మిసెస్ కైలాసం
అనగనగా ఓ నగరం , ఆ నగరం పేరు భాగ్యనగర్. భాగ్యనగర్ భాగ్యమా అని ఓ అఫిసరమ్మ మదరాసు నగరం నుంచి తరలివచ్చింది భాగ్యనగర్ కు. భాగ్యనగర్ లో ఉండటానికి చాలామంది అడ ఆఫీసర్లు వున్నారు. అమెలాటి ఆఫీసరు ఆమె ఒక్కర్తే ఆమె దృష్టిలో. ఆఫీసరు అంటే అల్లాటప్పా ఆఫీసరు కాదు, గజిటెడ్ ఆఫీసరు. ఆమె గజిటెడ్ ఆఫీసర్ ఏ క్షణాన అయిందో ఆ క్షణం నుంచే ఆమెకు కష్టాలు పుంఖాను పుంఖాలుగా చుట్టి వేశాయి.
ఆమె ఉద్యోగంలో చేరిన చాలాకాలానికి కాని (అదీ నానా గడ్డీ కరచి) గజెటెడ్ ఆఫీసరు కాలేదు. తను చేరింది చిన్న ఉద్యోగమే అయినా గజిటెడ్ ఆఫీసరుకు ఉండాల్సిన గుణాలు వున్నాయని మొదటే గుర్తించింది. తన యోగ్యతను గుర్తించుకొన్న మరుక్షణం నుంచే మనశ్శాంతి కి దూరం అయింది. తను చిన్న ఉద్యోగం చెయ్యటానికి కారణం తనలోని సేవా తత్పరతే! అనుకుంటూ బాధపడుతున్న మనస్సును జోకొట్టి నిద్రపుచ్చటానికి ప్రయత్నించేది మిసెస్ కైలాసం.
ఆమె దృష్టిలో తన యోగ్యతను గుర్తించని అధికారులు అజ్ఞానులు. ప్రభుత్వం గుడ్డిది. అసలు తనలాటి వ్యక్తీ ఈ దేశంలో జన్మించటమే తన దౌర్భాగ్యం అని అప్పుడప్పుడూ వాపోతూ వుండేది. మిసెస్ కైలాసం, గజిటెడ్ ఆఫీసరు కాకముందు.
ఆమె పేరులో విలక్షణత వుంది. ఆమె ప్రతి పనిలోనూ , మాటలోనూ , కదలికలోనూ విలక్షణత ఉట్టిపడుతూ వుంటుంది. ఒకసారి ఆమెను చూసినవారికీ , ఒకసారి ఆమె మాట్లాడగా విన్నవారికీ ఆమెను గురించి చాలా గొప్ప అభిప్రాయమే కలుగుతుంది. చక్కగా మాట్లాడగలదు. అవినీతి నిర్మూలన గురించీ, జీవితాదర్శాల గురించి 6 గంటలయినా అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె చెప్పే నీతులూ, ఆదర్శాలూ లోకం కోసమే. ఆమె దృష్టిలో తను వాటన్నింటికీ అతీతురాలు. ఆమాట కొస్తే, తనే ఒక గీటురాయి ఆదర్శానికీ, నీటికీ - అని ఆమె గాడమైన అభిప్రాయం.
మిసెస్ కైలసానికి తనమీద తనకు వల్లమాలిన అభిమానమూ గౌరవమూ. పొరపాటున కూడా తన పేరు పక్కన 'గారూ' అన్న పదాన్ని తగిలించుకోవడం మర్చిపోదు. గాడ నిద్రలోంచి తట్టి లేపి "మీ పేరేమిటండీ" అని అడిగితే తడుముకోకుండా 'మిసెస్ కైలాసంగారు' అనేస్తుంది.
ఆర్ధిక పరిస్థితులకు తలవంచి చిన్న ఉద్యోగం చెయ్యక తప్పలేదు. తను ఏ ఉద్యోగంలో వుంటే నేమిటి ? తను తనే. ఆచిన్న ఉద్యోగంలో వున్న తనను తనుగా ప్రపంచానికి చూపించుకోవటానికి పడరాని పాట్లూ పడ్డది. అంత పెద్ద వ్యక్తిత్వం అంత చిన్న ఉద్యోగంలో పట్టక ఎలా ఉక్కిరిబిక్కిరి అయిపోతోందో అనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావటానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తూనే ఉండేది. ఈ ప్రయత్నంలో ఎంతమంది ఆఫీసర్లను ఎన్ని రకాల సంతోషపెట్టటానికి ప్రయత్నించిందో ఆమెకే ఎరుక.
ఆమెకు ఆడవాళ్ళంటే (తన్ను చాలా గొప్పదిగా గుర్తించే వాళ్ళను తప్పించి) ముఖ్యంగా అందంగా వుండి కలుపుగోలుతనంగా వుండే వాళ్ళంటే మహారోత. వాళ్ళను చూస్తుంటే ఆమెకు ఈ ప్రపంచం నుంచి దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపించేది. మగవాళ్ళంటే ముఖ్యంగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వుండే మగవాళ్ళంటే వళ్ళు మండిపోయేది. ఆ మంటల వేడిమికి తాళలేక అప్పుడప్పుడు 'వాళ్ళ అవినీతి చర్యలను గురించి ఎలుగెత్తి అక్రోశించేది.' తనకు తెలిసిన ఆఫీసర్లంటేనూ, తనకు సహాయం చేసిన అఫీసర్లంటేనూ చాలా చాలా అభిమానం ఆమెకు. తనను గౌరవించే ఆఫీసర్లను వదిలివేయగా మిగిలిన అఫీసర్లలో "నీతి, న్యాయం" అనేవి కాగడా వేసి వెతికినా కనబడవని ఆమె ఖచ్చితమైన అభిప్రాయం.
ఏఏ ఆఫీసర్ల కార్ల నెంబర్లు ఏమిటో , ఏ ఏ కారులో ఏ ఏ రోజు ఏ ఏ అమ్మాయి ఎక్కి తిరిగిందో మిసెస్ కైలాసం చెప్పగలదు.
ఆఫీసర్ల అవినీతి కధలు చెబుతున్నప్పుడు ఆమె గుండెలో సుడిగుండాలు తిరుగుతాయి. ఆ సుడిగుండాల తాలుకూ సంచలనం ఆమె కళ్ళలో కనిపిస్తుంది.
అందం అనేదానికి ఆమె శరీరంలో ఆశ్రయం లభించని మిసెస్ కైలాసం జీవిత యాత్రలో ఎభయ్యో మైలు రాయికి దగ్గర దగ్గరగా వుంది.
మిస్టర్ కైలాసం ఏమయ్యాడో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. తెలిసినవాళ్ళు ఏవేవో కధలు చెబుతూనే వుంటారు.
ఆమెకు మగ ఆఫీసర్ల దగ్గర పని చెయ్యట మంటే చచ్చేంతటి భయం. కాని తనకు మగవాళ్ళ దగ్గర పని చెయ్యటం "అవమానం" అని చెబుతూ వుంటుంది -- మగ ఆఫీసర్లు యోగ్యతను గుర్తించరనీ కేవలం అందం గల ఆడవాళ్ళనే అభిమానిస్తారనీ ఆమె భయం. తనకు మగ ఆఫీసరు దగ్గర పనిచేయ్యాలిసి వచ్చిన మరుక్షణంలోనే రాజీనామా ఇచ్చేస్తాను అంటూ వుండేది.
మిసెస్ కైలాసం ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. అలాంటి క్షణం ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్న ఎంతమందికి వస్తుంది కనుక? మిసెస్ కైలాసం గజిటెడ్ ఆఫీసరు అయింది. ఆ వార్త వినగానే అఫీసరమ్మగారి గదికి చేరుకొని అంత శరీరాన్ని కుర్చీలో పడేసింది. చిరునవ్వుతో అఫీసరమ్మ మిసెస్ కైలసానికి ఆర్డరు కాగితం అందించింది. అందుకుంటున్న మిసెస్ కైలాసం చేతివేళ్ళు వణికాయి. మనస్సు ఏదో ఏదోగా అయిపొయింది. అరంగుళం పాము మందుకు నిప్పంటించినట్లు, ఏదో భావం ఆమె హృదయంలో బుసబుస లాడుతూ పైకి లేచి, బయటపడే మార్గం దొరకక వంగి మెలికలు చుట్టుకు పోసాగింది. తన శరీరంలోని ప్రతి జీవాణువూ "ఇంతింతై వటుడిం' నట్లు పెరిగి పోతున్నట్లనిపించింది. అసలే పొడవైన తను ఇంకా ఇంకా చాల పొడవుగా, ఎత్తుగా పెరిగిపోయినట్లనిపించింది మిసెస్ కైలసానికి. ఎలాగో తన మూర్చ తాను తెలుపుకొన్నదై అఫీసరమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంది. బయటకు వస్తున్న మిసెస్ కైలాసానికి కాళ్ళు నేలకు అననట్లూ , కళ్ళు పైకి చూస్తున్నట్లూ అనిపించి సరిగా నడవలేక నడిచింది.
తనకోసం ప్రత్యేకంగా ఎర్పటయిన గదిలో కాలుపెడుతున్న మిసెస్ కైలాసానికి ఎవరెస్టు శిఖరం మీద కాలు పెడుతున్నట్లనిపించింది. గదిలో అడుగు పెడుతూనే ఆశ్చర్యంతో ఆగిపోయింది. ఇంత పెద్దగది తనకోసమే? తన ఒక్క దాని కోసమే? అవును తనకోసమే! ఇంకా సందేహం ఎందుకు? గదిలో సగభాగాన్ని ఆక్రమించుకొని, పాతకాలపు పందిరి మంచంలా వున్న ఆ పెద్ద టేబులు కూడా తనకోసమే! టేబుల్ మీద బెల్ కూడా వుంది. ఆ బెల్ మీద పొరపాటున చెయ్యి పడ్డా పరుగెత్తుకొచ్చి తనముందు వినయంగా నిల్చోనే ఫ్యూన్ - ఇవన్నీ తనకోసమే! ఆమెకు మతి పోయినట్లయింది. ఏదో మత్తు ఆమె శరీరాన్నీ, మెదడునూ కప్పి వేస్తున్నట్లుంది. ఏమిటబ్బా ! తనకు అదోలా తమాషాగా వుంది. అనుకుంటూ వెళ్ళి తనకోసం ప్రత్యేకించబడిన కుర్చీ మీద కూర్చుంది. కూర్చుంటూనే కుర్చీ గిర్రున తిరిగినట్లయింది. దాంతో పాటు మిసెస్ కైలసానికి బుర్ర కూడా గిర్రున తిరిగినట్లయింది. ఆమెకు ఆ క్షణంలో అర్ధం కాలేదు. తనకు బుర్ర తిరుగుతున్నటుండటానికి కారణం తనను చుట్టి వేస్తున్న మత్తే ననీ, ఆ మత్తు ప్రపంచంలోని అన్ని మత్తుల కంటే ఘాటైన మత్తనీ, దానికి విరుగుడు లేదనీ , అది అధికారం మత్తు అనీ.
మత్తులో దిమ్ముగా వున్న మిసెస్ కైలాసం బుర్రలో మెరుపులా ఓ ఆలోచన తళుక్కుమంది. ఇప్పుడు తను అందరి లాంటి మనిషి కాదు. ఇప్పుడు తను మందలో మనిషి కాదు. అదే మాబ్ అంటే మంద, గొర్రెల మందలో ఒక గొర్రె కాదు. తను తోడేలు - ఛ తోడేలు కాదు. మరి ........మరి ........! తనేమిటో తనకే తెలియటం లేదు. తను వందలో మనిషి కాదు. పదిమందిలో మనిషి. అసలు ఆమాట కొస్తే తను ఎప్పుడు మాత్రం మంద -- అదే - మాబ్ మనిషి? కాకపోతే చిన్న ఉద్యోగంలో వున్నందువల్ల మూర్ఖులు గుర్తించలేదు. అంతే.
