Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 44


    ముస్తాబైన ముగ్ధతో సుకుమారంగా, ఆశల ఐరావతంపై సుఖాల తీరాలదాకా సాగిపోవాలని తనూ ఒకనాడు కలలుకంది.
    ఏదీ.....
    ఏదమ్మా! నిరుడు కన్న కలలేవీ.....బ్రతుకు బృందావనంలో నందివర్ధనంలా వికసించి ఆనందించాలన్న ఆ స్వప్నాల బాలికలు సైతం కనిపించని యీ బ్రతుకుతో ఎంతగా రాజీపడిపోయింది.
    ఎందుకమ్మా.....నా కళ్ళెందుకు చెమ్మగిల్లుతున్నాయి.....? ఆగి పోయాయీ అనుకుంటే యింకా వున్నామంటూ గుండె వాగులకి  గండిపడి యింతగా చిమ్ముతున్నాయేం.....అసహ్యంగా వుంది. అసలివి నిజంగా కన్నీళ్ళేనా? లేక ఆలోచనల రాపిడి మూలంగా మనసుకే పట్టిన స్వేదబిందువులా?
    "సుకృతీ" అక్కున చేర్చుకుంది అలివేలు. "ఎందుకే పిచ్చితల్లీ ఏడుపు మరిచావంటే యిప్పుడు మళ్ళీ యీ నీళ్ళేమిటి? పిరికితనం వున్నప్పుడు కన్నీళ్ళు రావాలి. మొండితనం ఓడినప్పుడు బండగా మారాలి. రాయి కావాలిగాని రాలుగాయిలా అలజడిచెంది నన్నెందుకు కంగారుపెడుతున్నావు?"
    నవ్వింది సుకృతి. అసలేమీ జరగనంత మామూలుగా పడీ పడీ నవ్వింది.
    ఏమైందీ పిచ్చిపిల్లకి?
    "ఆ నవ్వేమిటి?" వారించబోయింది అలివేలు.
    గుర్తొచ్చింది ఆంటీ! నేను స్టేట్స్ లో ఉండగా ఓ స్నేహితురాలు అన్న వాక్యాలు జ్ఞప్తికొచ్చాయి" ఏ జ్ఞాపకాలతెరలో కళ్ళముందు కదులుతున్నట్టు బడలికగా కళ్ళుమూసుకుంది. "తాగొచ్చిన తండ్రి టార్చర్ కి తట్టుకోలేక తరచూ క్లాసులో ఏడ్చేది. నాకు కన్నీళ్ళంటే చాలా విచిత్రంగా వుండేది ఆంటీ! అలవాటు లేదుగా! అందుకే ఆ అమ్మాయిని ఓసారి అడిగాను నీ దగ్గర అన్ని కన్నీళ్ళు స్టాక్ ఎక్కడివే అని. దానికా అమ్మాయి ఏమందో తెలుసా? కారు యింజను రేడియేటర్ వేడెక్కినప్పుడు చల్లబరిచే నీళ్ళలా, మనిషికి కన్నీళ్ళూ అవసరమేనే! మనసు వేడెక్కినప్పుడు చల్లబరుస్తుంటాయి. లేకపోతే బాడీ బాంబులా పేలిపోతుంది. కాబట్టి రెగ్యులర్ గా దేవుడు కన్నీళ్ళు ఉత్పత్తి చేసి బాడీలో స్టాక్ పెడుతుంటాడూ అంది."
    అలివేలు విస్మయంగా చూస్తూ వుండిపోయింది.
    ఉన్నట్టుండి సుకృతి ఎవరూ, ఎక్కడ చదువుకుని వచ్చిందీ జ్ఞప్తికి వచ్చి మనసు దేవుకుపోతుంటే లాలనగా సుకృతి తల నిమిరింది. "నువ్వెప్పుడూ నవ్వుతూనే వుండాలి సుకృతీ! మనసు చంపుకున్న నువ్వు మనిషిగా సైతం చచ్చిపోయేదాకా నవ్వుతూ బ్రతకాలి."
    "నువ్వు పొయిట్రీ బాగా చెప్పగలవు ఆంటీ....." ఇప్పటిదాకా ఏదీ ఆలోచించనంత ఆనందంగా నవ్వేసింది.
    "మరేం" తనూ నవ్వుతూ జవాబు చెప్పింది అలివేలు. "అంతా పోయి నేనిప్పుడు 'ట్రీ'గా బ్రతుకుతున్నాగా! అంచేత పొయిట్రీ ఎక్కువ మాట్లాడుతుంటాను."
    "ఎంతవరకూ చదువుకున్నావాంటీ?" సీరియస్ గా అడిగింది. జవాబు చెప్పని అలివేలుని చూస్తూ రెట్టించింది "చెప్పాంటీ....."
    "వద్దమ్మా! ఉపయోగం లేని చదువు గురించి చర్చెందుకు?"
    "చెప్పమంటుంటే....ప్లీజ్ ఆంటీ!"
    ఇక తప్పించుకోలేకపోయింది. "తెలుగులో ఎం.ఏ.డిస్ కంటిన్యూ చేశాను."
    షాక్ తిన్నట్టుగా చూసింది సుకృతి.
    ఆ తరువాత అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అంత చదివి యింకా పతనంలో బ్రతుకుతున్న అలివేలులో తన జీవితమే కనిపించిందో లేక బాధా సర్పదృష్టురాలై బ్రతుకుతూ కూడా నవ్వడమనే వరాన్ని ఎంత సిద్ధించుకుందన్న ఆలోచనే మెదిలిందో హఠాత్తుగా చర్చను ముగించింది.
    మౌనంగా హాస్పిటల్ కి వెళ్ళారిద్దరూ.
    అమ్మ పరిస్థితిలో ఇంప్రూవ్ మెంట్ లేదు. కోమాలోనే  వుంది అయినా యింకా బ్రతుకుతుందన్న ఆశ! ఏదో రోజు స్పృహలోకి వస్తుందన్న నమ్మకం!
    తిరిగి ఇంటికి వస్తుంటే అడిగింది అలివేలు.
    "మొహం మళ్ళీ సీరియస్ గా పెట్టేశావేం?"
    "లేదాంటీ....." ఫిలాసఫికల్ గా అంది సుకృతి. "స్పృహలో అమ్మని కంపేర్ చేసుకుంటున్నాను. ఎందుకో యింత కాలానికి అనిపించింది....."
    "ఏమని?"
    "నాకన్నా అమ్మే అదృష్టవంతురాలని! నిజమే ఆంటీ! తన చుట్టూ ఏం జరుగుతున్నదీ  తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలాంటి కోమాలో బ్రతకడంకన్నా, అసలు ఏం జరిగేదీ తెలీని 'కోమా' నయంకదూ....."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS