Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 44

 

    ఆ గోవిందయ్య మాత్రం తను ఎలా బాకీ తీర్చగలడని అప్పు ఇస్తాడు....
    అందుకే ఉద్యోగం వచ్చేవరకూ ఏదో ఒకటి చేయాలి అనే నిర్ణయంతో గోవిందయ్యను కలిశాడు.......
    విష్ణుమూర్తి చెప్పిందంతా శ్రద్దగా విన్నాడు గోవిందయ్య.
    'విష్ణు.......నీ బాధ నాకర్ధమయ్యిందయ్యా......సరే నీకొక మార్గం చెబుతాను విను. నీకున్న ప్రధానమైన సమస్య ఏమిటి అక్కల పెళ్ళిళ్ళు ......ఈరోజులలో ఒక ఆడపిల్ల పెళ్ళి కావాలంటే కనీసం లక్షయినా కావలసిందే. అంటే నువ్వు ఐదు లక్షలు సంపాదిస్తే తప్ప నీ ఐదుగురు అక్కల పెళ్ళిళ్ళు కావు. అంటే కదూ...."
    విష్ణుమూర్తి అవునన్నట్టు వూపాడు.
    "నీకు రేపో మాపో ఉద్యోగం వస్తుందనే భావిద్దాం.....అప్పుడయినా అమాంతం నీకు ఐదు లక్షలు రావు కదా........సరే, ఎవరయినా అప్పు ఇస్తారనుకోవడానికి అయినా నీ వద్ద ఏం వుందని అంత డబ్బు అప్పుగా ఇస్తారు చెప్పు......కాబట్టి ఎలా చూసినా నువ్వు ఈ జన్యలో మీ అక్కల పెళ్ళిళ్ళు చెయ్యలేవు......" నిర్మొహమాటంగా చెప్పాడు గోవిందయ్య.
    అతను అంత వివరంగా చెప్పినా చెప్పకపోయినా తను చెప్పింది నిజమేనని విష్ణుమూర్తికి కూడా తెలుసు. కాబట్టే గోవిందయ్య పై విసుక్కోలేదు.
    "కానీ నేను నీకు ఒక గోల్డెన్ చాన్స్ ఇస్తున్నాను. అది నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే నీ కుటుంబం హాయిగా ఒడ్దేక్కుతుంది.'
    "చెప్పండి గోవిందయ్యగారూ.......ఈ జన్మలో మీ ఋణం వుంచుకొను....
    "తీరా చెప్పిన తరువాత కాదనకూడదు."
    "ఎంతమాట.....నా మేలు కోరి చెప్పే మీలాంటి పెద్దవాళ్ళ మాట వినకుండా ఎలా వుంటాను! నేను ఏం చేసినా నా అక్కలను ఒక ఇంటి వాళ్ళను చేయాలి. నా తండ్రి లేని లోటును నేను తీర్చాలి. అప్పుడు కానీ నా తండ్రి ఆత్మ శాంతించదు....."
    'ఆ ఐదు లక్షలు నేను నీకు ఇస్తాను. ఒక్కొక్క అక్కయ్యకు ఒకో లక్ష ఇచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకమని చెప్పు.....ఇప్పుడు వుంటున్న ఇంటిని మీ అమ్మ పేరున రిజిస్టర్ చేస్తాను. కానీ నువ్వు మాత్రం నా ఇంట్లో వుండాలి.'
    "ఏమిటి మీరనేది? నాకేం అర్ధం కావడం లేదు......"
    "అదేంటోయ్ అల్లుడూ....అందులో అర్ధం కాకపోవడానికేం వుంది?"
    "అల్లుడా....!" అతని చెవులు వినగూడనిదేదో విన్నట్టున్నాయి.
    "నా ఇంటిలో వుండమంటే కూతురిని పెళ్ళి చేసుకోమని అర్ధం. అయినా ఆ మాత్రం నీకు తెలియదని నన్ను అనుకోమంటావా? ఆ మాట నానోటి వెంట చెప్పించాలని కాకపోతే?"
    విష్ణుమూర్తి ఒక్కసారిగా తనేం వింటున్నాడో అర్ధమయింది.
    తనను గోవిందయ్య ఇల్లరికపుటల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాడా?
    తన హృదయాన్ని ఎవరో పిండినట్లయింది.
    తన హృదయంలో ఎవరికి స్థానం వుందో మనసుకు తెలుసు.
    గోవిందయ్య చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా తను తన మనసు చంపుకోవాలా? హృదయాన్ని బండరాయిగా మార్చుకోవాలా?
    తను మనసుపడిన మగువను కాదని మరొక చోట మనువు ఆడితే ఎవరూ సుఖ పడలేరు అనేది నిత్యసత్యం. అది తెలిసినా తనెందుకు ఉదాసీనంగా వున్నాడు? పరిస్థితులకు తలవొంచాలా' క్షణాలు వేగంగా దొర్లిపోతున్నాయి......అతను ఆలోచిస్తున్నాడు.
    తిరిగి గోవిందయ్య నోరు విప్పాడు.
    "అల్లుడూ.......నువ్వు చదువుకున్న వాడివి. లోకజ్ఞానం బాగా అలవర్చుకున్న వాడివి. నీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకో. నా కూతురుకు ఈ క్షణాన పెళ్ళి చేయాలే గానీ లక్షాధికారులు దొరుకుతారు. కానీ నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబట్టే నిన్ను అల్లుడిగా చేసుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. విష్ణు ఒప్పిస్తున్నాననుకోవద్దు. నిదానంగానే అలోచించి రేపు చెప్పు నీ నిర్ణయం ఏమిటో......"
    ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు విష్ణు.
    గోవిందయ్య మాటలే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
    తనను అల్లుడిగా చేసుకోవాలనే దురాశతోనే అతను తన తండ్రికి డబ్బు సాయం చేసి వుండవచ్చు. ఇప్పుడు కాదంటే అప్పుల రూపంలో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేయవచ్చు. అంతేకాదు వుండడానికి ఇల్లు కూడా వుండదు.
    ఈ రెండే సమస్యలు అయితే ఎలాగోలా సర్దుకుపోవచ్చు. కానీ పెళ్ళీడు కొచ్చిన ఐదుగురు అక్కల పెళ్ళిళ్ళు చేయాలంటే తాను ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడినా లక్షలు సంపాదించడమూ కష్టమే.......పెళ్ళిళ్ళు చేయడమూ కష్టమే!
    తన ప్రేమను త్యజించగలిగితే బాధపదేవి రెండు హృదయాలు మాత్రమే.....కానీ, అక్కలకు అనందమయిన జీవితాలను ఏర్పాటు చేసిన తృప్తి అయిన మిగులుతుంది.
    ఆ సమయంలో విష్ణుకు తనే సర్వస్వం అని భ్రమించి కలలు కంటున్నా ప్రియురాలు జ్ఞప్తికి వచ్చింది. మరొకవైపు రక్త సంబంధాన్ని పంచుకు పుట్టిన అక్కలు నిలవడంతో హృదయాన్ని పాషానంగా మార్చుకున్నాడతను.
    గోవిందయ్య చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు విష్ణు.
    అదే........అదే...
    విష్ణు జీవితంలో మనసాక్షికి విరుద్దంగా చేసిన మొట్టమొదటి పని.......
    
                                                   *    *    *    *

    విష్ణుమూర్తి నందినిల వివాహం చాలా అట్టహాసంగా చేశాడు గోవిందయ్య. తంతే వెళ్ళి గారెల బుట్టలో పడ్దాట్టు అకస్మాత్తుగా లక్షాధికారికి అల్లుడయిన విష్ణుమూర్తి అదృష్టాన్ని కొందరు మెచ్చుకున్నారు. మరికొందరు అసూయ చెందినవాళ్ళు కూడా లేకపోలేదు. విష్ణుమూర్తి తల్లి అక్కలు ఆ దంపతులను నిండు మనసుతో ఆశీర్వదించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS