Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 45

    "అవును! రేపట్నుంచి మన దారి ఇది కాదు, రామాలయం దారే" అంది రాధ.

    జయంతి నవ్వింది.
                                        *    *    *    *

    "ఏంటి జయంతి ఈరోజు ఇంత ఆలస్యమయిందే?" ఇంటిలోకి అడుగు పెట్టగానే అడిగింది కస్తూరి.

    "ఏంలేదమ్మా! స్కూల్లో ఆఖరి ఘడియల్లో ఆటలపోటీలు పెట్టారు. అందుకే ఆలస్యమయింది" వెంటనే చెప్పింది జయంతి.

    "ఇలా ఆలస్యమవుతుందని ముందే చెపితే, నేను వెంకటేశాన్ని పంపేదాన్ని కదా....బండిలో వచ్చేదానివి" అంది కస్తూరి లాంతరు చిమ్ని ముగ్గుతో తుడుస్తూ.

    "నేను కూడా అనుకోలేదమ్మా, ఈరోజు ఆటల పోటీలు పెడతారని" అంది జయంతి.

    "సర్లే వెళ్ళు....వెళ్ళి స్నానం చేయి, చూడు ముఖం ఎలా వాడిపోయిందో , ఏం చదువులో ఏంటో" అంది కస్తూరి.

    జయంతి అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళి పుస్తకాలు గూట్లో పెట్టింది. బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వంట గదిలోకి వెళ్ళింది.

    అక్కడ దాక్షాయణి వంకాయలు కోస్తోంది.

    "పిన్ని! కాఫీ వుంటే ఇవ్వవా? తలనొప్పిగా వుంది" అంది.

    "కూరగాయలు తరుగుతున్నాను కదమ్మా, అదిగో కాఫీ గిన్నె పొయ్యి పక్కనే వుంది, ఆ నీళ్ళు దించి కాఫీగిన్నే పెట్టుకో" అంది దాక్షాయణి నవ్వుతూ.

    జయంతి మసిబట్టతో నీళ్ళా డేక్షా దింపి, పక్కనే వున్న కాఫీగిన్నె పొయ్యిమీద పెట్టింది.

    పైన చూరులోనుంచి ఎండ పడుతుండటంతో పొగ ఆ కిరణాల్లో పడి నీలిరంగులో మెరుస్తూ, పైనుంచి కిందవరకు నీలిరంగు గొట్టాల్లో కనిపిస్తూ వింతగా వున్నాయి.

    డాబా వెనుక భాగంలో పెరటిలో పైన రెళ్ళు గడ్డితో పక్కన తడికలతో కట్టారు. పొగ ఇల్లంతా వ్యాపించకుండా, గిరిజ పెళ్ళప్పుడు ఇలా కొత్త వంటగదిని ఏర్పాటు చేశారు.

    జయంతి కాఫీ గిన్నె దింపి, గ్లాసులో పోసుకుంది.

    "నిక్కుడా కాఫీ పోసేదా పిన్ని?' అడిగింది.

    "వద్దు జయంతి! నేను ఇందాకే తాగాను" అంది దాక్షాయణి.

    జయంతి అక్కడే పీటమీద కూర్చుని నెమ్మదిగా కాఫీ తాగుతూ అక్కడికొచ్చిన కోడిపిల్లలకు కొన్ని బియ్యపు గింజలు తీసి జల్లింది. అవి ఆనందంగా అరుచుకుంటూ ఆ గింజల చుట్టూ మూగి ఏరుకుని తింటున్నాయి.

    "నీకు ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు జయంతి..." అంది దాక్షాయణి.

    "ఎందుకు పిన్ని అలా అన్నావు?' అంది జయంతి ఆశ్చర్యంగా.

    "కోడిపిల్లల్ని కూడా వింతగా చూస్తూ వుంటేనూ..." అంది నవ్వుతూ.

    "నాకు చిన్నప్పటినుంచి కోడిపిల్లలన్నా, లేగదూడలన్నా భలే ఇష్టం పిన్ని......అని గింజలు తింటుంటే చూస్తూ అన్ని మర్చిపోతాను" అంది నవ్వుతూ.

    "ఎంటి ఈరోజు మీ స్కూల్లో విశేషాలు ?" అడిగింది దాక్షాయణి నవ్వుతూ.

    "సాయంత్రం ఆటలపోటీలు పెట్టాను పిన్ని....పరుగు పందెంలో నేనే ఫస్ట్....కోకో కూడా ఆడాను" అంది ఆనందంగా.

    "ఇప్పుడెంటి? ఆటలపోటీలు ఇప్పుడెందుకు పెట్టారు? పరిక్షలకు ముందు పెడతారు కదా?" అంది దాక్షాయణి.

    "ఆటలు ఆడించి చాలా రోజులయిందట. అందుకే వురికే ప్రాక్టిసు చేసుకోమని పెట్టారు" అంది జయంతి కాఫీగ్లాసు కింద పెడుతూ.

    "అబ్బ కింద నేలంతా బలే అలికారు పిన్ని....ముగ్గులు కూడా బాగా వేశారే ఎవరు?" అంది జయంతి.

    "ఇంకెవరు మీ అమ్మే....ఆమె ఊరికే ఒక్కక్షణం కూడా కూర్చోదు కదా. మేము ఆమెకంటే చిన్నపిల్లలం. వంటచేసేసరికే నీరసం వొచ్చేస్తుంది. అలాంటిది కస్తూరక్క ఇరవై నాలుగు గంటలు పనిచేయమన్నా చేస్తుంది. ఏమి ఓపికో ఏంటో" అంది నవ్వుతూ.

    "ఏంటి దాక్షాయణి నా ఓపిక గూర్చి తీరిగ్గా చెపుతున్నావు?' అంటూ వచ్చింది అక్కడికి బిందెతో నీళ్ళు తెచ్చి కింద పెడుతూ కస్తూరి.

    "నీళ్ళు నన్ను తెమ్మంటే నేను తెస్తాను కాదమ్మా! నువ్వు మోసుకు రావటం ఎందుకు?" అంది జయంతి సీరియస్ గా.

    "ఏంటే నేనప్పుడే ముసల్దాన్ని అయిపోయినట్లు మాట్లాడుతున్నావు ...ఇంకా నీ పెళ్ళి కూడా చేయందే" అంది కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ.

    "ఆ! నీకు నా పెళ్ళి మాట తప్పించి మరో మాట వుండదు" అంది సీరియస్ గా.

    "ఆడపిల్ల తల్లికి ఆ ముచ్చట తప్పించి మరే ఆలోచన వుంటుంది తల్లీ....." అంది నీరసంగా.

    "ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు....నాకింకా ఆ వయసు రాలేదు నీ ముచ్చట తిరటానికి" అంది సీరియస్ గా జయంతి.

    "సర్లేవే నీతో వాదించి ఎవరు గెలవగలరు గానీ .....దాక్షాయణి ఏం చేద్దాం కూరలు ఈపూట?" అంది కస్తూరి నవ్వుతూ.

    "ఇదిగో వంకాయలు తరగటం అయిపోయింది, వంకాయ పులుసు, పప్పుచారు చేద్దాం" అంది.

    "సరే నేను పప్పు కడిగి పొయ్యిమీద పెడతాను" అంది కస్తూరి.

    "జయంతి! నీళ్ళు కాగాయి, తోడుకుని స్నానం చేయి" అంది కస్తూరి మళ్ళీ.

    "అలాగే" అంటూ లోపలికి వెళ్ళింది జయంతి.
                                              24

    గత నెలరోజులనుంచి జయంతి సురేంద్రతోనూ, గిరిజతోనూ అసలు మాట్లాడటం లేదనే చెప్పాలి. ఇదివరకు వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలిసేదే కాదు. ఎంతసేపని పిన్ని వాళ్ళతో మాట్లాడుతుంది? అందుకే ఇంటి ఆవరణలో చక్కగా కాలక్షేపం కోసం రకరకాల పూలమొక్కల్ని నాటింది. బంతిచెట్లు, మెట్టతామర, మందార, రకరకాల క్రోటన్ మొక్కల్ని స్కూలుకు వెళ్ళే దారిలో, స్కూల్లో వున్న మొక్కల్ని తెచ్చి ఇంటి పెరటిలో ఇంటిముందు నాటి అందమైన తోటను పెంచుతుంది. పొద్దుటే లేచి ఆ మొక్కలను నీళ్ళు పోయటం ఆమె నిత్య కృత్యమైపోయింది. దాదాపు అరగంటసేపు పడుతుంది. ఆ మొక్కలన్నింటికీ నీళ్ళు తోడిపోయటం, బంతిచెట్లు మొగ్గల్ని తోడుగుతున్నాయి. ప్రస్తుతం జయంతి నీళ్ళు తోడి మొక్కలకు పోస్తుంది. బక్కెట్లో నీళ్ళు నింపుకుని ఆ బక్కేట్టును మొక్కల దగ్గిరికి తీసుకెళ్ళి చెంబుతో వాటికీ నీళ్ళు పోస్తుంది. బంతి మొక్కల చుట్టూ గడ్డి మొలిస్తే దాన్ని పికుతూ కూర్చుంది.

    "ఏంటి జయంతి! ఇంట్లో తోటను బాగా పెంచుతున్నట్లు న్నావ్?' అంది గిరిజ ఆమె దగ్గరకు వచ్చి.

    ఆమె పళ్ళపొడితో పళ్ళు తోముకుంటుంది.

    జయంతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలాకాలం తరువాత తవకై తాను దగ్గరకు వచ్చి పలకరించింది.

    "జయంతి అమెవేపు చూసి నవ్వి,

    "అవునక్కా! మనింట్లో బోల్డంత స్థలం వుందికదా....ఊరికే ఎందుకుండాలని మొక్కల్ని నాటాను. బావుందా నా పూలతోట?" అంది.

    "ఓ బ్రహ్మాండంగా వుంది...." అంది నవ్వుతూ.

    "థాంక్స్ అక్కా....." అంది జయంతి క్లుప్తంగా.

    ఇద్దరి మధ్యలో పొడిపొడి మాటలు తప్పించి లోగడలా మనసు విప్పి మాట్లాడుకోవటంలేదు. గిరిజకు అనుమానం వచ్చింది. నేను సురేంద్ర బావతో అనే మాటలు తను విన్నదేమోనని. అందుకే ఈ మధ్య అసలు బావతో మాట్లాడటం మానేసిందని అనుకుంది. పోనిలే ఇది కూడా మంచిదేగా. పీడా విరగడయిందని సంతోషించింది. ఏదో మాట వరసకి పలకరించింది అంటే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS