Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 44

 

    "నేను స్వప్న ని స్వప్నగా ప్రేమించాను అంతే. ఈ యింట్లో అడుగు పెట్టిన తొలి క్షణంలోనే ఆమె నా మనస్సును ఆకట్టుకుంది. నాకు ఈ ఐశ్వర్యం వద్దు. ఈ ఆస్తివద్దు. ఇదంతా అమ్మమ్మగారి పేరు చిరస్థాయిగా వుండేట్టుగా ఏ అనాధ శరణాలయానికో- వేద పాఠశాలకో - పేదలకో యిచ్చేద్దాం. నేను నేనుగా స్వప్నని పోషించగలను."
    "గుడ్!" మెచ్చుకోలుగా అన్నాడు విశ్వేశ్వరం గారు.
    "ఓ మాట చెప్పమంటారా?"
    "ప్రొసీడ్-------"
    "నేను విగ్రహం తెచ్చిచ్చాను అమ్మమ్మగారికి. ఆ విగ్రహం మెడలో పచ్చలాహారం వుంది. మీరూ చూసే వుంటారు. దాన్ని నేను ఆమెకి ఉచితంగా యిచ్చేశాను. అది మా నాన్నగారు ఆమెతో పోట్లాడి తీసికెళ్ళింది. దాన్ని విక్రయిస్తే కొన్ని లక్షలు వస్తాయి తెలుసా? నేను ఐశ్వర్యాన్ని , అది తెచ్చే భోగాన్ని ఆశించే వాడినే అయితే......."
    "స్టాప్ ! స్టాప్! అమ్మమ్మగారి సెలక్షన్ ని శంకించ\టమే నే చేసిన తప్పు. ఇంకేం లేదు. మంచిరోజు చూసి శాస్తుర్లగారితో ముహూర్తం పెట్టిస్తాను" ఆనందంగా అన్నాడాయన.


                                                             33

    మరి మూడురోజుల తర్వాత అతను గజపతి నగరం వెళ్ళేడు. రైతులతో మాటాడి పనులన్నీ ముగించుకుని, జీప్ ని అలాగే తల్లి వుంటున్న యింటికి మళ్ళించేడు.
    సరిగ్గా ఆ సమయానికి ఆమె చెరిగిన తన చీర కంది కాయకుట్టు కుట్టుకుంటూ కూర్చుని ఉంది.
    ఆమె సమీపంలో పక్కింటి అన్నపూర్ణ గారమ్మాయి విశాల కూర్చుని భాగవతం చదువుతోంది. ఆమెకి భాగవతం ఎంతో ప్రీతిపాత్రమైంది. తను చదవతమో విశాలతో చదివించుకోవతమో ఆమెకి నిత్యకృత్యలయ్యాయి.
    పురిటి వల్లనో, అశుచి వల్లనో భాగవతం చదవటం పడకపోతే ఆ రోజులంతా ఆమెకి దుర్ద్దినాల్లా వుంటాయి. తిన్నా తిన్నట్టుగా ఉండదు. బ్రతుకే దుర్భరంగా , నిస్సారంగా తోస్తుంది.
    "ఏం విశాల బావున్నావా?" తల్లి పక్కకూర్చుంటూ అడిగేడు రవి. విశాల ముసిముసి నవ్వులు నవ్వి , చదువు తోన్న చోట గుర్తు పెట్టి పుస్తకం మూసేసింది.
    "నువ్వు బాగున్నావా? స్వాతి ఎలా ఉంది?"
    తల్లి ప్రశ్నకి "స్వాతికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. అయినా యింకో ఏడాది పాటు మాత్రలూ, యింజక్షన్లూ వాడుతూ వుండాలి" అని జవాబిచ్చేడు.
    విశాల లేచి వెళ్ళింది. "వస్తానత్తయ్యా!" అంటూ.
    కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి.
    "అన్నపూర్ణ అడుగుతోందిరా రవీ!"
    "ఏంటమ్మా?"
    "ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తావని?"
    "దేనికి?" చప్పున అడిగి నాలిక్కొరుక్కున్నాడు.
    "సిటీ చేరగానే అన్నీ మరిచిపోయావా? మొదటినుంచీ అది విశాలని నికివ్వాలనుకోవటం లేదూ? నేనే నీ చదువూ ఉద్యోగం అంటూ ఆలస్యం చేశాను. అయినా ఇన్ని రోజులూ వేరు. ఇప్పుడు వేరు కదా? అది వ్యక్తురాలై రెండేళ్ళయి పోయింది. నీకూ ఓ ఉద్యోగం దొరికింది. అయినా తెలియ కడుగుతాను. మీ బామ్మాపొతే ఆ యింటి పెత్తనం అంతా నీపై పడిందట కదా? వెంకట్రామయ్య రావటం లేదట కదా? ఏం జరిగింది? నీ ఉద్యోగానికి దీనికీ ఎలా లంకె కుదురుతోంది?"
    వెంటనే సమాధానం యివ్వలేదు రవి.
    ఏ విషయమైతే తల్లికి చెప్పి ఆమె అనుమతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడో ఆ విషయమే ఆమె ప్రస్తావన కి తేవటం అతనికి కొంత సంతోషంగానే వుంది. కాని విశాల విషయం ఏం చేయాలో అతనికి పాలుపోలేదు.
    నిజానికి విశాలని పెళ్ళి చేసుకుంటానని అతనే నాడూ వాగ్దానం చేయలేదు. అయితే అన్నపూర్ణమ్మగారూ తల్లితో ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు తిరస్కారచనూ లేదు.
    మొదటి నుంచీ ఆ కుటుంబాల మధ్యా బంధుత్వానికి మించిన స్నేహం వుంది. తన పినతల్లి కొడుకు కుతురనే కాక విశాల అన్ని విధాలా నచ్చిందామెకి. ఏకైక పుత్రిక -----ఓ యిల్లు, కొంత పొలం .........ఆప్యాయత......స్నేహం .......ఇవన్నీ విశాలకీ దోహదాలే!
    "పలకవేమిటి? ఇంకా అభ్యంతరాలున్నాయా?"
    "అమ్మా! వెంకట్రామయ్య బాబాయ్ అక్కడ మోసగాడుగా ఋజువై దొరికిపోయాడు. మోహన్ స్వప్నని ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవాలని చూసాడు. పోలీసులకి దొరికిపోయి జైలు పాలయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఆ యింటికి రావటానికి ముఖం చెల్లటం లేదు, రాని వ్వరు కూడాను!"
    "అయితే మనకేమిటి వొరిగింది. ఈ చాకిరీ అంతా ఎందుకు?"
    "నన్ను క్షమించమ్మా! ఆరోజు విగ్రహం నువ్వు వద్దంటున్నా తీసికెల్లటంలోనే ఏదో పొరపాటు జరిగిపోయింది. నేను యిప్పుడు వాళ్ళకి దూరం కాలేని స్థితిలో వున్నాను!
    "ఏం జరిగింది?" గంభీరంగా ప్రశ్నించింది.
    అతను వెంటనే సమాధానం చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS