Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 44

 

    "చూడు రాధా! ఆ కాయల జోలికి వెళ్ళకండి. నేను మీ పక్కన లేకపోయినా పర్వాలేదుగాని, వున్నప్పుడు ఈ చేను జోలికి పోకండి. ఆ గోపాలరావుకు తెలిస్తే పెద్దగొడవ చేస్తాడు. అసలే ఆయనకు మానాన్న గారికి మధ్య మాటల్లేవు....ఆ గోపాలరావు కొడుకు మంచివాడు కూడా కాదు. నా మాటవిని రండిపోదాం" అంది జయంతి బ్రతిమాలుతూ.

    "నువ్వెన్నయినా చెప్పు మేము రాము. నీకు అంతగా భయమైతే నువ్వెళ్ళు. మేమేగా కోసేది కాయలు. నువ్వు కాదుకదా...." అంది రాధ.

    "మీ ఖర్మ!" అంటూ జయంతి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.

    కొద్దిసేపట్లోనే వెనుక నుంచి కేకలు వినిపించాయి.

    "ఏయ్! ఎవరిది కాయలు కోసేది ఎవరే?" అంటూ.

    జయంతికి భయమేసింది. వెధవలు చెపితే వినలేదు. ఇప్పుడు ఆ కాపలావాడు ఎంత గొడవ చేస్తాడో అనుకుంటూ అక్కడే ఆగి చూస్తోంది. జయంతికి వాళ్ళకి ఇరవై గజాల దూరం వుంది.

    "ఏయ్.....ఎవరే మీరు.....? దొంగముండల్లారా....! చేలో కాయలు కోస్తారా?' అంటూ రౌడిలాగా వున్నా ఆ కాపలావాడు వాళ్ళమీదకు దూకాడు. ఆ దెబ్బకు ఇద్దరూ భయపడిపోయి కేకలు వేశారు.

    "జయంతి....జయంతి! చూడవే వీడు, అల్లరి చేస్తున్నాడు..." అంటూ.

    "ఎవతె ఆ జయంతి....అదంటే నాకు భయమా? మిమ్మల్ని ఎవడు ఆడుకుంటాడో చూస్తాను" అంటూ వాళ్ళిద్దర్నీ రెండు చేతులతో పట్టుకుని చేలోకి లాక్కెళ్ళిపోతున్నాడు.

    జయంతికి కోపం కట్టలు తెంచుకుంది.

    "రేయ్ వదల్రా....వాళ్ళని ఎక్కడికి తీసుకేళుతున్నావ్?" అంటూ కేకలువేస్తూ వాళ్ళ దగ్గరకు పరుగుతిస్తూ వచ్చింది.

    "ఏయ్! మధ్యలో నీ పెత్తనం ఏందే...ఓహో ప్రెసిడెంట్ గారి అమ్మాయా? అదా నీ పొగరూ....మీ బాబంటే నాకేంటి భయం? అసలు  ముందు నీ పని పట్టాలి" అంటూ వాళ్ళిద్దర్నీ వదిలేసి జయంతి చేయి పట్టుకున్నాడు.

    "రేయ్! వదల్రా చెయ్యి వదులు ముందు" అంటూ వాడితో పెనుగులాడాసాగింది జయంతి.

    "వదలటానికి కాదే పట్టుకుంది....ఈరోజు నీ పని ఖాళి అంటూ జయంతిని కందిచేలోకి బరబర ఈడ్చుకుపోతున్నాడు. క్షణంలో ఏమైందో తెలిదు. వాడు ఎగిరి పదిగజాలదూరంలో పడ్డాడు.

    జయంతి ఆశ్చర్యంగా చూసింది.

    దాదాపు ఆరడుగుల ఎత్తులో దృడంగా, బలంగా వున్న యువకుడు కోరమిసంతో...తెల్లప్యాంట్, తెల్ల షర్ట్ వేసుకుని, మెడలో పులిగోరు గొలుసుతో గంభీరంగా నిలబడి జయంతిని చూసి...."మిరేళ్ళండి అమ్మాయిగారూ....వెధవ ఎంత ధైర్యంగా నీకు? ప్రెసిడెంటుగారి అమ్మాయి మీద చెయ్యేస్త్తావా? చంపేస్తాను" అన్నాడు.
    "వాడు "బాబుగారూ ...మీరు నన్ను...." అంటూ ఇంకా ఏదో అనబోతున్న వాడిని మళ్ళీ చెంప మీద కొట్టాడు.

    "నోరెత్తితే చంపేస్తాను. మిరేళ్ళండి అమ్మాయిగారు....అన్నట్లు మీ పేరు...." అన్నాడు అతను.

    "జయంతి" అంది కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ.

    "నాపేరు మహేంద్ర, ఈ చేను మాదే....నేను గోపాలరావుగారి అబ్బాయిని" అన్నాడు నవ్వుతూ.

    "మీరా?!" అంది ఆశ్చర్యంగా చూస్తూ.

    "ఎందుకు జయంతిగారు అలా ఆశ్చర్యపోతారు" అన్నాడు నవ్వుతూ.

    "అబ్బే ఏంలేదు...చాలా థాంక్స్ అండి ! ఈరోజు ఈ రాక్షసుడి బారి నుండి రక్షించారు" అంది జయంతి.

    "అరెరె...దీన్లో ఏముంది జయంతిగారూ! వీడి కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరీ విషయం మీ నాన్నగారితో చెప్పకండి. మళ్ళీ పంచాయితీ పెట్టి, అందరిముందు మీరు నిలబడటం నాకిష్టం లేదు. వీడి ఎముకల్లో సున్నం లేకుండా కొడతాను. మీరు వెళ్ళండి" అన్నాడు మహేంద్ర.

    "వస్తామండి" అంటూ జయంతి కిందపడిన పుస్తకాలు తీసుకుని, స్నేహితులతో కలిసి వడివడిగా వెళ్ళింది.

    "చుశారటే మీ వల్లే ఎంత గొడవ జరిగిందో....కాయలు కోయకండే అంటే విన్నారా? సమయానికి పాపం ఆ మహేంద్ర రాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు మన బ్రతుకులు ఏమయ్యేవి? అంటూ కోప్పడింది జయంతి.

    "సారీనే" అన్నారు ఇద్దరూ కోరస్ గా.

    "అవునే గోపాలరావు అబ్బాయి పెద్ద రౌడి అంటారుకదా...నిన్ను చూడగానే ఏంటి అలా అయిపోయాడు?' అంది రాధ.

    "అది మన జయంతి మహత్యం....ఎంతటి వాడైనాసరే జయంతి చూపుకు ఐసయిపోవాల్సిందే" అంది విద్య.

    "నోర్ముసుకుని పదండి.....చేసిన నిర్వాకం చాలు" అంది జయంతి. "అన్నట్లు ఈ విషయం ఎవరితో చెప్పకండి. మళ్ళీ వూళ్ళో లేనిపోని గొడవలు మొదలవుతాయి. ఆ మహేంద్ర కూడా అదే చెప్పాను కదా...."అంది జయంతి.

    "అబ్బో పేరు బాగానే గుర్తు పెట్టుకున్నవే" అంది విద్య.

    "చీ! నువ్వు నోరు ముస్తావా లేదా....నేను చెప్పేది ఏంటి? మీరనేది ఏంటి? ఇంకా బుద్ది రాలేదా మీకు?" అంది జయంతి.

    "సర్లే తల్లీ ఎవరికి చేప్పంలే. మాకు మాత్రం తెలిదా ఏంటి మన వూరు సంగతి. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు.....లేని పోనీ మాటలు సృష్టిస్తారు. గొడవలు తెస్తారు" అంది రాధ.

    "అందుకేనే చెప్పొద్దు అంటుంది" అంది జయంతి.

    "చేప్పంలే....ఈ సంఘటన మన ముగ్గురి మధ్యలోనే వుండిపోతుంది. అసలు రేపటి నుంచి ఈ దారిలోనే రావొద్దు. అటు రామాలయం మీదగా వద్దాం. ఏదో ఆలస్యమయిపోయింది, దగ్గిర దారి కదా అని ఇటు వస్తే ఇంత గొడవ జరిగింది" అంది విద్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS