"మిశ్రాకి నిన్న ఆపరేషన్ జరిగింది" చెప్పాడు.
ధృతికి ఆశ్రమంలో వృద్దుడు గుర్తుకొచ్చాడు.
"ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా?" అంటూ చాలా ఆశ్చర్యంగా మొహంపెట్టి ఆమెవైపు చూస్తూ "కొడుకులూ, కోడళ్ళూ అందరూ వచ్చారు. అప్పటిదాకా వారిని తిట్టి, వారి మొహాలు చూడనన్న మిశ్రా వారిని చూడగానే ఆనందంతో వేయి ఏనుగులు బలం వచ్చినవాడిలా తయారయ్యాడు. వాళ్ళూ ఆయన్ని పట్టుకుని ఇన్నాళ్ళూ ఒక్కక్షణం కూడా వదిలి వుండని వాళ్ళల్లా ఏడ్వడం....ఇతనూ పేరు పేరునా వాళ్ళని పట్టుకుని ఏడ్వడం నాకయితే అద్భుతమైన నాటకం చూస్తున్నట్లు అనిపించింది" అన్నారు.
ధృతి ఉత్సుకతతో ఆయన ముఖంలో మారుతున్న భావాలు చదవసాగింది.
"ఆపరేషన్ జరగగానే మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతాం" అని వాళ్ళు అనగానే ఇతను కూడా ఆనందంగా వెళ్ళిపోవడానికి సంసిద్దమయిపోయాడు" వింత చెప్తున్నట్లు చెప్పాడు.
"ఏ మనిషికయినా 'తనూ - తనకి' సంబంధించిన అనే విషయాలు చాలా మనోహరంగానే కనిపిస్తాయి. వాటిల్లో ఎన్ని లోపాలున్నా కూడా ఆ పాశం, తీపీ భగవంతుడు పెట్టకపోతే ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడో కూలిపోయేది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు సంచరిస్తే ఏముందీ బ్రతుక్కి అర్ధం" అంది.
"అతను నాతో ఎన్నోసార్లు 'బాబుగారూ! వాళ్ళు వచ్చి అడిగినా నన్ను మాత్రం పంపకండి. వాళ్ళు పెట్టిన హింసలు నేను మరువలేను. వాళ్ళు రాక్షసులు. నన్ను వాళ్ళతో పంపివేసే బదులు నన్ను చంపెయ్యండి' అని చెప్పేవాడు. అటువంటిది వారిని చూడగానే...."
"అదే ప్రేమ జీవితం ప్రసాదించే మకరందం ప్రేమ. వారితో కలిసి వున్నప్పుడు వారు విసుక్కుమ్తే తాత్కాలికంగా వారిమీద అసహ్యము, వెగటు కలిగినా ఇక్కడికి వచ్చాక అస్తమానం వారే గుర్తుకొచ్చి తను ఒంటరిని అనే భావనతో నరకం అనుభవించి వుంటాడు. ఎలాగో అలా సర్దుకుపోయి మిగిలిన బ్రతుకు గడపాలని నిశ్చయించుకుని వైర్ని నిందించేవాడు. కానీ తఃలుచుకుని మురిసిపోయినా, బాధపడినా అతనికి 'గతం' తోనే అనుబంధం కానీ, ఈ రసహీనమైన 'భవిష్యత్తు'లో ఏముందీ? గతంతో సంబంధాన్నీ తెంచేసే భవిష్యత్తు ఎవ్వరికీ ఆనందం ఇవ్వదు."
"గతంతో సంబంధాన్ని తెంచివేసే భవిష్యత్తు...." ఆయన మనసులో ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమెనే చూడసాగాడు.
ఆమె వెళ్ళిపోయినా తర్వాత కూడా ఆ విషయమే చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. "తన స్వజనం, తనకి సంబంధించైనా అనే భావం అంత ఆనందాన్నిస్తుందా? ఏదైనా మరిచిపోయేటట్లు చేస్తుందా? అది లేనినాడు జీవితం నిరర్ధకమేనా?" అన్న ప్రశ్న ఆయన మనసుని మాటిమాటికి కలచివెయ్యసాగింది.
* * *
క్ర్సుహ్నమూర్తి నవ్వుతూ "ఈ లెటర్ కొంచెం అర్జెంటుగా టైపు చేసి పెడతారూ?" అన్నాడు.
ధృతి నుదురు చిట్లించి "లీలకివ్వండి" అంది ఆమె ఎం.డి. పర్సనల్ సెక్రటరీ ఆయన లెటర్సే బోలెడుంటాయి.
"ఇవాళ ఆవిడ రాలేదు. ఫరవాలేదులెండి! నేనే చేసుకుంటాను. అసలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం నాకూ ఇష్టంలేదు. ఏదో మేనేజర్ గారు అర్జంటంటేనూ..." అంటూ నసుగుతూ అదోరకంగా వంగిపోయి వెళ్ళిపోయాడు.
ధృతికి అతన్ని చూస్తే ఈమధ్య తెగ చిరాగ్గా అన్పిస్తోంది. లీల ఉత్తరం చదివాక అతను లీలతో మాట్లాడడం మానేశాడు. 'అమ్మయ్య' అనుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ కానీ అతను ధృతి చుట్టూ అవసరం వున్నా లేకపోయినా తిరగడం మొదలుపెట్టాడు.
కొందరు వ్యక్తులు ఎప్పుడూ తమ వైపునుంచే ఆలోచిస్తుంటారు. ఇలా చేస్తే మనకెంత లాభం? వీళ్ళవల్ల మనకేమి అవసరం? అని అంతే కానీ అవతలివాళ్ళు మన ప్రవర్తననెలా తీసుకుంటున్నారూ? ఎలా స్పందిస్తున్నారన్నది వాళ్ళకి శుద్ద అనవసరం. కృష్ణమూర్తి అలాంటి తరహా మనిషి లీలకంటే ధృతి అందంగా వుంటుంది. ఇంకా ఎక్కువ జీతం ఆమె తప్పిపోవడం నా మంచికేనేమో! ఈమెని ప్రయత్నిద్దాం అనుకోవడమే తరువాయి ప్రయత్నం మొదలుపెట్టేశాడు కూడా అతనీ విధంగా ప్రవర్తించడానికి మరో కారణం నవీన్! అతను చూస్తూండగా ధృతి నవీన్ తో చనువుగా మాట్లాడటం, నవ్వడం చూసి అతనికి ఒళ్ళు మండిపోయింది. ఒక డ్రైవర్ తోనే ఇంత చనువుగా వుండగా లేనిది నన్ను..... నన్నెందుకు ప్రేమించదూ అన్న ధీమా కలిగింది కాబోలు.
అతని ప్రవర్తనలో మార్పు ధృతి గమనించింది కానీ పైకి తేలలేదు. దేనికైనా సమయం రావాలి కదా!
ఇంతలో లీల లోపలికొస్తూ కనిపించింది.
"హాయ్! ఏమిటంత ఆలస్యం?" అడిగింది ధృతి.
ఆమె ఉస్సూరుమంటూ నిట్టూర్చి కూర్చుని "ఇంట్లో ఒకటే గొడవ - బయటపడేసరికి ఈ టైమయింది" అంది.
"ఏమిటీ? మీ బావ వచ్చి మళ్ళీ గొడవ చేశాడా? లేక మీ నాన్న మళ్ళీ అప్పులు చేసి నీ పీకకి చుట్టాడా?" అంది ధృతి.
"అవన్నీ మామూలేగా! మా చెల్లెలు ఈరోజు ప్రొద్దుటే పెళ్ళి చేసుకుని చక్కా వచ్చింది" అంది లీల.
"పెళ్ళా! ఏ చెల్లెలూ?"
"రూప ఆ మధ్యనేవో వంటలు నేర్చుకోవడానికెళ్ళింది కదా! అక్కడ పరిచయమయ్యాడట. పేరు జాఫర్ "దాల్చా" అనే వంటకం బ్రహ్మాండంగా చేస్తాడుట" అని నవ్వింది లీల.
ధృతి నోటమాట రానట్లు చూడసాగింది.
"ఏమిటలా చూస్తున్నావ్? మనమూ వున్నాం ఎందుకూ అనా?" అంది తన సహజ ధోరణిలో.
"మీ అమ్మా, నాన్నా...."
"అమ్మ అలుపొచ్చేవరకూ తెలుగు సినిమాల్లో వుండే డైలాగులన్నీ తిట్టింది. మా నాన్నకి అనుకోకుండా చివరి నెంబర్లు కలిసి లాటరీలో ఇరవై రూపాయలు వచ్చేసరికి ఆనందంతో ఒళ్ళు తెలియని స్థితిలో వున్నాడు. మిగతావాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రపంచాల్లో బిజీ నేను కాసేపు అమ్మకి కంపెనీ ఇచ్చి వాళ్ళుకూడా బయల్దేసరికి ఓ వంద రూపాయలు పెట్టి "ఎక్కడైనా కడుపునిండా తిండి తినండి" అని చెప్పి వచ్చేశాను."
