తో నన్ను కలవర పెట్టమని చెప్పాడు. అంటే, నేను బాగా కంగారు పడాలి. నా మనసులో ఇతర ఆలోచనలు నశించి వీర్రాజోక్కడే నిలవాలి. నా ఆలోచనా శక్తి క్షీణించిన సమయంలో నా చెల్లెలు రంగప్రవేశం చేయాలి. అతనూహించినట్లే నేను ప్రవర్తించాను. మానవ మనస్తత్వం మీద అతనికి బాగా అవగాహన ఉండి తీరాలి. అయితే ఈ ఉత్తుత్తి నాటకానికి అతను 20 వేలెందుకు ఖర్చు పెట్టాడు.
హటాత్తుగా నాకు స్పురించింది. ఇటీవలే అతను నాకు మరో పదిహేను వేలు ఇచ్చాడు. కేవలం ఒక లాకెట్ కోసం.
అంటే ఈ పన్నాగామంతా ఈ లాకెట్ కోసమేనా? ఆ లాకెట్ అంత విలువ చేస్తుందా?
చెల్లెలితో నేను కూడా ఇంతవరకూ జరిగిన వివరాలన్నీ చెప్పాను. ఆశ్చర్యంగా ఆ వివరాలన్నీ వింది సునీత. "ఈ రహస్యాలన్నీ ఎలాగైనా చెధించాలి" అన్నాను నేను.
తర్వాత నేను వీర్రాజును కలుసుకున్నాను. అతను కూడా ఇందులో ఏదో పెద్ద సమస్యే ఉందనీ, అది తేలేదాకా మరికొంతకాలం అజ్ఞాతవాసం సాగించడం ఉత్తమమని అన్నాడు.
తరువాత మేము చేయవలసింది అతని చిరునామా సంపాదించడం. హోటల్ అజంతా లో అతను కొద్ది రోజులు క్రితం బస చేశాడు. అప్పటికి అతనికి మా ఉనికి గురించి తెలియదు. అక్కడ విచారిస్తే అతని చిరునామా దొరకవచ్చు.
