శీతల్ అక్కడ నుంచుని ఇంకా వినాల్సింది ఏమీ కనబడలేదు.
దీన్ని గురించి చాలా ఆలోచించాలి. ఎత్తుకు పైఎత్తు వేయాలి అనుకుంటూ శీతల్ తిరిగి ఏ విధమైన పరిశోధన చేయక తన గదికి వచ్చి పడుకుంది.
ఆ రాత్రి శీతల్ సరీగా నిద్రపోనేలేదు.
కుందన్ తనని మర్యాదగా పెళ్ళిమాట అడిగాడు. తను తెలివిగా జవాబు ఇచ్చింది. తెలివి ఎప్పుడూ ఒకరి సొత్తుకాదు. కుందన్ గాడు ఏదో ప్లాన్ మీద వుండి వుండడం వల్ల చాలా నిబ్బరంగా, మౌనంగా వుండిపోయాడు.
లోకేశ్వరరావు పథకం ప్రకారం తనని ఎత్తుకువచ్చారు. బహుశా తనని కోడలుగా చేసుకోడానికే అయివుంటుంది.
వాడు తన మీదకే వల ఎందుకు విసిరాడు?
ఇంకెవరూ దొరకలేదా?
ఇంకేమైనా కారణం వుందా?
అది ఏమిటి?
శీతల్ అలా అలా ఆలోచిస్తూ తెల్లవారుజాము! నిద్రపోయింది.
27
శీతల్ చాలా పెద్ద ప్లాన్ వేసింది.
అన్నింటికన్నా నమ్మకం ముఖ్యం. నమ్మకంతో తడిగుడ్డ గొంతుమీద వేసి తాపీగా కోయవచ్చు. "నేను బలవడానికి నా ఆరోగ్యం కోసం నా యజమాని నా కెంత తిండి పెడుతున్నాడో!" అనుకుంటుంది వెర్రి గొర్రె. దానికి అప్పుడు తెలియదు యజమాని తనని ఎప్పుడో చంపి తింటాడని.
గొర్రె కసాయివాడినే నమ్ముతుంది. ఆ సామెత శీతల్ కి తెలుసు. ఇటునుంచి నరకటం కుదరకపోతే అటునుంచి నరుక్కురమ్మన్నారు విజ్ఞులు.
శీతల్ ఇప్పుడు ఆ పనే చేసింది.
ఆ ఉదయం-
కుందన్ దరిదాపుల్లో లేని సమయం చూసి-
"అంకుల్! నీతో ఓ విషయం న మనసులో వున్నది చెపుదామనుకుంటున్నాను. నే చెప్పింది విని అర్ధం చేసుకుంటారు కదూ?" శీతల్ అడిగింది.
శీతల్ అడిగే తీరు లోకేశ్వరరావుకి నచ్చింది. పెద్దల ఎడల వినయం. మర్యాదగా అడిగే తీరు, మాట తీరులో బిడియం..."అడుగమ్మా! నా ముందు నీవు దేనికి సంకోచపడనక్కరలేదు." ఆప్యాయంగా అన్నాడు. లోలోపల మాత్రం పరిపరి విధాల ఏవేవో ఆలోచనలు పోతున్నావాటన్నింటిని నొక్కిపట్టి.
"అంకుల్! కుందన్ నన్ను ఇష్టపడుతున్నానని నే ఇష్టపడితే పెళ్ళాడతానని చెప్పాడు. నేను ఇంతవరకు నా చదువేమిటో, నేనేమిటో, ఆటపాటలు తప్పించి పెళ్ళి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనే కదా ఇంట్లోంచి పెళ్ళి పీటల మీంచి పారిపోవాలనుకుందీను. ఇదంతా మీకు తెలుసు.
కుందన్ ఆ మాట అడగంగానే పెళ్ళి ఊహలు ఇప్పుడప్పుడే నా తలపుల్లో లేవు. కొన్నాళ్ళు ఆగాలి అని చెప్పాను. కుందన్ అసలే మితభాషి. అందువల్లనో, నా మాటలకి వ్యధ చెందో, మరేదో నాకు తెలియదు. మౌనం వహించాడు. కుందన్ మనసు బాధ పెట్టాలని పెట్టకపోయినా బాధ పెట్టినదాన్ని అయ్యాను.
అంకుల్! నేను కొన్నాలలు మీ దగ్గరే వుండదలిచాడు. నేను ఎక్కడికీ పోను. అమ్మకి ఎలాగూ నీ ద్వారా లెటర్స్ అందిస్తున్నాను. నా క్షేమం వాళ్ళకి తెలుస్తూనే వుంది. ఓసారి అడిగాను "ఫోన్ లో మాట్లాడతానని." వద్దని చెప్పారు. ఫోన్ మీ ఇంటికి చేశాననుకో మీ డాడీ ఎలాగో అలా పట్టేస్తాడు అని...
మీ మాట ప్రకారం మా ఇంటికి ఫోన్ చేయలేదు. అలాగే మీ మాట ఎప్పుడూ కాదనను అంకుల్! కుందన్ కి మీరే ఎలాగో అలా నచ్చచెప్పండి. కొన్నాళ్ళు ఇలా కుందన్, నేను కలసి వుంటే మా మధ్య స్నేహం పెరిగి ప్రేమ పెళ్ళి ఎక్కడికైనా దారి తీయవచ్చు. అంతదాకా కుందన్ నాతో మామూలుగా వుండాలి. ఇదే నేను కోరేది అంకుల్! ఇంక మీ ఇష్టం ఎలా అంటే అలా..." అంటూ "శీతల్ చాలా నైపుణ్యంగా చెప్పింది.
అంతటి మహానుభావుడు లోకేశ్వరరావు నమ్మేశాడు. అందమైన ఆడపిల్ల అమాయకంగా చెపుతుంటే ఎవరు మాత్రం నమ్మరు? కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువ. ఏనుగు తొండంలోకి దోమ దూరితే ఏనుగంత ఏనుగు ఏమీ చేయలేక ఎగిరెగిరిపడాల్సిందే! ముందు చేసే పని అదే.
"ఓస్ ఇంతేనా! ఈ మాత్రం దానికి ఇంత ఇది దేనికి? కుందన్ ఏమీ అనుకోడు. నీవు, కుందన్ మామూలుగా వుండండి" అప్పటికి ఆ మాట అన్నాడు లోకేశ్వరరావు.
అమ్మయ్య అనుకుంది శీతల్.
లోకేశ్వరరావు శీతల్ చెప్పింది నమ్మాడు. ఒక్కోసారి నమ్మకమే దెబ్బతీస్తుంది. ఎవరైనాసరే ఈ మాట చెప్పరు, దాస్తారు అనుకుంటున్నప్పుడు వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ నిజం చెపితే ఆ తర్వాత చెప్పే అబద్దాలు కూడా నిజాలనుకుని తేలికగా నమ్మేస్తారు.
ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే.
శీతల్ చెప్పింది లోకేశ్వరరావు నమ్మడంవల్ల శీతల్ ఎక్కడికి పారిపోదన్న నమ్మకం ఏర్పడింది. శీతల్ పై కాపలా కాస్త తగ్గింది. దానివల్ల శీతల్ ఆ ఇంట్లో అన్ని చోట్లా కాస్త స్వేచ్చగా తిరగగలుగుతున్నది. అందంతో కలివిడిగా వుండి పేర్లు పెట్టి పిలవడం అధికారం చలాయించడం ఏదైనా అడిగి చేయించుకోవడం చేస్తున్నది.
కుందన్ కూడా మళ్ళీ పెళ్ళి ప్రసక్తి ఎత్తలేదు,
ఇవన్నీ ఇలా వుంటే ఓ రోజు శీతల్ కి పాత సామానుల గదిలో ఓ డ్రమ్ములో కొన్ని విరిగిపోయిన నగిషీలు చెక్కి వున్న చెక్క ముక్కలు పగిలిపోయిన గాజు సామాను కనిపించాయి.
