"నీ చనువూ, చొరవా చూచి అనిపించింది."
"నేను చనువుగా చొరవగా నిష్కల్మషంగా వుంటే మా అక్క కూడా అట్లా వుండాలని నియమం యేముంది?"
"అదీ నిజమే!"
"అయినా అక్క మంచిది అనే నీకు అన్పిస్తోంది అవునా?"
"అవును."
"అలాగే నీ కత్తి చూచి నీ వీరత్వం వూహించాను."
"మాటలు బాగా నేర్చావు సుమా!" అన్నాడు వెంగళరాయుడు.
"మహారాణి కాబోయే వాళ్ళకి మాటలు రాకుండా యెట్లా?"
"అబ్బో యే దేశానికి మహారాణి అవుతావు?"
"కిరీటం పెట్టుకునేవాళ్ళనే పెళ్ళాడుతాను."
"అయితే నాలాంటివాళ్ళకు యిహ పెళ్ళిళ్ళు కావు" అంటూ బాధ నటించాడు వెంగళరాయుడు. ఆమెతో అలాగే యింకాస్సేపు సరసాలు సాగించి తన దారిన వెళ్ళిపోయాడు. జగ్గమాంబ అక్క దగ్గర చేరింది.
"అక్కా నీ పెంటిపావురం జంటదగ్గరకు పోయింది"
"ఇట్లాంటి చేష్టలు చెయ్యటానికి నీకు సిగ్గు అనిపించదూ!" అని. అడిగింది మల్లమ్మ.
"ఎందుకూ సిగ్గు?"
"ఈ పావురం కధలన్నీ వారికీ చెప్పావా?"
"ఓ చెప్పాను చిన్ని బావనుకూడా చూచే వచ్చాను."
"ఎందుకు చూడవు తల్లీ! పెళ్ళి అన్నదగ్గరనించీ పెట్రేగిపోయి నావు. నాకు ఆటవిడుపు అయింది" చుట్టూ యెవరూ వినకుండా చూచి జగ్గమ్మమీద విరుచుకుపడింది మల్లమ్మ.
గోపాలకృష్ణ రంగారావుగారి దగ్గరకు యీమె వెళ్ళి యేదయినా తప్పుగా మాట్లాడిందేమో! ఆయనకు కోపం వచ్చిందేమో! అని ఆమె అనుమానం.
"అయితే అప్పుడే ఆయనతో చూపు కలిపావన్నమాట?"
"అప్పుడా? యెప్పుడూ?" అయోమయంగా అడిగింది మల్లమ్మ.
"అడవిలో?"
"అడవిలో చూపు కలపటం యేమిటీ?"
"రెండేళ్ళక్రితం మనం గుర్రపుస్వారీకి వెళ్ళాం. ఒక యువకుడు మనకన్నా వేగంగా గుర్రాన్ని పరుగెత్తించాడని నేను వెనక్కు పిల్చి ఆటలు పట్టించాను గుర్తుందా?"
"అవును నువ్వు చేసే పనులు యెట్లా మరుపుకి వస్తాయి."
"ఆయనతో నువ్వు చూపు కలిపావా లేదా?"
"ఛీ, ఛీ నోరుముయ్యి."
"అప్పుడుకూడా యిట్లాగే నా నోరు నొక్కి నువ్వు ప్రేమలో పడ్డావు."
"అట్టే వాగకు."
"ఎందుకమ్మా చేసేదంతా చేసి నన్ను కసురుకుంటావు?"
"అలా అనకూడదమ్మా!"
"ఎందుకనకూడదు. బాగానే అనొచ్చు. ఆయనే గోపాలకృష్ణ రంగారావు."
"అవునా? నిజమా?"
"అవునక్కా అయన నాకు బావగారు. నీకు భర్తగారు."
"ఈ విషయంకూడా వారిదగ్గర చెప్పావా?" సిగ్గుతో అడిగింది మల్లమ్మ.
"చెప్పకుండా యెట్లా వుంటాను?" జగ్గమాంబ యెదురు ప్రశ్న.
మల్లమ్మదేవి యిహ ఆ విషయాన్ని పొడిగించకుండా వూరుకుంది.
"అక్కా, నీ పావురం బావగారి పావురంతో క్షణంలో జట్టు కలిపింది."
"ఘనకార్యం చేసొచ్చావులే. అరవకుండా కూర్చో."
"చెట్టుకొమ్మమీద చక్కగా రెండు ఆనుకుని కూర్చున్నాయి కువ కువలాడుకుంటున్నాయి"
మల్లమ్మదేవి ఆ మాటలు శ్రద్దగా వింది. ఆమె వింటుందని జగ్గమాంబకు తెలుసు. కాని జగ్గమాంబకు తెలియని సంగతి ఒకటుంది.
తన మాటలు యిష్టంగా వింటూనే- "అలా అనకు, యిలా అనకు" అని సన్నాయి నొక్కులు నొక్కుతారెందుకు వీళ్ళు?
ఇష్టమైన మాటల్ని హాయిగా ఒకటికి రెండుమార్లు అడిగి చెప్పించుకుని వినొచ్చుకదా' పధిసార్లయిఆ చెప్పటానికి తను సిద్దంగానే వుందాయె!
వెంకమాంబ అటుకేసి రావటంతో వాళ్ళ మాటలు ఆగిపోయినాయి. మల్లమ్మను తలంటు చేయించటానికి తీసుకుపోయింది వెంకమాంబ.
బిక్కు బిక్కుమంటూ కూర్చుంది జగ్గమాంబ ఒక్కతీ! కాస్సేపటికి యెవరో వచ్చి ఆమెనూ పిల్చారు తలంటుకు. స్నానాలగదిలో కమలక్క వుంది. ఆమె జగ్గమాంబను యెక్కువగా మాట్లాడనివ్వలేదు. మాటకు మాట అంటిస్తూ "జగ్గమాంబ నోరు మూతపడేలా చేసింది.
తలంట్లు అయ్యాక వెన్నెలకన్నా, మల్లెపూలకన్నా తెల్లనయిన మొక్కజొన్న అన్నంలో పాలుపోసుకున్న అన్నం తినిపించారు. అక్క ప్రక్కనవుండే జగ్గమాంబకుకూడా అన్ని రాజలాంఛనాలూ జరుగుతున్నాయి. తలంటు అయ్యాక వేడి వేడి అన్నం తినగానే జగ్గమాంబకు నిద్రముంచుకు వచ్చింది వొళ్ళు తెలియకుండా నిద్రపోయింది.
అప్పచెల్లెళ్ళకు మెలుకువ వచ్చేసరికి మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. యెవరో లేపితే నిద్ర మెలుకువ వచ్చింది తల్లి చన్నీళ్ళు తెచ్చి కళ్ళు తడిపింది. కలలోంచి లేచినట్లుగా లేచారు అప్పచెల్లెళ్ళు.
అక్కతోపాటు చెల్లెల్నికూడా తోడు పెళ్ళికూతుర్ని చేశారు. ఆ రోజు ఆనందమంతా మల్లమ్మది అయితే సందడి అంతా జగ్గమాంబది అయింది. ఆ సందడి రాజాము ప్రభువు ప్రభువు తాండ్ర పాపారాయుడితో ప్రారంభమయింది.
తాండ్ర పాపారాయుడు చామనచాయతో మధ్యరకం యెత్తులో అంత లావూ, అంత సన్నమూ కాని మనిషి పడిగమీసం ఆయన పౌరుషానికి చిహ్నం. అలంకారంకూడా.
చెల్లెమ్మా అంటూ వచ్చాడు పాపారాయుడు. వినయవిధేయతలతో ఆయన మాటలకు బదులు యిస్తోంది మల్లమ్మ.
"రామరాయుడువారికి ధర్మప్రభువు అనే పేరుంది. విజయరామ రాజు చెప్పే పితూర్లు నిజామువరకూ వెళ్ళినాయి. కప్పం బకాయిపడి పోయిందట. నాకు శ్రీకాకుళం వెళ్ళితే యీ విషయం తెలిసింది" అన్నాడు పాపారాయుడు అయన పెద్దవాళ్ళ దగ్గర అయినా పసివాళ్ళ దగ్గర అయినా యిటువంటి విషయాలే మాట్లాడుతూ వుంటారు.
