"తొందరేముంది. మరోసారి మాట్లాడుకుందాం!" దామోదరం లేచి వెళ్ళబోతూ అన్నాడు.
"రావుగారు కంగారుపడ్డారు. "లేదు లేదు, మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. నేను నీతో మంచిగా చేయి కలపాలని చూస్తున్నాను. డబ్బు ఒకటే కాదు. నా స్నేహంవలనకూడా నీకు ఎంతో మేలు జరుగుతుందికాని, కీడు జరుగదు. కూర్చోదామోదరం!" నచ్చచెప్పే ధోరణిలో నవ్వుతూ అన్నారు రావుగారు.
"ఏమిటో మీరు మరీ బలవంతం చేస్తున్నారు. స్నేహం గ్నీహం అంటున్నారు కాబట్టి, సరే ఆలోచిస్తాను" అంటూ కూర్చున్నాడు దామోదరం.
"ఈ తుచ్చుడితో నా తనకు స్నేహం" లోలోపల పళ్ళు నూరుకుంటూ పైకి మాత్రం థ్యాంక్స్! అన్నాడు రావుగారు.
తెలివిగల రావుగారు ఆ క్షణంలో అతి తెలివికిపోయి. పూర్తి తెలివితక్కువ వ్యవహారంలోకి దిగుతూవుంటే తెలివి తక్కువ దామోదరం అతి తెలివితేటలు పెంచుకుంటూ తెలివిగా వ్యవహరిస్తున్నాడు. జయాపజయాలు తారుమారు అయ్యే పరిస్థితి వచ్చినపుడు ఎంతటి తెలివిగలవాడయినా బోల్తాపడతాడు. తెలివితక్కువగా బోల్తా పడినవాడు తెలివిగా పైకి లేస్తాడు. ఈ గేమ్ ని విధి ఆడే వింత నాటకం అంటారు.
"రావుగారూ! మీతో నాకు విరోధమేమీలేదు. నాకు కొంచెం ఎక్కువ మొత్తం డబ్బు అవసరమయిన మాట నిజమే మీరు మీ మనసులోది, మీరు అనుకుంటున్నది, మీకు తెలిసిందీ మొత్తం చెప్పేయండి. నేను కాస్త ఆలోచించుకుని నా నిర్ణయం చెబుతాను. అప్పుడు మనం మన స్నేహం గురించి తేల్చుకుందాం. అన్నట్లే నాకు నిమిషానికో బీడీ తగలేసే అలవాటు వుంది. బీడీ కాల్చుకుంటాను. అభ్యంతరం లేదుగా దామోదరం అద్భుతమయిన తెలివితేటలు ప్రదర్శిస్తూ మాట్లాడాడు.
"అయ్యో! ఎంతమాట. ఎవరి అలవాటు వారిది. బీడీ కాల్చుకున్నా నాకు అభ్యంతరం లేదు. చుట్ట కాల్చుకున్నా నాకు అభ్యంతరం లేదు. ముందే నేననుకోలేదు. లేకపోతే నేను వచ్చేటపుడు వీల్స్ పాకెట్ తెచ్చేవాడిని" రావుగారు అన్నారు.
దామోదరం బీడీ ముట్టిస్తూ అన్నాడు. "నాకు చౌక రకం బీడీలు చాలా యిష్టం. నోటికి అవయితేనే రుచిగా వుంటాయి."
అవునులే పంది బురదమెచ్చునుకాని పన్నీరు మెచ్చునా అన్నారు పెద్దలు. మరి ఊరికినే అన్నారా ఆ మాటలు. ఇలాంటివారినిచూసే అని వుంటారు. రావుగారు అనుకున్నారు.
"నేను బీడీ తగలేసేలోపల, మీరు విషయం చెప్పేయండి!" దామోదరం అన్నాడు.
"ఈ రహస్యం తెలిసింది నీకు, కామినీకి ఇద్దరికే. ఏ మాటకామాట ఇంతవరకూ నీవు మావాడిజోలికిరాలేదు. కారణం కామిని ఎంతోకొంత నీకు ఇవ్వటం, డబ్బు నీకిచ్చే విషయంలొ ఈ మధ్య కామిని నీతో పోట్లాడటం నేను విన్నాను.
మావాడ్ని పీడించి డబ్బుతీసుకున్న కామిని న్యాయముగాకొంత నీకివ్వాలికదా! వున్నట్టుండి కామిని ఆలోచనలు పెడత్రోవపట్టాయి. తరచూ మా బాబాయి చేతులు తడవకపోతే నిన్ను బయటికి లాగుతాడు. మా బాబాయి ఎలాంటివాడో నాకు తెలియందికాదు. మీరు మా బాబాయ్ నోరు మూయించగలిగితే ఎంతోకొంత నీతో సర్దుకుంటాను. అని ఈమధ్య కామిని కిరణ్ తో అంది.
ఈ మాటను బట్టి అయినా అర్ధం అవుతున్నది కదా! నీకు డబ్బు ఇవ్వటం కామినీకి ఇష్టంలేనిదీ. చాటుగా మీరూ మీరూ ఏం పోట్లాడుకున్నారో నాకయితే తెలియదు. ఒకటిమాత్రం నిజం. కామిని నీకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. వీలయితే శాశ్వతంగా వదుల్చుకోవాలనికూడా అనుకుంటున్నది. మీరిద్దరూ వేరుపడ్డా, కలిసివున్నా నాకేమీ ప్రయోజనం లేదు. ఆ కష్టనష్టాలు మీ స్వవిషయాలు.
వెయ్యి రెండువేలతో ఎప్పుడూ ఏదీ సాధించలేం. ఏదయినా బిజినెస్ చేయాలంటే కొంచెం పెద్దమొత్తమే వుండాలి. ఎప్పుడయితే కామినీ నీకు డబ్బు ఇవ్వలేదో, మీమధ్య వ్యవహారం బెడిసికొట్టడం మొదలయినదో అప్పుడు నీకీ ఆలోచన వచ్చివుంటుంది. ఆ రహస్యం ఇద్దరికీ తెలుసుకాబట్టి నీ దోవన నీఉ డబ్బు సంపాయించుకోటానికి బ్లాక్ మెయిలర్ అవతారమెత్తి ఎవడో రాసినట్లుగా మావాడికి బెదిరింపు లెటర్ రాశావు అవునా! దామోదరం!" మామూలు విషయాలు మాట్లాడుతున్నట్లుగా అన్నారు రావుగారు.
"మీకు తెలియనిది ఏముంది? కానీయండి!" అంటూ మరో కొత్త బీడీకి అగ్గిపుల్ల వెలిగిస్తూ.
ఒక విధంగా దామోదరం ఒప్పుకుంటున్నట్లు అనిపించడంతో తన అంచనా తప్పుకానందుకు రావుగారు సంతోషించారు.
ఒకేసారి అన్నీ నరుక్కురాకుండా ఒక దాని వెనుక మరొకదాన్ని నరుక్కువస్తే బాగుంటుంది అనుకున్న రావు గారు ఇలా అడిగారు "క్యాసెట్, ఫోటోస్, నెగిటివ్స్ ఎవరి వద్ద వున్నాయి?"
క్యాసెట్స్ ఏమిటి! ఫోటోస్ ఏమిటి! బహుశా కిరణ్ రహస్యమేదో క్యాసెట్ లోనో, ఫోటోలోనో కామిని బంధించి వుంటుంది. దానిని ఎక్కడో దాచి వుంటుంది. ఆ రహస్యమేదో ఇద్దరికీ తెలుసుననుకొని రావుగారు నన్నడుగుతున్నారు. అసలు రహస్యమే నాకు తెలియదు. కామిని కొంచెం కూడా నాతో చెప్పలేదు. క్యాసెట్, ఫోటోలు కామిని దాచిందన్న మాట, అవి తను సంపాదించగలిగితే రావుగారి పంచప్రాణాలూ తన చేతిలో వుంటాయి. ఈ గాడిదకొడుకునీ వీడి కొడుకునీ తను ఆడించవచ్చు. పనిలోపనిగా కామినీని కూడా ఒక ఆట ఆడించవచ్చు. అసలు చేతినిండా డబ్బువుంటే కామినీతో పనేముంది? అనుకున్న దామోదరం రావుగారి ప్రశ్నకు సమాధానంగా ఇలా అన్నాడు.
"సీక్రెట్ సీక్రెట్ కదా! మీకు తెలియంది ఏముంది? రావుగారూ!"
దామోదరాన్ని ఆ క్షణమే పీక పిసకాలన్నంత కోపం వచ్చింది రావుగారికి కాని ఆయన అంతటి సమర్ధుడు కూడా పరిస్థితి సరీగా లేక అధమాధముడైన దామోదరం ముందు తల వంచక తప్పలేదు. కోపం దిగమింగుకుని చిరునవ్వు మొహంలోకి తెచ్చుకున్నాడు రావుగారు.
"నిజమే దామోదరం! సీక్రెట్ ఎప్పటికీ సీక్రెట్టే. డైరెక్ట్ గా అసలు విషయంలోకి వస్తాను. నీకు మనసుకి కష్టంగా వుంటే ఫలానాది కష్టంగా వుంది అని చెప్పు దిద్దుకుంటాను. నీకు నచ్చితే నాకు సహాయం చెయ్యి. బాగుపడు. సంఘంలో నీవు ఒక రిచ్ మాస్ వికా!"
"అలాగే కానీయండి!" అన్నాడు దామోదరం.
"ఫోటోలు, క్యాసెట్స్ నీ దగ్గర ఉన్నాయో, కామినీ దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. నెగిటివ్స్ తో సహా అవి నాకు కావాలి. అవి నువ్వు నాకు తెచ్చి ఇచ్చిన మరుక్షణం 'ఒన్ లాక్' సరీగా లక్ష రూపాయలు నీకు తక్షణం అందిస్తాను. మళ్ళీ నీవు నా జోలికి రాకూడదు. మా వాడిని బ్లాక్ మెయిల్ చెయ్యకూడదు. అవసరం అయినపుడు నా సాయం నీకెపుడూ ఉంటుంది. లక్ష అనేది చిన్న మొత్తమేమీ కాదు. పదివేలు ఇస్తాను పాతికవేలు ఇస్తాను. అని బేరము ఆడవచ్చు. కాని, నాకు అలా చేయడము ఇష్టములేదు. అందుకనే ఒకేసారి నా అంతటనేనుగా లక్ష అన్నాను. బాగా ఆలోచించి చెప్పు!" అన్నారు రావుగారు.
