Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 44


    మొదటి క్షణంలో మాలతి యోగ క్షేమాలగురించి అడిగి తెలుసుకోవటమే సరిపోయింది. ఆ తరువాత ఫిజోతో పరిచయాలు పూర్తి అయినాయి.
    ఆ పైన అర్ధమానవుణ్ణి గురించి తెలుసుకోవాలన్న ఉబలాటంతో వారు ప్రశ్నలు ప్ర్రారంభించినారు.
    
                   ౦    ౦    ౦
    

    ఆడపిల్లలకు సహజంగా ఉండవలసిన రవంత పాలు ఎక్కువ చురుకుదనం ఆ అమ్మాయికి లేదు. మనిషి బరువు యిద్దరు యువతులకు సమానం తొంభై ఆరుకిలోలు.
    ఆవయసులో అంతబరువు అసాధారణమని ఆరోగ్యానికి మంచిదికాదని డాక్టర్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కాని ఆ అమ్మాయి తిండి తగ్గించలేదు. అరకిలో అయినా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించలేదు.
    మంచి బలం కలిగిన అరుదైన ఆడపిల్ల ఆమె పేరు పార్వతి మిత్రమండలి అప్పుడప్పుడు ముద్దుగా పర్వతరం అని కూడా పిలుస్తుంటారు.
    ఆమె పిడికిలి బిగించి చేయి ఎత్తితే అందరూ హడలిపోతారు. పారిపోతారు.
    వాళ్ళ అన్నయ్య రెండు చేతులా సంపాదిస్తున్నాడు. పాపం పిల్లలుకూడా లేరు. ఇదికూడా ఒక్కతే చెల్లి కావడంతో ముద్దు చేస్తున్నాడు.
    ఇది ఎంత తిన్నా అతని సంపాదన ఒట్టిపోదులే అని వ్యాఖ్యానిస్తుండేది మాలతి అప్పట్లో.
    పార్వతి గుమ్మటంలా అమిత బలవంతురాలుగా తయారయింది. బాగా బొద్దుగా పిడికిలి బిగించి గ్రుద్ధితే పగిలి పోయే గుమ్మటంలా పిటపిటలాడుతూ కన్పిస్తుంది. తిండి గురించి తప్ప ఏ సంగతీ మాట్లాడదు.
    అలాంటి పార్వతి అర్ధ మానవుడి గురించి ఆసక్తి చూపుతూ మాట్లాడే సరికి అందరూ ఆశ్చర్యపడిపోయినాడు. మాలతి నవ్వింది.
    "నువ్వు ఒక్క దానివి రేపటి ఉదయం మాయింటికిరా అర్ధ మానవుడితో యింటర్వ్యూ ఏర్పాటు చేయిస్తాను. మీ యిద్దరికి అభిప్రాయాలు కలుస్తాయేమో పరిశీలిస్తాను" అంటూ బదులు చెప్పింది మాలతి.    
    ఆ మాటవిని మిత్రమండలి యావత్తూ పరుగెత్తే రైళ్ళు ఆగిపోతాయేమో అనిపించేంత బిగ్గరగా నవ్వటం ప్రారంభించారు.
    వారి నవ్వుల సందడికి రైల్వే ఫ్లాట్ ఫారం పై కప్పులు అదిరిపడినాయి.
    వెనుక రెండు కార్లనిండా వస్తున్న మిత్రమండలితో సైతం ప్రస్తుతం జరుగుతున్న చర్చ అర్ధమానవుడి గురించే. వారు అతడి గురించి ఏమీ ఊహించలేకుండా ఉన్నారు. అనుక్షణం ఆసక్తి అధికాధికమవుతోంది.
    కార్లు మాలతి యింటిముందు ఆగాయి. అందరూ హాలులో కూర్చున్నారు.
    మాలతి తనగదిలోకి వెళ్ళి మాధవకు ఫోను చేసింది. ఆమె ప్రియతముడు నిష్టూరాలు ప్రారంభించాడు.
    
                     ౦    ౦    ౦
    
    ఆ సాయంత్రం మాధవతో చేయి కలిపి నడుస్తోంది మాలతి. పర్వతారోహణ కోసం వెళ్ళిన మాలతికి ఎదురయిన అనుభవాలు మధునిబాగా కదిలించినాయి. "ఇటువంటి సాహసాలు పేరు ప్రతిష్టలు తెచ్చి పెడతాయోకానీ బ్రతుకు నరక ప్రాయమవుతుందని తెలుసుకోవాలి నువ్వు. ఇక నయినా ఇటువంటి ప్రయత్నాలు మానెయ్యాలి" అన్నడు మధు. మాలతి నవ్వింది.
    "మధూ! ఏదో చెయ్యాలన్న ఆరాటం మనస్సుతొలుస్తోంది. అయినా ఇంక నగరాన్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాను. ఒక పెద్ద బాధ్యతను వెంట పెట్టుకుని వచ్చాను కదా" అన్నదామె.
    "అయితే అతణ్ణి ఏమి చేయదలచావు. ఎక్కడో జనావాసాలకు దూరంగా సుదూరంగా జీవితం గడుపుతున్న ప్రకృతిపుత్రుణ్ణి చేరదీశావు. అతనికి ఈ లోకం తెలియదు. ఈ మనుషుల మధ్య మసలుకోవటం తెలియదు.
    బ్రతికినంత కాలం అతణ్ణి నీవు దగ్గరుండి చూచుకోవటం సాధ్యంకాదు కదా! అందుకని నువ్వు తొందర పడ్డావని నాకు అనిపిస్తోంది. ఈ క్రొత్త వాతవరణాన్ని అతడు సరిగా అర్ధంచేసుకుని యిమిడిపోతే కొంత నయం.
    అలాజరగని పక్షంలో ఎదురు అయ్యే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా!" అన్నాడతడు.    
    తన ప్రియతముడయిన మధు మాటల్ని ప్రశాంతమయిన మనసుతో విన్నదామె. అందు గురించి ఆలోచించింది.
    అతడు తన శ్రేయఃకామనతో మాత్రమే అటువంటి సలహా యిచ్చాడని గ్రహించిందామె. అయితే అతని భయం నిష్కారణమయినది. మానవ ప్రాణి కారణాంతరాల వల్ల కొంతకాలం మనుషులకు దూరంగా ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత అతడెన్నటికీ మనుషుల మధ్య యిమిడిపోతాడన్నది ఆధారం లేని అనుమానం. అటువంటి అపనమ్మకం తనకు రాదు. రాకూడదు.
    చాల త్వరలో అతడు మనుషులమధ్య వారితో సమాన మయిన స్థాయిలో వినూత్న మయిన జీవితం ప్ర్రారంభించగలడనే తను నమ్ముతోంది.
    అయితే తనకు ప్రియతముడు, కానున్న జీవిత భాగస్వామి అయిన మధు యీవిషయంలో తనతో ఏకీభవించాలి అతనికి యిష్టంకూడా మానవతా దృష్టితో తాను తీసుకున్న ఈనిర్ణయాన్ని అతడు ఆమోదించడం ఈ కృషిలో అతడు కూడా భాగస్వామి కావాలి. అందుకోసం మధు తనతో చేయికలిపి సహకరించే విధానం అతడిని ఒప్పించాలి.
    ఇంత వరకూ అర్ధమానవుడి గురించి తాను చెప్పిన మాటలు పేపర్లో వచ్చిన వార్తలు మాత్రమే అతనికి తెలిశాయి. ప్రత్యక్షంగా చూడ లేదు.
    తనతో పాటుగా మధుని అర్ధమానవుడి దగ్గరకు తీసుకువెళ్ళాలనుకుంది మాలతి. వెంటనే అతణ్ణి కూడా తిరుగుప్రయాణం చేయించింది.
    యింటి ముందు లాన్ లో ఫిజో దగ్గర కూర్చుని ఉన్నాడు అర్ధమానవుడు. అతడు నగరానికి వచ్చిన క్రొత్తలో కనిపించిన చెట్లన్నీ ఎక్కాలని ప్రయత్నించేవాడు. కాదని వారించిన వారి మీద కోపగించే వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS