ఇక ఆగలేకపోయేవాడు. కానీ తనంత తాను మాట్లాడకూడదు కాబట్టి మౌనం వహించేవాడు.
అప్పటికే అతను చలించకపోవడంతో "చీమలు ఎగబాకుతున్నాయి బాబు" తనలో తాను అనుకుంటున్నట్టు అని చీర కుచ్చిళ్ళను పైకి లాక్కునేది.
"సారీ చెబితే మాట్లాడతాను" అనేవాడు తనే మొదట. ఆమె పాదాల్ని చూస్తూ ఏమీ కోరిక కలగకుండా వుండడం సాధ్యం కాని పని.
ఆమె వస్తున్న నవ్వును పెదవుల మధ్య నొక్కిపెట్టి "సారీ మహాశయా" అనేది.
ఆ వాక్యం పూర్తవడంతోనే అతను ప్రొసీడ్ అయిపోయేవాడు. ఇక చీర కుచ్చిళ్ళను పాదాల మీదకి జరుపుకునేందుకు ఇంటికి వెళ్ళే ముందే సాధ్యమయ్యేది ఆమెకి.
అతను పెళ్ళికాని కుర్రాడు. ఆమె వివాహిత. అందుకే ఎప్పుడు ఏ టెక్నిక్ వాడాలో ఆమెకు తెలుసు.
అతనికి అలాంటివి తెలియవు.
ఎప్పుడయినా ఆమె రానిరోజు అతను చిన్నపిల్లాడిలా ఏడ్చేవాడు. అలా కళ్ళలో నీళ్ళు నింపుకొని ఏట్లో పడి ఇంటికి వచ్చేవాడు.
ఒకసారి మాత్రం ఆమె ఇంటికి వెళ్ళి పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు.
ఆ వూరికి రోడ్డు దగ్గర ఓ కల్లు దుకాణం వుండేది. అక్కడికి సాయంకాలమైతే కొత్త కొత్త వాళ్ళు వచ్చి కల్లు సేవించి వెళ్ళే వాళ్ళు అలా వచ్చినవాళ్ళు అవసరార్ధమో, ఎక్కినకైపు వల్లో ఇళ్ళ ముందు పెట్టిన బకెట్లు పాత్రలు తస్కరించుకొని వెళ్ళేవాళ్ళు.
దీంతో వూరి జనం చీకటిపడితే జాగరూకతతో వ్యవహరించే వాళ్ళు
ఆ రోజు మసక వెన్నెల ఆకాశంలో చంద్రవంక పాల కడవ అంచులా వుంది అక్కడక్కడ వున్న నక్షత్రాలు వెన్న ముద్దళ్ళా వున్నాయి. గాలి ఏటి స్నానం చేసి వచ్చినట్టు చల్లగా తగుల్తోంది.
గోకుల్ యధాప్రకారం ఏటి దిగువున కూర్చుని నిమిషాలను జపమాలలాగా తిప్పుతున్నాడు.
పద్మజ స్పర్శ గుర్తొచ్చి రక్తం వేడెక్కుతోంది. ఆమె ఎద నునుపు కళ్ళల్లో తేలి గుండెవేగం పెంచింది. ఆమె నగ్నమైన పాదాలు మనసులో మెదిలి నరాలన్నీ నిలువునా సాగినట్టు స్టిఫ్ గా తయారయ్యాయి.
కానీ ఆమె రావడం లేదు.
అతను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాడు.
కాలానికి గబుక్కున పక్షపాతం వచ్చినట్టు కదలడం లేదు.
అతను తలపైకెత్తి కనుగుడ్లను పైకి లేపుతున్నాడు.
ఆమె వస్తున్న అలికిడి వినిపించలేదు.
సెకండ్లను నిముషాలు తినేస్తున్నాయి. కాలాన్ని మింగిన కొండ చిలవలా లోకం చీకట్లను తనలో దాచుకుంటోంది. మసక వెన్నెల చారలాగా పడుతోంది తప్ప చీకట్లను మాయం చేయలేకపోతోంది.
కానీ ఆమె రాలేదు.
అప్పటికి అతనొచ్చి రెండు గంటలయింది.
ఇంటింటికి వెళ్ళి కడుపు నింపుకున్న కుక్కలు వెచ్చగా వుండే ప్రదేశాలను ఎన్నుకుంటున్నాయి. వీధుల్లో జనసంచారం తగ్గిపోయింది.
రాత్రి తన గాఢతను తెలియచేయడానికి మరింత నిశ్శబ్దాన్ని పాటిస్తోంది.
అతనికి ఏడుపొస్తోంది. తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఎంత నచ్చజెప్పినా అది మాట వినడం లేదు.
ఆమె ఇంటికయినా వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేచాడు.
వెళ్ళడానికి మనసైతే ఉత్సాహంగా వుందిగానీ కాళ్ళు సహకరించడం లేదు. ఏదో భయం శరీరాన్ని వెనక్కి లాగుతోంది. మనసు మాత్రం వెనక్కి తిరిగి చూడడం లేదు.
ఇల్లు సమీపించేకొద్దీ అంత చలిలోనూ చెమట పట్టింది.
మెల్లగా ఇంటి దగ్గరికి చేరుకున్నాడు.
తడికల మాటున నిలబడ్డాడు.
శివయ్య ఇంటి ముందు ఆవరణలో మంచం వాల్చుకుంటున్నాడు. అంతవరకయితే వెళ్ళాడుగానీ లోపలికి వెళ్ళి 'ఎందుకొచ్చావ్?' అంటే ఏం చెప్పాలో తోచడం లేదు. అంతేగాక ఎవరికయినా డౌట్ వస్తే లేచిపోని ఇబ్బంది.
పద్మజ బయటికి వచ్చినప్పుడు ఎలాగో తనను చూసేలా చేసుకుని సైగ చేయాలని నిర్ణయించుకొన్నాడు.
అందుకే ఓ మూలకు జరిగి తడిక ఇవతల్నుంచి చిన్న తిన్నెమీద కూర్చున్నాడు.
వీధుల్లో వెళ్ళేవాళ్ళు తనని గుర్తుపట్టకుండా లుంగీ విప్పుకుని దానిని కప్పుకున్నాడు. ఇప్పుడు మరీ పర్టిక్యులర్ గా చూస్తే తప్ప తనను ఎవరూ గుర్తుపట్టలేరు.
తల తిప్పితే తను పద్మజను మిస్ అయిపోతానేమోనని తడికల సందుల్లోంచి చూస్తున్నాడు.
అయిదు- పదినిమిషాలు- కళ్ళు నెప్పెడుతున్నాయి గానీ పద్మజ బయటికి రావడం లేదు.
శివయ్య నిద్రకోసం కాబోలు అటూ ఇటూ దొర్లుతున్నాడు.
అతను అలా కూర్చొని ఎంతసేపైందో తెలియదుగానీ వీధికి చివర నున్న వీధి కుక్క మొరగటం ప్రారంభించింది.
ఇక అక్కడ తచ్చాడటం ప్రమాదం అని తెలిసినా వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించటం లేదు.
పార్వతమ్మకు నిద్రలో మెలకువ వచ్చి బయటికి వచ్చింది.
ఆమె రావడాన్ని అతను గమనించలేదు.
ఆమె అటూ ఇటూ చూస్తూ అతని దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయింది.
కళ్ళు చిట్లించి చూసింది.
ఎవరో ఓ వ్యక్తి అక్కడ కూర్చున్నట్టు తెలుస్తోందిగానీ ఆ వ్యక్తి తెలియడం లేదు.
ఆమెకి అనుమానం మొదలయింది.
ఎవరో భిక్షగాడయితే అలా కూర్చుంటాడు గానీ లోపలికి చూడాల్సిన అవసరం ఏమిటి?
