Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 44


    వెంకటపతికి గుర్తొచ్చి "మర్చిపోయా!" అన్నాడు.
    "ఇంకా నయం, నేనుకూడా మర్చిపోతే పరువు పోయేది. త్వరగావెళ్ళి పట్టుకురండి" అన్నది వరూధిని.
    "ఆయనకు మనిల్లు తెలుసుగా! అయినా అప్పుడే ఎందుకూ? రాత్రికిగా భోజనాలూ?" తెలివిగా అన్నాడు వెంకటపతి.
    "అయ్యో తెలివి? బజారుకెళ్ళి సరుకులు తెమ్మని సంచీ డబ్బూ ఇస్తే, ఆయన్ను పట్టుకొస్తా నంటారేం?" వచ్చేనవ్వును ఆపుకోకుండానే అనేసింది వరూధిని.
    "ఏమేమేం తెమ్మంటావ్ మరి?"
    "ఒక కోడిపెట్ట. ఒకటి సరిపోతుందిలే! ముదుర్ధి పట్టుకురాకండి! చేపలు బొచ్చలుంటే అవీ-లేకపోతే కొరమీన్లు తీసుకోండి. కిస్ మిస్ - ఆఁ ఒక అర్ధశేరు హల్వా... ఇంకా..... ముందు అవి పట్టుకురండి!"
    గడపదాటుతున్న భర్తను వెనక్కు పిల్చి "ఆంద్రరత్న కిల్లీ షాపులో రెండు స్పెషల్ కిళ్ళీలు.....దగ్గిరుండి కట్టించుకురండి. ఎన్ని చెప్పాను? రెండా? మూడు కిల్లీలు తీసుకోండి. అక్కడే కూర్చోకండి. ఇక్కడున్నట్టు రావాలి!" చెప్పింది వరూధిని.
    ఇంకా ఏమన్నా చెబుతుందేమోనని మరోనిముశం నిలబడి, తర్వాత చెప్పినవి గుర్తు చేసుకొంటూ సంచి ఊపుకుంటూ రోడ్డుమీద కొచ్చాడు వెంకటపతి.
    వెంకటపతి బజారునుంచి వచ్చేసరికి వరూధిని డ్రాయింగ్ రూమూ, డైనింగ్ రూమూ దులిపి శుభ్రంగా కడిగించింది. కుర్చీలమీదున్న దిండ్లకు కొత్త గలీబులు వేసింది. ఇంటిముందున్న మూకల పూలూ, ఆకులూ కోసి ఫ్లవర్ వాజుల్లో పెట్టింది. పనిపిల్ల కమలమ్మ చేత గిన్నెలన్నీ శుభ్రంగా తోమించి పెట్టింది. వెంకటపతి సామానులు తీసుకొని ఇంటికి రాగానే, తర్వాత గుర్తొచ్చినవి అన్నీ ఏకరువుపెట్టి మళ్ళీ బజారుకు పంపించింది. వెంకటపతి మళ్ళీ వెళ్ళటానికి బద్దకించి విసుక్కుంటూ వెళ్ళాడు.
    రాత్రి ఎనిమిది అయింది. వరూధిని డిన్నర్ ఏర్పాట్లన్నీ పూర్తిచేసి, పన్నీరు చల్లుకుని స్నానం చేసి, పట్టుచీర కట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని, సెంటు ఘుమఘుమల్ని వెదజల్లుతూ, డ్రాయింగ్ రూంలో వెంకటపతికి ఎదురుగా కూర్చొని, ఎదురు చూడసాగింది.
    ఇంటిముందు కారాగి, తలుపు తెరిచి, మళ్ళీ మూసిన ధ్వని వినిపించగా వరూధినికి వళ్ళు ఝల్లుమంది.
    "రామనాథబాబుగారు వస్తున్నట్టున్నారు!" భర్తను హెచ్చరిస్తూ అన్నది వరూధిని. వెంకటపతి లేచి, కారు దిగి వస్తున్న రామనాథబాబుకు ఎదురు వెళ్ళాడు. ఆయన వెనకే లోపలకు వచ్చాడు.
    సోఫాలో కూర్చున్న రామనాథబాబును హ్కోసి వరూధిని కళ్ళు మిలమిల మెరిశాయి. మనసులో రంగులు విరిశాయి.
    "కమలా! కమలా!" మృదువుగా పనిపిల్లను పిలుస్తూ డైనింగ్ రూంలోకి వెళ్తున్న వరూథిన్ని వారిస్తూ అన్నాడు రామనాథబాబు-
    "భోజనానికి తొందరేంలేదు. ఇలా వచ్చి కూర్చోవచ్చుగా కాసేపు?" వాచీ చూసుకొన్నాడు.
    "మీకు ఆలస్యం అవుతుందేమోనని?" హంసలా తిరిగి నడిచివచ్చి సోఫాకు ఎదురుగానువ్వు కుర్చీలో కూర్చుంది వరూధిని.
    "అబ్బే, అదేంలేదు రోజూ నా భోజనం అయేసరికి పదిగంటలు దాటుతుంది" అన్నాడు రామనాథబాబు.
    "అబ్బా! అంత ఆలస్యంగా భోజనం చేస్తారా?" తెచ్చి పెట్టుకున్న ఆశ్చర్యాన్నంతా కళ్ళలో తిప్పుతూ అన్నది వరూధిని.
    "సెకండు షో బుకింగ్ అయేదాకా హాలు దగ్గిరే" అంటూ త్రీ ఫైవ్ టిన్నులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకొన్నాడు. ఎదురుగావున్న వెంకటపతిని చూసి 'సారీ' అంటూ టిన్ను మూత తీసి అందించాడు. వెంకటపతి సందేహిస్తూ "సిగరెట్ అలవాటు లేదు; చుట్టూ - తప్పితే బీడీ!" అన్నాడు.
    వరూధిని ముఖం కందిపోయింది. రానినవ్వు తెచ్చుకుంటూ రామనాథబాబు కేసి చూసింది.
    "ఫర్వాలేదు. తీసుకోండి!" అంటూ తనే టిన్నులోనుంచి తీసి వెంకటపతి కిచ్చి, లైటర్ వెలిగించి సిగరెట్ ముట్టించాడు. రామనాథబాబు కబుర్లు చెపుతుంటే వరూధిని తన్మయత్వంలో పడి వినసాగింది. వెంకటపతి సిగరెట్ దమ్ము లాగుతూ కూర్చున్నాడు. మాటల సందర్భంలో తాలూకాఫీసు పక్కన వరూధిని పేర వెంకటపతికొన్న స్థలం ప్రసక్తి తెచ్చాడు రామనాథబాబు.
    "ఆ స్థలంలో ఏం చెయ్యబోతున్నారు?"
    "ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం" అన్నది వరూధిని.
    "ఎకరం పైగా వుంది. మెయిన్ రోడ్డు మీది స్థలం. ఎంత ఇల్లు కట్టినా ఇంకా బోలెడు చోటు మిగిలిపోతుంది" అన్నాడు రామనాథబాబు.
    "రోడ్డుదరిని కొట్లూ, లోపలవైపు గదులూ కట్టిస్తే బాగా అద్దెలు వస్తాయని చెప్పాడు కనకయ్య" అన్నాడు వెంకటపతి చివరిదాకా సిగరెట్ దమ్ములాగి.
    "ఆమాట నిజమేననుకోండి! కాని ఆ స్థలానికి ఇప్పుడు చాలా డిమాండ్ వచ్చింది. అమ్ముకుంటే లాభం వస్తుంది" అన్నాడు రామనాథబాబు.
    "ఏమాత్రం లాభం ఉంటుందంటారు?" అడిగాడు వెంకటపతి.
    "భోజనాలకు లేవండి, లాభం సంగతులు తర్వాత చూసుకొందురుగాని" అంటూ వరూధిని డైనింగ్ టేబుల్ దగ్గరకు దారి తీసింది.
    ఆమె స్వయంగా వడ్డించి పక్కన నిలబడింది.
    "మీరు కూడా కలిసే భోంచేయొచ్చుగా?" అన్నాడు రామనాథబాబు.
    నువ్వు కూర్చోకపోతే ముద్దా కలపను అన్నట్లు మాట్లాడి రామనాథబాబు వరూథిన్ని భోజనానికి కూర్చోపెట్టాడు.
    చేప ముల్లు తీస్తూ వెంకటపతి అడిగాడు "అమ్మితే ఎంత వస్తుందంటారు?"
    "డెబ్బై యనభై వేలదాకా రావచ్చు. మీరు కొన్నది ఏభైకి కదూ? ఇరవై వేలు లాభం వస్తుంది."
    వెంకటపతి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. భర్త గొంతులో  చేపముల్లు గుచ్చుకుందేమోనని భార్య గాబరాపడింది.
    ఇరవై వేలు లాభమా?
    పెళ్ళాం బలవంతంమీద, తండ్రి ఇవప్పెట్టెలో వున్న ఇరవైవేల పైచిలుకు డబ్బు తెచ్చి, కనకయ్య దగ్గిర వడ్డీకి ముఫ్ఫైవేలు తీసుకొని రామనాథబాబు ప్రోత్సాహంతో, ఏభైవేలుపోసి స్థలంకొన్న వెంకటపతి, స్థలం రిజిష్టరయిన మర్నాటినుంచీ, ఘోరమైన తప్పుచేసినవాడిలా బాధపడసాగాడు. దాంతో తండ్రితో తెగతెంపులు చేసుకొన్నట్టే భావిస్తూ లోలోపల కుమిలిపోతూ దిగులు దిగులుగా తిరుగుతూన్న వెంకటపతి మనసులో కొత్త ఆశలు మోసులెత్తాయి. తను చేసింది లాభసాటి బేరమా? వారం పదిరోజుల్లో ఇరవైవేలు సంపాదించాడు. డెబ్బై ఎకరాల వ్యవసాయం-అదీ స్వంతంగా చేసుకొంటే ఎంత వస్తుంది? ఖర్చులు పోను మిగిలేదెంత? రెండేళ్ళ వరుంబడి కలిపినా ఇరవైవేలు కాదు. అమ్మేసి-కనకయ్య అప్పు తీర్చేసి---నలభైవేలు తీసుకెళ్ళి తండ్రి చేతిలో పోస్తే ఎంత ఆనందిస్తాడు? తన ప్రయోజకత్వానికి ఎంత మురిసిపోతాడు? ఇక తనేం చేసినా అడ్డం చెప్పడు. తన తెలివితేటలమీదా, వ్యవహారదక్షతమీదా తండ్రికి గురి ఏర్పడుతుంది.
    రామనాథబాబు ఏదో జోక్ వేశాడు. వరూధిని పకాలున నవ్వింది.
    వెంకటపతి ఆలోచనలు చెదిరిపోయినై. భార్యకేసి చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అంతా దాని బుర్రే ఇది! వరూధిని తెలివైంది. పదిరోజుల్లో ఇరవైవేలు లాభం వచ్చే పని చేయించింది తనచేత. రామనాథబాబులాంటి వాళ్ళతో పరిచయం లేకపోతే స్థలం కొనడం జరిగేదా? వరూధినికి పెద్దవాళ్ళతో మాట్లాట్టం తెలుసు. తెలివిగలది. ఏ పనైనా సాధించే పట్టుదలా, నేర్పూ దానికుంది! తెలివితేటలున్న వరూధిని తనకు భార్య కావటం తన అదృష్టం! వరూధిని తండ్రి ఎగగొట్టిన కట్నం తాలూకు ఇరవైవేలూ వారం రోజుల్లో సంపాదించింది. అది దాని డబ్బే! ఆ మాట చెప్పి తండ్రి ముఖాన కొడ్తేసరి - ఆయన కోడల్ని ఇకనుంచి గౌరవంగా చూస్తాడు.
    వెంకటపతికి రామనాథబాబూ, వరూథినీ మాట్లాడుకుంటున్నదేమీ బుర్రకు ఎక్కడం లేదు. అతని ఆలోచనలన్నీ లాభంగా రాబోతున్న ఇరవైవేల రూపాయల చుట్టూనే తిరుగుతున్నాయి.
    మాంసం పీకి కోడి ఎముక కింద పెడ్తూ "అమ్ముతామండీ, ఇరవైవేలు లాభం వస్తే?" అన్నాడు వెంకటపతి.
    "అమ్మడాని కేమిటి కొన్నది?" కోడిమాంసం రుచికంటే వరూధిని గొంతే ఎక్కువ రుచిగా తోచింది వెంకటపతికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS