నిజానికి నాకు జ్యోతిషం మీద చెప్పుకోదగ్గ నమ్మకం లేదు. అయినా ప్రతి పనిషికి ఏదో బలహీనత. మన దగ్గర డబ్బు తీసుకున్నందుకు మనల్ని సంతోషం పెట్టడం కోసం సాధారణంగా జ్యోతిష్కుడు మంచినే చెబుతాడు. అది నిజం కాదేమో నని అనిపించినా మనలోని బలహీనత ఆ మాటలకు చాలా సంతోష పడుతుంది. ఆ సంతోషం నాకు చాలా బలాన్నిస్తుంటుంది.
ఇప్పుడు అలంకార్ హోటల్ ల్లోకి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. అతగాడి గురించి అప్పుడే చాలా ప్రచారం జరిగింది. అందుకే పాతిక రూపాయలు ఖర్చయినప్పటికీ జోస్యం చెప్పించుకొదలిచాను.
జ్యోతిష్కుడు నన్ను చూసి మందహాసం చేశాడు.
గెడ్డం , మీనం ఉన్నప్పటికీ అంత వయస్సున్న వాడిలా కనిపించలేదు. ముఖంలో తేజస్సు, కళ్ళలో వెలుగు ప్రతి వారినీ ఆకట్టుకునేలా వున్నాయి. హోటల్ అలంకార్ లో అతను బస చేసిన గది చాలా లగ్జూరియస్ గా వుంది. అందమైన మెత్తని సోఫాలో అతగాడు కూర్చుని వున్నాడు. నేను అతని కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. అతగాడి సంజ్ఞాను గమనించి చేయి జాపాను.
జ్యోతిష్కుడు నా చేతిని చాలా శ్రద్దగా గమనించాడు. అతని ముఖంలో క్రమంగా చిరునవ్వు వెలగసాగింది.
"ఇది చాలా గొప్ప చేయి. అతి త్వరలో నీ జీవితంలో గొప్ప మలుపు రాబోతోంది"అన్నాడతను. అతను ఇంకా ఏవేవో చాలా చాలా చెబుతున్నాడు. కానీ అతి త్వరలో తిరగబోయే మలుపు నా మనసులో బాగా నాటుకుంది. ఏమిటో ఈ మలుపు?
ఆ తర్వాత వారం రోజుల పాటు ఆ మలుపు గురించి అలోచించి క్రమంగా మరిచిపోసాగాను.
షాపులో క్యాష్ బాక్స్ ముందు కూర్చుని వుండగా నా ముందు ఒక పౌడరు డబ్బా దాని క్రింద - వంద రూపాయల నోటు హటాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.
తల ఎత్తి చూశాను. ఆ వ్యక్తీ రోడ్డు కేసి చూస్తున్నాడు. కానీ నేను గుర్తు పట్టాను అతను అతనే!
నాకాశ్చర్యం కలిగించింది అతని ముఖం కాదు. పై బొత్తాలు ఓపెన్ చేసి వున్న బుష్ షర్టు లోంచి కనబడుతున్న నా లాకెట్! వీర్రాజు శవం మీద వ్రేలాడవలసిన లాకెట్ అతని మెడలోని కెందుకు వచ్చింది?
క్యాష్ బాక్సు లోంచి చిల్లర తీస్తున్నానన్న మాటే కానీ బుర్ర సరాగా పనిచేయడం లేదు. అతనికి చిల్లర ఇచ్చి- షాపు పని కుర్రవాడికి అప్పగించి - అతన్ని అనుసరించెను.
అతన్ని ఫాలో చేస్తున్నంత సేపూ రకరకాల ఆలోచనలు నా బుర్రలో తిరుగుతూ వున్నాయి. ఆఖరికి ఆసలు విషయం నా బుర్రకు తట్టింది. వీర్రాజు శవాన్ని నాదిగా గుర్తుపట్టడం జరిగేక - నా జ్ఞాపకార్ధం ఆ లాకెట్ తీసుకుని వుంటాడు. ఇప్పుడతన్ని నేను దేనికి అనుసరించడం?
ఆ లాకెట్ నాకు కావాలి -- హత్య కేసు ముగిసింది కాబట్టి - దాని సాక్ష్యపు అవసరం తీరింది కాబట్టి - ఇంక అతను దాన్ని నాకు ఇచ్చేయవచ్చు.
అయితే ప్రస్తుతం నేనున్నా వేషంలో అతను నన్ను గుర్తుపట్టలేదు. అందువల్ల ఈ విధంగా అతన్ని కలుసుకుని నా ఐడెంటిటీని అతనికి తెలియజేయడం మంచిది కాదనిపించింది. అందుకే అతన్ని ఫాలో చేశాను.
అతను హోటల్ అజంతా లో అడుగుపెట్టాడు. రూమ్ నెంబరు 33 తాళాలు తీసుకున్నాడు.
నేను తక్షణం అక్కణ్ణించి వెళ్ళిపోయాను. ఒక కిలో మీటరు దూరం నడిచి అక్కడున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో దూరాను. నంబరు చూసి హోటల్ అజంతా కు ఫోన్ చేసి రూమ్ నంబరు 33 కి కనెక్షన్ ఇవ్వమన్నాను. అవతల నుంచి అతని కంఠం వినబడగానే "హలో నేను చిరంజీవి ని మాట్లాడుతున్నాను."
"చిరంజీవి అంటే?"
"రెండేళ్ళ క్రితం స్నేహితుడిని. నీ మెడలో లాకెట్ కి స్వంతదారుడిని. సాక్ష్యం అవసరం తీరిపోయింది కాబట్టి ఆ లాకెట్ ని దయుంచి తిరిగి ఇప్పించమని కోరుతున్నాను.'
"నా మెడలో ఏ లాకేట్టూ లేదు. నువ్వెవరివో నాకు తెలియదు."
"సరే అయితే ! కానీ ఆ లాకెట్ ని నేను ఎలాగో అలా తీసుకు తీరతానని మాత్రం గుర్తుంచుకో."
"ఒక్క మాట - ఆ లాకెట్ సంగతి నాకు తెలియదు కాని, అసలు నీ కెందుకు కావాలని!"
"ఎందుకేమిటి? నా చిన్నప్పుడు మా అమ్మ ప్రేమతో ఇచ్చిన కానుక అది. ఏ పరిస్థితుల్లోనూ అది తీయనని ఆమెకు మాట ఇచ్చాను. కానీ అనివార్య పరిస్థితుల వల్ల నీ కిచ్చేయవలసి వచ్చింది. అది పోయిందనే అనుకున్నాను. కానీ ఈరోజు అది నీమెడలో చూశాను ...." నేనింకా ఏదో అడగబోతుండగా - "ఎక్కడ!" అని ఆత్రుతగా ప్రశ్న వినిపించింది. "హోటల్ అజంతాలో" అన్నాను అవతల నుంచి మళ్ళీ ఏమీ వినిపించలేదు.
"ఆ లాకెట్ నాకెంతో ముఖ్యమైనది. దానితో నీ కే పనీ లేదు, కాబట్టి...."
"చెప్పానుగా, నాకు దాని గురించి ఏమీ తెలియదని, అయినా అవసరముంటే నా రూముకి రాకూడదూ, అన్నీ వివరంగా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నిజంగా నీ లాకెట్ నా దగ్గరుంటే తీసుకు పొదువుగానీ."
"నేను నీ దగ్గరకు రాదల్చుకోలేదు. లాకెట్ నా కివ్వదల్చుకుంటే అది నాకు చేరే పద్దతి వేరే ఉంది. ఇస్తానంటే చెబుతాను."
"ఎందుకీ వృధా ప్రయాస లాకెట్ నా దగ్గర లేనప్పుడు?" అంటూ అవతల అతను ఫోన్ పెట్టేశాడు. నేను కూడా ఫోన్ పెట్టేసి మెరుపు వేగంతో హోటల్ అజంతా కు దారి తీశాను. అక్కడ అయిదు నిముషాల సేపు మాటు వేశాను.
నేనూహించినట్టే అతను సామానుతో హోటల్ నించి బయటకు వస్తున్నాడు. నాకు తెలుసు, అతను హోటల్ మారిపోతాడని. అందుకే నేను జాగ్రత్తగా మళ్ళీ అతన్ని ఫాలో అయి హోటల్ కామరూప లో -17 వ నంబరు రూములోకి అతను ప్రవేశించినట్లు రూడీ చేసుకొని దూరంగా ఉన్న టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాను.
"ఎవరు?" అంటూ ఆతని కంఠం వినిపించింది. "నేను చిరంజీవిని" అనగానే "ఆ" అంటూ విపరీతంగా ఆశ్చర్య పోయిన అతని కంఠం వినబడింది నాకు.
"కష్టపడి హోటల్సు మారడం అనవసరం. నా లాకెట్ నా కిచ్చే వరకూ నిన్నిలాగే నీడలా వెంటాడుతానూ."
"నువ్వెవరో నాకు తెలియదు. ఆ లాకెట్ విషయం కూడా నాకు తెలియదు. అయినా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతోంది. కావాలంటే ఓ పది వేల రూపాయలివ్వ గలను. ఆ లాకెట్ సంగతి మరిచిపోకూడదు?"
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా లాకెట్ గురించి అతని కంత పట్టుదల ఎందుకు? దానికి పదివేలు వేలకట్టాడా?
'ఆలోచించకు. కావాలంటే ఇంకో అయిదు వేలు తీసుకో. అంతేకానీ అనవసరంగా చిక్కుల్లో పడకు. అందులోనూ నువ్వు అజ్ఞాతంగా ఉంటున్న హంతకుడివి కూడా అనుకుంటాను."
వేశాడు బ్రహ్మాస్త్రం అనుకున్నాను. ప్రస్తుతానికి పదిపదిహేను వేలు పుచ్చుకోవడమే లాభసాటి అనిపించింది.
జ్యోతిష్కుడు చెప్పనే చెప్పాడు. నా జీవితం గొప్ప మలుపు తిరగాబోతోందని . అదేనేమో ఇది!
వ్యాపారరీత్యా నేను అప్పుడప్పుడు సెట్ గులాబ్ చంద్ దగ్గర అప్పు చేస్తుంటాను. మళ్ళీ టంచనుగా తీర్చేస్తుంటాను. అతను నేనంటే చాలా ఇష్ట పడతాడు. డబ్బును పోస్టులో పార్సెల్ గా గులాబీ పువ్వు గుర్తుతో గులాబ్ చంద్ పేర పంపమని ఫోన్ పెట్టేసి, త్వరగా గులాబ్ చంద్ దుకాణం చేరుకొని రెండు మూడు రోజుల్లో అతని పేరా ఒక పార్సెల్ వస్తుందనీ, దాని మీద గులాబీ పువ్వు గుర్తు ఉంటుందని, అది జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని కొన్నాళ్ళు పోయేక రహస్యంగా నాకు అంద జేయవలసిందనీ కోరాను. ఎవరైనా వచ్చి ఆ పార్సెల్ ఎవరికోసమని అడిగితె చెప్పవద్దని కూడా కోరాను.
వారం రోజుల అనంతరం క్షేమంగా ఆ పార్సెల్ నాకు చేరింది. గులాబ్ చంద్ ని ఎవ్వరూ ఏ వివరాలు అడగలేదు.
ఆ పార్సెల్ లో పదిహేను వేల రూపాయలతో పాటు ఒక చిన్న ఉత్తరం కూడా ఉంది. "నీ మంచితనాన్ని నేను నమ్ముతున్నాను. ఇంక ఎన్నడూ ఆ లాకెట్ కోసం ప్రయత్నించకు. వీర్రాజు హత్య కేసు పోలీసులు ప్రస్తుతానికి క్లోజ్ చేసినా, ఏ క్షణం లోనైనా తిరగతోడవచ్చు. ఇది హెచ్చరిక కాదు. శ్రేయోభిలాషిగా నా విన్నపం" అని ఉంది. క్రింద సంతకం లేదు.
నేను బాగా ఆలోచించసాగాను. నాకు తెలియనిది ఏవేవో రహస్యాలు అతని దగ్గర ఉన్నాయని పించింది.
అసలు అతను నాద్వారా వీర్రాజుని హత్య చేయించాలనుకున్నాడు. కానీ నేను తెలివిగా ప్రవర్తించి, నిద్ర మాత్రలు నేనే కొంటానన్నాను. ఆ పరిస్థితుల్లో అనవసరంగా పరిస్థితుల ప్రభావానికి లోనై నేను వీర్రాజుని హత్య చేశాను. ఆత్మరక్షనార్ధం నా దగ్గిర ఉంచుకోమని అతనిచ్చిన రివాల్వర్, వీర్రాజుని హత్య చేయడాని కుపయోగించాను. అతని అదృష్టం బాగుంది. అతని కోరిక నెరవేరింది.
అయితే వీర్రాజు లాంటి సామాన్యుడి ని చంపడం వల్ల అతనికి కలిగిన లాభమేమిటి? ఎంతో సుగుణ శీల అనుకున్న నా చెల్లెలు అంత పచ్చిగా ఎలా ప్రవర్తించింది? అవసరం తీరిపోయినా అతను లాకెట్ ఎందుకు వదలదు? నేను హంతకుడి నన్న సంగతి తెలుసుండీ లాకెట్ గురించి అడగగానే అతను పదిహేను వేలెందుకిచ్చాడు?
ఈ ప్రశ్నలకు జావాబులు ఎక్కడా నా ఊహకు అందడం లేదు. కానీ జ్యోతిష్కుడు చెప్పిన గొప్ప మలుపు మాత్రం అప్పుడప్పుడు నా మదిలో లీలగా మెదుల్తోంది.
నా షాపులోని ఆరోజు ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఎంత అందమంటే -- మాటల్లో చెప్పలేను. అలా అని ఆమె చెప్పుకోదగ్గ ఫాషన్ బుల్ గా కూడా లేదు. సింపుల్ గా ఉంది. ఎందుకో నాకు ఆ అమ్మాయిని వివాహమాడలనిపించింది. మర్యాదను కూడా మరచిపోయి ఆమె వైపే కళ్ళప్పగించి చాలాసేపు చూస్తుండి పోయాను.
ఆమె నా షాపులో రబ్బరు గాజులు, రిబ్బన్లు కొంది. రెండుం పావలా అయింది. డబ్బులు తీసుకో బుద్ది కాలేదు. కానీ బాగుండదని తీసుకున్నాను. ఆమె రెండున్నర ఇచ్చింది. పావలా కాసు ఆమె చేతిలో పెడుతూ పరవశించి పోయాను. ఆ చిన్న స్పర్శ నా శరీరాన్నంతటినీ పులకరింపజేసింది. ఆమె కనుక నా జీవిత భాగస్వామి అయితే -
