Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 45


    మృత్యుదేవతవాల్చిన మంచంమీదపడుకుని ఉన్నట్లు పడుకుని ఉంది అహల్య. ఆమెకు ఎగశ్వాస వస్తోంది. కాళ్ళలో నీరు చేరినున్నగా కనబడుతున్నాయి పాదాలు.
    "డాక్టర్ సాబ్!" అంది హీనస్వరంతో.
    "ఏమిటి అహల్య బాయ్?" అన్నాడు డాక్టరు, ఇంజక్షను ఇవ్వడానికి సిరెంజి బయటకు తీస్తూ.
    "డాక్టర్ సాబ్! నన్ను ఇంకొక్కరోజు బతికించండి డాక్టర్ సాబ్! మా అమ్మాయి సీత ఇవాళన్నా రావాలి. ఆమెను చూడకుండా నేనుపోలేను డాక్టర్ సాబ్!" దుఃఖంతో ఆమె గొంతుపూడుకుపోయింది.
    ఇంజెక్షను ఇవ్వడం పూర్తి చేశాడు డాక్టరు. "ఒక్కరోజు ఏమిటి అహల్యబాయ్! నువ్వు ఇంకా పాతికేళ్ళు బతుకుతావు. భయపడకు!" అన్నాడు అనునయంగా.
    "వద్దు డాక్టర్ సాబ్! నాకు ఎక్కువరోజులు బతకాలని లేదు. కానీ పోయేముందు ఒక్కసారి, ఒక్కసారన్నా నా సృజనని, నా సీతని చూడకుండా పోలేదు. మీ కాళ్ళకు దణ్ణంపెడతా సాబ్! నా సీత వచ్చేదాకా నన్ను బతికించండి." అని హఠాత్తుగా ఆగి, గుమ్మంవైపు వెర్రిగా చూసింది అహల్య. వెంటనే ఆమెకు నిలువు గుడ్లుపడ్డాయి.
    "అదిగో! వచ్చేశారు!" అంది విహ్వలంగా.
    డాక్టర్ కూడా తిరిగి చూశాడు. అతనికక్కడ ఎవరూ కనబడలేదు.
    "ఎవరు అహల్యబాయ్" అన్నాడు అనుమానంగా.
    "అదిగో! అదిగో! వచ్చేస్తున్నారు! తలమీద కొమ్ములూ, నోట్లో కోరలూ....యమభటులేనా? నేరుగా నరకానికేనా నన్నుతీసుకెళ్ళేది? వచ్చేస్తాబాబుల్లారా! వచ్చేస్తా! ఒక్కసారి మా సీతను చూసి...." అని కలవరించడం మొదలెట్టింది అహల్య.
    అహల్యకు డెలిరియమ్ మొదలయిందని గ్రహించాడు డాక్టర్. సంధి ప్రేలాపన అది.
    తదేకంగా ఆమె వైపు కొద్ది క్షణాలు చూశాడు.
    పాషాణ హృదయురాలు ఈ అహల్య! ఇప్పుడు చిన్న పిల్లలా వెక్కెక్కి ఏడుస్తోంది!
    ఈస్త్రీ తన జీవితంలో ఎంతమంది తల్లులకడుపుల్లో చిచ్చుపెట్టి పిల్లలని ఎత్తుకొచ్చి పడుపు వృత్తిలోకి దింపిందో?
    కడుపుతీపి అంటే ఏమిటో తెలియదు ఈ అహల్యకి. కానీ పెంచిన మమకారం మాత్రం తెలుసు.
    లెక్కలేనంతమంది తల్లులు పెట్టిన శాపనార్దాలూ, తిట్టిన తిట్లూ ఇప్పుడు ఈమెకి సెగలా సోకుతున్నాయా? వాళ్ళ ఉసురు ఈమెకి తగులుతుందా!
    లేకపోతేఏమిటీ చిత్రం?
    ఆప్యాయతా, అభిమానం, అనురాగం అనేవి అడుగుబెట్టని ఈ కొంపల్లో పెరిగిన ఈ ఆడది తన కూతురుకానీ ఒకమ్మాయిని తన కూతురేనన్నంత ప్రేమించి ఇంతగా తపించిపోవడమా?
    చిత్రమే నిజంగా!
    కాసేపు గాలిని గుప్పెటలో పట్టుకోబోతున్నట్లు గుప్పెట్లు మూసి తెరిచింది అహల్య. ఆమెకళ్ళు తెరుచుకునే ఉన్నాయి. కానీ ఆ చూపుల్లో జీవంలేదు. ఆమె ఏం చేస్తుందో ఆమెకేతెలియడం లేదు.
    ఉన్నట్లుండి లేచి కూర్చుని డాక్టర్ చేతులు పట్టుకుంది అహల్య.
    "డాక్టర్ సాబ్! నేను ఎన్ని ఉత్తరాలు రాసినా మా అమ్మాయి నన్ను చూడ్డానికి రాలేదు! నేను చచ్చినా అబద్దాలు తప్పనిజాలు చెప్పనని నమ్మకమేమో తనకి!
    డాక్టర్ సాబ్! నా మీద దయ ఉంచి, ఒక్క సహాయం చెయ్యగలరా?"
    "చెప్పు అహల్య బాయ్!"
    "నేను చావు మంచంమీద ఉన్నానని మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పగలరా డాక్టర్ సాబ్!"
    "మీరు చెబితేనన్నా నమ్మి వస్తుందేమోతను!" అంది వివశురాలయి ఏడుస్తూ.
    "అలాగే అహల్యా బాయ్! తప్పకుండా ఫోన్ చేస్తాను" అన్నాడు డాక్టర్ నెమ్మదిగా.
    వ్వవ్వవ్వ
    ఫోన్ పెట్టేసి ఆలోచనలో మునిగిపోయింది సీత.
    హైదరబాద్ నుంచి డాక్టర్ ఫోన్ చేశాడు. అహల్యకి చివరిఘడియలు. చూడదలుచుకుంటే ఇదే చివరి అవకాశమని.
    ఆ వార్త విని కూడా నిర్వికారంగానే ఉంది తను. దుఃఖంకలగలేదు తనకి. జాలీ కలగలేదు.
    అలాగని సంతోషమూ లేదు.
    ఉదాసీనత! అంతే! అహల్య పేరుచెబితే ఉదాసీనంగా అయిపోతుంది తన మనసు.
    ఇన్నాళ్ళు గడిచినా, ఇన్నిసార్లు ఆలోచించినా తను తేర్చుకోలేకపోతోంది.
    తనకి అహల్య అంటే అసహ్యమా? అభిమానమా? తను అహల్యనుద్వేషిస్తోందా? ప్రేమిస్తోందా?
    ఊహూ!
    ఇవేవీకావు.
    అహల్యమీద ఏ భావమూ లేదు తనకి. కేవలం నిర్లిప్తత తప్ప!
    అహల్యరాసిన చివరి ఉత్తరంలోని వాక్యాలు గుర్తువచ్చాయి.
    "మోసపోయి ఈ కొంపల్లోకి వచ్చాను నేను. నేను మారాను గనక మేడమ్ ని అయ్యాను. మారకపోతే కామాక్షిలాగా నేను కూడా...."
    అది నిజమేనా? నిజమేనేమో!
    అహల్య చేసింది తప్పా? ఒప్పా?
    మరొకలాగా చెయ్యడానికి అహల్యకి అసలు అవకాశం ఉందా?
    చదువుకున్న స్త్రీ కాదు అహల్య మనోవికారం కల మనిషికూడా కాదు.
    ఆమెని తప్పుపట్టాలా? అక్కర్లేదా?
    అంతా అయోమయం!
    ఒక్కసారి తల విదిలించింది సీత.
    తనకోసం తపించిపోతోంది అహల్య. ఒకసారి వెళ్ళిచూస్తే తప్పేమిటి?
    అదీగాక, తను కేవలం అహల్యని చూడడానికే హైదరాబాద్ వెళ్ళడం లేదు. అంతకంటే అవసరమైనపని ఉంది తనకు.
    అక్కడికి వెళ్ళి రాఘవులు ఆచూకీ కనిపెట్టడం!
    ఆ తర్వాత వాడిపని పట్టడం!
    కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వెళ్ళి ఉండేది తను. కానీ అప్పుడే ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వెళ్ళలేకపోయింది.
    ఇప్పుడింక వెళ్ళితీరాలి!
    లేచి, ప్రయాణ సన్నాహాలు చెయ్యడం మొదలెట్టింది సీత. ఒక ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకుంది. ఆమె పర్సనల్ సెక్రటరీ సూట్ కేసులు సర్దింది. సరిగ్గా గంట తర్వాత ఎయిర్ పోర్టుకి బయలుదేరింది సీత.
            

                                                                       * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS