ఒకరోజు ఉదయం సావిత్రిగారి వర్క్ చేస్తున్నాం. ఓవర్ లేప్స్ వుండే చోట కాంబినేషన్ వుండే ఆర్టిస్టుల్ని కూడా పెట్టాం.
అందులో - నన్ను మొదట్లో ఈర్ష్యించుకున్న 'నాయకురాలు' కూడా వుంది. శ్రీశ్రీగారు మంచి మూడ్ లోకి వచ్చారు. నేను వున్న మూడ్ కూడా పోకుండా కంట్రోల్ చేసుకున్నాను.
గడ్డంకింద ఎడమచేతి బొటనవేలు, పాపిడికి తగిలేలా చూపుడువేలు పెట్టుకొని శ్రీశ్రీగారు ఆమెవైపే చూస్తున్నారు.
* * *
శ్రీశ్రీగారి టైం సెన్స్
శ్రీశ్రీగారు థియేటర్ లోనే కూర్చున్నారు కానీ నాకు సహాయపడలేదు. నాకు చెప్పలేనంత ఏడుపుతోపాటూ కోపం కూడా వస్తోంది.
"ఏవండీ - అలా చూస్తూ కూర్చోకపోతే, ఆర్టిస్టుల లిప్ ఫాలో అవకూడదండీ" అని అడిగాను.
"నువ్వు చూస్తున్నావుగా".
"నావల్ల కాలేదండీ" అన్నాను.
"తాపీగానే కానీయ్ మరేం మునిగిపోలేదు" అన్నారేగానీ కదలలేదు.
ఆ అమ్మాయి వెళ్ళి సరిగ్గా వారి పక్కనే కూర్చుంది.
ఉదయం కాల్ షీట్ టైం కూడా అయిపోవచ్చింది. అరగంటలో లంచ్ బ్రేక్ రానే వచ్చింది. మూడు గంటలకి వస్తామని సావిత్రిగారు, జగ్గయ్యగారు, కన్నాంబగారు వెళ్ళిపోయారు.
"సరే, యింటికి వెళదామా?" అనడిగాను.
"ఈ రోజు ఇక్కడే భోంచేద్దాం" అన్నారు.
"మీరిక్కడ తినడానికి వీల్లేదు" అన్నాను.
"వీల్లేదనడానికి నువ్వెవరు?" అన్నారు.
"నేనెవర్నీ కాను గానీ, మీరు యింటికి వెళ్ళి స్నానం చేసి, ఫ్రెష్ గా, మంచి బట్టలు వేసుకొని రండ"న్నాను.
"నీ పట్టుదల ఏమిటి?".
"ఇందులో పట్టుదల ఏముందండీ? మీరెప్పుడైనా స్టూడియోల్లో భోంచేశారా?" అనడిగాను.
ఏమనుకున్నారో ఏమో - "వెంటనే వచ్చేస్తాన"ని చెప్పి వెళ్ళిపోయారు.
ఆయన యింటికి వెళ్ళి వచ్చేవేళకి, నేను థియేటర్లలో కూర్చొని నా టేబుల్ ముందు ఒక ఆర్టిస్టుతో మాట్లాడుతున్నాను.
అందరూ బయట కూర్చున్నారు. పనిచేసే ఆపరేటర్స్, అసిస్టెంట్స్, ఇంజనీర్ అక్కడే వున్నా టేబుల్ మీద నడుం వాల్చారు.
తిన్నగా శ్రీశ్రీగారు లోపలికి వచ్చి "ఏం చేస్తున్నానవ"ని అడిగారు.
"అతనితో మాట్లాడుతున్నాను" - అని జవాబిచ్చాను.
"అందుకే నన్ను యింటికి వెళ్ళమన్నావా?" అనడిగారు.
"ఛీఛీ! అసహ్యంగా మాట్లాడకండి" అన్నాను.
"వాడితే నీకేమిటి మాటలు?".
"నేను అతనితో మాట్లాడితే మీకెందుకండీ అంత బాధ?" అన్నాను.
"నేను సహించలేను సరోజా!" అన్నారు.
"ఇది మరీ బాగుంది ఎవరాయినా వింటే నవ్విపోతారు".
"నువ్విలా అందహ్రితో మాట్లాడుతుంటే నవ్వకేం చేస్తారు? మనకి గౌరవం ఏం వుంటుంది?" అన్నారు. ఆయన కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి.
"ఆర్టిస్టులతో మాట్లాడ్కితే గౌరవం పోతుందా? నేనున్నా చోటుకి ఆయన వచ్చారు కానీ అయన వున్న చోటుకి నేను వెళ్ళలేదన్నాను"
"అదికాదు సరోజా! డిసిప్లిన్ వుండొద్దా".
"అది నాకు మాత్రమే పరిమితమా, లేక అందరికీ వర్తిస్తుందా?" అనడిగాను.
"నీ ఉద్దేశం?"
"అడిగినదానికి సమాధానం చెపుదురూ" అన్నాను.
"అవసరంలేదు" అన్నారు.
"నాకు అవసరమండీ మీ అంతట మీరే ఆడవాళ్ళ వెనకాలపడి మీ విలువ పొగొట్టుకుంటున్నారు. మీ చూపులూ మీరూ! అందరి దృష్టిలో చులకనై పోవడంలేదూ? అది డిసిప్లినేనా?
ఈ పిక్చర్ కి ముఖ్యులు మీరు రైటర్ గా ఎలా వుండాలి? ఎందుకలా దిగజారిపోతారు? నేను ఇంకొకరితో మాట్లాడితే మీరు సహించలేనంటున్నారు. నేను సహించగలను.
అది మీ యిష్టం. కాదనడానికి నేనెవర్ని? కానీ థియేటర్లో మీరే ఇలా ప్రవర్తిస్తే మిగిలిన వాళ్ళకి పట్టపగ్గాలుంటాయా? నాకు గౌరవ మర్యాదలు ఎవరైనా ఇచ్చేది మిమ్మల్ని బట్టేనండీ.
ఆ ఆర్టిస్టు తన వరకు మధ్యాహ్నం వస్తుందా, వస్తే ఎన్ని గంటలకి వస్తుందని అడగడానికి వచ్చారు. దీనికే మీకింత కోపం అయితే, మీ చిలిపి చేష్టలకి నాకెంత వుందాలి? నేను మీరన్న డిసిప్లిన్ కోసమే అవస్థపడుతున్నాను. కానీ, మీ పర్సనల్ విషయాలు నా కెందుకండీ!" - అని కసితీరా, అనలనుకున్న నాలుగు మాటలూ అనేశాను.
థియేటర్లో ఎవరూ లేరనుకోండి. పదిమందిలో వారిని అనే పని పెట్టుకోను. ఎందుకంటే - నాకున్న ప్రిన్సిపల్స్ లో అదొకటి.
వారేమీ మాట్లాడలేదు.
వారిని అన్ని మాటలన్నానేకానీ, నా మనస్సెంత బాధపడిందో చెప్పడానికి లేదు.
మాటకి మాట సమాధానం చెప్పేమనిషైతే వేరేసంగతి. 'భగవంతుడా! క్షమించు' అనుకున్నాను.
అయినా - నా మాటలు మనసులో పెట్టుకొని సమయంచూసి నా మీద విరుచుకుపడతారని నాకు తెలుసు.
* * *
హాల్లోనే ఫ్యాను కింద కూర్చున్నాను. బైటకి వెళ్ళలేదు.
సావిత్రిగారూ, జగ్గయ్యగారూ, కన్నాంబగారూ వచ్చారు. లూప్ వెయ్యగానే తిన్నగా టేబుల్ ముందుకొచ్చి కూర్చున్నారు. పుస్తకం తీసుకొని చెక్ చెయ్యడం ప్రారంభించారు. నేను పోర్షన్ పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురికీ యిచ్చేశాను.
"సరోజా!" - అని పిలిచారు.
"లూప్ వెయ్యగానే ఏం చెయ్యాలని చెప్పాను?"
"చెక్ చెయ్యాలని" చెప్పారు.
"మరి నువ్వేం చేశావు?"
"వాళ్ళకి పుస్తకాలు ఇచ్చానండీ"
"అంటే వీడు చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటనేనా నీ ఉద్దేశం?".
ఈ రోజు నా మీద కక్ష తీర్చుకోందే ఊరుకోరని గ్రహించాను. ఆరోజంతా కారాలూ మిరియాలూ నూరుతూనే వున్నారు.
కూర్చుంటే 'ఎందుక్కూర్చున్నావ'ని, నిల్చుంటే 'ఎందుకునిల్చున్నావని' అడగసాగారు. ఏ పనైనా చేస్తే తప్పు, చెయ్యకుంటే తప్పు.
'స్క్రీన్ ముందుకు వెళ్ళి డైలాగ్ చెక్ చెయ్య'మానేవారు వెళితే 'పిక్చర్ చూడడానికి వచ్చావా?" అని అడిగేవారు. వారి కోపానికి అర్ధంపర్ధం వుండేది కాదు. వారంటున్న మాటలకి, సతాయింపుకి నాకు థియేటర్లో ముళ్ళమీదన్నట్టుగా వుంది.
అందహ్రూ మమ్మల్నే చూస్తున్నారు. సావిత్రిగారూ వాళ్ళూ "ఏమయింది? ఎందుకలా చిరాకుపడుతున్నారు?" అని అడిగారు.
"ఏమీలేద"ని చెప్పాను.
ఆరోజు శ్రీశ్రీగారి అనవసరపు చిరాకుకి, కోపానికి హడలిపోయాను.
అలాగే పని పూర్తిచేశాం. మర్నాడు జగ్గయ్యగారి లూప్స్ మాత్రం ఉదయం తీస్తామని ప్లాన్ చేసుకున్నాం. అందుకు జగ్గయ్యగారు కూడా ఒప్పుకోని 'ఓ అరగంట ఆలస్యంగా వస్తా'నన్నారు అంటే - ఏడు గంటలకీ కాల్ షీటంటే, ఎదున్నారని వస్తానని చెప్పారు.
ఏదో - పని దెబ్బతినకుండా - ఆరోజు కాల్ షీట్ అయిపోయింది. శ్రీశ్రీగారితో నేను మాట్లాడలేదు. నాతో ఆయన మాట్లాడలేదు.
* * *
మర్నాడు ఇద్దరం ఆరుగంటల యాభై అయిదు నిముషాలకల్లా థియేటర్లో అడుగుపెట్టాం. 'ఈరోజు ఏ గొడవా లేకుండా, పని జరగాలి దేవుడా?' అనుకుంటూ కూర్చున్నాను.
మా యిద్దరి మధ్య మౌనం తాండవం చేస్తోంది. నేను మాట్లాడకుండానే టేబుల్ మీద పోర్షన్ల పుస్తకాలూ, స్క్రిప్ట్ పుస్తకం అన్నీ సిద్దంగా పెట్టేశాను.
మిగిలిన ఆర్టిస్టులంతా వచ్చేశారు. జగ్గయ్యగారి కోసమే వెయిటింగ్.
ఉదయం పదకొండు గంటలవరకూ జగ్గయ్యగారి సోలో లూప్స్ తీస్తూ వుంటే తర్వాత - సావిత్రి, కన్నాంబ, రమణారెడ్డిగార్లు వస్తారన్నమాట! అలాగే ప్లాన్ చేసుకుని కూర్చున్నాం. వేరే తియ్యాలన్నా మా ప్లానులో లూప్స్ లేవు.
